Tuesday, February 8, 2011

కోరిన వరాలిచ్చే వైష్ణోదేవి





ఈ వ్యాసం 6-2-2011 ఆంధ్రభూమి దిన పత్రికలో ప్రచురించబడింది.





ఆలయ చరిత్ర                  
                                                 
ముగ్గురమ్మలు మూర్తీభవించిన దేవిగా, తనను దర్శించే భక్తులకు ధర్మార్ధ కామ మోక్షాలు ప్రసాదించే జగజ్జననిగా జమ్మూ-కాశ్మీరు రాష్ట్రంలో  కొలువైవుంది  వైష్ణోదేవి.  ఈ చల్లని తల్లి దర్శనార్ధం భక్తులు ఎక్కడెక్కడినుంచో సంవత్సరం పొడుగునా అశేష సంఖ్యలో వస్తారనేదే దేవి మహిమకి నిదర్శనం.  ఆ దేవిని దర్శించినవరెవరూ తమ న్యాయమైన కోరికలు తీరకుండా రిక్త హస్తాలతో వెను తిరగరని భక్తుల ప్రగాఢ విశ్వాసం.

సముద్రమట్టానికి 5200 అడుగుల ఎత్తులో త్రికూట పర్వత గుహలో వెలసిన  వైష్ణో
దేవి, భక్తులు అడిగే న్యాయమైన కోర్కెలు తీర్చే చల్లని తల్లి.  ఈ ఆలయం ఎన్ని ఏళ్ళు క్రితందో ఆధారాలు లేవు.  భూగర్భ శాస్త్రవేత్తల పరిశోధనలో ఈ ఆలయం వున్న గుహ ఒక మిలియన్ సంవత్సరాల పూర్వంనుంచి వున్నదని కనుగొన్నారు.  ప్రప్రధమంగా పాండవులకాలంలోనే శక్తి పూజలు ప్రారంభం అయినాయనీ, వారే  ఈ ప్రాంతంలో దేవీ ఆలయాలు నిర్మించారని ఇంకొక కధనం.

ఉత్తరాదివారి కొంగు బంగారమై విలసిల్లే ఈ దేవి ప్రాశస్త్యం దక్షిణాదిలో అంత ఎక్కువగా కనబడదు.  అందుకే ఇక్కడివారు ఈ దేవిని లక్ష్మీ స్వరూపమని కొందరు, పార్వతీ స్వరూపమని కొందరు చెబుతారు.  నిజానికి మహాలక్ష్మీ, మహాకాళీ, మహా సరస్వతి .... ఈ ముగ్గురి తేజోమయ స్వరూపమే ఈ తల్లి.  ఆ కధ ఏమిటంటే...

పూర్వం జగన్మాత అసురుల బాధలు ఎక్కువగా వుండి వారితో పోరాడే సమయంలో భూలోకంలో ధర్మాన్ని రక్షించి, ప్రజలని కాపాడేందుకు మహాలక్ష్మీ, మహాకాళి, మహా సరస్వతులు తమ తేజస్సునుండి ఒక దివ్య శక్తిని ఆవిర్భవింపచేయాలనుకున్నారు.  వారి సంకల్పమాత్రంచేత అక్కడో అందమైన యువతి ప్రత్యక్షమైంది.  వారు ఆ యువతిని భూలోకంలో ధర్మ సంరక్షణార్ధం రత్నాకరసాగర్ అనే ఆయనకి పుత్రికగా విష్ణు అంశతో  జన్మించి ధర్మహిత కార్యాలు చేయమని, ఆధ్యాత్మికంగా ఉన్నతస్ధాయికి చేరుకున్న తర్వాత శ్రీ మహా విష్ణువులో ఐక్యం చెందుతావని చెబుతారు.  ఆ మహాశక్తుల ఆదేశానుసారం రత్మాకరసాగర్ ఇంట జన్మించిన ఆ బాలికకు వైష్ణవి అని నామకరణంచేయబడ్డది.

వైష్ణవి చిన్నతనంనుంచే జ్ఞాన సముపార్జనలో లీనమైంది.  ఏ గురువులూ ఆమె జ్ఞాన తృష్ణను తీర్చలేకపోయారు.  జ్ఞానసముపార్జనలో ఉన్నతస్ధాయి చేరుకోవాలనే తపనతో వైష్ణవి అంతర్ముఖి అయిచేసిన అన్వేషణలో ధ్యానం విలువ తెలుసుకుంది.  తపస్సుతోనే తన జీవన ధ్యేయాన్ని సాధించగలననుకుని, ఇల్లు వదిలి అడవుల్లోకెళ్ళి తపస్సు చేయసాగింది.

అదే సమయంలో 14 సంవత్సరాలు అరణ్యవాసంలోవున్న శ్రీరామచంద్రుడు అక్కడికి వచ్చాడు.  వైష్ణవి శ్రీరామచంద్రుణ్ణి ఆ శ్రీమహావిష్ణువుగా గుర్తించి, తనని ఆయనలో లీనం చేసుకోమనికోరింది.  శ్రీరామచంద్రుడు దానికి తగిన సమయంకాదని, తన అరణ్యవాసం తర్వాత తిరిగి వైష్ణవి దగ్గరకొస్తానని, ఆ సమయంలో ఆమె తనని గుర్తిస్తే తప్పక తనలో ఐక్యం చేసుకుంటానని తెలిపాడు.  ఆ ప్రకారమే శ్రీరామచంద్రుడు అరణ్యవాసం, రావణవధానంతరం అయోధ్యకి తిరిగి వెళ్తూ ఆమెదగ్గరకు ఒక వృధ్ధుడి రూపంలో వచ్చాడు.  కానీ ఆ సమయంలో వైష్ణవి ఆయనని గుర్తించలేకపోతుంది.  అందుకని భగవంతునిలో ఐక్యమయ్యే ఆవిడ కోరిక తీరలేదు.


