Friday, June 19, 2009

క్లే, గ్లాస్ అండ్ మెటల్ షో, రాయల్ ఒోక్, మిచిగన్

క్లే, గ్లాస్ అండ్ మెటల్ షో, రాయల్ ఓక్, మిచిగాన్

వాషింగ్టన్ ఎవెన్యూ, రాయల్ ఓక్ డౌన్ టౌన్, మిచిగాన్ లో జూన్ 11, 12, 13న క్లే, గ్లాస్ అండ్ మెటల్ షో జరిగింది. దీనికోసం ఒక రోడ్డుని ట్రాఫిక్ రాకుండా మూసి వేశారు. షుమారు 120 మంది కళాకారులు తమ కళలని ఇక్కడ ప్రదర్శించారు. రోడ్డు మొత్తం చిన్న చిన్న గుడారాలలో స్టాల్స్ పెట్టారు. స్త్రీల ఆభరణాలు, గృహాలంకరణ వస్తువుల స్టాల్స్ ఎక్కువ వున్నాయి.

అందరినీ ఆకర్షించినది గాజు అలంకరణ వస్తువులు తయారు చేయటాన్ని ప్రదర్శించిన స్టాల్.

చిన్న పిల్లలని ఆకర్షించటానికి చిన్న చిన్న రాళ్ళతో వస్తువులను తయారు చేయటం, మోటారుతో తిరిగే కుమ్మరి చక్రం మీద కుండ తయారు చెయ్యటం, ఇంకా తెల్ల షర్టులమీద స్ప్రే పెయింట్ చెయ్యటం ఇలాంటి స్టాల్స్ వున్నాయి. 10 డాలర్లు ఇచ్చి తెల్ల షర్టుమీద పిల్లలు వాళ్ళకిష్టమైన రంగులు స్ప్రే చేశారు. అవి పడ్డ ఆకారాలు చూసి తాము అద్భుతంగా పైంట్ చేశామనుకుని మురిసిపోయారు పిల్లలు. మనవాళ్ళు కాయితాలమీద ఇంకు జల్లి వాటిని మడిచి రకరకాల ఆకారాలను చూసి మురిసిపోతారుకదండీ. అలాగే.

షో అంటే తినుబండారాలు తప్పనిసరికదా. కేండీలు, ఐస్ క్రీమ్సూ, ఇవేకాక ఎలిఫెంట్ ఇయర్స్ అని ఒక ప్రత్యేక తినుబండారం, మన పూరీలు పెద్ద సైజులో వున్నట్లుంటాయి..వాటిమీద చక్కెర వగైరాలు వేసి ఇస్తారు..అవీ, ఇంకా రకరకాలు.

వీటన్నింటి మధ్యలో ఒక చిన్న స్టేజ్ ఏర్పాటు చేసి సంగీత కచేరీలు (సంగీత కచేరీ అన్నానని మనవి వూహించుకోకండి. ఇప్పుడు చెబుతున్నది అమెరికా గురించి..అందుకని వెస్ట్రన్ మ్యూజిక్ వూహించుకోండి.)

వీటన్నిటి మధ్యలో ఒకాయన ప్రక్క వాయిద్యాలేమీ లేకుండా ఎలక్ట్రిక్ గిటార్ మీద అక్కడివారు కోరిన పాటలు వాయిస్తున్నాడు. అలాగే ఆయన ఆల్బమ్స్ అమ్మకానికి వున్నాయి. వివరాలన్నీ ఒక బోర్డుమీద రాసి పక్కన పెట్టాడు.

ఈ షోలో ఆడంబరమైన వస్తువులేమీలేకపోయినా ఇక్కడివారిలోని అభిమానాలు పెల్లుబికాయనిపించింది. చాలామంది తమ పెంపుడు కుక్కలని తెచ్చారు. ఎంత భయంకరమైన కుక్కలైనా తమ యజమానులతో హాయిగా తిరిగాయి ఎవరినీ భయపెట్టకుండా. పిల్లలు ప్రదర్శనకన్నా ఈ కుక్కలతో ఆడటానికి ఎక్కువ ఇష్టపడటం, ఒకరినొకరు పలకరించుకోవటం, వీటన్నింటితో అక్కడ పండగ వాతావరణం నెలకొంది.

సందర్శకులతో వచ్చిన ఒక బుల్లి కుక్క ఒక పెద్దకుక్కని భయపెట్టటానికి చేసిన విశ్వ ప్రయత్నం అందర్నీ ఆకర్షించింది. మీ కోసం ఆ ఫోటోలు..చూడండి మరి.








