Sunday, May 31, 2009

శ్రీ సిధ్ధివినాయక దేవాలయము, ఐనవల్లి





శ్రీ సిధ్ధి వినాయక దేవాలయం, ఐనవల్లి

ఆకాశం మేఘావృతమైవుంది. చిరుజల్లులతో వాతావరణం ఆహ్లాదకరంగా వుంది. సన్నని రోడ్డుకటూ ఇటూ పచ్చని పొలాలూ, కొబ్బరి తోటలూ పిల్లగాలుల వింజామరలు వీస్తుంటే ప్రకృతి అందాలు మనసునిండా నింపుకుంటూ ముమ్మిడివరంనుంచీ 12 కి.మీ. ల దూరంలో వున్న ఐనవల్లి శ్రీ సిధ్ధి వినాయక దేవాలయానికి చేరుకున్నాము.

అతి పురాతన కాలంనుంచీ భక్తుల కోర్కెలు తీరుస్తున్న ఈ బొజ్జ గణపయ్యను దక్షప్రజాపతి దక్ష యజ్ఞం ప్రారంభించటానికి ముందు పూజించాడని అంటారు. వ్యాసమహర్షి తన దక్షిణాపధ యాత్ర ప్రారంభంలో పార్వతీ తనయుణ్ణి ఇక్కడ ప్రతిష్టించి పూజించాడని ఇంకో కధనం.

ఏ కధ నిజమైతే మనకెందుకుగానీ పురాణకాలంనుంచీ లబ్ధ ప్రతిష్టుడయిన ఈ దేవదేవుని, దక్ష ప్రజాపతి, వ్యాస మహర్షి వంటి మహనీయులు పూజించిన ఈ గణాధిపతిని ఇవాళ మేము దర్శించుకున్నామని ఆనందించాము.

ఈ దేవాలయంలో ఇంకా అన్నపూర్ణా సమేత విశ్వేశ్వర స్వామి, శ్రీదేవి, భూదేవి సమేత కేశవస్వామి, క్షేత్రపాలకుడైన కాలభైరవస్వాముల ఉపాలయాలు వున్నాయి.

పురాతన కాలానికి చెందిన ఈ ఆలయాన్ని పెద్దాపురం రాజులు పునరుధ్ధరించారు. ప్రస్తుతం ఎండౌమెంట్స్ డిపార్టుమెంటు ఆధ్వర్యంలో వున్నది.

ప్రతి నెలా చవితి, దశమి, ఏకాదశి రోజులలోనూ, వినాయక చవితి, నవరాత్రి, కార్తీక మాసం మొదలగు పర్వదినాలలోనూ విశేష పూజలు జరుగుతాయి.

ఇక్కడ భక్తులు రాత్రిపూట గుళ్ళో నిద్ర చేస్తారు. ఉదయం ఆలయంలో భక్తులకోసం అన్నదానం వుంది. గెస్టు హౌస్, హోటళ్ళల్లో బసచేయదలుచుకున్నవారికి అమలాపురంలో సౌకర్యంవుంది.

కాకినాడనుంచి 70 కి.మీ (వయా యానాం, ముమ్మిడివరం, ముక్తేశ్వరం), రాజాంనుంచి 55 కి.మీ. (వయా రావులపాలెం, కొత్తపేట, వానపల్లి), అమలాపురంనుంచి 14 కి.మీ ల దూరంలో వున్న ఈ దివ్య క్షేత్రం చిరునామా
ఎక్జిక్యూటివ్ ఆఫీసరు,
శ్రీ విఘ్నేశ్వరస్వామి దేవస్ధానం,
ఐనవల్లి (గ్రామం మరియు మండలం)
పిన్ 533211
తూర్పు గోదావరి జిల్లా
ఫోన్ నెంబరు 08856 – 225812

ఆలయం తెరచి వుంచు సమయాలు
ఉదయం 6 గం. ల నుంచీ 12-30 దాకా
సాయంత్రం 4-30 నుంచీ 7-30 దాకా
అభిషేక సమయం ఉదయం 6 గం. ల నుంచీ 11-30 దాకా.

2 comments:

పరిమళం said...

మాది తూర్పు గోదావరి జిల్లా అయినా మా దగ్గరలోని విశేషాలే మేము చూడలేకపోయాం . మీ యాత్ర వల్ల మాకు ఆ ప్రదేశాలను చూసిన అనుభూతి ..చూడాలనే ఆసక్తి ..కలుగుతున్నాయి .లక్ష్మి గారూ ! ధన్యవాదాలు .

psmlakshmiblogspotcom said...

మీ జిల్లాలోని ప్రదేశాలు మీకు చూపిస్తున్నందుకు, అవి మీకు నచ్చినందుకు సంతోషంగా వుంది పరిమళంగారూ. ఇలాగే వేరే జిల్లాలకి కూడా ఆహ్వానం పలకండి....గోదావరి జిల్లాల తర్వాత రానున్నాయి.
psmlakshmi