Wednesday, May 23, 2012

ప్రయాణంలో పదనిసలు - 4 వేసవిలో జలకాలాటలు
ప్రయాణంలో పదనిసలు - 4

వేసవిలో జలకాలాటలు - మల్లెల తీర్ధం

వేసవి..సూర్యారావుగారు అడ్డూ ఆపూ లేకుండా చెలరేగిపోతున్నారు..మీరేమో జలకాలాటలంటారేంటని కోప్పడుతున్నారా  మీ కోపం తగ్గించేందుకే మేము ఈనెల 14న, అంటే 14-5-2012 న వెళ్ళొచ్చిన జలపాతం గురించి చెబుతున్నాను.  మీరేమీ పదిరోజుల ప్రయాణాలు చెయ్యక్కరలేదు, వేలకి వేలు ఖర్చు పెట్టక్కరలేదు.  కొంచెం మెడ సారించి చూడండి.  హైదరాబాదుకు సుమారు 170 కి.మీ. ల దూరంలో శ్రీశైలం వెళ్ళే రోడ్డులో వుంది.  అదేనండీ మల్లెల తీర్ధం.  శ్రీశైలం వెళ్ళే దోవలో ఎడమవైపు బోర్డు కనబడుతుంది.  అక్కడనుండి లోపలికి 8 కి.మీ.ల దూరం వుంటుంది.  రోడ్డు  బాగుంది.  కంకర రోడ్డు.  

దీని గురించి అందరూ రకరకాలుగా చెప్పారు.  మా అబ్బాయేమో నువ్వా మెట్లు దిగలేవు, చాలా వున్నాయి అన్నాడు.  రోడ్డు బాగుండదని కొందరు.   కొందరేమో నీళ్ళు చాలా తక్కువ వుంటాయి.  సరే..ఇన్ని అభిప్రాయాలెందుకు..వెళ్ళు చూస్తే సరిపోతుందికదా అనుకున్నానుగానీ, దేనికన్నా టైము రావాలికదా.  ఈ మారు శ్రీశైలం ట్రిప్ లో ఆ టైము కుదిరింది.

అయితే అసలు సంగతి అక్కడకెళ్ళాక వుంది.  మరి 350 మెట్లు దిగాలి..మళ్ళీ ఇంటికెళ్ళాలంటే ఎక్కి పైకి రావాలి కూడా. భయపడకండి..మెట్లు చిన్నగానే వుంటాయి.   మెట్లు దిగిన తర్వాత దాదాపో 200 గజాల దూరం కొండపైన నడవాలి.  మరి జలపాతంలో జలకాలాడాలంటే ఆ మాత్రం కష్టపడాలండీ.  ఇంక చాలు…పైనుంచి మల్లెలలా జాలువారే జలపాతంలో హాయిగా మీ ఇష్టం వచ్చినంతసేపు జలకాలాడండి.  ఇది చూసి వెళ్ళొచ్చినవాళ్ళుంటే చెబితే సంతోషిస్తా.

 మెట్లు దిగాక దోవ
జలపాతం

2 comments:

సి.ఉమాదేవి said...

మీ ఓపికకు హేట్సాఫ్!వేసవిలో మల్లెలు రివాజు.అందుకు తగ్గట్టుగానే యాత్ర బ్లాగులో అక్షర మల్లెలు పరిచిన మల్లెలతీర్థం.

psm.lakshmi said...

కొన్ని కావాలంటే కొంత కష్టపడక తప్పదుకదండీ ఉమాదేవిగారూ. ఆ స్వఛ్ఛమైన జలాలకింద అన్నీ మరచిపోయామంటే నమ్మండి. ఎప్పుడూ నదులూ, వగైరాలలో స్నానంచెయ్యని మా వియ్యంకుడుగారు కూడా ఆ జలపాతం ఆకర్షణని తప్పించుకోలేకతడిసి ముద్దయ్యారు.
అక్షర మల్లెలు పరిచిన మల్లెలతీర్ధం..మీ కామెంట్స్ నుంచి అందమైన మాటల సుమాలనేరుకుంటూవుంటాను నేను.
psmlakshmi