Friday, June 12, 2009

శ్రీ జగన్మోహినీ కేశవస్వామి ఆలయం, ర్యాలి


శ్రీ జగన్మోహినీ కేశవస్వామి ఆలయం, ర్యాలి

ముక్తేశ్వరంలో సాయంకాలం 5-30 కి బయల్దేరి తర్వాత మజిలీ ర్యాలి చేరుకునేసరికి సాయంకాలం 6-50 అయింది. చీకటిపడటంవల్ల దోవలో ప్రకృతి అందాలు చూడలేకపోయాం.

శ్రీ మహావిష్ణువు ముందువైపు పురుషరూపంలోనూ వెనుకనుంచి చూస్తే స్త్రీ రూపంలోనూ దర్శనమిచ్చే అపురూపమయిన ఆలయం ఇది. విష్ణుదేవుడు ఈ రూపంలో పూజలందుకోవటం బహుశా ఇంకెక్కడా లేదేమో.

భగవానుని మోహినీ రూపం కధ అందరికీ తెలిసిందే. మోహినిని చూసిన శంకరుడు మాయామోహంలోపడి ఆవిడని వెంబడించాడు. మోహిని ఈ ప్రదేశానికి వచ్చినప్పుడు ఆవిడ తలలోనుంచి ఒక పువ్వు ఇక్కడరాలి పడిందిట. దానిని వాసన చూసిన శివుడుకి మాయ వీడిపోయ ఎదురుగా విష్ణు భగవానుని చూశాడుట. మోహిని తలలోంచి పువ్వు రాలి పడ్డదిగనుక రాలి క్రమంగా ర్యాలి అయిందంటారు. ఆ కధకి నిదర్శనంగానే శ్రీ మహావిష్ణు విగ్రహం ముందునుంచి పురుష రూపం, వెనుకనుంచి మోహినీ రూపంతో వున్నదంటారు.

ఇంకో కద ప్రకారం, 11 వ శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని చోళరాజులు పరిపాలిస్తూండేవాళ్ళు. అప్పుడు ఇక్కడంతా దట్టమైన అరణ్యాలు వుండేవి. చోళ రాజులలో ఒకరైన రాజా విక్రమదేవుడు ఒకసారి ఈ ప్రాంతానికి వేటకు వచ్చాడు. కొంతసేపు వేటాడిన తర్వాత అలసిన రాజు ఒక చెట్టుకింద పడుకుని నిద్రపోయాడు. ఆ నిద్రలో మహావిష్ణువు ఆయన కలలో కనబడి, తన విగ్రహం ఆ ప్రాంతాల్లో వుందని దానిని తీసి ఆలయ నిర్మాణం చేసి పూజలు జరిపించమని చెప్పాడు. ఆ విగ్రహాన్ని కనుగొనటానికి ఒక చెక్క రధాన్ని ఆ ప్రాంతంలో లాగుకుని వెళ్తుంటే ఆ రధశీల ఎక్కడ రాలి పడిపోతుందో అక్కడ తవ్విస్తే విగ్రహం కనబడుతుందని చెప్పాడు.

విక్రమదేవుడు భగవతాదేశాన్ని పాటించి ఈ ప్రాంతంలో విగ్రహాన్ని కనుగొని ఆలయాన్ని కట్టించాడు.

ప్రకృతి సౌందర్యం మధ్య కొలువైవున్న ఈ ఆలయంలోని స్వామి సౌందర్యం వర్ణనాతీతం. ఐదు అడుగుల ఎత్తైన సాలిగ్రామ శిల ఇది. మకరతోరణంమీద దశావతారాలు, నారద, తుంబురులు, ఆదిశేషు, పొన్నచెట్టు, గోవర్ధనగిరి, మహర్షులు, అన్నీ ఆవిగ్రహం చుట్టూ వున్నాయి. ఆ విగ్రహంయొక్క గోళ్ళు కూడా చాలా సజీవంగా కనిపిస్తాయి. వెనుకవైపునుంచి చూస్తే పద్మినీజాతి స్త్రీ అలంకరణ।


నేను మరచిన ఇంకో విషయాన్ని శ్రీ డి। వేణుగోపాల్ గారు గుర్తు చేశారు ఇక్కడ స్వామి పాదాల దగ్గర చిన్న గుంటలో ఎప్పుడూ నీరు వుంటుంది। ఎన్నిసార్లు తీసినా ఆ నీరు అలాగే వూరుతూ వుంటుంది.

