Tuesday, February 8, 2011

కోరిన వరాలిచ్చే వైష్ణోదేవి





ఈ వ్యాసం 6-2-2011 ఆంధ్రభూమి దిన పత్రికలో ప్రచురించబడింది.





ఆలయ చరిత్ర                  
                                                 
ముగ్గురమ్మలు మూర్తీభవించిన దేవిగా, తనను దర్శించే భక్తులకు ధర్మార్ధ కామ మోక్షాలు ప్రసాదించే జగజ్జననిగా జమ్మూ-కాశ్మీరు రాష్ట్రంలో  కొలువైవుంది  వైష్ణోదేవి.  ఈ చల్లని తల్లి దర్శనార్ధం భక్తులు ఎక్కడెక్కడినుంచో సంవత్సరం పొడుగునా అశేష సంఖ్యలో వస్తారనేదే దేవి మహిమకి నిదర్శనం.  ఆ దేవిని దర్శించినవరెవరూ తమ న్యాయమైన కోరికలు తీరకుండా రిక్త హస్తాలతో వెను తిరగరని భక్తుల ప్రగాఢ విశ్వాసం.

సముద్రమట్టానికి 5200 అడుగుల ఎత్తులో త్రికూట పర్వత గుహలో వెలసిన  వైష్ణో
దేవి, భక్తులు అడిగే న్యాయమైన కోర్కెలు తీర్చే చల్లని తల్లి.  ఈ ఆలయం ఎన్ని ఏళ్ళు క్రితందో ఆధారాలు లేవు.  భూగర్భ శాస్త్రవేత్తల పరిశోధనలో ఈ ఆలయం వున్న గుహ ఒక మిలియన్ సంవత్సరాల పూర్వంనుంచి వున్నదని కనుగొన్నారు.  ప్రప్రధమంగా పాండవులకాలంలోనే శక్తి పూజలు ప్రారంభం అయినాయనీ, వారే  ఈ ప్రాంతంలో దేవీ ఆలయాలు నిర్మించారని ఇంకొక కధనం.

ఉత్తరాదివారి కొంగు బంగారమై విలసిల్లే ఈ దేవి ప్రాశస్త్యం దక్షిణాదిలో అంత ఎక్కువగా కనబడదు.  అందుకే ఇక్కడివారు ఈ దేవిని లక్ష్మీ స్వరూపమని కొందరు, పార్వతీ స్వరూపమని కొందరు చెబుతారు.  నిజానికి మహాలక్ష్మీ, మహాకాళీ, మహా సరస్వతి .... ఈ ముగ్గురి తేజోమయ స్వరూపమే ఈ తల్లి.  ఆ కధ ఏమిటంటే...

పూర్వం జగన్మాత అసురుల బాధలు ఎక్కువగా వుండి వారితో పోరాడే సమయంలో భూలోకంలో ధర్మాన్ని రక్షించి, ప్రజలని కాపాడేందుకు మహాలక్ష్మీ, మహాకాళి, మహా సరస్వతులు తమ తేజస్సునుండి ఒక దివ్య శక్తిని ఆవిర్భవింపచేయాలనుకున్నారు.  వారి సంకల్పమాత్రంచేత అక్కడో అందమైన యువతి ప్రత్యక్షమైంది.  వారు ఆ యువతిని భూలోకంలో ధర్మ సంరక్షణార్ధం రత్నాకరసాగర్ అనే ఆయనకి పుత్రికగా విష్ణు అంశతో  జన్మించి ధర్మహిత కార్యాలు చేయమని, ఆధ్యాత్మికంగా ఉన్నతస్ధాయికి చేరుకున్న తర్వాత శ్రీ మహా విష్ణువులో ఐక్యం చెందుతావని చెబుతారు.  ఆ మహాశక్తుల ఆదేశానుసారం రత్మాకరసాగర్ ఇంట జన్మించిన ఆ బాలికకు వైష్ణవి అని నామకరణంచేయబడ్డది.

వైష్ణవి చిన్నతనంనుంచే జ్ఞాన సముపార్జనలో లీనమైంది.  ఏ గురువులూ ఆమె జ్ఞాన తృష్ణను తీర్చలేకపోయారు.  జ్ఞానసముపార్జనలో ఉన్నతస్ధాయి చేరుకోవాలనే తపనతో వైష్ణవి అంతర్ముఖి అయిచేసిన అన్వేషణలో ధ్యానం విలువ తెలుసుకుంది.  తపస్సుతోనే తన జీవన ధ్యేయాన్ని సాధించగలననుకుని, ఇల్లు వదిలి అడవుల్లోకెళ్ళి తపస్సు చేయసాగింది.

