Thursday, March 24, 2011

ఉత్తర రామేశ్వరం, మహబూబ్ నగర్ జిల్లాశివాలయం

30 ఏళ్ళ క్రితం మా వారు ఈ ప్రదేశం చూశారండీ. అప్పుడు కొన్నాళ్ళు దాని గురించి కధలు చెప్పేవాళ్ళు. పచ్చని పొలాల మధ్య చిన్న శివాలయం, దానిముందే చిన్న కొలను, ఆ కొలనులో రోజూ ఒకే తామర పువ్వు పూస్తుందిట..అది శివుడికే. ఆ ప్రదేశం ఎంత బాగున్నదో..నిన్ను తీసుకెళ్తానులే అని వూరించీ, వూరించీ కొన్నాళ్ళకి దాని గురించి మరచిపోయారు. మొన్న హోలీనాడు నెట్ లో ఏదో చూస్తుంటే ఉత్తర రామేశ్వరం కనబడిందిట…పద..పద..అన్నారు. నాకో వజ్రాల వడ్డాణం కొనిపెట్టినదానికన్నా ఒక పూట ఎక్కడికన్నా బయటకి తీసుకెళ్తే విపరీతంగా సంతోషిస్తా. వెంఠనే బయల్దేరేశా.

హైదరాబాదు దాటి 50 కి.మీ. పైన వెళ్ళాక షాద్ నగర్ వచ్చింది. దాన్లోంచి వెళ్ళాలని ఆయనకి గుర్తు ఆ ఊరంతా చూసుకుంటూ, మధ్యలో దోవ కనుక్కుంటూ, అతి చిన్న సందులు, మట్టి రోడ్డులు, గ్రామాలు దాటుకుంటూ మొత్తానికి ఆ ఆలయానికి చేరామండీ. చివర్లో మీకోసం అతి సులభమైన దోవ ఇస్తాను చూడండి.

ఆలయం చిన్నదే. జనం బాగానే వున్నారు. హోలీ పౌర్ణమి కదా. అందుకేమో అనుకున్నాము. ఆలయం ముందు షామియానాలు వేసి వున్నాయి. చుట్టుపక్కల గ్రామాలనుంచీ కూడా జనం వచ్చారేమో, అక్కడే భోజనాలు చేస్తున్నారు. చాలామంది ఒక దుప్పటి పరిచి స్ధలం రిజర్వు చేసుకున్నట్లనిపించింది. రాత్రికి అక్కడే పడుకుంటారేమో.

అర్చన చేయించవచ్చు అన్నారుకానీ టికెట్లు అమ్మేవారెవరూ లేరు. గుడి లోపల కూడా చిన్న చిన్న వసారాల్లాగా గదులు వున్నాయి. అక్కడ కొంతమంది విశ్రాంతి తీసుకుంటున్నారు. దర్శనం చేసుకున్నాం. శివ లింగం కొంచెం పెద్దదే. ఆలయం గురించి విశేషాలు చెప్పండి అని పూజారిని అడిగాను. రామ ప్రతిష్ట. 300 ఏళ్ళ క్రితం ఆలయం అన్నారు. బయటకి రాగానే మావారు నాకు గఠ్ఠిగా చెప్పేశారు..ఆయన చెప్పింది రాయకు..300 ఏళ్ళ క్రితం రాముడెక్కడున్నాడు అని.

చుట్టూ రూముల్లాగా వున్నాయన్నానుకదా దాని పైకి వెళ్ళటానిక మెట్లు వున్నాయి. పైకి వెళ్ళి చూస్తుండగా ఇంకొకతను వచ్చాడు. మా ఆయనలాగానే అతనూ అక్కడ పరిసరాలన్నీ మారిపోయాయని పైకే అనుకుంటున్నాడు. చుట్టూ పొలాలుండేవి..ఇప్పుడు లేవు..గుడి ముందే కోనేరు వుండేది లేదు అని. పాపం మా ఆయనలాగానే అతనూ డిజప్పాయింట్ అయ్యాడనుకున్నా. మావారుకూడా గుడి చూడగానే దానిముందు కోనేరు ఏమైపోయిందా అనే ఆరా తీశారు. అది పూడ్చేశారుట. ఆ కోనేరు చాలా అందంగా వుండేది..అది పూడ్చేశారా అని బాధ పడ్డారు. కొంచెం దూరంలో ఒక చిన్న కోనేరు వుంది.

