ముగింపు
కాశీ క్షేత్రం గురించి ఇప్పటిదాకా నాకు తెలిసిన విశేషాలు చెప్పాను. కాశీలాంటి మోక్షదాయక క్షేత్రం ఇంకెక్కడా లేదంటారు. అన్నపూర్ణాసమేత విశ్వేశ్వరుడు కొలువుతీరిన ఈ క్షేత్రంలో అడుగు పెట్టటమే ఎన్నో జన్మల పుణ్యఫలం. అసలు కాశీ వెళ్తాను అనుకుంటేనే చాలుట..ఎంతో పుణ్యంవస్తుందట.
అలాంటి పుణ్యక్షేత్రం కాశీ వెళ్ళాలని తపించి, వెళ్ళాక, ఆధ్యాత్మిక భావాలలో మునిగిపోయేవారికి అన్నిచోట్లా విశ్వేశ్వరుడూ, విశాలాక్షే కనిపిస్తారు. కానీ అంత తాదాత్మ్యంచెందలేనివారికి కాశీలో ఇరుకు సందులు, అడుగడుగునా అపరిశుభ్రత, ఏ సమయంలోనైనా రోడ్లమీద కనిపించే పశువులూ, అడుగు బయటపెడితేచాలు అడ్డంపడే బట్టల షాపులవాళ్ళూ…ఓహ్..ఇదా విశ్వేశ్వరుడి నివాసం అనిపిస్తుంది.
అవ్వన్నీ పక్కనపెట్టి నిండుమనసుతో ఒక్కసారి పావనమైన ఆ కాశీ పట్టణాన్ని, విశ్వేశ్వరుని, గంగమ్మతల్లిని, చల్లని తల్లులు విశాలాక్షి, అన్నపూర్ణలను తల్చుకోండి. మీ మనసు భక్తి భావంతో నిండుతుంది. మనసునిండా వున్న ఆ భక్తి భావంతో కాశీని చూడండి. పురాణ ప్రాశస్త్యంపొందిన కాశీనగరం కనిపిస్తుంది. సత్య హరిశ్చంద్రుడు తన సత్యవాక్పరిపాలనను నిరూపించుకున్న పట్టణం ఇది. బుధ్ధ భగవానుడు జ్ఞానోదయం తర్వాత మొట్టమొదట ధర్మప్రబోధం చేసింది ఇక్కడికి అతి సమీపంలోను సారనాధ్ లోనే.
ఆది గురువు శంకరాచార్యులవారు, ఇంకా ఎందరో మహానుభావులు ఇక్కడ విద్యాభ్యాసం చేశారు. మహాకవి తులసీదాసు తన రామాయణాన్ని ఇక్కడే రాశాడు. ఇలా చెప్పుకుంటూ పోతుంటే ఎందరో, ఎందరెందరో మహనీయులు ఈ కాశీక్షేత్ర మహత్యాన్ని పెంపొందించారు. అలాంటి కాశీ క్షేత్ర ఆవిర్భావం గురించి శివ పురాణంలో ఈ విధంగా వర్ణించారు.
కల్పం మొదట్లో ఎక్కడ చూసినా నీరు వుంది. బ్రహ్మ సృష్టి చెయ్యటానికి తగిన సామర్ధ్యం సంపాదించుకోవటానికి తపస్సు చెయ్యటానికి స్ధలం కోసం పరమ శివుడు తన త్రిశూలాగ్రంమీద సృష్టించిన భూ భాగమే కాశీ క్షేత్రం. బ్రహ్మ దీనిమీద కూర్చుని తపస్సుచేసి పొందిన శక్తితో బ్రహ్మ అన్ని లోకాలను, గ్రహాలను, జీవజాలాన్నీ సృష్టించాడు. అన్ని గ్రహాలతోబాటు భూమినికూడా సృష్టించాడు బ్రహ్మ. దేవతలు, ఋషులు చేసిన ప్రార్ధనను మన్నించిన శివుడు తన త్రిశూలాగ్రానవున్న భూ భాగాన్ని అలాగే భూమిమీదకు దించాడు. అదే కాశీ క్షేత్రమనీ, కాశీ పట్టణం, స్వయంగా ఈశ్వర సృష్టేననీ, అందుకనే తర్వాత సృష్టి చేసిన బ్రహ్మదేవుడికిగానీ, ఆ సృష్టిలో ఆవిర్భవించిన ఏ దేవీ దేవతలకుగానీ అక్కడ ఏ విధమైన అధికారం లేదనీ, కేవలం, శివుడు, అతని పరివార దేవతల ప్రభావం మాత్రమే ఇక్కడ వుంటుందని పురాణ కధనం. అంతేకాదు, బ్రహ్మ సృష్టించినవన్నీ ప్రళయకాలంలో నశించినా, ఆయన ప్రభావంలేని కాశీనగరం మాత్రం ప్రళయ సమయంలోకూడా చెక్కుచెదరదని కూడా పురాణ కధనం.