అదే సమయంలో 14 సంవత్సరాలు అరణ్యవాసంలోవున్న శ్రీరామచంద్రుడు అక్కడికి వచ్చాడు.  వైష్ణవి శ్రీరామచంద్రుణ్ణి ఆ శ్రీమహావిష్ణువుగా గుర్తించి, తనని ఆయనలో లీనం చేసుకోమనికోరింది.  శ్రీరామచంద్రుడు దానికి తగిన సమయంకాదని, తన అరణ్యవాసం తర్వాత తిరిగి వైష్ణవి దగ్గరకొస్తానని, ఆ సమయంలో ఆమె తనని గుర్తిస్తే తప్పక తనలో ఐక్యం చేసుకుంటానని తెలిపాడు.  ఆ ప్రకారమే శ్రీరామచంద్రుడు అరణ్యవాసం, రావణవధానంతరం అయోధ్యకి తిరిగి వెళ్తూ ఆమెదగ్గరకు ఒక వృధ్ధుడి రూపంలో వచ్చాడు.  కానీ ఆ సమయంలో వైష్ణవి ఆయనని గుర్తించలేకపోతుంది.  అందుకని భగవంతునిలో ఐక్యమయ్యే ఆవిడ కోరిక తీరలేదు.


బాధపడుతున్న వైష్ణవిని శ్రీరామచంద్రుడు ఓదార్చి, ఆమె తనలో ఐక్యమవటానికి తగిన సమయమింకారాలేదని, కలియుగంలో తాను కల్కి అవతారం ధరిస్తానని, అప్పుడు ఆమె కోరిక నెరవేరుతుందని ధైర్యం చెప్పాడు.  త్రికూట పర్వత సానువుల్లో ఆశ్రమం నెలకొల్పుకుని  తపస్సు కొనసాగిస్తూ, ఆధ్యాత్మికంగా ఉన్నత శిఖరాలు అవరోహించమని,  ప్రజల మనోభీష్టాలు నెరవేర్చి, పేద, బాధిత ప్రజల కష్టాలు తీర్చమని ఆదేశించాడు.

శ్రీరామచంద్రుని ఆజ్ఞానుసారం వైష్ణవి త్రికూట పర్వతసానువుల్లో ఆశ్రమాన్ని నెలకొల్పుకుని తన తపస్సు కొనసాగించింది.  అనతికాలంలోనే ఆవిడ శక్తిని గ్రహించిన ప్రజలు ఆవిడ ఆశీస్సులకోసం రాసాగారు.

కొంతకాలం తర్వాత గోరఖ్ నాధ్ అనే తాంత్రికుడు వైష్ణవి గురించి, ఆమె దీక్ష గురించి తెలుసుకుని, శ్రీరామచంద్రుడు ఆదేశించిన ప్రకారం ఆమె ఆధ్యాత్మికంగా ఉన్నత శిఖరాలను అధిరోహించిందో లేదో తెలుసుకోవాలనే కుతూహలంతో, వివరాలు తెలుసుకురావటానికి  అత్యంత సమర్ధుడైన తన శిష్యుడు భైరవనాధుణ్ణి పంపాడు.  భైరవనాధుడు చాటుగా వైష్ణనిని గమనించాడు.  తపస్విని అయినా వైష్ణవి ఎల్లప్పుడు ధనుర్బాణాలు ధరించి వుండటం, ఆవిడకి రక్షగా లంగూర్లు, ఒక భయంకర సింహం వుండటం గమనించాడు. భైరవనాధుడు  వైష్ణవి అందానికి ముగ్ధుడై తనని వివాహం చేసుకోమని ఆమెని విసిగించసాగాడు.

వైష్ణవికి అత్యంత భక్తుడైన శ్రీధర్ ఒకసారి ఊరందరికీ భోజనాలు పెట్టాలని అందరినీ ఆహ్వానిస్తూ, గోరఖ్ నాధ్ ని,  భైరవనాధ్ తో సహా మిగతా ఆయన శిష్యులనందరినీ భోజనానికి ఆహ్వానించాడు.  భోజనసమయంలో భైరవుడు వైష్ణవిపట్ల అమర్యాదగా ప్రవర్తించాడు.  వైష్ణవి మందలించినా వినడు.  వివాదం పెద్దదిచేసి భైరవుణ్ణి శిక్షించటం ఇష్టంలేని వైష్ణవి వాయురూపంలో పర్వతాలలోకి వెళ్తుంది తన తపస్సును కొనసాగించటానికి.

భైరవుడు ఆమెని వదలకుండా వెంటాడుతాడు.   బాణగంగ, చరణపాదుక, అధక్వారీ   అని ప్రస్తుతం పిలువబడుతున్న ప్రదేశాల్లో ఆగుతూ త్రికూట పర్వతంలోని ఈ పవిత్రగుహ దగ్గరకు వెళ్తుంది వైష్ణవి.  అప్పటికీ విడువకుండా వెంటాడుతున్న భైరవుడి తలని ఆ గుహ బయట ఒక్క వేటుతో నరుకుతుంది.  తెగిన భైరవుడి తల కొంచెం దూరంలో ఒక పర్వత శిఖరంమీదపడింది.

అప్పుడు తన తప్పుతెలుసుకున్న భైరవుడు వైష్ణవీదేవిని క్షమించమని ప్రార్ధిస్తాడు.  మాత దయతలచి, తన భక్తులంతా తన దర్శనం తర్వాత భైరవుణ్ణి దర్శిస్తారని, అప్పుడే వారి యాత్ర సంపూర్ణమవుతుందని వరమిస్తుంది. 

తదనంతరం వైష్ణవి తన ధ్యేయం నెరవేర్చుకోవటానికి, అంటే అత్యున్నత తపస్సుతో శ్రీ మహావిష్ణువులో లీనమయ్యే అర్హత సంపాదించుకోవటానికి, అలాగే తనని సృష్టించిన త్రిమాతలు, మరియు శ్రీరామచంద్రుని ఆజ్ఞప్రకారం ప్రజల కోర్కెలు తీర్చటానికి త్రికూట పర్వతంపైన గుహలో, 3 తలలతో 5.5 అడుగుల ఎత్తయిన రాతిరూపం ధరించింది.    వైష్ణోదేవిలో గుహాలయంలో మనకి కనిపించే మూడు రాతి రూపాలు (పిండీలంటారు అక్కడివారు) ఆ మాత తలలే.  వాటినే మహాకాళీ, వైష్ణోదేవి, మహా సరస్వతిగా చెప్తారు అక్కడి పండితులు.

వైష్ణోదేవి ఆలయం చేరటానికి 14 కి.మీ. దూరం కొండలెక్కాలి.  దోవ పొడుగుతా తినుబండారాలు, త్రాగు నీరు, శౌచాలయాలు వగైరా యాత్రీకులకి కావలసిన అన్ని రకాల సదుపాయాలు వున్నాయి.  దోవలో అవసరమైతే కొంతసేపు ఆగి విశ్రాంతికూడా తీసుకోవచ్చు.  24 గంటలూ యాత్రీకుల సందడితో వుండే  దోవ పైన  చాలా మటుకు రేకులతో  కప్పబడి పైనుంచీ పడే రాళ్ళనుంచేకాక, ఎండా వానలనుంచీ కూడా యాత్రీకులని రక్షిస్తుంటాయి.   ఎత్తైన కొండలమీద నుంచి కనిపించే అందమైన ప్రకృతి దృశ్యాలు నడిచేవారికి అలసట తెలియనీయవు.  కొండ ఎక్కలేనివారికోసం గుఱ్ఱాలు, డోలీలు వున్నాయి.  గుఱ్ఱం కొంచెం నడుం గట్టితనాన్ని పరీక్షించినా, డోలీలో ఎలాంటివారైనా తేలికగా వెళ్ళవచ్చు.  కుర్చీ లో మనం కూర్చుంటే దానికి వున్న కఱ్ఱల సహాయంతో నలుగురు మనుష్యులు మనల్ని మోసుకెళ్తారు.  అదే డోలీ.    తోవ పొడుగూతా భక్తులు జై మాతాకీ అంటూ లయ బధ్ధంగా చేసే నినాదాలు  యాత్రీకులలో ఎనలేని ఉత్సాహాన్ని కలిగిస్తాయి. 

       ఆగేవాలే బోలో జైమాతాకీ     పీఛేవాలే బోలో జైమాతాకీ
       పాల్కీవాలే బోలో జైమాతాకీ   ఘోడేవాలే బోలో జైమాతాకీ

అంటూ అందరినీ కలుపుకుంటూ చేసే నినాదాలతో మనమూ శృతి కలపకుండా వుండలేము.

అర్ధరాత్రి అయినా జనసంచారం, విద్యుద్దీపాలు వుంటాయి.  నిర్భయంగా కొండ ఎక్కవచ్చు.  అయితే రాత్రిళ్ళు డోలీలుండవు.  ఆలయం అన్నివేళలా తెరిచివుంటుంది (రాత్రంతా కూడా).