బాధపడుతున్న వైష్ణవిని శ్రీరామచంద్రుడు ఓదార్చి, ఆమె తనలో ఐక్యమవటానికి తగిన సమయమింకారాలేదని, కలియుగంలో తాను కల్కి అవతారం ధరిస్తానని, అప్పుడు ఆమె కోరిక నెరవేరుతుందని ధైర్యం చెప్పాడు.  త్రికూట పర్వత సానువుల్లో ఆశ్రమం నెలకొల్పుకుని  తపస్సు కొనసాగిస్తూ, ఆధ్యాత్మికంగా ఉన్నత శిఖరాలు అవరోహించమని,  ప్రజల మనోభీష్టాలు నెరవేర్చి, పేద, బాధిత ప్రజల కష్టాలు తీర్చమని ఆదేశించాడు.

శ్రీరామచంద్రుని ఆజ్ఞానుసారం వైష్ణవి త్రికూట పర్వతసానువుల్లో ఆశ్రమాన్ని నెలకొల్పుకుని తన తపస్సు కొనసాగించింది.  అనతికాలంలోనే ఆవిడ శక్తిని గ్రహించిన ప్రజలు ఆవిడ ఆశీస్సులకోసం రాసాగారు.

కొంతకాలం తర్వాత గోరఖ్ నాధ్ అనే తాంత్రికుడు వైష్ణవి గురించి, ఆమె దీక్ష గురించి తెలుసుకుని, శ్రీరామచంద్రుడు ఆదేశించిన ప్రకారం ఆమె ఆధ్యాత్మికంగా ఉన్నత శిఖరాలను అధిరోహించిందో లేదో తెలుసుకోవాలనే కుతూహలంతో, వివరాలు తెలుసుకురావటానికి  అత్యంత సమర్ధుడైన తన శిష్యుడు భైరవనాధుణ్ణి పంపాడు.  భైరవనాధుడు చాటుగా వైష్ణనిని గమనించాడు.  తపస్విని అయినా వైష్ణవి ఎల్లప్పుడు ధనుర్బాణాలు ధరించి వుండటం, ఆవిడకి రక్షగా లంగూర్లు, ఒక భయంకర సింహం వుండటం గమనించాడు. భైరవనాధుడు  వైష్ణవి అందానికి ముగ్ధుడై తనని వివాహం చేసుకోమని ఆమెని విసిగించసాగాడు.

వైష్ణవికి అత్యంత భక్తుడైన శ్రీధర్ ఒకసారి ఊరందరికీ భోజనాలు పెట్టాలని అందరినీ ఆహ్వానిస్తూ, గోరఖ్ నాధ్ ని,  భైరవనాధ్ తో సహా మిగతా ఆయన శిష్యులనందరినీ భోజనానికి ఆహ్వానించాడు.  భోజనసమయంలో భైరవుడు వైష్ణవిపట్ల అమర్యాదగా ప్రవర్తించాడు.  వైష్ణవి మందలించినా వినడు.  వివాదం పెద్దదిచేసి భైరవుణ్ణి శిక్షించటం ఇష్టంలేని వైష్ణవి వాయురూపంలో పర్వతాలలోకి వెళ్తుంది తన తపస్సును కొనసాగించటానికి.

భైరవుడు ఆమెని వదలకుండా వెంటాడుతాడు.   బాణగంగ, చరణపాదుక, అధక్వారీ   అని ప్రస్తుతం పిలువబడుతున్న ప్రదేశాల్లో ఆగుతూ త్రికూట పర్వతంలోని ఈ పవిత్రగుహ దగ్గరకు వెళ్తుంది వైష్ణవి.  అప్పటికీ విడువకుండా వెంటాడుతున్న భైరవుడి తలని ఆ గుహ బయట ఒక్క వేటుతో నరుకుతుంది.  తెగిన భైరవుడి తల కొంచెం దూరంలో ఒక పర్వత శిఖరంమీదపడింది.

అప్పుడు తన తప్పుతెలుసుకున్న భైరవుడు వైష్ణవీదేవిని క్షమించమని ప్రార్ధిస్తాడు.  మాత దయతలచి, తన భక్తులంతా తన దర్శనం తర్వాత భైరవుణ్ణి దర్శిస్తారని, అప్పుడే వారి యాత్ర సంపూర్ణమవుతుందని వరమిస్తుంది. 

తదనంతరం వైష్ణవి తన ధ్యేయం నెరవేర్చుకోవటానికి, అంటే అత్యున్నత తపస్సుతో శ్రీ మహావిష్ణువులో లీనమయ్యే అర్హత సంపాదించుకోవటానికి, అలాగే తనని సృష్టించిన త్రిమాతలు, మరియు శ్రీరామచంద్రుని ఆజ్ఞప్రకారం ప్రజల కోర్కెలు తీర్చటానికి త్రికూట పర్వతంపైన గుహలో, 3 తలలతో 5.5 అడుగుల ఎత్తయిన రాతిరూపం ధరించింది.    వైష్ణోదేవిలో గుహాలయంలో మనకి కనిపించే మూడు రాతి రూపాలు (పిండీలంటారు అక్కడివారు) ఆ మాత తలలే.  వాటినే మహాకాళీ, వైష్ణోదేవి, మహా సరస్వతిగా చెప్తారు అక్కడి పండితులు.

