Monday, July 27, 2009

వేదాద్రి

శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్ధానం, వేదాద్రి
ఆలయ దృశ్యం
కృష్ణానదిలో సాలగ్రామ నరసింహస్వామి

శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహస్వామి దేవస్ధానం, వేదాద్రి

జగ్గయ్యపేటకు 9 కి.మీ.ల దూరంలో వున్న ఈ క్షేత్రం నవ నారసింహ క్షేత్రాలలో ఒకటి. అంతేకాదు కృష్ణా నదీ తీరాన వున్న పంచ నారసింహ క్షేత్రాలలో ఒకటి. మిగతా నాలుగూ వాడపల్లి, మట్టపల్లి, కేతవరం, మంగళగిరి. పంచ నారసింహ క్షేత్రంగా ప్రసిధ్ధికెక్కిన ఈ మహా క్షేత్రంలో స్వామివారు 5 రూపాలలో అవతరించారుట.

1. శ్రీ జ్వాలా నరసింహస్వామి -- స్వయంభూ -- శిఖర స్ధితి (ఆలయం పక్కనుంచి మెట్లు కనబడతాయి)

2. శ్రీ సాలిగ్రామ నృసింహ స్వామి -- బ్రహ్మ ప్రతిష్ఠ -- కృష్ణానదిలో (ఆలయంలో నుంచి కూడా చూడవచ్చు)

3. శ్రీ వీర నృసింహ స్వామి -- స్వయంభూ -- గరుడాచలం (ఇక్కడికి 5 కి.మీ.ల దూరంలో)

4. శ్రీ యోగానంద స్వామి త్రేతాయుగంలో ఋష్యశృంగ మహర్షి ప్రతిష్ఠించినది -- మూలవిరాట్, గర్భాలయం

5. శ్రీ లక్ష్మీ నృసింహస్వామి -- మూలవిరాట్ పీఠం లోక కళ్యాణార్ధం ప్రతిష్ఠింపబడ్డది.

ఈ స్వామిని సేవిస్తే గ్రహబాధలు, మానసిక రుగ్మతలు తొలగిపోతాయట.

గుడిలో స్వామితోబాటు చెంచు లక్ష్మి, రాజ్య లక్ష్మి అమ్మవార్లకు ప్రత్యేక మందిరాలు వున్నాయి.

ఇక్కడ దేవాలయ సత్రంలో వసతి సౌకర్యం వుందిగానీ బస, భోజనం జగ్గయ్యపేటలో అయితే ఇబ్బందిలేకుండా వుంటుంది.

ఇంకొక విషయం. దేవుడికి పూలమాలలు సమర్పించాలనుకుంటే జగ్గయ్యపేటనుంచి తీసుకువెళ్ళండి. అలంకరిస్తారు. గుడి దగ్గర దొరకవు.

ఇక్కడ కోతుల బెడద చాలా ఎక్కువ. కవరు కనబడితే పీకేస్తాయి అరటి పళ్ళున్నాయనుకుని. మేము దండలు విడిగా పట్టుకెళ్ళాము.

దర్శన సమయాలు

ఉదయం 6-30 నుంచి మధ్యాహ్నం 1-00 గం. దాకా మధ్యలో అరగంట విరామంతో

సాయంత్రం 3-00 గం. లనుంచి 5-30 దాకా మళ్ళీ 6-30 నుంచి 8-30 దాకా.

మొదటిసారి వెళ్ళేటప్పడు చీకటిపడకుండా వెళ్తే ఇబ్బందిలేకుండా వుంటుంది।



Wednesday, July 15, 2009

ముక్త్యాలలో మరచిపోలేని అనుభూతులు

కొన్ని ప్రదేశాలలో మనం వున్నది చాలా తక్కువ సమయం అయినా మరచిపోలేని అనుభూతులు మూటకట్టుకుని వస్తాము. అలాంటి అనుభూతులు, ముక్త్యాల తలుచుకోగానే గర్తుకొచ్చేవి మీతో పంచుకోవాలనిపించింది.