స్వయంభూనో, శిల్పి చాతుర్యమో, ఏదయినాగానీ ఆ దేవదేవుని అవతారిమూర్తిని చూసి అద్భుతమని చేతులు జోడించవససినదే.

ఈ క్షేత్రంలోని ఇంకొక విశిష్టత విష్ణ్వాలయం ఎదురుగావున్న ఈశ్వరాలయం -- శ్రీ ఉమా కమండలేశ్వరాలయం. పూర్వం అక్కడ త్రిమూర్తలలో ఒకరైన బ్రహ్మదేవుడు తపస్సు చేశాడుట. ఆ సమయంలో ఆయన తన కమండలంపై ఉమతో కూడిన ఈశ్వరుని ప్రతిష్టించాడుట. అందుకే ఈ ఆలయం ఉమా కమండలేశ్వరాలయంగా ప్రసిధ్ధికెక్కింది.

ఇక్కడ ఇంకొక విశేషం తర్వాత తెలిసింది. ఇది చదివిన తర్వాత వెళ్ళినవాళ్ళు గమనించండి. ఈశ్వరుడుకి అభిషేకం చేసిననీరు బయటకిగానీ కిందకిగానీ పోవటానికి మార్గంలేదుట. మోహినీమూర్తినిచూసి మోహించిన శివుని శరీర వేడికి పైన అభిషేకం చేసిన గంగ హరించుకుపోతుందంటారు.

ట్రాన్సఫర్ కావాల్సిన ఉద్యోగస్తులు ఒకసారు ఈ దేవాలయాన్ని దర్శిస్తే త్వరలో ట్రాన్సఫర్ అవుతుందిట.

తూర్పు గోదావరి జిల్లాలో కోనసీమకి ముఖద్వారం అని చెప్పదగ్గ రావులపాలెంకి 6 కి. మీ. ల దూరంలో ఆత్రేయపురం (పూతరేకులకు ప్రసిధ్ధి) మండలంలో వున్న ఈ గ్రామానికి రాజమండ్రినుండి బస్సులున్నాయి. రావులపాలెంనుంచి ఆటోలోకూడా వెళ్ళవచ్చు।



Saturday, June 6, 2009

ముక్తేశ్వరం




ముక్తేశ్వరం
సాయంత్రం 5 గం. లకి ఐనవల్లి నుంచి బయల్దేరి ముక్తేశ్వరం వచ్చాం. 10 నిముషాల ప్రయాణం కూడా వుండదు. మైన్ రోడ్డు ఎక్కగానే ముక్తేశ్వరమే. అంటే ముక్తేశ్వరం నుంచి ఎడమవైపు రోడ్డులో వెళ్తే ఐనవల్లి వస్తుంది.

మైన్ రోడ్డులో ఎడమవైపు తిరగగానే ఎదురెదురుగా రెండు ముక్తేశ్వరాలయాలు. ఎడమవైపువున్న ఆలయం శ్రీ ముక్తికాంత క్షణ ముక్తేశ్వర స్వామి ఆలయం. గర్భగుడిలో స్వామి పక్కనే అమ్మవారు. లింగానికి ఇత్తడి ముఖం అలంకరింపబడివుంది. గుడి ప్రధాన ద్వారం తెరిచివుంది. గర్భగుడికి కటకటాల తలుపులు వేసివున్నాయి. పూజారి లేరు. పక్కనే శ్రీదేవీ భూదేవీ సమేత కేశవస్వామి. ఇక్కడ శివ కేవులని శ్రీ రామచంద్రుడు ప్రతిష్టిచాడంటారు. ఈ ఆలయం ఐనవల్లి పంచాయతీలోకి వస్తుదిట.

ఎదురుగా శ్రీ రాజేశ్వరీ సమేత ముక్తేశ్వరస్వామి ఆలయం. ఇది సత్తనపూడి పంచాయతీ శివారులోవుంది. 130 సంవత్సరాల క్రితం రెండు గ్రామాల్లోవాళ్ళ మధ్య కలహాలవల్ల క్షణముక్తేశ్వరస్వామి ఆలయంనుంచి ఉత్సవ విగ్రహాలను తీసుకొచ్చి ఇక్కడ పెట్టారుట. తర్వాత శ్రీ విద్యా ఉపాసకులయిన శ్రీ కప్పగంతుల మల్లికార్జున శాస్త్రి గారు ప్రక్కన శ్రీ రాజేశ్వరీదేవిని ప్రతిష్టించారు. ఈ ఆలయం ప్రస్తుతం ట్రస్టు ఆధ్వర్యంలో నడుస్తోంది. ఆలయంలో పూజారిగారున్నారు. ఆయనే ఈ వివరాలు చెప్పారు.