వైష్ణోదేవి ఆలయం చేరటానికి 14 కి.మీ. దూరం కొండలెక్కాలి.  దోవ పొడుగుతా తినుబండారాలు, త్రాగు నీరు, శౌచాలయాలు వగైరా యాత్రీకులకి కావలసిన అన్ని రకాల సదుపాయాలు వున్నాయి.  దోవలో అవసరమైతే కొంతసేపు ఆగి విశ్రాంతికూడా తీసుకోవచ్చు.  24 గంటలూ యాత్రీకుల సందడితో వుండే  దోవ పైన  చాలా మటుకు రేకులతో  కప్పబడి పైనుంచీ పడే రాళ్ళనుంచేకాక, ఎండా వానలనుంచీ కూడా యాత్రీకులని రక్షిస్తుంటాయి.   ఎత్తైన కొండలమీద నుంచి కనిపించే అందమైన ప్రకృతి దృశ్యాలు నడిచేవారికి అలసట తెలియనీయవు.  కొండ ఎక్కలేనివారికోసం గుఱ్ఱాలు, డోలీలు వున్నాయి.  గుఱ్ఱం కొంచెం నడుం గట్టితనాన్ని పరీక్షించినా, డోలీలో ఎలాంటివారైనా తేలికగా వెళ్ళవచ్చు.  కుర్చీ లో మనం కూర్చుంటే దానికి వున్న కఱ్ఱల సహాయంతో నలుగురు మనుష్యులు మనల్ని మోసుకెళ్తారు.  అదే డోలీ.    తోవ పొడుగూతా భక్తులు జై మాతాకీ అంటూ లయ బధ్ధంగా చేసే నినాదాలు  యాత్రీకులలో ఎనలేని ఉత్సాహాన్ని కలిగిస్తాయి. 

       ఆగేవాలే బోలో జైమాతాకీ     పీఛేవాలే బోలో జైమాతాకీ
       పాల్కీవాలే బోలో జైమాతాకీ   ఘోడేవాలే బోలో జైమాతాకీ

అంటూ అందరినీ కలుపుకుంటూ చేసే నినాదాలతో మనమూ శృతి కలపకుండా వుండలేము.

అర్ధరాత్రి అయినా జనసంచారం, విద్యుద్దీపాలు వుంటాయి.  నిర్భయంగా కొండ ఎక్కవచ్చు.  అయితే రాత్రిళ్ళు డోలీలుండవు.  ఆలయం అన్నివేళలా తెరిచివుంటుంది (రాత్రంతా కూడా).

దేవీ దర్శనానికి ఇదివరకు చిన్న గుహ మార్గంలో పాకుతూ వెళ్ళవలసి వచ్చేదిట.  ప్రస్తుతం మార్గం సుగమంచేశారు.  ఎక్కడా వంగకుండా నడుస్తూనే వెళ్ళిరావచ్చు.

 
ఇక్కడ దర్శనానికి చాలా చక్కని ఏర్పాట్లు చెయ్యబడ్డాయి.  దర్శనానికి బయల్దేరే ముందే కింద ముఖ్యద్వారంగుండా వెళ్ళటానికి కూపన్ తీసుకోవాలి. పరఛీ అంటారు దీనిని. ఎక్కువ సమయం పట్టదు దీనికి.  గ్రూప్ కి ఒకళ్ళు వెళ్ళి కూడా తీసుకోవచ్చు.  ఇది తీసుకున్న ఆరు గంటలలోపు ముఖ్యద్వారంగుండా లోపలకి వెళ్ళాలి.  లేకపోతే ఇంకొకటి తీసుకోవాల్సి వుంటుంది.    అది వుంటేనే ముఖ్యద్వారంగుండా లోపలకి (కొండ ఎక్కటానికి) వెళ్ళనిస్తారు.  మనం పైకి వెళ్ళాక పరఛీ చూపించి బేచ్ నెంబరు తీసుకోవాలి.  దర్శనానికి వచ్చేవారిని ఇలా బేచ్ నెంబర్లు ఇచ్చి క్రమబధ్ధీకరిస్తారు.  ఆ నెంబరు ప్రకారం దర్శనానికి వెళ్ళాలి.  జరుగుతున్న బేచ్ నెంబరు బోర్డుమీదు చూపిస్తుంటారు.  ఖాళీ వుంటే తర్వాత బేచ్ వాళ్ళనికూడా వెళ్ళనిస్తారు.  దానితో తొక్కిడి వుండదు  5, 6 చోట్ల సెక్యూరిటీ చెక్ వుంటుంది.  డోలీలు ఆలయానికి ఒక కి.మీ. దూరం దాకా వెళ్తాయి. గుఱ్ఱాలు ఇంకా  కొంచెం దూరంగా ఆగుతాయి.  అక్కడనుండి నడక తప్పదు.  అయితే ఎలాంటివారైనా నెమ్మదిగా అన్నీ చూసుకుంటూ వెళ్తే శ్రమ తెలియదు.  అనేక చోట్ల వచ్చే సెక్యూరిటీ చెక్ లతో మనం అంత దూరం వెళ్ళామని కూడా తెలియదు.   కెమేరా, సెల్, తోలు బెల్టులు వగైరాలు అన్నీ అక్కడ లాకర్లలో పెట్టి వెళ్ళాల్సిందే.

ఆలయానికి చేరుకోవటానికి హెలికాప్టరుకూడా వున్నది.  ఈ సర్వీసు కాట్రానుంచి వుంటుంది.  ముందుగా ఆన్ లైన్ లో కూడా బుక్ చేసుకోవచ్చు.  అయితే ఆ సర్వీసులు వాతావరణాన్నిబట్టి వుంటాయి.  మేము వెళ్ళినప్పుడు పొగమంచు ఎక్కువగా వున్నకారణంగా నెల రోజులనుంచి హెలికాప్టర్లు నడపలేదు.