2008 కార్తీకమాసంలో కూర్చున్నదానికి కూర్చున్నట్లే ఒక ఆలోచన వచ్చింది. ఈ మారు కార్తీక మాసంలో గుళ్ళో దీపాలు పెట్టాల్సిందే. ఆ పెట్టేదేదో 108 లింగాల దగ్గర పెడితే బాగుంటుందికదా. అంతే నా ఆలోచన వెంటనే మావారికి చెప్పటం..ఇద్దరం కలిసి ఎక్కడెక్కడ గుళ్ళున్నాయో ఆలోచించటం మొదలు పెట్టాము. మర్నాడు ప్రొద్దున్నఆయన ఆఫీసుకెళ్ళేలోపల కాలనీ దగ్గర వున్న 3 గుళ్లకెళ్ళి దీపాలు పెట్టి వచ్చాను. ఎంత లిస్టు వేసినా అంతంత దూరాలు వెళ్ళి 108 శివ లింగాల దగ్గర దీపాలు పెట్టాలంటే ఎంతకాలం పడుతుందో అనే ఆలోచన. ఇంతలో ఆఫీసునుంచి వెంకట్ (మా వారు) ఫోన్ చేశారు. ముక్త్యాల కోటిలింగ క్షేత్రంలో శివలింగాల ప్రతిష్ట జరిగిందేమో కనుక్కో..అక్కడ ప్రతిష్ట జరిగితే చాలా శివ లింగాలు వుంటాయికదా. నీకెన్ని దీపాలు కావాలంటే అన్ని పెట్టుకోవచ్చు అన్నారు. వెంటనే ఫోన్ చేస్తే శివ లింగ ప్రతిష్టలు జరుగుతున్నాయి, కొన్ని వేల లింగాల ప్రతిష్ట జరిగింది అన్నారు. ఆ శని, ఆదివారాలలో ముక్త్యాల ప్రయాణం అనుకున్నాము. వెంటనే ప్రమిదలు మిగతా అవసరమైన వస్తువులు సమకూర్చుకోవటం మొదలు పెట్టాము. మేమిద్దరం, మా స్నేహితురాళ్ళు ఇంకో ముగ్గురం కలిసి పొద్దున్న బయల్దేరి ముక్త్యాల చేరేసరికి మధ్యాహ్నమయింది. ఆరోజు మధ్యాహ్నం ఏమీ తోచక బల్లకట్టుమీద కారుతో సహా అవతల ఒడ్డుకు వెళ్ళాం. ఆ ఒడ్డునుంచీ అంతా గుంటూరు జిల్లా. అక్కడనుంచి కేతగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం దగ్గర అంటే వెళ్ళొద్దామనే ఉద్దేశ్యం. కొంచెం దూరం వెళ్ళేసరికి ముక్త్యాల కృష్ణ ఒడ్డున చూసిన ప్రకటన శ్రీ అష్టముఖ గండభేరుండ బడబానల జ్వాలా లక్ష్మీ నృసింహస్వామి బోర్డు కనిపించి వెళ్ళి చూసి వచ్చాము. దీనిగురించి వేరే పోస్టు రాస్తాను. అక్కడ తెలిసింది కేతగిరి అడవి మర్గాన వెళ్తే అక్కడికి దగ్గరే కానీ కొన్ని మైళ్ళు నడచి వెళ్ళాలి..రోడ్డు మార్గాన అయితే అటునుంచి దూరమని. తిరిగి వస్తూ ముక్త్యాల శ్రీ ముక్తేశ్వరాలయంలో 365 ఒత్తులతో దీపాలు పెట్టాము. తర్వాత శ్రీ కోటిలింగ క్షేత్రం చేరేసరికి బాగా చీకటి పడింది. చీకట్లోనే దీపాలు బాగుంటాయనుకున్నాము. మర్నాడు అభిషేకం, లింగ ప్రతిష్ట చెయ్యాలని అడిగితే, ఉదయం 10 గం. కి రమ్మన్నారు. ఇంక అప్పుడు నా కోరిక, 108 శివలింగాల దగ్గర దీపాలు పెట్టాను. మా స్నేహితురాళ్లుకూడా వేరే కొన్ని పెట్టారు. ఆ దీపాలు పెట్టటానికి, నాకు మాముగ్గురు స్నేహితురాళ్ళు సహాయం చేస్తే 3 గంటలు పట్టింది. అన్ని శివలింగాలముందు ఆ దీపాలు చాలా అద్భుతంగా కనిపించాయి. దీని గురించి అంతరంగ తరంగాలలో అప్పుడు రాసిన పోస్ట్ కార్తీక దీపాలు చూడండి.