కొంచెం దూరంలో గుట్టమీద పార్వతీదేవి ఆలయం వున్నదని బోర్డు చూశాము. ఇది కూడా కొత్తదే. ఇదివరకు ఆ ఆలయం లేదు అని మావారు నొక్కి వక్కాణించారు. ఆయనకి ఆ ప్రదేశం ఇదివరకు చూసింది అలాగే గుర్తుండటంవల్ల అంత బాధ పడ్డారుకానీ, 30 ఏళ్ళ క్రితం పరిసరాలు అలాగే వుండాలంటే వుంటాయా.

సరే పక్కనున్న సన్న సందులో కొంతదూరం నడిచి, చిన్న గుట్ట ఎక్కి పార్వతీదేవి ఆలయానికి వెళ్ళాము. హమ్మయ్య. అక్కడ పూజారి కొంచెం ఖాళీగా వున్నారు. మధ్య మధ్యలో వచ్చే భక్తులకు తీర్ధం ఇస్తూనే మాకు ఆలయం గురించి కొంత సమాచారం ఇచ్చారు.

ఆ ఆలయం అతి పురాతనమైనదనీ, శివ లింగం శ్రీరామచంద్రుడి ప్రతిష్ట అనీ, దానికి గుర్తుగా రామబాణం లింగం మీద వుంటుది, చూడవచ్చనీ, లింగం వెనుక వైపు మనిషి వీపులాగా వుంటుందనీ, లింగానికి అలా ఎక్కడా వుండదనీ అదిక్కడ విశేషమనీ చెప్పారు. అలాగే లింగం పెరుగుతూ వుంటుందనికూడా అన్నారు. శ్రీరాముడు ప్రతిష్టించిన శివలింగం కనుక ఈ ఆలయంలో ప్రతి పౌర్ణమిరోజూ మధ్యాహ్నం 2 గం. నుండీ 5 గం. ల దాకా సామూహిక సత్యన్నారాయణ వ్రతాలు జరుగుతాయి. శివాలయంలో సత్యన్నారాయణ వ్రతం జరగటం కూడా ఇక్కడి విశేషమే.

అమ్మవారి ఆలయం ఇదివరకు లేదుకదా అంటే అసలు విగ్రహం భవాని ఉగ్ర రూపమనీ, ఆ విగ్రహం చాలా కాలంనుంచీ అక్కడే చిన్న గుళ్ళో వున్నదనీ, అయితే ఉగ్ర రూపమవటంవల్ల భక్తులెవ్వరూ వచ్చేవారుకాదనీ, పూజారి మాత్రం వచ్చి పూజాదికాలు నిర్వర్తించి వెళ్ళేవారనీ చెప్పారు. 24 సంవత్సరాల క్రితం భక్తులకోసం ఉగ్రరూపిణి అయిన భవానీ అమ్మవారి ముందు శాంత స్వరూపిణి అయిన పార్వతీదేవిని ప్రతిష్టించి, గుడిని పునరుధ్ధరించారన్నారు. ఇప్పుడుకూడా మనం చూడగలిగేది ముందు పార్వతీదేవినే.

ఆ ఆమ్మవారు అక్కడ వెలవటానికి కూడా ఒక కధ చెప్పారు. పూర్వం ఒకాయన షాద్ నగర్ పరిగి రోడ్డులోని ఎలికట్ట అనే గ్రామంనుంచీ భవానీదేవిని విగ్రహాన్ని తీసుకొచ్చి ఇక్కడ స్వామితో కళ్యాణం చేసేవారుట. కొంతకాలం తర్వాత వృధ్ధాప్యంవల్ల అంత దూరంనుంచీ అమ్మని తీసుకురావటం శ్రమ అవుతోందనిఅన్నారుట ఆయన. అమ్మ నువ్వంత శ్రమపడవద్దు నేనే ఇక్కడకొస్తానని ప్రస్తుతం అమ్మవారి ఆలయంవున్న ప్రదేశంలో ఒక కొండరాయి కింద కూర్చున్నట్లు వెలిసిందిట.

ఆయన అంత కధ చెప్పారుకదాని మళ్లీ శివాలయానిక వెళ్ళి రామబాణం గుర్తు చూపించండని అడిగాము. పూజారి అభిషేకం సమయంలో అయితే కనబడుతుందన్నారు. ఉదయం 6 గం. నుంచీ 12 గం. దాకా ప్రతి రోజూ స్వామికి అభిషేకం మనం చేసుకోవచ్చు. టికెట్ రూ. 101. కావలసిన పూజా సామాగ్రి మనమే తీసుకెళ్ళాలి. మీకు ఆలయ విశేషాలు చెప్పాలన్నా ఆ సమయంలోనే రావాలి..ఇప్పుడీ జనంలో చెప్పటం కష్టమన్నారు.