Sunday, May 31, 2009

శ్రీ సిధ్ధివినాయక దేవాలయము, ఐనవల్లి





శ్రీ సిధ్ధి వినాయక దేవాలయం, ఐనవల్లి

ఆకాశం మేఘావృతమైవుంది. చిరుజల్లులతో వాతావరణం ఆహ్లాదకరంగా వుంది. సన్నని రోడ్డుకటూ ఇటూ పచ్చని పొలాలూ, కొబ్బరి తోటలూ పిల్లగాలుల వింజామరలు వీస్తుంటే ప్రకృతి అందాలు మనసునిండా నింపుకుంటూ ముమ్మిడివరంనుంచీ 12 కి.మీ. ల దూరంలో వున్న ఐనవల్లి శ్రీ సిధ్ధి వినాయక దేవాలయానికి చేరుకున్నాము.

అతి పురాతన కాలంనుంచీ భక్తుల కోర్కెలు తీరుస్తున్న ఈ బొజ్జ గణపయ్యను దక్షప్రజాపతి దక్ష యజ్ఞం ప్రారంభించటానికి ముందు పూజించాడని అంటారు. వ్యాసమహర్షి తన దక్షిణాపధ యాత్ర ప్రారంభంలో పార్వతీ తనయుణ్ణి ఇక్కడ ప్రతిష్టించి పూజించాడని ఇంకో కధనం.

ఏ కధ నిజమైతే మనకెందుకుగానీ పురాణకాలంనుంచీ లబ్ధ ప్రతిష్టుడయిన ఈ దేవదేవుని, దక్ష ప్రజాపతి, వ్యాస మహర్షి వంటి మహనీయులు పూజించిన ఈ గణాధిపతిని ఇవాళ మేము దర్శించుకున్నామని ఆనందించాము.

ఈ దేవాలయంలో ఇంకా అన్నపూర్ణా సమేత విశ్వేశ్వర స్వామి, శ్రీదేవి, భూదేవి సమేత కేశవస్వామి, క్షేత్రపాలకుడైన కాలభైరవస్వాముల ఉపాలయాలు వున్నాయి.

పురాతన కాలానికి చెందిన ఈ ఆలయాన్ని పెద్దాపురం రాజులు పునరుధ్ధరించారు. ప్రస్తుతం ఎండౌమెంట్స్ డిపార్టుమెంటు ఆధ్వర్యంలో వున్నది.

ప్రతి నెలా చవితి, దశమి, ఏకాదశి రోజులలోనూ, వినాయక చవితి, నవరాత్రి, కార్తీక మాసం మొదలగు పర్వదినాలలోనూ విశేష పూజలు జరుగుతాయి.

ఇక్కడ భక్తులు రాత్రిపూట గుళ్ళో నిద్ర చేస్తారు. ఉదయం ఆలయంలో భక్తులకోసం అన్నదానం వుంది. గెస్టు హౌస్, హోటళ్ళల్లో బసచేయదలుచుకున్నవారికి అమలాపురంలో సౌకర్యంవుంది.

కాకినాడనుంచి 70 కి.మీ (వయా యానాం, ముమ్మిడివరం, ముక్తేశ్వరం), రాజాంనుంచి 55 కి.మీ. (వయా రావులపాలెం, కొత్తపేట, వానపల్లి), అమలాపురంనుంచి 14 కి.మీ ల దూరంలో వున్న ఈ దివ్య క్షేత్రం చిరునామా
ఎక్జిక్యూటివ్ ఆఫీసరు,
శ్రీ విఘ్నేశ్వరస్వామి దేవస్ధానం,
ఐనవల్లి (గ్రామం మరియు మండలం)
పిన్ 533211
తూర్పు గోదావరి జిల్లా
ఫోన్ నెంబరు 08856 – 225812

ఆలయం తెరచి వుంచు సమయాలు
ఉదయం 6 గం. ల నుంచీ 12-30 దాకా
సాయంత్రం 4-30 నుంచీ 7-30 దాకా
అభిషేక సమయం ఉదయం 6 గం. ల నుంచీ 11-30 దాకా.