మర్నాడు ఉదయం ముందుగా వేదాద్రి వెళ్ళి కృష్ణ స్నానంచేసి, శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దర్శనానంతరం, ముక్తేశ్వరాలయానికి బయల్దేరాము. ఆ రోజు నాగుల చవితి. మా స్నేహితురాళ్ళు నాగులచవితి కోసం ఇంటినుంచి ప్రసాదాలు తయారుచేసి తెచ్చారు. వెళ్ళేది గుళ్ళకి కదా ఎక్కడోక్కడ వినియోగించవచ్చని. కిందటిరోజు ముక్తేశ్వరాలయానికి వెళ్ళినప్పుడు గుళ్ళో ముందు పెద్ద పుట్ట చూశాము.

అనుకోకుండా కృష్ణస్నానం చేశాం, పుట్ట వున్న గుడికి వెళ్తున్నాము..ఎక్కడన్నా పాలు దొరికితే పుట్టలో పాలు కూడా పొయ్యచ్చని అనుకున్నామోలేదో ఎదురుకుండా సైకిల్ మీద పాల క్యానులు తీసుకెళ్తున్న వ్యక్తి. వెంటనే ఆ అబ్బాయిని ఆపి అడిగాము ఆవు పాలున్నాయా అంటే వున్నాయన్నాడు. మరి ఎలా తీసుకెళ్ళాలి బ్రిలియంట్ ఐడియా. ఒక నీళ్ళ బాటిల్ తీసి నీళ్ళు ఒంపేసి పాలు పోయించాం. ఇంక చూసుకోండి మా సంబంరం. నాగుల చవితి రోజు శ్రీ ముక్తేశ్వరాలయంలో ప్రాచీనమైన పుట్టకి పూజ చెయ్యటం. పాలు పోస్తుంటే మళ్ళీ సైంటిఫిక్ ఆలోచనలు..పాములని బాధ పెడతామేమోనని..పైగా ముందునుంచీ నాగుల చవితి పూజ ఇంట్లోనే చెయ్యటం అలవాటు. అందుకే ఒక్కచుక్కే పాలు పోసి పూజ చేశాము.

తర్వాత శ్రీ కోటిలింగక్షేత్రంలో శివునికి అభిషేకం, శివలింగ ప్రతిష్ట చేసి భోజనాలయ్యాక హైదరాబాదు తిరుగు ప్రయాణం లో బోనస్ గా సూర్యాపేట దగ్గర పిల్లలమఱ్ఱి ప్రాచీన శివాలయాల్లో దైవ దర్శనం, దీపారాధన కార్తీక మాసంలో రెండు రోజుల్లో ఇన్ని కార్యక్రమాలు ఎలా మరచి పోతాను.

Thursday, July 9, 2009

శ్రీ ముక్తేశ్వరాలయం, ముక్త్యాల

బల్లకట్టు మీద లారీలు
ముక్త్యాల రాజాగారి బంగళా

శ్రీ ముక్తేశ్వరస్వామి ఆలయం, ముక్త్యాల

ముక్త్యాలలో శ్రీ కోటిలింగశివ క్షేత్రానికి 2 కి.మీ. ల దూరంలో వున్నది అతి పురాతనమైన శ్రీ ముక్తేశ్వరస్వామి ఆలయం. ఈ ఆలయంలో శివలింగం బలి చక్రవర్తిచే ప్రతిష్టింపబడ్డది. పక్కన అమ్మవారి గుళ్ళో శ్రీచక్రంకూడా ప్రతిష్టింపబడివుంది. శివ కేశవులకు బేధం లేదన్నట్లు చెన్న కేశవ స్వామి ఆలయం కూడా ఈ ప్రాకారంలోనే వుంది. ఇక్కడ కృష్ణా నది ఉత్తర వాహిని. ఈ క్షేత్రం ఉత్తర కాశీగా పరమ పావన పుణ్య తీర్ధంగా ప్రసిధ్ధికెక్కింది. పలు పురాణాలలో ఈ క్షేత్రం గురించి ప్రస్తావన వున్నది.