దర్శన సమయాలు ఉదయం 6 గం. నుంచి 12 గం. లదాకా, తిరిగి మధ్యాహ్నం 2 గం. ల నుంచీ 7-30 దాకా. శని, ఆది, సోమవారాలు, పౌర్ణమి రోజు, శ్రావణ, కార్తీక మాసాల్లో జనం బాగా వస్తారు. శివరాత్రి రోజు లక్షల్లో వస్తారుట భక్తులు. మేము వెళ్ళినప్పుడుకూడా 200 మంది పైనే వున్నారు.

ఆలయ చరిత్ర తెలిపే పుస్తకమేమైనా వున్నదా అంటే మాణిక్ ప్రభు పుస్తకంలో ఈ ఆలయం గురించి వున్నదన్నారు. అదెక్కడ దొరుకుతుందంటే హైదరాబాదు పాత బస్తీలో అన్నారు. ఆ పుస్తకం గురించి తెలిసినవాళ్ళెవరైనా అదెక్కడ దొరుకుతుందో దయచేసి తెలియజేయండి.

తేలిక మార్గం చెబుతానన్నానుకదా. హైదరాబాద్ – బెంగుళూరు రహదారిలో హైదరాబాద్ నుంచి 54 కి.మీ. వెళ్ళాక, షాద్ నగర్ దాటాక (షాద్ నగర్ ఊళ్ళోకి వెళ్ళక్కరలేదు..రహదారిలోనే)టోల్ గేట్ కి దగ్గర దగ్గర ఒక కిలో మీటరు ఇవతల కుడివైపు రోడ్డు వస్తుంది. రోడ్డు మొదట్లో చిన్న బోర్డు వుంటుంది. ఆ రోడ్డులో 4 కి.మీ. వెళ్తే ఎడమవైపు ఆలయం కనబడుతుంది. ఆలయం చిన్నదే. శిల్ప కళ ఏమీ వుండదు.

అక్కడనుంచి బయల్దేరి ఇదివరకు భవానీమాతని ఎలికట్టనుంచి తెచ్చేవారుటకదా, దోవేకదా చూద్దామనుకున్నాము. బెంగుళూరునుంచి వచ్చేదోవలో షాద్ నగర్ – పరిగి రోడ్డులో వుందన్నారు. షాద్ నగర్ దాటగానే సోలీపూర్ గ్రామం, ఫరూఖ్ నగర్ మండలంలో ఒక ఆలయం కనబడితే అదేమోనని వెళ్ళాము. అది వీరాంజనేయస్వామి ఆలయం. అది కూడా చాలా పురాతనమైన ఆలయం..వ్యాసరాయల ప్రతిష్టట.

ఎలికట్ట భవానీ దేవి ఆలయం ఆర్చి కనుక్కున్నాముగానీ బాగా చీకటి పడింది..దోవ కూడా సరిగ్గా కనబడలేదు. అందుకే తిరిగి వచ్చేశాము.

మేము 19-3-11, హోలీ రోజు వెళ్ళాము. ఆ రోజు చంద్రుడు భూమికి చాలా దగ్గరగా వచ్చాడు. పెద్ద చందమామ అందాలని చూసుకుంటూ తిరిగొచ్చాము.


పి.యస్. వచ్చే పోస్టులో మళ్ళీ వరంగల్ విశేషాలు.


2 comments:

మాలా కుమార్ said...

నేనిక్కడ చదవను . నన్ను తీసుకెళ్ళి చూపించి చెప్పాల్సిందే ఆ కథ :)

psm.lakshmi said...

హహహహహ..అలకా బ్లాక్ మైలా అలక తీర్చటానికే పెద్దవాటికే తీసుకెళ్తున్నానుగా. అన్నట్లు ఇప్పుడే వచ్చిన ఐడియా..ఇది చదవకపోతే రేపు ప్రోగ్రాం కేన్సిల్..పెద్ద..నాకు తెలియదా మీతో ఎలా చదివించాలో..మిమ్మల్ని వూరు తీసుకెళ్ళాలంటే నా పోస్టులన్నీ కంఠతాపట్టి గడగడా అప్పజెప్పెయ్యండి. హన్నా!
psmlakshmi