శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహస్వామి దేవస్ధానం, వేదాద్రి
జగ్గయ్యపేటకు 9 కి.మీ.ల దూరంలో వున్న ఈ క్షేత్రం నవ నారసింహ క్షేత్రాలలో ఒకటి. అంతేకాదు కృష్ణా నదీ తీరాన వున్న పంచ నారసింహ క్షేత్రాలలో ఒకటి. మిగతా నాలుగూ వాడపల్లి, మట్టపల్లి, కేతవరం, మంగళగిరి. పంచ నారసింహ క్షేత్రంగా ప్రసిధ్ధికెక్కిన ఈ మహా క్షేత్రంలో స్వామివారు 5 రూపాలలో అవతరించారుట.
1. శ్రీ జ్వాలా నరసింహస్వామి -- స్వయంభూ -- శిఖర స్ధితి (ఆలయం పక్కనుంచి మెట్లు కనబడతాయి)
2. శ్రీ సాలిగ్రామ నృసింహ స్వామి -- బ్రహ్మ ప్రతిష్ఠ -- కృష్ణానదిలో (ఆలయంలో నుంచి కూడా చూడవచ్చు)
3. శ్రీ వీర నృసింహ స్వామి -- స్వయంభూ -- గరుడాచలం (ఇక్కడికి 5 కి.మీ.ల దూరంలో)
4. శ్రీ యోగానంద స్వామి – త్రేతాయుగంలో ఋష్యశృంగ మహర్షి ప్రతిష్ఠించినది -- మూలవిరాట్, గర్భాలయం
5. శ్రీ లక్ష్మీ నృసింహస్వామి -- మూలవిరాట్ పీఠం – లోక కళ్యాణార్ధం ప్రతిష్ఠింపబడ్డది.
ఈ స్వామిని సేవిస్తే గ్రహబాధలు, మానసిక రుగ్మతలు తొలగిపోతాయట.
గుడిలో స్వామితోబాటు చెంచు లక్ష్మి, రాజ్య లక్ష్మి అమ్మవార్లకు ప్రత్యేక మందిరాలు వున్నాయి.
ఇక్కడ దేవాలయ సత్రంలో వసతి సౌకర్యం వుందిగానీ బస, భోజనం జగ్గయ్యపేటలో అయితే ఇబ్బందిలేకుండా వుంటుంది.
ఇంకొక విషయం. దేవుడికి పూలమాలలు సమర్పించాలనుకుంటే జగ్గయ్యపేటనుంచి తీసుకువెళ్ళండి. అలంకరిస్తారు. గుడి దగ్గర దొరకవు.
ఇక్కడ కోతుల బెడద చాలా ఎక్కువ. కవరు కనబడితే పీకేస్తాయి అరటి పళ్ళున్నాయనుకుని. మేము దండలు విడిగా పట్టుకెళ్ళాము.
దర్శన సమయాలు
ఉదయం 6-30 నుంచి మధ్యాహ్నం 1-00 గం. దాకా మధ్యలో అరగంట విరామంతో
సాయంత్రం 3-00 గం. లనుంచి 5-30 దాకా మళ్ళీ 6-30 నుంచి 8-30 దాకా.
మొదటిసారి వెళ్ళేటప్పడు చీకటిపడకుండా వెళ్తే ఇబ్బందిలేకుండా వుంటుంది।
0 comments:
Post a Comment