ఈ స్వామిని త్రేతాయుగంలో రామ లక్ష్మణులు, ద్వాపర యుగంలో పాండవులు దర్శింటారుట. ఎఱ్ఱన, శ్రీనాధుడు మొదలగు మహాకవులు ఈ క్షేత్రాన్ని దర్శించినట్లు వారు రాసిన గ్రంధాలలో వున్నది.

త్రేతాయుగంలో భరద్వాజ మహర్షి ఇక్కడ ఆశ్రమం ఏర్పాటుచేసుకుని నిత్యం ఉత్తరవాహినిలో స్నానంచేసేవారని మార్కండేయ పురాణంలో వున్నది. నదీ ప్రవాహంలో ఆయనకు జంట నందులు కనిపించేవిట. కృష్ణ ఒడ్డున జంట నందుల విగ్రహాలు వున్నాయి. ఇప్పటికీ నది లోతులో బంగారు శివాలయం వుందని భక్తుల నమ్మకం. ఋష్యశృంగ మహర్షి ఇక్కడికి సమీపంలో వున్న కొండగుహలో తపస్సు చేసేవారుట. అప్పుడు ఆ గుహ నుండి నిరంతరం సామవేదగానం వినిపించేదిట.

గుడి తెరచి వుంచు వేళలు ఉదయం 6 గం. ల నుండి మధ్యాహ్నం 12 గం. ల దాకా తిరిగి సాయంత్రం 5 గం. ల నుంచి 8 గం. ల దాకా. మీరు వెళ్ళిన సమయంలో గుడి మూసి వుంటే గుడి మొదట్లో వున్న షాపులో అడగండి. పూజారిగారి ఫోను నెంబరు దొరకవచ్చు. ఆయన ఇల్లు సమీపంలోనే. వస్తారు.

ఇక్కడి జమీందారులు ముక్త్యాల రాజావారు లబ్ధప్రతిష్టులు...కీర్తిశేషులు. వారి గురించి మేము ఎక్కువ వివరాలు తెలుసుకోలేకపోయాముకానీ కృష్ణ ఒడ్డునుంచీ వాళ్ల బంగళా ఫోటో తియ్యగలిగాము.

సరదా వున్న పట్న వాసులు చూడదగ్గ ఇంకో విశేషం బల్లకట్టు. గుడి దగ్గరనుంచి కొంచెం దూరం వుంటుంది. ఈ బల్లకట్టు మీద మనుషులతోపాటు ఒకేసారి మూడు లారీలను ఎక్కించి అవతలి ఒడ్డుకి చేరుస్తారు. కావాలంటే మీరు కూడా మీ వాహనంతో సహా ఆ బల్లకట్టుమీద అవతలి ఒడ్డుకెళ్ళచ్చు.



Wednesday, July 8, 2009

శ్రీ కోటిలింగ క్షేత్రం, ముక్త్యాల

గుడి ప్లాను

ముక్త్యాల

కృష్ణా జిల్లాలోని జగ్గయ్యపేట మండలంలో ప్రసిధ్ధి చెందిన ముక్త్యాల చూశారా? జగ్గయ్యపేట హైదరాబాదు విజయవాడ రహదారిలో హైదరాబాదునుంచి 200 కి.మీ., కోదాడనుంచి 25 కి.మీ., విజయవాడనుంచి 70 కి.మీ. ల దూరంలో వున్నది. ఇక్కడికి 10 కి.మీ. ల దూరంలో వున్నది ముక్త్యాల. జగ్గయ్యపేట నుండి ఆటోలో వెళ్ళి రావచ్చు. బస, భోజనం, జగ్గయ్యపేట లోనే.