దేవీ దర్శనానికి ఇదివరకు చిన్న గుహ మార్గంలో పాకుతూ వెళ్ళవలసి వచ్చేదిట.  ప్రస్తుతం మార్గం సుగమంచేశారు.  ఎక్కడా వంగకుండా నడుస్తూనే వెళ్ళిరావచ్చు.

 
ఇక్కడ దర్శనానికి చాలా చక్కని ఏర్పాట్లు చెయ్యబడ్డాయి.  దర్శనానికి బయల్దేరే ముందే కింద ముఖ్యద్వారంగుండా వెళ్ళటానికి కూపన్ తీసుకోవాలి. పరఛీ అంటారు దీనిని. ఎక్కువ సమయం పట్టదు దీనికి.  గ్రూప్ కి ఒకళ్ళు వెళ్ళి కూడా తీసుకోవచ్చు.  ఇది తీసుకున్న ఆరు గంటలలోపు ముఖ్యద్వారంగుండా లోపలకి వెళ్ళాలి.  లేకపోతే ఇంకొకటి తీసుకోవాల్సి వుంటుంది.    అది వుంటేనే ముఖ్యద్వారంగుండా లోపలకి (కొండ ఎక్కటానికి) వెళ్ళనిస్తారు.  మనం పైకి వెళ్ళాక పరఛీ చూపించి బేచ్ నెంబరు తీసుకోవాలి.  దర్శనానికి వచ్చేవారిని ఇలా బేచ్ నెంబర్లు ఇచ్చి క్రమబధ్ధీకరిస్తారు.  ఆ నెంబరు ప్రకారం దర్శనానికి వెళ్ళాలి.  జరుగుతున్న బేచ్ నెంబరు బోర్డుమీదు చూపిస్తుంటారు.  ఖాళీ వుంటే తర్వాత బేచ్ వాళ్ళనికూడా వెళ్ళనిస్తారు.  దానితో తొక్కిడి వుండదు  5, 6 చోట్ల సెక్యూరిటీ చెక్ వుంటుంది.  డోలీలు ఆలయానికి ఒక కి.మీ. దూరం దాకా వెళ్తాయి. గుఱ్ఱాలు ఇంకా  కొంచెం దూరంగా ఆగుతాయి.  అక్కడనుండి నడక తప్పదు.  అయితే ఎలాంటివారైనా నెమ్మదిగా అన్నీ చూసుకుంటూ వెళ్తే శ్రమ తెలియదు.  అనేక చోట్ల వచ్చే సెక్యూరిటీ చెక్ లతో మనం అంత దూరం వెళ్ళామని కూడా తెలియదు.   కెమేరా, సెల్, తోలు బెల్టులు వగైరాలు అన్నీ అక్కడ లాకర్లలో పెట్టి వెళ్ళాల్సిందే.

ఆలయానికి చేరుకోవటానికి హెలికాప్టరుకూడా వున్నది.  ఈ సర్వీసు కాట్రానుంచి వుంటుంది.  ముందుగా ఆన్ లైన్ లో కూడా బుక్ చేసుకోవచ్చు.  అయితే ఆ సర్వీసులు వాతావరణాన్నిబట్టి వుంటాయి.  మేము వెళ్ళినప్పుడు పొగమంచు ఎక్కువగా వున్నకారణంగా నెల రోజులనుంచి హెలికాప్టర్లు నడపలేదు.

ఇక్కడ కొన్ని జాగ్రత్తలు చెబుతాను.  డోలీలో వెళ్ళాలనుకుంటే కిందే కౌంటర్ లో రానూ పోనూ కావాలో, కేవలం దింపటానికే కావాలో చెప్పి  బుక్ చేసుకోండి.  ఇవ్వాల్సిన డబ్బు, డోలీ తీసుకొచ్చేవాళ్ళల్లో ఒకరిద్దరి పేర్లతో సహా అన్ని వివరాలూ రాసి ఇస్తారు.  ఇది గవర్నమెంటు వాళ్ళ కౌంటర్.  అక్కడ అది ఒక్కటే వుంది అని అన్నారు.   విడిగా డోలీ గానీ, గుఱ్ఱంగానీ మాట్లాడుకుంటే వాళ్ళకి లైసెన్సు టోకెన్లుంటాయి.  మీ యాత్ర పూర్తయ్యేదాకా అవి అడిగి తీసుకుని మీ దగ్గర పెట్టుకోండి.  ఎవరికీ పూర్తి డబ్బు ముందు ఇవ్వద్దు.  మాట్లాడుకున్న డబ్బుకాకుండా మళ్ళీ మీదగ్గర  నాస్తా, చాయ్ అంటూ వసూలు చేస్తారు.

