Sunday, August 23, 2009

శ్రీ తిరుపతమ్మ దేవాలయం, పెనుగంచిప్రోలు


ఆలయం ముఖద్వారం

ఆలయంలోపల దృశ్యం




శ్రీ తిరుపతమ్మ అమ్మవారి దేవస్ధానము, పెనుగంచిప్రోలు


తిరుమలగిరికి దగ్గరలోనే పెనుగంచిప్రోలులో వున్న శ్రీ తిరుపతమ్మ ఆలయం ఇక్కడ చాలా ప్రసిధ్ధిచెందినది. ఈ ఆలయాన్ని సందర్శించే భక్తజనసందోహంకూడా ఎక్కువే. తమపాలిటి కల్పవల్లిగా వెలిసిన ఈ దేవి దర్శనార్ధం చుట్టుపక్కలనుంచేకాక సుదూర తీరాలనుంచి కూడా భక్తులు వస్తారు...భక్తితో పసుపు కుంకుమలు సమర్పిస్తారు.

శ్రీ తిరుపతమ్మ శ్రీ వేంకటేశ్వరస్వామి అంశతో జన్మించిన కారణజన్మురాలు అంటారు. ప్రతి ఏటా ఉత్సవాల సమయంలో తిరుమలగిరి శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంనుంచి మొదటి పసుపు కుంకుమలు అమ్మవారికి పంపించటం ఇప్పటికీ ఆనవాయితీగా వుంది.

ఇక్కడ శ్రీ తిరుపతమ్మ విగ్రహం ప్రక్కన ఆమె భర్త శ్రీ గోపయ్య విగ్రహం, వేరే మంటపాలలో శ్రీ అంకమ్మ, ఇతర దేవతల విగ్రహాలు కూడా ప్రతిష్టించబడ్డాయి.

మాఘ శుధ్ధ పౌర్ణమినుంచి ఐదు రోజులు, ఫాల్గుణ మాసంలో నెల రోజులు ఇక్కడ ఉత్సవాలు జరుగుతాయి।







Friday, August 14, 2009

కృష్ణాష్టమి

ఆంజనేయ స్వామి (అసలు విగ్రహం...ఇప్పుడు వేరేది పెద్ద విగ్రహం చేయించి ప్రతిష్టించారు)
మొవ్వ గోపాలుని పదాల సృష్టికర్త వరదయ్య లేక క్షేత్రయ్య

మొవ్వ వేణు గోపాల స్వామి (అసలు విగ్రహం...దీని స్ధానంలో పెద్ద విగ్రహం చేయించి ప్రతిష్టించారు)

కృష్ణాష్టమి

కృష్ణాష్టమి సందర్భంగా పోస్టు రాయండి అని శ్రీమతి జ్యోతి అంటే నాకేమీ తోచలేదు. కృష్ణుడి గురించి రాసే పాండిత్యం నాకు లేదు. గురువారం సాయంత్రం 6 గం. లయింది. ఏమీ రాయలేకపోయాను. పోనీ ఈ మాటుకి మానేద్దామా అనుకున్నాను. మనసొప్పటంలేదు. ఆకస్మాత్తుగా గుర్తొచ్చింది భక్తి మాస పత్రికలో ప్రచురించబడిన నా మొవ్వ వ్యాసం. కృష్ణాష్టమినాడు మీకందరికీ మొవ్వ వేణుగోపాలుని పరిచయంచెయ్యటంకన్నా మహద్భాగ్యం ఏముంటుంది. కృష్ణాజిల్లాలోని మొవ్వ గ్రామంలో వెలసిన వేణుగోపాల స్వామిని చూశారా ఎవరైనా? లేదా? ఇప్పుడు చూడండి.

మొవ్వ

మొవ్వ అనగానే మువ్వ గోపాలుడు గుర్తుకొస్తున్నాడు కదూ. నిజమేనండీ. ఆ వేణు గోపాలుడు మౌద్గల్య మహర్షికి ప్రత్యక్షమైన ప్రదేశం ఇది. సామాన్య గోవుల కాపరి వరదయ్యను ఆ వేణుగానలోలుడు క్షేత్రయ్యగా మార్చి క్షేత్రయ్య పదాలకు నాందీ పలికిన ప్రదేశమిది. కృష్ణా జిల్లాలో కూచిపూడి నాట్యానికి ప్రసిధ్ధి చెందిన కూచిపూడికి 3 కి.మీ. ల దూరంలో వున్నది. వసతి, ఆహార సౌకర్యాలు కూచిపూడిలోనే. మీరు వెళ్ళేది మరీ అపరాహ్ణ సమయంలో కాకపోతే గుడి మూసి వున్నా తెరుస్తారు. పూజారిగారిల్లు ప్రక్కనే. ఆయనే అక్కడి చరిత్ర చాలా విపులంగా చెప్పారు.

