<!--[if gte mso 9]>
శ్రీ రామాప్రమేయస్వామి, దొడ్డమల్లూరు
ఉదయం 9-20 కి చేరుకున్నాము ఈ ఆలయానికి.
చెన్నపట్టణ దాటి 1 కి.మీ. వెళ్ళిన తర్వాత ఎడమవైపు ఆర్చి కనబడుతుంది. దానిలోంచి వెళ్తే వస్తుంది త్రేతాయుగంనాటి శ్రీరామాప్రమేయస్వామి ఆలయం. శ్రీరాముడు వనవాస సమయంలో ఇక్కడ కొంతకాలం వున్నారు. ఆ సమయంలోనే విష్ణుమూర్తిని అప్రమేయస్వామిగా ప్రతిష్టించి పూజించారు. అందుకే స్వామికి శ్రీరామాప్రమేయస్వామి అనే పేరువచ్చింది. కణ్వ మహర్షీ, కపిల మహర్షీ ఆ కాలంలోనేకాదు, ఇప్పటికీ ఈ స్వామిని సేవిస్తున్నారని ప్రజల నమ్మకం. ఆలయ తలుపులు తాళం వేసిన తర్వాత వినబడే గర్భగుడి తలుపులు తెరిచిన శబ్దాలు, గంటల శబ్దాలు తార్కాణంగా చెబుతారు. బ్రహ్మాండ పురాణంలో ఈ స్వామిగురించి 12 అధ్యాయాలలో వర్ణించారు.
ప్రదక్షిణ మార్గంలో వున్న ఉపాలయంలో అమ్మ అరవిందవల్లితాయారు తామరపువ్వులో పద్మాసనస్దితగా దర్శనమిస్తుంది. చతుర్భుజి. పైన రెండు చేతులలో తామరలు, ఇంకో రెండు చేతులు వరద, అభయ ముద్రలతో భక్తుల ఆర్తిని తీరుస్తూ వుంటాయి.
తర్వాత వచ్చే ఉపాలయంలో గరుడ పీఠంపైన పారాడే చిన్ని కృష్ణుడిని చూడవచ్చు. కుడిచేతిలో వెన్నముద్దతో మనవైపే పారాడుతూ వస్తున్నట్లుండే ఈ కన్నయ్యను చూసి పులకించని మది వుండదేమో. ఈ చిన్నికృష్ణుడు సంతానంలేనివారికి సంతానం ఇచ్చే అభయప్రదాత. కోరిక నెరవేరినవారు స్వామికి తమ శక్తికొలదీ చెక్క, వెండితో చేసిన ఊయల సమర్పిస్తారు.
ఈ స్వామిని దర్శించినంతనే మహాకవి పురందరదాసు .. జగదోధ్ధారణా .. అనే కృతి గానం చేశాడు. ఆయన స్మృతి చిహ్మంగా రాజ గోపురం బయటవుండే మండపానికి పురందరదాసుమండపమని ఆయన పేరు పెట్టారు.
ఇంకా ముందుకు వెళ్తే ఆళ్వారులు, శ్రీ వైకుంఠ నారాయణస్వామి, స్తంబంలో స్వయంభూగా వెలిసిన శ్రీ ఆంజనేయస్వామిని దర్శించి తర్వాత సాలిగ్రామ శిలలో మలచబడ్డ శ్రీ అప్రమేయస్వామిని దర్శించవచ్చు. స్వామి దయ అపారమనీ, కొలతలేనిదనీ, అందుకే ఏ కొలతలకూ అందని స్వామిని అప్రమేయస్వామి అన్నారు. స్వామి చతుర్భుజుడు. నాలుగు హస్తాలలో శంఖం, చక్రం, గద, అభయ ముద్ర ధరించి వుంటాడు.
ఇవికూడా చూడండి
మేము వెళ్ళినప్పుడు మాకు తెలియక పక్కన వున్న రామాలయం చూడలేదు. మాకు తర్వాత తెలిసిన వివరాలు .. ఇందులోవున్న మూడు ఆలయాలు విశేషమైనవి. ఎలాగంటే…
శ్రీ రామాలయంలో రాముడు, సీత కూర్చుని వుంటే లక్ష్మణుడు వారి ఆనతికోసం ఎదురు చూస్తున్నట్లు పక్కన నమస్కారం చేస్తూ నుంచుని వుంటాడు. ఆంజనేయస్వామి రాములవారి పాదసేవ చేస్తూ వుంటారు. ఈ భంగిమలు అరుదైనవి.
శ్రీ వేణుగోపాలస్వామి చతుర్భుజుడుగా, శంఖం, చక్రం, వేణువులతో దర్శనమిస్తాడు. వేణుగోపాలుడు చతుర్భుజుడుగా కనబడటం తక్కువ.
శ్రీ సుదర్శన లక్ష్మీ నరసింహస్వామి .. అరుదుగా కనిపించే స్వామి.
మీరు వెళ్తే తప్పక చూడండి.
ఇంకా వివరాలకు www.doddamallurtemple.net చూడండి.
ఉదయం 10-05 కి బయల్దేరాము.
0 comments:
Post a Comment