శ్రీ కోటిలింగ మహా శివ క్షేత్రం, ముక్త్యాల

జగ్గయ్యపేట నుంచి 8 కి.మీ. ల దూరంలో ఉత్తర వాహిని అయిన కృష్ణా నదీ తీరంలో 54 ఎకరాల స్ధలంలో ఇంకా నిర్మాణ దశలో వున్న ఈ మహాద్భుత ఆలయ సముదాయం పూర్తవటానికి ఇంకో 7, 8 ఏళ్ళు పట్టవచ్చు. ఈ ఆవరణలోవున్న శ్రీ పంచముఖ అమృత లింగేశ్వరస్వామి వారి దేవాలయము సుమారు 55 అడుగుల ఎత్తయిన ఐదు అంతస్తుల విమాన గోపురంతో, 4 ద్వారములతో, 4 ధ్వజస్ధంబములతో అలరారుతోంది. ఏ ద్వారంనుంచయినా స్వామి నగుమోము దర్శనం అవుతుంది. శివాలయానికి ముందు మహా మండపం, అందులో రెండు వైపులా శ్రీ కామాక్షి, విజయ గణపతుల దేవాలయాలున్నాయి. ఇంకా కశ్యప మహర్షి రచించిన కాశ్యప శిల్ప శాస్త్ర ప్రమాణముతో 32 శివ గణ పరివారాలయములు, 27 శివలీల మూర్తులు, 27 శక్తి ఆలయములు, ద్వాదశ జ్యోతిర్లింగాలు, అష్టాదశ శక్తి పీఠాలు షట్ గణపతులు, షట్ సుబ్రహ్మణ్యులు వగైరా 108 దేవతా మూర్తులకు గుళ్ళు సిధ్ధమవుతున్నాయి. వీటిలో కొన్ని గుళ్ళల్లో దేవతా విగ్రహాల ప్రతిష్ఠ పూర్తయి పూజలందుకుంటున్నాయి. కొన్ని గుళ్ళు నిర్మాణ దశలో వున్నాయి. ఇవికాక కోటి శివలింగాలని ప్రతిష్ఠిస్తారు. ఈ ప్రతిష్ఠలు గూడా మొదలయి ఇప్పటికి కొన్ని వేల లింగాల ప్రతిష్ఠ పూర్తయింది.. ఇవ్వన్నీ పూర్తయ్యేసరికి ఈ క్షేత్రం ఎక్కు పెట్టిన బాణం ఆకారంలో వస్తుందట.

ఈ ఆలయ నిర్మాణం కంచికచర్ల వాస్తవ్యులు శ్రీ గద్దె ప్రసాద్, పావని గార్ల శుభ సంకల్పంతో, భద్రాచల వాస్తవ్యులు శ్రీ మందరపు వెకటేశ్వర్లు స్ధపతి ఆధ్వర్యంలో జరుగుతోంది.

ఇక్కడ 1,50,000 రూ. కడితే ఒక గుడి దగ్గర డోనర్స్ పేరు పెడతారు పైగా ఆ ఆలయంలో దేవతా మూర్తులను వాళ్ళచేత ప్రతిష్టింప చేస్తారు. ఇంకా 639 రూ. లు కడితే ఒక శివలింగాన్ని మనం ప్రతిష్ఠించవచ్చు కానీ ఎక్కడా మనపేరు కనబడదు. ఇవి కాక కాటేజ్ లు కూడా కడుతున్నారుట. వీటికి 70 వేల రూపాయలు కడితే ఏడాదికి 30 రోజులు డోనర్స్ అక్కడ వుండవచ్చు.

దర్శన సమయాలు ఉదయం 6 గం. ల నుంచి 1-00 గం. దాకా, సాయంత్రం 4-00 గం. లనుంచి 7-00 గం. లదాకా.

ఇంకా వివరాలు కావాల్సిన వారు ఈ క్రింది ఫోన్ నెంబర్లను సంప్రదించవచ్చు

08654320355 93462 19357 98854 64888 94407 11348 93938 ६१४०९