పూర్వం ఈ ప్రాంతము కృష్ణా నదీ పరీవాహక క్షేత్రం. ఇక్కడ మౌద్గల్య మహర్షి తపస్సు చేస్తూ వుండేవారుట. ఆయనకి కృష్ణా నది ఒడ్డున ఇసుక దిబ్బల్లో ఈ వేణు గోపాల స్వామి విగ్రహం దొరికింది. ఆ విగ్రహ విశేషాలేమిటంటే శిలాకృతిలోనే, స్వామి వెనుక వున్న మకరతోరణం పై దశావతారాలు వున్నాయి. స్వామి ప్రక్కన రుక్మిణీ సత్యభామలు. చేతిలో వేణువుకు గాలి వూదే రంధ్రాలు కూడా స్పష్టంగా కనబడతాయి. ఈ విగ్రహం ఇసుక విగ్రహం కావటంతో అభిషేకాలు చేసేటప్పుడు కాళ్ళ దగ్గర కొంచెం తరుగు ఏర్పడింది. అలాంటి విగ్రహాలు పూజనీయాలు కావని, 2000 సంవత్సరంలో అదే ఆకారంలో వున్న పెద్ద విగ్రహాన్ని చేయించి ప్రతిష్టించారు. ఈ విగ్రహాన్ని వెనుక ఒక హాల్లో వుంచారు. ప్రస్తుతం పూజాదికాలులేవు గనుక ఈ విగ్రహాన్ని మనం ముట్టుకుని కూడా చూడవచ్చు. ఈ విగ్రహాన్ని చిన్నగా తడితే డొల్లు శబ్దం వస్తుంది. ఇసుకలోంచి ఉద్భవించిన విగ్రహం, ఇసుక తయారీ కనుక అలా వస్తుంది.

ఇంక వరదయ్య కధ. చాలా కాలం క్రితం వరదయ్య అనే గోవుల కాపరి గోవులను కాచుకుంటూ వచ్చి రోజూ ఈ విగ్రహం దగ్గర కూర్చుంటూ వుండేవాడుట. అతనికి చదువు సంధ్యలు ఏమీలేవు. ఒక రోజు అతనికి ఆ విగ్రహానికి పూజలు చేయాలనిపించి. అప్పటినుంచీ తనకు తోచిన విధంగా రోజూ పూజ చేసేవాడుట. ఒకసారి వేణు గోపాల స్వామి వరదయ్యకు కనిపించి నువ్వు కారణ జన్ముడవు. ఇక్కడ గోవులు కాయటం కాదు నువ్వు చెయ్యాల్సిన పని, నా గురించి ప్రచారం చెయ్యమన్నాడుట. దానికి వరదయ్య నాకు చదువూ సంధ్యా ఏమీ రాదు. నేను నీ గురించి ఏమి ప్రచారం చెయ్యగలను అని అడిగాడుట. రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా అన్నట్లు, ఆ దేవ దేవుడే తలచుకుంటే చదువులకు కొదవా. వెంటనే స్వామి వరదయ్యని నాలుక చాపమని, అతని నాలుకమీద బీజాక్షరాలు వ్రాశాడు. దానితో వరదయ్య దశ తిరిగింది. ఆయన గొప్ప పండితుడై వేణుగోపాల స్వామి మీద అనేక పాటలు వ్రాశాడు. అవ్వే క్షేత్రయ్య పదాలుగా ప్రసిధ్ధికెక్కాయి.