ఇక్కడ కొన్ని జాగ్రత్తలు చెబుతాను.  డోలీలో వెళ్ళాలనుకుంటే కిందే కౌంటర్ లో రానూ పోనూ కావాలో, కేవలం దింపటానికే కావాలో చెప్పి  బుక్ చేసుకోండి.  ఇవ్వాల్సిన డబ్బు, డోలీ తీసుకొచ్చేవాళ్ళల్లో ఒకరిద్దరి పేర్లతో సహా అన్ని వివరాలూ రాసి ఇస్తారు.  ఇది గవర్నమెంటు వాళ్ళ కౌంటర్.  అక్కడ అది ఒక్కటే వుంది అని అన్నారు.   విడిగా డోలీ గానీ, గుఱ్ఱంగానీ మాట్లాడుకుంటే వాళ్ళకి లైసెన్సు టోకెన్లుంటాయి.  మీ యాత్ర పూర్తయ్యేదాకా అవి అడిగి తీసుకుని మీ దగ్గర పెట్టుకోండి.  ఎవరికీ పూర్తి డబ్బు ముందు ఇవ్వద్దు.  మాట్లాడుకున్న డబ్బుకాకుండా మళ్ళీ మీదగ్గర  నాస్తా, చాయ్ అంటూ వసూలు చేస్తారు.

డోలీ మాట్లాడుకునేటప్పుడే పాదగయ (అమ్మవారి పాదాలుంటాయి), అమ్మవారి ఆలయానికి ఇంకా కొంచెం పైకి వెళ్తే భైరవ ఆలయం వుంటుంది..అది చూస్తేగానీ యాత్ర సంపూర్తి కాదంటారు..ఇవ్వన్నీ చూపించాలి అని చెప్పండి.  మాకు తెలియక అవి చూడలేదు.  మధ్యలో డోలీ వాళ్ళనడిగితే దోవ సరిగాలేదని పైన కొండ చూపించి అదే భైరవాలయం దణ్ణం పెట్టమన్నారు (పెళ్ళిలో అరుంధతీ నక్షత్రంలాగా).

 దోవ ఒకటే వుంటుంది.  ఎలా వెళ్ళాలి అని కంగారు పడకండి.  మీకు కావాల్సిన వివరాల బోర్డులుంటాయి.   సీనియర్ సిటిజన్స్ కోసం 6 కి.మీ. కొండ ఎక్కిన తర్వాత ఆలయం వారి ఆధ్వర్యంలో బేటరీతో నడిచే కార్లున్నాయి (ఆటోలు).  అక్కడదాకా గుఱ్ఱాలు, డోలీలలో వెళ్ళవచ్చు.

గర్భగుడిలో పూజారులెవ్వరూ డబ్బులు తీసుకోరు.  మీరు అమ్మవారికిచ్చే కానుకలు హాయిగా హుండీలో వెయ్యండి.  అమ్మవార్లు ముగ్గురుంటారు.. కాళీ, వైష్ణవీ, సరస్వతి...లింగ రూపంలో...మధ్యలో దేవి వైష్ణవి.  ఈ సంగతి అక్కడవున్న పూజారి అందరికీ చెబుతూనే వుంటారు.  అమ్మవార్ల పైన కిరీటాలుంటాయి.  అంతేగానీ అక్కడ అమ్మవార్ల రూపం వుండదు. 

దర్శనమయ్యాక అక్కడే కేంటీన్లు వుంటాయి.. పూరీ కూరా, రజ్మా రైస్ వగైరా ధరలు తక్కువే.   భోజనం చేసి మరీ తిరుగు ప్రయాణం మొదలు పెట్టవచ్చు.  పైన వుండటానికి కూడా వసతి వున్నది.

మార్గం

జమ్మూ రాష్ట్రంలోని కట్రాదాకా రైలు, రోడ్డు, వాయు మార్గాలున్నాయి.  అక్కడనుండి యాత్ర మొదలయ్యే మైన్ గేట్ దాకా ఆటోలో వెళ్ళవచ్చు.  దోవలో బస్ స్టాండులో ఆటో ఆపి పరఛీ తీసుకుని,  అక్కడేవున్న డోలీ కౌంటర్ లో డోలీ మాట్లాడుకుని మైన్ గేట్ దాకా ఆటోలో వెళ్తే అక్కడనుంచి మాత్రమే డోలీ వగైరా యాత్ర మొదలవుతుంది.

ఇంకా వివరాలకు

http://www.maavaishnodevi.org/  చూడండి.





  వైష్ణోదేవి మైన్ గేటు


  కొండపైకి మార్గం


                 డోలీలు










Tuesday, February 1, 2011

కాశీ ప్రయాణం మేడ్ ఈజీ అనబడే కాశీ కబుర్లు – 28



ముగింపు
కాశీ క్షేత్రం గురించి ఇప్పటిదాకా నాకు తెలిసిన విశేషాలు చెప్పాను.  కాశీలాంటి మోక్షదాయక క్షేత్రం ఇంకెక్కడా లేదంటారు.  అన్నపూర్ణాసమేత విశ్వేశ్వరుడు కొలువుతీరిన ఈ క్షేత్రంలో అడుగు పెట్టటమే ఎన్నో జన్మల పుణ్యఫలం.  అసలు కాశీ వెళ్తాను అనుకుంటేనే చాలుట..ఎంతో పుణ్యంవస్తుందట.

అలాంటి పుణ్యక్షేత్రం కాశీ వెళ్ళాలని తపించి, వెళ్ళాక, ఆధ్యాత్మిక భావాలలో మునిగిపోయేవారికి అన్నిచోట్లా విశ్వేశ్వరుడూ, విశాలాక్షే కనిపిస్తారు.  కానీ అంత తాదాత్మ్యంచెందలేనివారికి కాశీలో ఇరుకు సందులు, అడుగడుగునా అపరిశుభ్రత, ఏ సమయంలోనైనా రోడ్లమీద కనిపించే పశువులూ, అడుగు బయటపెడితేచాలు  అడ్డంపడే బట్టల షాపులవాళ్ళూ…ఓహ్..ఇదా విశ్వేశ్వరుడి నివాసం అనిపిస్తుంది.

