Friday, February 10, 2012

శ్రీ సూర్య భగవాన్ దేవాలయం, తిరుమలగిరి, సికిందరాబాద్




ఉదయంనుంచి అస్తమయందాకా (ఆ మాటకొస్తే సర్వకాల సర్వావస్ధలలో) తన కిరణాలతో సమస్త జీవకోటిని కాపాడుతున్న ప్రత్యక్ష దైవం శ్రీ సూర్యనారాయణస్వామికి నమస్కారం చెయ్యకుండా ఏమీ తినని భక్తులు ఇప్పటికీ వున్నారు. అను నిత్యం సూర్య నమస్కారాలు చేస్తూ తమ ఆరోగ్యం, ఐశ్వర్యాలని కాపాడుకునే భక్తులు అనేకులు. కానీ ఆ సూర్యనారాయణునికి ఆలయాలలు మాత్రం అతి తక్కువ వున్నాయి.


మన రాష్ట్రంలోవున్న సూర్యదేవాలయాలలో ప్రముఖమైనది శ్రీకాకుళం జిల్లా అరసవిల్లిలో వున్న శ్రీ సూర్యనారాయణ దేవాలయం. అలాగే సికింద్రాబాదులో తిరుమల గిరిలో నిర్మిపబడిన శ్రీ సూర్య భగవాన్ దేవాలయం దిన దిన ప్రవర్ధమానమపుతూ అనేకమంది భక్తులనాకర్షిస్తున్నది. శ్రీ సూర్యశరణ్ దాస్ మహరాజ్ సూర్య భగవానుని భక్తులు. శ్రీ సూర్య భగవానుని ఆజ్ఞానుసారం శ్రీ సూర్య శరణ్ దాస్ 1959లో ఇక్కడి కొండ ప్రాంతంలో పచ్చని ప్రకృతి మధ్య సూర్య దేవుని ప్రతిష్టించి పూజించసాగారు. శ్రీ సూర్య శరణ్ దాస్ దేవాలయ నిర్మాణాన్ని తన భుజ స్కందాలపై వేసుకుని ఒక శక్తిగా ఆలయ నిర్మాణాన్ని పూర్తిచేశారు.


చిన్న గుట్ట మీద విశాలమైన ఆవరణలో నిర్మింపబడింది ఈ ఆలయం. గుట్ట ఎక్కి ఆలయ ప్రాంగణంలో ప్రవేశించగానే ఎడమపక్క కొండరాతిమీద మరకత గణపతి దర్శనమిస్తాడు. ఆయనకి నమస్కరించి కదిలితే ఎదురుగా ఒక పెద్ద రాతినానుకుని నిర్మింపబడిన చిన్న ఆలయంలో శ్రీ సూర్యనారాయణుడు అత్యంత సుందర రూపంతో దర్శనమిస్తాడు.


పక్కనే అశ్వధ్ధ, వేప చెట్లు కలిసివున్న వేదిక. భక్తులు ఇక్కడ దీపారాధన చేసి, ఆ దేవతా వృక్షాలకి ప్రదక్షిణలు చేసి భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లుతారు. ఈ వృక్షరాజాల పక్కనే ఆరుబయలే అత్యంత సుదరంగా వెలసిన శివ లింగ దర్శనం మానసికానందాన్నిస్తుంది. పక్కనే సరస్వతీదేవి, నాగ దేవత, మరొక పక్క శ్రీ సత్యనారాయణ స్పామి ఉపాలయాలున్నాయి. నాగ దేవత ఆలయం వెనుకే నాగ విగ్రహాలున్నాయి.


ఆదివారాలు, సెలవు రోజులు, పర్వ దినాలలో భక్త జన సందోహం ఎక్కువగా వుంటుంది. శ్రీ సూర్యనారాయణ స్వామికి వచ్చిన భక్తులలో చాలామంది వేయించిన శనగలు, గోధుమలు స్వామికి సమర్పిస్తున్నారు. అలాగే కొందరు భక్తులు పాయసం, పులిహోర నైవైద్యాలు పెట్టించి అక్కడకొచ్చిన భక్తులకు ప్రసాదాలు పంచుతున్నారు. మేమొక గంటపైన వున్నాము. అంతసేవూ ఆలయంవారో, భక్తులో అందరికీ ప్రసాదాలు పంచుతూనే వున్నారు.


ముఖ్య ఉత్సవాలు

సూర్యుడు మకరరాశిలో ప్రవేశించే మకర సంక్రాంతికి, రధ సప్తమికి ఆలయంలో విశేష పూజలు జరుగుతాయి.

ఇక్కడ భక్తులు మొక్కుకుని తమ కోరికలు తీరుతే 12 ఆదివారాలు 108 ప్రదక్షిణలు చేసి మొక్కు చెల్లించుకుంటారు.

దర్శన సమయాలు

సోమవారం నుంచి శనివారందాగా ఉదయం 7 గం. లనుంచీ 11 గం. లదాకా, సాయంద్రం 5 గం. నుంచీ 7 గం.లదాకా.

ఆదివారం 6-30 నుంచి 12-30 దాకా, సాయంత్రం 5 గం. ల నుంచీ 7-30 దాకా.

మార్గము -- సికింద్రాబాదు డయమండ్ పాయింట్ నుంచి తిరుమలగిరి వెళ్ళే దోవలో, బౌనేపల్లి మార్కెట్ యార్డ్ ముందునుచి వెళ్తుంటే ఎడమపక్క ఫుడ్ వరల్డ్ వస్తుంది. అది దాటగానే, దానిని ఆనుకుని వున్న సందులో లోపలకెళ్తుంటే కుడిచేతిపక్క 6వ సందులోకి తిరిగి కొంచెం ముందుకెళ్తే ఎడమవైపు ఆలయం కనబడుతుంది. సందు మొదట్లో చిన్న బోర్డు వుంటుంది. పొరబాటున సందు గుర్తుపెట్టుకోలేక ముందుకు వెళ్తే వచ్చేది టి జంక్ష్షన్. అక్కడ వెనక్కితిరిగి, తిరిగి వచ్చేటప్పుడు ఎడమవైపు మొదటి సందు తిరగండి. పార్కింగుకి పెద్ద ఇబ్బందిలేదు.

మన సమీపంలో వున్న శ్రీ సూర్యనారాయణస్వామిని ఆయనకి అత్యంత ప్రీతికరమైన మాఘమాసంలో సేవించి తరిద్దాం.

1 comments:

నాగేస్రావ్ said...

ఇక్కడ చూడండి
http://wikimapia.org/#lat=17.4735975&lon=78.5062408&z=18&l=0&m=b&show=/9952231/Lord-SURYA-Temple
లేపోతే google mapsలో Surya Temple, Trimulgherry, Secunderabad, Andhra Pradesh అని వెతికితే ఉంది.