Monday, March 15, 2010

శ్రీ కేతకీ సంగమేశ్వర క్షేత్రము, ఝరాసంగము
ఈ మధ్య ఈ బ్లాగులో జరిగిన వాద వివాదాలలో యాత్రపట్ల అనేకమంది శ్రేయోభిలాషులు చూపించిన అభిమానానికి పేరు పేరునా కృతజ్ఞతాభివందనాలు. ఇంత అభిమానానికి బదులుగా మీకందరికీ ఇవాళ మన సమీప ప్రాంతంలోవున్న ఒక విశేష తీర్ధ స్ధలం గురించి చెబుతాను.

మన చుట్టుప్రక్కల వున్న ప్రదేశాలగురించి ఏనాడో పురాణాల్లో వ్రాయబడి వున్నదంటే మనకెంత అద్భుతంగా అనిపిస్తుందికదూ. మనకింత సమీపంలోవున్న ఈ ప్రదేశాలు పురాణాలలో ఇంత ప్రాముఖ్యత సంపాదించుకున్నాయంటే, అలాంటి పుణ్య ప్రదేశాలలో పుట్టిన, లేక అలాంటి ప్రదేశాలతో ఏదో ఒక సంబంధం వున్న మనం ఎంత అదృష్టవంతులమోకదా.

మెదక్ జిల్లావాసులుగానీ, హైదరాబాదు చుట్టుప్రక్కలవారుగానీ ఝరాసంగము అనే ప్రదేశము గురించి విన్నారా అనే ప్రశ్న వేస్తే చాలామటుకు సమాధానం లేదనే వస్తుంది. ఒకవేళ విన్నవారు వున్నా, ఈ క్షేత్రంయొక్క పురాణ ప్రాముఖ్యత తెలిసి వుండకపోవచ్చు. మన పొరుగునవున్న ఈ ఊరి గురించి అప్పుడెప్పుడో వ్రాసిన బ్రహ్మాండ పురాణంలో ఐదు అధ్యాయాల్లో చెప్పారట. అయోధ్యలో హరిశ్చంద్ర మహారాజు చేసిన యజ్ఞానికి వచ్చిన సూత మహర్షిని చూసి, ఆ యజ్ఞానికి వచ్చిన మిగతా ఋషులంతా ఏదేని పుణ్య క్షేత్రం గురించి తెలియజెయ్యమని కోరగా, ఈ క్షేత్రం గురించి తెలియజేశారుట సూత మహర్షి. ఇంక ఊరించకుండా అసలు విషయం చెబుతున్నాను.

హైదరాబాదుకి వంద కిలో మీటర్ల దూరంలో జహీరాబాద్ వుంది., అదేనండీ, ముంబాయి, షిర్డీ వెళ్ళే త్రోవలో వున్న జహీరాబాదే. ఈ జహీరాబాద్ లో అడుగు పెడతూనే (హైదరాబాద్ నుండి వెళ్ళేటప్పుడు) కుడివైపు ఒక కమాను....శ్రీ కేతకీ సంగమేశ్వర క్షేత్రము, ఝరాసంగము అనే వివరణతో కనబడుతుంది. ఈ కమాను కొంచెం క్రాస్ గా వుంటుంది. కనుక జహీరాబాద్ సరిహద్దులో అడుగుపెడుతూనే జాగ్రత్తగా చూడండి. ఈ కమాన్లోంచిలోపలికి 13 కిలో మీటర్లు వెళ్తే వస్తుంది శ్రీ కేతకీ సంగమేశ్వర క్షేత్రం.

పూర్వం సూర్యవంశ రాజైన కుపేంద్ర మహారాజు భయంకరమైన కుష్టు రోగంతో బాధ పడేవాడు. ఏ వైద్యం చేయించినా, ఏ క్షేత్రం తిరిగినా ఆయన రోగం నయం కాలేదు. ఒకసారి వేటకై ఈ ప్రాంతానికి వచ్చి దప్పికతో నీటికోసం వెతికాడు. ఇక్కడ ఒక జలాశయము, దానిలోవున్న బాణ లింగము చూశాడు. నీరు తాగి కొంచెంసేపు విశ్రమించి తన రాజధానికి వెళ్ళాడు. మర్నాడు ఉదయమే ఆయనను చూసిన ఆయన భార్య చంద్రకళ ఆశ్చర్యపోయినది. ఆయన కుష్టురోగం మటుమాయమైనది. దానికి కారణమేమయి వుండనోపని ఆలోచించి తానా గుండములోని నీరు త్రాగుటగురించి, ఆ గుండములోనే వున్న బాణ లింగం గురించి చెప్పాడు. అందరూ కలిసి ఆ క్షేత్రానికి వెళ్ళి, శివుణ్ణి అర్చించారు. ఆ సమయంలో నారద మహర్షి అక్కడే వున్నారు. కుపేంద్ర మహారాజు ఆ ఋషిని ఆ ప్రాంత విశేషాలు వివరించమని ప్రార్ధించగా, నారద మునీంద్రుడు వారికి ఆ క్షేత్ర విశేషాలను ఈ విధంగా వివరించాడు.