వరదయ్య ఈ పదాలు పాడుకుంటూ ఎక్కువగా తిరిగేవాడు. ఆయన వ్రాసిన పదాలు కూడా ఎక్కువగా ఆయననొక గోపికగా వూహించుకుని వ్రాయటంతో భక్తికన్నా రక్తి ఎక్కువగా వుండేదని ఆంధ్రులు ఆదరించలేదు. వరదయ్య తిరుగుతూ తమిళనాడుకెళ్ళి అక్కడ వరదరాజ స్వామిని సేవిస్తూ అక్కడే వుండిపోయాడు. వరదరాజ క్షేత్రంలో వుండటంతో ఆయనకి క్షేత్రయ్య అనే పేరు వచ్చింది.

ఈ ప్రాంగణంలోనే ఆంజనేయ స్వామి ఉపాలయం వుంది. ఈయన కుడి చేతిలో ఖడ్గం, ఎడమ చేతిలో సంజీవని పట్టుకుని వుంటాడు. ఇలాంటి విగ్రహం ఇక్కడ ఒక్క చోటే వున్నదట. ఆరోగ్యానికి, దుష్ట గ్రహ పీడా నివారణకు, సకల ఐశ్వర్యాలకూ, ఈ స్వామిని పూజిస్తే మంచిదట. ఈయన్ని పూజిస్తే పంచముఖ ఆంజనేయ స్వామిలో వున్న అన్ని దేవుళ్ళనీ పూజించినట్లేట. 2000 సంవత్సరంలో ఈయన విగ్రహం స్ధానంలో కూడా అదే రూపు రేఖలతో ఇంకా పెద్ద విగ్రహం తయారు చేయించి పునః ప్రతిష్టించారు. పాత విగ్రహం, వరదయ్య విగ్రహం వెనుక హాల్ లో వేణుగోపాల స్వామి విగ్రహంతోబాటు భద్రపరచబడ్డాయి.

మాఘ పూర్ణిమకు వేణు గోపాల స్వామికి విశేష వుత్సవాలు జరుగుతాయి. ఆ సమయంలో యాత్రికుల బసకు తాత్కాలిక ఏర్పాట్లు చేస్తారుట. మిగతా సమయాల్లో మన సంగతి మనం చూసుకోవాల్సిందే।



శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయం, తిరుమలగిరి

పాదాకృతిలోవున్న కోనేరు
కొండమీద ఆలయ దృశ్యం



శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయం, తిరుమలగిరి

కృష్ణా జిల్లాలో జగ్గయ్యపేటనుంచి 8 కి.మీ.ల దూరంలో వున్నది తిరుమలగిరి. జగ్గయ్యపేట-విజయవాడ రహదారిలో జగ్గయ్యపేట దాటగానే చిన్నకల్లు దగ్గర ఎడమవైపు తిరిగి 3 కి.మీ. వెళ్తే వస్తుంది ఈ ఊరు. చిన్న కొండమీద వుంటుంది ఆలయం. ఇక్కడ విశేషం శ్రీ వేంకటేశ్వరస్వామికి రూపం వుండదు. పుట్ట ఆకారంలో వెలిశారు.

భరద్వాజ మహర్షి ముక్త్యాల దగ్గర కొండమీద తపస్సు చేసుకుంటుంటే తపస్సులో పుట్టలోనుంచి తేజస్సు రావటం కనిపించిందట. తర్వాత ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు పుట్టలోనుంచి వెలుగురావటం, కేశవ నామాలు వినబడటం జరిగిందట. పుట్టలోనుంచి స్వామివారు తనని కేశవనామాలతో అర్చించమని చెప్పటంతో ఆ పుట్టకు కేశవాది ద్వాదశనామాలు ఏర్పరచి ఆ నామాలతో పూజించసాగారు. ఆదిశేషు ఇక్కడ లక్ష్మీదేవి కోసం తపస్సు చేశారుట. ఆదిశేషుకూడా ఇక్కడ వుండటంతో ఈ కొండకు శేషాచలమని పేరు వచ్చింది.

ఇక్కడవాళ్ళు చెప్పిన ఇంకొక విశేషం...ఇక్కడ కొండ ఎక్కినప్పట్నించ తిరిగి వెళ్ళేదాకా ఏదైనా కోరిక కోరుకుని స్వామిని తల్చుకుంటూవుంటే కోరిన కోరిక తప్పక నెరవేరుతుందట.