డోలీ మాట్లాడుకునేటప్పుడే పాదగయ (అమ్మవారి పాదాలుంటాయి), అమ్మవారి ఆలయానికి ఇంకా కొంచెం పైకి వెళ్తే భైరవ ఆలయం వుంటుంది..అది చూస్తేగానీ యాత్ర సంపూర్తి కాదంటారు..ఇవ్వన్నీ చూపించాలి అని చెప్పండి.  మాకు తెలియక అవి చూడలేదు.  మధ్యలో డోలీ వాళ్ళనడిగితే దోవ సరిగాలేదని పైన కొండ చూపించి అదే భైరవాలయం దణ్ణం పెట్టమన్నారు (పెళ్ళిలో అరుంధతీ నక్షత్రంలాగా).

 దోవ ఒకటే వుంటుంది.  ఎలా వెళ్ళాలి అని కంగారు పడకండి.  మీకు కావాల్సిన వివరాల బోర్డులుంటాయి.   సీనియర్ సిటిజన్స్ కోసం 6 కి.మీ. కొండ ఎక్కిన తర్వాత ఆలయం వారి ఆధ్వర్యంలో బేటరీతో నడిచే కార్లున్నాయి (ఆటోలు).  అక్కడదాకా గుఱ్ఱాలు, డోలీలలో వెళ్ళవచ్చు.

గర్భగుడిలో పూజారులెవ్వరూ డబ్బులు తీసుకోరు.  మీరు అమ్మవారికిచ్చే కానుకలు హాయిగా హుండీలో వెయ్యండి.  అమ్మవార్లు ముగ్గురుంటారు.. కాళీ, వైష్ణవీ, సరస్వతి...లింగ రూపంలో...మధ్యలో దేవి వైష్ణవి.  ఈ సంగతి అక్కడవున్న పూజారి అందరికీ చెబుతూనే వుంటారు.  అమ్మవార్ల పైన కిరీటాలుంటాయి.  అంతేగానీ అక్కడ అమ్మవార్ల రూపం వుండదు. 

దర్శనమయ్యాక అక్కడే కేంటీన్లు వుంటాయి.. పూరీ కూరా, రజ్మా రైస్ వగైరా ధరలు తక్కువే.   భోజనం చేసి మరీ తిరుగు ప్రయాణం మొదలు పెట్టవచ్చు.  పైన వుండటానికి కూడా వసతి వున్నది.

మార్గం

జమ్మూ రాష్ట్రంలోని కట్రాదాకా రైలు, రోడ్డు, వాయు మార్గాలున్నాయి.  అక్కడనుండి యాత్ర మొదలయ్యే మైన్ గేట్ దాకా ఆటోలో వెళ్ళవచ్చు.  దోవలో బస్ స్టాండులో ఆటో ఆపి పరఛీ తీసుకుని,  అక్కడేవున్న డోలీ కౌంటర్ లో డోలీ మాట్లాడుకుని మైన్ గేట్ దాకా ఆటోలో వెళ్తే అక్కడనుంచి మాత్రమే డోలీ వగైరా యాత్ర మొదలవుతుంది.

ఇంకా వివరాలకు

http://www.maavaishnodevi.org/  చూడండి.





  వైష్ణోదేవి మైన్ గేటు


  కొండపైకి మార్గం


                 డోలీలు










2 comments:

Ennela said...

లచిమక్కోవ్, నీ అంతరంగాలు నువ్వే దాపెట్టుకుంటె ఎట్ల? ఖుల్లా అయితల్లేదు.ఖుల్ల అయినా, కదులుతల్లేదు, మెదులతల్లేదు, జరుగుతల్లేదు.
'పుట్టింటి'కాడకామెంటుపెడదారంటె.కామెంటనియ్యకపోతివి.గిట్లైతె యెట్లా అని నేను సవాల్ జేస్తున్నా..

psm.lakshmi said...

నీనుంచి దాపెట్టాలనికాదు తల్లే. అదెందుకట్టా అవుతోందో నాకూ తెల్దు. పుట్టింటి పోస్టుకూడా తెగ సతాయించింది. నాకేమో రాసుడేగానీ ఈ కంపూడర్ డబ్బాల సంగంతి తెల్దాయే. ఏం సెయ్యాల.
psmlakshmi