అవ్వన్నీ పక్కనపెట్టి నిండుమనసుతో ఒక్కసారి పావనమైన ఆ కాశీ పట్టణాన్ని,   విశ్వేశ్వరుని, గంగమ్మతల్లిని, చల్లని తల్లులు విశాలాక్షి, అన్నపూర్ణలను తల్చుకోండి.  మీ మనసు భక్తి భావంతో నిండుతుంది.  మనసునిండా వున్న ఆ భక్తి భావంతో కాశీని చూడండి.  పురాణ ప్రాశస్త్యంపొందిన కాశీనగరం కనిపిస్తుంది.  సత్య హరిశ్చంద్రుడు తన సత్యవాక్పరిపాలనను నిరూపించుకున్న పట్టణం ఇది.  బుధ్ధ భగవానుడు జ్ఞానోదయం తర్వాత మొట్టమొదట ధర్మప్రబోధం చేసింది ఇక్కడికి అతి సమీపంలోను సారనాధ్ లోనే. 

ఆది గురువు శంకరాచార్యులవారు, ఇంకా ఎందరో మహానుభావులు  ఇక్కడ విద్యాభ్యాసం చేశారు.  మహాకవి తులసీదాసు తన రామాయణాన్ని ఇక్కడే రాశాడు.  ఇలా చెప్పుకుంటూ పోతుంటే ఎందరో, ఎందరెందరో మహనీయులు ఈ కాశీక్షేత్ర మహత్యాన్ని పెంపొందించారు.   అలాంటి కాశీ క్షేత్ర ఆవిర్భావం  గురించి శివ పురాణంలో ఈ విధంగా వర్ణించారు.

కల్పం మొదట్లో ఎక్కడ చూసినా నీరు వుంది.   బ్రహ్మ సృష్టి చెయ్యటానికి తగిన సామర్ధ్యం సంపాదించుకోవటానికి తపస్సు చెయ్యటానికి  స్ధలం కోసం పరమ శివుడు తన త్రిశూలాగ్రంమీద సృష్టించిన భూ భాగమే కాశీ క్షేత్రం.  బ్రహ్మ దీనిమీద కూర్చుని తపస్సుచేసి పొందిన శక్తితో బ్రహ్మ అన్ని లోకాలను, గ్రహాలను, జీవజాలాన్నీ సృష్టించాడు.  అన్ని గ్రహాలతోబాటు భూమినికూడా సృష్టించాడు బ్రహ్మ.  దేవతలు, ఋషులు చేసిన ప్రార్ధనను మన్నించిన శివుడు తన త్రిశూలాగ్రానవున్న భూ భాగాన్ని అలాగే భూమిమీదకు దించాడు.  అదే కాశీ క్షేత్రమనీ, కాశీ పట్టణం, స్వయంగా ఈశ్వర సృష్టేననీ, అందుకనే తర్వాత సృష్టి చేసిన బ్రహ్మదేవుడికిగానీ, ఆ సృష్టిలో ఆవిర్భవించిన ఏ దేవీ దేవతలకుగానీ అక్కడ ఏ విధమైన  అధికారం లేదనీ, కేవలం, శివుడు, అతని పరివార దేవతల ప్రభావం  మాత్రమే ఇక్కడ వుంటుందని పురాణ కధనం.  అంతేకాదు, బ్రహ్మ సృష్టించినవన్నీ ప్రళయకాలంలో నశించినా, ఆయన ప్రభావంలేని కాశీనగరం మాత్రం ప్రళయ సమయంలోకూడా చెక్కుచెదరదని కూడా పురాణ కధనం.
బ్రహ్మ, విష్ణుల కోరికమీద శివుడు కాశీ క్షేత్రంలో భక్తులను కాపాడటంకోసం  జ్యోతిర్లిగంగా వెలిశాడు.
 అంతేకాదు.  కాశీ పట్టణంలో మరణించబోయే జీవుల కుడిచెవిలో పరమశివుడు సాక్షాత్తూ తనే మంత్రోపదేశంచేస్తాడని, అలాంటివారి జన్మ ధన్యమయి మోక్షం లభిస్తుందని నమ్మకం.

ఈ ప్రఖ్యాత పట్టణంమీదు తురుష్కులు అనేకసార్లు దండయాత్రచేసి ఇక్కడి సిరిసంపదలను కొల్లగొట్టారు.  ఈ దాడులతో విశ్వనాధ మందిరంతోసహా అనేక విగ్రహాలు, లింగాలు స్ధానభ్రంశంచెందాయి.   ప్రస్తుతం వున్న మందిరం క్రీ.శ. 1785లో ఇండోర్ మహారాణి అయిన అహల్యాబాయి నిర్మించింది.   ఆక్రమణలకు గురిఅయినతర్వాత ప్రస్తుతంవున్న మందిరం చిన్నదే.  ఆలయంలోపలకూడా ఇరుగ్గానే వుంటుంది.  కాశీలో  విశాల ఆలయాలు, శిల్పకళ కనబడదు.

ఇక్కడ వసతికి హోటల్సేకాకుండా అనేక సత్రాలుకూడా వున్నాయి.  వీటిలో గదులు అద్దెకు ఇవ్వబడుతాయి.  చాలాచోట్ల ఉచితంగా భోజనం పెడతారు…అయితే ముందు మనం చెప్పాలి.  అప్పటికప్పుడు వెళ్తే ఏర్పాటు చెయ్యలేరు.  వాళ్లు ఉచితంగా పెట్టినా ఇవ్వదల్చుకున్నవారు అన్నదానానికి డబ్బు ఇచ్చిరావచ్చు.

విశ్వనాధుని దర్శనానికి వెళ్ళేటప్పుడు సెల్ ఫోన్లు, కెమేరాలు, పెన్నులు వగైరాలు తీసుకువెళ్ళద్దు.  వాటిని లోపలకి తీసుకెళ్ళనివ్వరు. 
శివాలయాలలో ఎక్కడైనా మీరు తీసుకెళ్లిన పూజా ద్రవ్యాలతో మీరు స్వయంగా పూజ, అభిషేకం చేసుకోవచ్చు.  అమ్మవార్ల ఆలయాలలోమాత్రం పూజారులే చేస్తారు.  అమ్మవార్ల ఆలయాలలో శ్రీచక్రానికి కుంకుమపూజ మనం చేసుకోవచ్చు.