Tuesday, May 5, 2009

ముమ్మిడివరం

భగవాన్ శ్రీ బాలయోగి మందిరం

ముమ్మిడివరం

సాయంత్రం 4 గం. లకు మురమళ్ళ లో బయల్దేరాము. త్రోవలో ముమ్మిడివరం బోర్డు చూసి మా చిన్నతనంలో బాలయోగిగారి గురించి చెప్పుకునే విశేషాలు గుర్తుకొచ్చి వాళ్ళు ఎంతోకాలం తపస్సు చేసిన ఆ ప్రదేశాన్ని సందర్శించటానికి చాలా సంతోషంగా వెళ్ళాము. మా ప్రయాణాలు చాలా వింతగా వుంటాయి లెండి. ఏవో రెండు మూడు చోట్లనుకుని బయల్దేరుతాము. త్రోవలో అంతకు ముందు మేము చదివిన విశేషాలేమైనా గుర్తొస్తే, ఆ ప్రదేశాలూ, ఇంకా ఆ ప్రాంతాల్లో కనుక్కోగా తెలిసే ప్రదేశాలు, ఒక్కోసారి మా ఆసక్తి గమనించి స్ధానికులు తెలిపే కొత్త ప్రదేశాలూ చాలానే చుట్టబెడతాము. ముందుగా మా ప్లానులో లేనివాటన్నిటినీ బోనసులనుకుంటాము. ముమ్మిడివరం మాకు బోనసే. దూరమేమో అనుకున్నాముగానీ మురమళ్ళనుంచి కేవలం 15 ని.ల కారు ప్రయాణం.

ఇద్దరు బాలయోగీశ్వరులు తపస్సుచేసిన పుణ్య స్ధలం ఇది. బహుశా చిన్నతనంలోనే వారు తపస్సు ప్రారంభించటంతో వారిని బాలయోగీశ్వరులన్నారేమో. భగవాన్ పెద్ద బాల యోగీశ్వరుల జననం 23-10-1930. ఆయన 16వ ఏటనే, 22-6-1946లో తపస్సు ప్రారంభించారు. ఆయన ఆహార పానీయాలు కూడా విసర్జించి తపోనిష్టలో నిమగ్నులయ్యారు. ఫిబ్రవరి 1949లో తమ తపస్సుకు అంతరాయం కలుగకుండా తలుపులు తాళం వేసి వుంచమని భక్తులకు చెప్పారు. ఆయన ఎపరికీ దర్శనమివ్వక నిరంతరం తపస్సులో మునిగి వుండటంతో భక్తులు నిరాశ చెందారు. ఒకసారి దర్శనమిచ్చినప్పుడు కనీసం ఏడాదికి ఒకసారైనా తమకు దర్శనమివ్వాలని భక్తులు ప్రాధేయపడటంతో వారి కోరిక మన్నించి, ఏడాదికొకసారి, మహా శివ రాత్రి మరునాడు ఉదయే 4 గం. లనుంచి, రాత్రి 12 గం. లదాకా భక్తులకు దర్శనమివ్వటానికి అంగీకరించారు. అప్పుడు కూడా ఆయన తపస్సులో నిమగ్నమై వుండేవారు. భక్తులు నిశ్శబ్దంగా అలతి దూరంనుంచి దర్శనం చేసుకుని వెళ్ళేవాళ్ళు.

ఇంక భగవాన్ శ్రీ చిన్న బాలయోగిగారి జననం 3-11 1941. ఆయన తన 8వ ఏటనే 26-3-1950లో తపస్సు ప్రారంభించారు. ఈయనకూడా తాళం వేసివున్న గదిలో ఆహార పానీయాలు లేకుండా అనేక సంవత్సరాలు తపస్సుచేసి 28-10-1991 లో సమాధి చెందారు.

ఆహార పానీయాలు లేకుండా, తాళం వేసివున్న గదిలో నిరంతరం తపోనిష్టలో మునిగి ఆ ప్రాంతాన్ని పునీతం చేసిన ఈ మహానుభావుల గురించి మా చిన్నతనంలో అనేక కధలు చెప్పుకునేవారు. వారి దర్శనానికి వెళ్ళినవారిలో కొందరికి ఆ ప్రదేశంలో వారి తపో మహిమల వలన వింత దృశ్యాలు కనిపించేవట. అలాంటి పావన ప్రదేశాన్న దర్శించుకుని అలౌకిక ఆనందంతో మా తదుపరి మజిలీ ఐనవిల్లికి బయల్దేరాము.