ఇక్కడ వెంకటేశ్వరస్వామి పుట్టలో వుండగా దాహం వేస్తే ఈశ్వరుడు గోవుగా బ్రహ్మ దూడగా వచ్చి స్వామి దాహం తీర్చారుట. తర్వాత ఒక భక్తుని దాహం తీర్చటానికి స్వామి తన పాదతాడనంతో ఒక బండరాయిని పగులగొడ్తే బండ రెండుగా చీలి మధ్యోలో నీరు వచ్చిందట. ఆలయానికి వెళ్ళే మెట్ల త్రోవలో ఆంజనేయ స్వామి ఆలయం ఎదురుగా వేప, రావి చెట్లక్రింద ఈ పాదాకృతిలోవున్న కోనేరు చూడవచ్చు.

ఐదు సంవత్సరాల క్రితం ఈ ఆలయాన్ని రినోవేట్ చేశారు. ఈ ఆలయ సందర్శన వేళలు ఉదయం 6 గం. లనుంచీ సాయంత్రం 5 గం.లదాకా. సూర్యాస్తమయం అయితే కొండమీద ఎవరూ వుండరు. ఆ సమయంలో పెద్ద సర్పం ఆలయంలో తిరుగుతూ వుంటుందంటారు।


Friday, August 7, 2009

బెలూన్ ఫెస్టివల్, హోవెల్, మిచిగాన్













బెలూన్ ఫెస్టివల్, హోవెల్, మిచిగాన్

జూన్ 25నుంచి 28 దాకా మిచిగాన్ లోని హోవెల్ లో, హోవెల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో బెలూన్ ఫెస్టివల్ జరిగింది. 27 వ తారీకున సాయంకాలం 7-30 గ.లకు వెళ్ళాము. 6 గం. లకి ఎగరాల్సిన బెలూన్లన్నీ వాతావరణం సరిగ్గాలేక 7-30కి ఎగరటం మొదలు పెట్టాయి, మాకోసమే ఆగాయా అన్నట్లు. అమెరికాలో అంతమంది జనాన్ని ఒకచోట అక్కడే చూశాను. లక్షల్లో వున్నారు. అంతమంది జనం వున్నా ఎక్కడా తొక్కిడిగానీ, అన్ని వేల కార్లు పార్కయినా ఎక్కడా ఏ ఇబ్బందిగానీ లేనంత విశాల ప్రదేశం. నాకంతకుముందు ఈ ఉత్సవం గురించి తెలియదు. అక్కడకి వెళ్ళాక చూశాను. 50 బెలూన్లు ఎగురవేస్తారని. ఇంతేనా అని నిరుత్సాహపడ్డాను. సరే వచ్చాంకదా చూద్దామని వెళ్ళి ఆ జనాన్ని చూసి ఆశ్చర్యపడ్డాను. అంతేకాదు మైదానంలో పెద్ద పెద్ద టెంట్లు వేసేముందు కింద పడేసినట్లున్నాయి బెలూన్లు. అమ్మో ఇంత పెద్దవా అని ఆశ్చర్యపోయాను. 7-30కి ఒక్కొక్క బెలూన్ లో గాలినింపటం ప్రారంభమయింది. కిందపడున్న గుడారాలు ఒక్కొక్కటీ రంగు రంగుల పెద్ద పెద్ద ఆకారాలని సంతరించుకుని నెమ్మదిగా గాలిలోకి ఎగురుతుంటే...ఓహ్...ఆ దృశ్యం అద్భుతం. ఒక్కొక్క బెలూన్ లో ఒకరినుంచి నలుగురుదాకా మనుషులు కింద వేళ్ళాడుతున్న బుట్టలలాంటి వాటిలో వున్నారు.

ఏభై బెలూన్లు ఒకటి తర్వాత ఒకటి గాలిలోకి ఎగిరి ఆకాశంలో గుంపుగా ప్రయాణించాయి. ఒక గంట తర్వాత తిరిగి అక్కడికే వస్తాయిట. అప్పుడు స్కై డైవింగ్ వగైరా విన్యాసాలో పోటీలు కూడా వున్నాయిట. అంత సమయం లేక, కొంత దూరం ఆకాశంలో ప్రయాణిస్తున్న బెలూన్లను కారులో వెంబడిస్తూ, ఇంటికి చేరాం. ఆ అద్భుత దృశ్యాలు మీకోసం మా కెమేరాలో బంధించి తెచ్చాం॥చూడండి।