మనం కాశీ వెళ్తుంటే పొలిమేరల్లోనే మన పాపాలన్నీ పటాపంచలవుతాయట.  అంతేకాదు.  కాశీలో చేసిన మంచికానీ, చెడుకానీ అనేక రెట్ల ఎక్కువ ఫలితాన్నిస్తుందట.  అందుకే సాధ్యమైనంత ఎక్కువ దైవనామ స్మరణ, దాన ధర్మాలు, పరోపకారం చెయ్యండి.  గంగా స్నానం, దైవ దర్శనం గురించి చెప్పక్కరలేదుకదా.  అలాగే పితృకార్యాలు చెయ్యదల్చుకున్నవారు వాటిని చెయ్యండి.  మీ కాశీయాత్రని సఫలం చేసుకోండి.






Tuesday, January 4, 2011

కాశీ ప్రయాణం మేడ్ ఈజీ అనబడే కాశీ కబుర్లు – 27



కాశీలో  ముఖ్యంగా దర్శించవలసిన దేవతలు

కాశీలో గంగా స్నానం, విశ్వేశ్వర దర్శనమేకాక, తప్పనిసరిగా దర్శించవలసిన ఇతర దేవతల గురించి తెలుసుకుందాం.  కాశీలో చిన్నా, పెద్దా అనేక ఆలయాలున్నాయి.  వీటిలో కాల చరిత్రలో శిధిలమైనవి అయిపోగా, మిగిలినవాటిని దర్శించటానికి కూడా చాలా సమయం పడుతుంది.  ఎక్కువకాలం కాశీలోనే నివసించేవారికి వారి ఆసక్తినిబట్టి ఇది సానుకూలపడవచ్చు కానీ, అందరికీ సాధ్యం కాదు.  తప్పనిసరిగా చూడవలసినవాటి గురించి ముందు చెప్పుకుందాం.

కాశీలో మూల విరాట్ విశ్వేశ్వరుడి ఆలయంలోనే అనేక దేవీ దేవతల ఉపాలయాలు వున్నాయి.  ప్రదక్షిణ మార్గంలో పార్వతీ దేవి, అన్నపూర్ణాదేవి, కుబేరస్వామి, ఒక మందిరంలో గుంటలో కుబేరేశ్వరలింగం వుంటాయి.  దాటితే ఆవముక్తేశ్వర మహాదేవుడు, నందీశ్వరుడు, ఏకాదశేశ్వర లింగం వున్నాయి.  ఇంకా గణపతి, విష్ణు, మహాలక్ష్ములనుకూడా దర్శించవచ్చు. 

ప్రధాన ఆలయంలో గర్భగుడిలోపల నాలుగు గోడలమీద వున్న పాలరాతి ఫలకాలలో మూర్తులను దర్శించండి.  అవి సీతారామ లక్ష్మణులు, పూజారి కూర్చునే గూటిపై లక్ష్మీ నారాయణులు, ఒక గోడపై దశ భుజ వినాయకుడు,  పార్వతీ పరమేశ్వరులు.

ఆలయం లోపల ప్రాంగణంలో పార్వతీదేవి ఉపాలయం తర్వాత వచ్చే దోవలో బయటకు వెళ్తే అనేక శివలింగాలు, బావి, మసీదు కనబడతాయి.  కొన్ని లింగాలు, విగ్రహాలదగ్గర పేర్లు వున్నాయి.  పూర్వం మహమ్మదీయుల దండయాత్ర సమయంలో విశ్వేశ్వర లింగాన్ని భద్రతకోసం ఆ బావిలోనే పడవేసి తిరిగి తీసి ప్రతిష్టించారంటారు. 

విశ్వేశ్వర ఆలయం  బయటకురాగానే కుడివైపు శనీశ్వరాలయం కనబడుతుంది.  ఇక్కడ భక్తులు నిరంతరం దీపాలు వెలిగిస్తూంటారు.  దీపాలు అక్కడ లభిస్తాయి.   సమీపంలోనే సాక్షి వినాయకుడు, డింఢి వినాయకుడు, అన్నపూర్ణ మందిరాలుంటాయి.  ఒక కిలోమీటరు దూరంలో కాశీ విశాలాక్షి. ఆలయం వుంది.  అన్నపూర్ణ, విశాలాక్షి మందిరాలలో ఉపాలయాలను కూడా దర్శించండి. ఇవ్వన్నీ తప్పక దర్శించవలసిన ఆలయాలు.  ఈ సందుల్లో వాహనాలు తిరగవు.  నడవవలసినదే.

ఇవికాక కేదారేశ్వరఘాట్ లోని కేదారేశ్వర మందిరాన్ని తప్పక దర్శించండి.  వీలు కుదిరితే విశాలాక్షి ఆలయానికి వెళ్ళే దోవలో (కనుక్కుంటూ వెళ్ళాల్సిందే) వారాహీ దేవి ఆలయం వుంది.  ఈవిడిని చూడలంటే ఉదయం 7 గం. లోపే వెళ్ళాలి.  ఈవిడ విగ్రహం భూగృహం (సెల్లార్) లో


వుంటుంది.  నేలపై వున్న గ్రిల్ లోనుంచి చూడాల్సిందే.  ఈవిడ గ్రామదేవత.  ఉగ్రదేవత.  ఎప్పుడూ చాలా వేడిగా వుంటుంది.  అందుకే దర్శనం ఉదయం 7 గం. లలోపే.   



కాలభైరవాలయం తప్పనిసరిగా దర్శించాలి. 