బ్రహ్మ, విష్ణుల కోరికమీద శివుడు కాశీ క్షేత్రంలో భక్తులను కాపాడటంకోసం జ్యోతిర్లిగంగా వెలిశాడు.
అంతేకాదు. కాశీ పట్టణంలో మరణించబోయే జీవుల కుడిచెవిలో పరమశివుడు సాక్షాత్తూ తనే మంత్రోపదేశంచేస్తాడని, అలాంటివారి జన్మ ధన్యమయి మోక్షం లభిస్తుందని నమ్మకం.
ఈ ప్రఖ్యాత పట్టణంమీదు తురుష్కులు అనేకసార్లు దండయాత్రచేసి ఇక్కడి సిరిసంపదలను కొల్లగొట్టారు. ఈ దాడులతో విశ్వనాధ మందిరంతోసహా అనేక విగ్రహాలు, లింగాలు స్ధానభ్రంశంచెందాయి. ప్రస్తుతం వున్న మందిరం క్రీ.శ. 1785లో ఇండోర్ మహారాణి అయిన అహల్యాబాయి నిర్మించింది. ఆక్రమణలకు గురిఅయినతర్వాత ప్రస్తుతంవున్న మందిరం చిన్నదే. ఆలయంలోపలకూడా ఇరుగ్గానే వుంటుంది. కాశీలో విశాల ఆలయాలు, శిల్పకళ కనబడదు.
ఇక్కడ వసతికి హోటల్సేకాకుండా అనేక సత్రాలుకూడా వున్నాయి. వీటిలో గదులు అద్దెకు ఇవ్వబడుతాయి. చాలాచోట్ల ఉచితంగా భోజనం పెడతారు…అయితే ముందు మనం చెప్పాలి. అప్పటికప్పుడు వెళ్తే ఏర్పాటు చెయ్యలేరు. వాళ్లు ఉచితంగా పెట్టినా ఇవ్వదల్చుకున్నవారు అన్నదానానికి డబ్బు ఇచ్చిరావచ్చు.
విశ్వనాధుని దర్శనానికి వెళ్ళేటప్పుడు సెల్ ఫోన్లు, కెమేరాలు, పెన్నులు వగైరాలు తీసుకువెళ్ళద్దు. వాటిని లోపలకి తీసుకెళ్ళనివ్వరు.
శివాలయాలలో ఎక్కడైనా మీరు తీసుకెళ్లిన పూజా ద్రవ్యాలతో మీరు స్వయంగా పూజ, అభిషేకం చేసుకోవచ్చు. అమ్మవార్ల ఆలయాలలోమాత్రం పూజారులే చేస్తారు. అమ్మవార్ల ఆలయాలలో శ్రీచక్రానికి కుంకుమపూజ మనం చేసుకోవచ్చు.
మనం కాశీ వెళ్తుంటే పొలిమేరల్లోనే మన పాపాలన్నీ పటాపంచలవుతాయట. అంతేకాదు. కాశీలో చేసిన మంచికానీ, చెడుకానీ అనేక రెట్ల ఎక్కువ ఫలితాన్నిస్తుందట. అందుకే సాధ్యమైనంత ఎక్కువ దైవనామ స్మరణ, దాన ధర్మాలు, పరోపకారం చెయ్యండి. గంగా స్నానం, దైవ దర్శనం గురించి చెప్పక్కరలేదుకదా. అలాగే పితృకార్యాలు చెయ్యదల్చుకున్నవారు వాటిని చెయ్యండి. మీ కాశీయాత్రని సఫలం చేసుకోండి.
5 comments:
beautiful series Lakshmigaru...informative and well put together
thank you deepti garu
psmlakshmi
chala bagunnay velli chooda leka poyina telusukunne avakasam kaligistunnaru
chala manchi pani
చాలా చాలా ఉపయోగకరమైన సమాచారం అందించారు. ధన్యవాదములు. మీ కాశి యాత్ర బ్లాగ్ పోస్ట్ లు అన్నీ PDF చేసుకుని భద్రపరచుకున్నాను.
చాల సంతోషం తల్లి కాశి గురించి చాల విషయాలు పంచుకున్నారు :) ధన్యవాదాలు అమ్మ మీ పాదాలకు నమస్కారాలు తల్లి
Post a Comment