ముక్త్యాల
కృష్ణా జిల్లాలోని జగ్గయ్యపేట మండలంలో ప్రసిధ్ధి చెందిన ముక్త్యాల చూశారా? జగ్గయ్యపేట హైదరాబాదు – విజయవాడ రహదారిలో హైదరాబాదునుంచి 200 కి.మీ., కోదాడనుంచి 25 కి.మీ., విజయవాడనుంచి 70 కి.మీ. ల దూరంలో వున్నది. ఇక్కడికి 10 కి.మీ. ల దూరంలో వున్నది ముక్త్యాల. జగ్గయ్యపేట నుండి ఆటోలో వెళ్ళి రావచ్చు. బస, భోజనం, జగ్గయ్యపేట లోనే.
శ్రీ కోటిలింగ మహా శివ క్షేత్రం, ముక్త్యాల
జగ్గయ్యపేట నుంచి 8 కి.మీ. ల దూరంలో ఉత్తర వాహిని అయిన కృష్ణా నదీ తీరంలో 54 ఎకరాల స్ధలంలో ఇంకా నిర్మాణ దశలో వున్న ఈ మహాద్భుత ఆలయ సముదాయం పూర్తవటానికి ఇంకో 7, 8 ఏళ్ళు పట్టవచ్చు. ఈ ఆవరణలోవున్న శ్రీ పంచముఖ అమృత లింగేశ్వరస్వామి వారి దేవాలయము సుమారు 55 అడుగుల ఎత్తయిన ఐదు అంతస్తుల విమాన గోపురంతో, 4 ద్వారములతో, 4 ధ్వజస్ధంబములతో అలరారుతోంది. ఏ ద్వారంనుంచయినా స్వామి నగుమోము దర్శనం అవుతుంది. శివాలయానికి ముందు మహా మండపం, అందులో రెండు వైపులా శ్రీ కామాక్షి, విజయ గణపతుల దేవాలయాలున్నాయి. ఇంకా కశ్యప మహర్షి రచించిన కాశ్యప శిల్ప శాస్త్ర ప్రమాణముతో 32 శివ గణ పరివారాలయములు, 27 శివలీల మూర్తులు, 27 శక్తి ఆలయములు, ద్వాదశ జ్యోతిర్లింగాలు, అష్టాదశ శక్తి పీఠాలు షట్ గణపతులు, షట్ సుబ్రహ్మణ్యులు వగైరా 108 దేవతా మూర్తులకు గుళ్ళు సిధ్ధమవుతున్నాయి. వీటిలో కొన్ని గుళ్ళల్లో దేవతా విగ్రహాల ప్రతిష్ఠ పూర్తయి పూజలందుకుంటున్నాయి. కొన్ని గుళ్ళు నిర్మాణ దశలో వున్నాయి. ఇవికాక కోటి శివలింగాలని ప్రతిష్ఠిస్తారు. ఈ ప్రతిష్ఠలు గూడా మొదలయి ఇప్పటికి కొన్ని వేల లింగాల ప్రతిష్ఠ పూర్తయింది.. ఇవ్వన్నీ పూర్తయ్యేసరికి ఈ క్షేత్రం ఎక్కు పెట్టిన బాణం ఆకారంలో వస్తుందట.
ఈ ఆలయ నిర్మాణం కంచికచర్ల వాస్తవ్యులు శ్రీ గద్దె ప్రసాద్, పావని గార్ల శుభ సంకల్పంతో, భద్రాచల వాస్తవ్యులు శ్రీ మందరపు వెకటేశ్వర్లు స్ధపతి ఆధ్వర్యంలో జరుగుతోంది.
ఇక్కడ 1,50,000 రూ. కడితే ఒక గుడి దగ్గర డోనర్స్ పేరు పెడతారు పైగా ఆ ఆలయంలో దేవతా మూర్తులను వాళ్ళచేత ప్రతిష్టింప చేస్తారు. ఇంకా 639 రూ. లు కడితే ఒక శివలింగాన్ని మనం ప్రతిష్ఠించవచ్చు కానీ ఎక్కడా మనపేరు కనబడదు. ఇవి కాక కాటేజ్ లు కూడా కడుతున్నారుట. వీటికి 70 వేల రూపాయలు కడితే ఏడాదికి 30 రోజులు డోనర్స్ అక్కడ వుండవచ్చు.
దర్శన సమయాలు ఉదయం 6 గం. ల నుంచి 1-00 గం. దాకా, సాయంత్రం 4-00 గం. లనుంచి 7-00 గం. లదాకా.
ఇంకా వివరాలు కావాల్సిన వారు ఈ క్రింది ఫోన్ నెంబర్లను సంప్రదించవచ్చు
08654—320355 93462 19357 98854 64888 94407 11348 93938 ६१४०९
3 comments:
చాలా ప్రసిద్ధి చెందిన దేవాలయం. మా ఊరినుండి చాలా దగ్గర ముక్త్యాల, మాది గుంటూరు జిల్లా అయినా!! కారణం కృష్ణని దాటితే జగ్గయ్య పేట దగ్గరే. లేకపోతే గూంటూరు వెళ్ళి, బెజవాడ మీదుగా జగ్గయ్య పేట వెళ్ళాల్సి వస్తుంది.
ధన్యవాదాలు.
నేనూ ఈ గుడి గురించి విన్నాను.
మా మామయ్యావాళ్ళు రెగులర్ గా వెళుతుంటారు..
మీరు ఒక్కకటి చెపుతుంటే అప్పటికప్పుడే వెళ్ళి చూడాలనిపిస్తోంది.
ధన్యవాదాలు రామరాజుగారూ.
మాలా, తప్పకుండా వెళ్ళిరండి. చాలా ప్రదేశాలు చూడచ్చు.
PSMLAKSHMI
Post a Comment