ఇంకా మేము చూడనివి, అవకాశం వుంటే చూడవలసినవి, తిలభాండేశ్వర్ మందిర్ (ఈయన రోజూ నువ్వు గింజంత పెరుగుతాడట).  ఇంకొక మందిరం భారతమాత మందిర్.   ఇది కంటోన్మెంట్ ఏరియాలో రైల్వే స్టేషన్ కి 1.5 కి.మీ. దూరంలో వున్నది.  పాలరాతితో చెక్కిన మొత్తం బారతదేశం పటం ఇందులో వున్నదిట. 

వచ్చే పోస్టుతో కాశీ కబుర్లు ముగియబోతున్నాయి.

Thursday, December 23, 2010

కాశీ ప్రయాణం మేడ్ ఈజీ అనబడే కాశీ కబుర్లు - 26



గంగా తీరంలో స్నాన ఘట్టాలు

పావన గంగా నదీ తీరాన వరుణా ఘాట్ నుంచీ అస్సిఘాట్ వరకు 64 ముఖ్యమైన స్నాన ఘాట్లు వున్నాయి.  కొత్తవి ఇంకా కొన్ని చేరాయి.  యాత్రీకుల సౌకర్యార్ధం పడవల వారు ఈ  స్నాన ఘాట్లని చూపిస్తూ, మధ్యలో కొన్ని ముఖ్యమైన చోట స్నానానికి సమయమిస్తూ తిప్పుతారు.  డబ్బు, ప్రయాణీకుల సంఖ్యమీద, వారి బేరం చేసే సామర్ధ్యం మీద ఆధారపడి వుంటుంది.  మేము ముగ్గురం  ఉదయం 11 గం. నుంచి మధ్యాహ్నం 12-30 దాకా ఒక బోట్ లో తిరిగాం, మధ్యలో మణికర్ణికలో మాత్రం ఆగాము.  దానికి 250 రూ. తీసుకున్నాడు.

సాధారణంగా ప్రయాణీకులు సూర్యోదయ, సూర్యాస్తమయ సమయాలలో ఈ ఘాట్ ల సౌందర్యం తిలకించటానికి ఇష్టపడతారుగనుక ఆ సమయంలో రేటు కొంచెం ఎక్కువ వుండవచ్చు.

ఎక్కువమంది  యాత్రీకులు మణికర్ణికా ఘాట్, దశాశ్వమేధ ఘాట్, పంచ గంగలలో స్నానం చెయ్యటానికి ఆసక్తి చూపిస్తారు.  వీటిని గురించి కొంచెం వివరంగా........

మణికర్ణికా ఘాట్
పూర్వం మహా విష్ణు తన చక్రంతో ఒక సరస్సు తవ్వి దాని ఒడ్డున మహా శివునికోసం తపస్సు చేశాడు.  శివుడు ప్రత్యక్షమై, విష్ణువుయొక్క తపస్సుని మెచ్చుకుంటూ తలాడించాడట.  అంతే..ఆయన చెవికున్న మణి కుండలం జారి ఆ తటాకంలో పడింది.  సాక్షాత్తూ ఆ మహా ప్రభువు ధరించిన చెవి కుండలం పడిన తటాకం మణకర్ణికా ఘాట్ అయింది.  తరువాత కాలంలో గంగానది ఆ తటాకం మీదనుంచి ప్రవహించిందని కొందరంటారు.  ఈ ఘాట్ లో మెట్లు ఎక్కి పైకి వెళ్తే అక్కడ నలువైపులా రాళ్లతో కట్టబడిన పుష్కరిణి ఒకటి వున్నది.  అదే మహా విష్ణువు చక్రంతో తవ్విన తటాకమని కొందరంటారు.

ముందు గంగానదిలో మణికర్ణికా ఘాట్లో స్నానం చేసి పైకి వెళ్ళి ఆ కుండంలో స్నానం చేసి, మళ్ళీ వచ్చి మణికర్ణికా ఘాట్ లో స్నానం చెయ్యాలని మేము వెళ్ళిన బోటు అతను చెప్పాడు.   ఇంకో విశేషమేమిటంటే ఈ ఘాట్ లో స్నానం చెయ్యటానికి మధ్యాహ్నం 12 గం. లకు సకల దేవతలూ వస్తారుట.  అందుకని ఆ సమయంలో అక్కడ స్నానం చెయ్యటం చాలా మంచిది అని చెప్తారు.

ఒడ్డున చిన్న చిన్న దేవాలయాలు వున్నాయి.  కొందరు పితృకార్యాలు చేస్తున్నారు.
 మణికర్ణికా ఘాట్
 చక్ర తీర్ధం

దశాశ్వమేధ ఘాట్
ఇక్కడ బ్రహ్మదేవుడు పది అశ్వమేధ యాగాలు చేశాడుట. అందుకే ఆ పేరు.  ఈ ఘాట్ యాత్రీకులతో ఎప్పుడూ సందడిగా వుంటుంది.  రోజూ సాయంసమయంలో ఇక్కడ గంగ హారతి ఇస్తారు.
 ప్రయాగ మరియు దశాశ్వమేధ ఘాట్స్

హరిశ్చంద్ర ఘాట్
హరిశ్చంద్రుడు కాటికాపరిగా చేసింది ఇక్కడే.  ఇక్కడ శవదహనాలు ఎప్పుడూ జరుగుతూనే వుంటాయి.  దీని ప్రక్కనే కేదార్ ఘాట్.


కేదార్ ఘాట్
ఈ ఒడ్డునే కేదారేశ్వర మందిరం వున్నది,  ఈ ప్రాంతంలో తెలుగువారు ఎక్కువ వుంటారుట.
 మెట్లకి ఎదురుగా ఒడ్డున కేదారేశ్వర మందిరం (ఎఱ్ఱ బిల్డింగ్ పక్కన)

ఇలా బోట్ లో వెళ్ళేటప్పుడు బోటతను మధ్యలో ఆపి డబ్బులడుగుతాడు, రాములవారు అక్కడే నది దాటారనీ,  ఆయనని తలచుకుని అక్కడ దానమిస్తే పుణ్యమనీ.  బయల్దేరగానే అలా మధ్యలో ఆపి అడిగేసరికి మాకు కోపం వచ్చి ఇవ్వలేదు.  దాంతో అతనికి చాలా కోపం వచ్చి, ముందంతా అన్నీ చెప్పినవాడు తర్వాత ఏమీ చెప్పలేదు.  ఇలాంటి సమయాల్లో ఏం చేస్తారో మీ ఇష్టం.  పుణ్యక్షేత్రానికి వెళ్ళారుకనుక ఎంతో కొంత ఇచ్చేయచ్చు.  వాళ్ళు అల్ప సంతోషులు, పైగా బీదవారు.  అనుభవంతో మాకు తెలిసిందిది.

గంగానదిమీదు పడవ షికారుకి తప్పక వెళ్ళండి.  అన్ని ఘాట్లూ బోట్ లోంచి చూడవచ్చు.  వీలయితే సూర్యోదయ, సూర్యాస్తమయ సమయాల్లో బాగుంటుంది.  సమయముంటే సాయంకాలాలు ఘాట్ లో మెట్లమీదకూర్చుని సమయం గడపవచ్చు.
 మేమూ బోటింగ్ చేస్తున్నామోచ్

కాశీలో చూడవలసిన దేవతల గురించి వచ్చే పోస్టులో.


Thursday, December 9, 2010

కాశీ ప్రయాణం మేడ్ ఈజీ అనబడే కాశీ కబుర్లు - 25



వ్యాస కాశీ
పూర్వం వ్యాస మహర్షి నివసించిన ప్రదేశమే వ్యాస కాశీ.  వ్యాస మహర్షి అష్టాదశ పురాణాలు వ్రాసిన వాడు.  వేద విభాగము చేసినవాడు.  అంతటి గొప్ప వ్యక్తి తన కోప కారణంగా కాశీనుంచి బహిష్కరింపబడి గంగ ఆవలి ఒడ్డున నివసించాడు.  ఆ కధేమిటో తెలుసుకోవాలనుకుంటున్నారా? 
పురాణ కధనం ప్రకారం పూర్వం వ్యాసుడు తన శిష్యగణంతో  కాశీలో వుండి  తపస్సు చేసుకోసాగాడు.  ఒకసారి పార్వతీ పరమేశ్వరులకు ఆయనని పరీక్ష చేయాలనిపించింది.  మధ్యాహ్నం భిక్ష కోసం వెళ్ళిన ఆయనకుగానీ ఆయన శిష్యులకుగానీ పార్వతీ పరమేశ్వరుల ప్రభావంవల్ల కాశీలో ఎక్కడా భిక్ష దొరకలేదు.  అలా మూడు రోజులయింది.  ఈ మూడు రోజులూ వారికి ఏ ఆహారమూ లేదు.  అలా ఎందుకు జరుగుతోందో ఆయనకు అర్ధంకాలేదు.  సాక్షాత్తూ అన్నపూర్ణ నిలయమైన కాశీలో తమకు ఆహారం దొరకకపోవటమేమిటి  కాశీవాసులకు ఇహంలో అన్ని సౌఖ్యాలూ వుండి అంత్యకాలంలో మోక్షం లభిస్తుంది.  అందుకే వారికి అహంకారం పెరిగి  తమకు భిక్ష పెట్టంలేదని కోపం వచ్చింది.  ఆ కోపంలో ఆయనకి ఆలోచన రాలేదు.  మూడు తరాలవరకు కాశీవాసులకు ఏమీ దొరకకూడదు అని శపించబోయాడు.  అతని మనసులో మాట బయటకు రాకుండానే ఒక పెద్ద ముత్తయిదు రూపంలో పార్వతీ దేవి వచ్చి వారిని భిక్షకు పిలిచి తృప్తిగా భోజనం పెట్టింది.  తర్వాత నెమ్మదిగా చివాట్లూ పెట్టింది.  మూడు రోజులు అన్నం దొరకకపోతే ఆగ్రహంలో ఔచిత్యాన్నే మరచిపోయావే, అష్టాదశ పురాణాలూ ఎలా రాశావయ్యా అని నిలదీసింది.  కాశీవాసులకు శాపం ఇస్తే విశ్వేశ్వరుడు వూరుకుంటాడా అని నిలదీసింది.  ఇంతలో విశ్వేశ్వరుడూ ప్రత్యక్షమయి కాశీలో కోపిష్టులు వుండకూడదని వ్యాసుణ్ణి ఐదు కోసుల దూరంలో గంగకు ఆవలి ఒడ్డున నివసించమని శాసించాడు.  వ్యాసుడు పశ్చాత్తాపంతో ప్రార్ధిస్తే పరవడి రోజుల్లో వచ్చి తన దర్శనం చేసుకోవచ్చని అనుమతిస్తాడు.
తర్వాతకాలంలో కాశీ పాలించిన రాజుల కోట అక్కడ ఇప్పుడు కనిపిస్తుంది.  ఇప్పుడు కోటనంతా మ్యూజియంగా మార్చి పూర్వం కాశీరాజులు వాడిన అనేక సామగ్రిని అక్కడ భద్రపరిచారు.  ప్రస్తుతం ఈ మ్యూజియంకి మైంటినెన్స్ సరిగ్గా లేదనిపిస్తుంది మ్యూజియం శుభ్రత చూస్తే.  మ్యూజియం సందర్శనానికి టికెట్ వుంది.  సమయం ఉదయం 9 గం. ల నుంచి సాయంత్రం 5 గం. ల దాకా.  మధ్యలో ఒకటి రెండు గంటల విరామం వున్నది.





 వ్యాస కాశీ  ప్రవేశ ద్వారమ

గంగకవతల ఒడ్డున రాజుగారి కోట