పూర్వము ఇక్కడంతా కేతకీ (మొగలి) వనముండేది. బ్రహ్మదేవుడు ఇక్కడ తపస్సు చేయగా శివుడు ప్రత్యక్షమయ్యాడు. బ్రహ్మదేవుని కోరికపై భక్తులననుగ్రహించుటకు శివుడు అక్కడ బాణ లింగాకారముతో వెలిశాడు. బ్రహ్మ తన కమండలంలోని జలంతో ఆ లింగాన్ని అభిషేకించాడు. బ్రహ్మ, శివుడు కలసిన ప్రదేశము కనుక ఈ ప్రదేశానికి సంగమం అనే పేరు వచ్చింది. అక్కడ వెలిసిన శివునికి సంగమేశ్వరుడనే పేరు వచ్చింది.

ఇంక స్వామికి కేతకీ సంగమేశ్వరస్వామి అనే పేరు రావటానికికూడా ఒక కధ చెప్పారు.

ఒకసారి బ్రహ్మ, విష్టువులను పరీక్షించదలచి శివుడు లింగ రూపంలో భూమ్యాకాశాలంతా వ్యాపిస్తాడు. శివుని ఆది, అంతము కనుక్కోలేని బ్రహ్మ, విష్ణువు కేతకి అనే అప్పరసతోను (మొగలి పువ్వని కూడా చెప్తారు), గోవుతోను అబధ్ధం ఆడిస్తారు.. శివుని ఆది అంతం తాము చూసినట్లు. దానికి శివునికి కోవం వచ్చి గోముఖానికి పూజ నిషేధిస్తాడు. అలాగే మొగలి పువ్వులు పూజకి పనికిరావని శాపం ఇస్తాడు. అప్పుడా అప్సరస శాప విమోచనానికై ప్రార్ధించగా భూలోకంలో కేతకీ వనంగా పుడతావని, అప్పుడు తానక్కడ వెలసి ఆ పూవుల పూజ అందుకుంటాననీ శివుడు వరం ఇస్తాడు. అందుకే శివునికిక్కడ మొగలి పూవులతో పూజ చేస్తారు. ఇప్పటికీ ఇక్కడ మొగలి చెట్లు ఎక్కువే.

నారదుని మాటలకు సంతసించిన కుపేంద్రుడు తానక్కడే నివసించదలచి సమీపములో కుపేంద్ర నగరమనే అత్యంత సౌందర్యవంతమైన పట్టణాన్ని నిర్మించాడు. ఆ కుపేంద్ర నగరమే ప్రస్తుతం ఈ క్షేత్రానికి ఒక కిలో మీటరు దూరంలో వున్న నేటి కుప్పాపురం అంటారు.

అమృత గుండం

ఈ అమృత గుండం చాలా విశేషమైనది. దీనిలో అనేక తీర్ధములు వున్నాయంటారు. కాశీనుంచి ఒక ఝర ఈ గుండములో కలుస్తుందని పూర్వీకుల కధనం. ఇంకొక ప్రత్యేకత ఇప్పుడుకూడా చూడగలిగినది...మధ్యాహ్న సమయంలో ఈ గుండం ఖాళీ చేసి అందులో వున్న ఋషి తీర్ధమునందు నైవేద్యము పెట్టినచో ఆ నైవేద్యము అక్కడ వున్న దారిలోకి వెళ్ళిపోతుంది. ఎంత నైవేద్యం పెట్టినా, ఎంతమంది నైవేద్యం పెట్టినా అలాగే అవుతుంది. విశేషమేమిటంటే ఆ దోవలోనుంచి నీళ్ళు వ్యతిరేక దిశలో గుండంలోకి వస్తూ వుంటాయి. కొద్ది గంటల్లో గుండం నీటితో నిండిపోతుంది. గుండంలోకి వచ్చే నీటితో పాటు గుండంలోకి రాకుండా ఆ నైవేద్యం అక్కడ వున్న దోవలోకి వెళ్తుంది...ఒకే దారిలోంచి రెండు వ్యతిరేక దిశల్లో, రెండు పదార్ధాలు ఒకేసారి సాగుతాయి. మధ్యలో ఎక్కడా ఏ విధమైన అరలూ లేవట. మేము ఉదయం వెళ్ళాము. అందుకు ఈ విశేషం చూడలేక పోయాము.


శివ లింగానికి వెండి తొడుగు వేసి వుంది. అంటే లింగం వెండి లింగంలాగా వుంటుంది. ఈ తొడుగు చాలాకాలం క్రింతం వెయ్యబడ్డది. లోపల బాణాకార లింగం. తొడుగు వేసిన తర్వాత తియ్యలేదు. ఈ మధ్యకాలం వారిలో తొడుగు లేకుండా లింగాన్ని చూసినవారు లేరు.

శివ లింగం వెనుక పార్వతీ దేవి వున్నది.

సందర్శన సమయాలు
ఉదయం 4 గం.లనుంచి రాత్రి 10 గంటలదాకా.

చిన్నదయినా పురాణ ప్రసిధ్ధికెక్కిన ఈ ఆలయం కార్యనిర్వాహక కమిటీ, గ్రామ ప్రజల ఉత్సాహంతో అనేక కొత్త హంగులు సంతరించుకుంటోంది.
0 comments: