Wednesday, September 29, 2010

కాశీ ప్రయాణం మేడ్ ఈజీ అనబడే కాశీ కబుర్లు – 17


మంగళగౌరి ఆలయం, గయ, బీహార్

గదాధరసహోదరి గయా గౌరి నమోస్తుతే పితృణాంచ సకర్తృణాం దేవి సద్గతిదాయిని
త్రిశక్తిరూపిణీమాతా సచ్చిదానంద రూపిణీ మహ్యంభవతు సుప్రీతా గయామాంగళ్యగౌరికా.

గయలోని మంగళగౌరి ఆలయం అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటి.  దక్షయజ్ఞ సమయంలో అసువులుబాసిన పార్వతీ దేవి శరీరాన్ని శ్రీమహావిష్ణువు తన సుదర్శన చక్రంతో భిన్నం చేయగా అవి అనేక చోట్ల పడిశక్తి పీఠాలుగా ఆరాధింపబడుతున్నాయి..  అందులో ముఖ్యమైన శరీర భాగాలు పడిన ప్రదేశాలు 18 అష్టాదశ శక్తి పీఠాలు.   గయలో అమ్మవారి తొడ భాగం పడ్డది.

ఈ ఆలయ ప్రసక్తి పద్మ పురాణం, వాయు పురాణం, అగ్ని పురాణాలలో చేయబడింది.  ప్రస్తుతం వున్న ఆలయం క్రీ.శ. 1459 లో నిర్మింపబడింది.  మంగళగౌరి అనే చిన్ని కొండమీద ఇటుకలతో నిర్మింపబడిన  చిన్న ఆలయం ఇది. 

గర్భగుడి చాలా చిన్నది.  లోపల చిన్న గుంటకి చుట్టూ చతురస్రాకారపు దిమ్మె  లాగా వుంటుంది.  ఆ దిమ్మె మీద మనం వెలిగించే అఖండ దీపంలాంటిది ఒకటి, ఇంకా భక్తులు వెలిగించిన దీపాలు ప్రకాశిస్తూ వుంటాయి.  గుంటలో అమ్మవారి తొడ భాగానికి ప్రతీకగా సాలగ్రామంలాగా వుంది.  దానినే మంగళగౌరీ దేవిగా భక్తులు పూజిస్తారు. 

ఇరుకు ప్రదేశాలలోకి వెళ్ళటానికి ఇబ్బంది పడేవాళ్ళు గర్భగుడిలోకి వెళ్ళేటప్పుడు కొంచెం చూసుకుని వెళ్ళండి.

 ఎడమవైపు కనబడుతున్న గోపురం ఆమ్మవారి గుడి..చిన్న కొండమీద వుంది

4 comments:

Alapati Ramesh Babu said...

ఆన్నిటి కన్నా ముఖ్యం గయ లొని మహా శుభ్రత ,మరియు పండాల డబ్బు యావ వీటి మధ్యలొ అధ్యాత్మికత .ఇక మాంగల్య గౌరి గుడికి వున్న దారి గొప్పతనము చూడాలి కాని వర్ణించలెము అలా అని ఫొటొ లొ చూపలెము .మనం అమ్మ కొసం, విష్ణు పాదం కోసం వారు మన దగ్గర సోమ్ము కొసం ... ఆది సంగతి .......

Anonymous said...

ంఈ బ్లాగ్ చూస్తుంటే, కాశీ, గయ చూస్తున్నట్టుంది.
గయ కాశీ యాత్రలో కష్టాలు, హెచ్చరికలు కూడా రాస్తే యాత్రీకులకు వుపకరిస్తుందేమో. గయాలో పిండప్రదానం విశేషాలు/అనుభవాలు తెలుపండి. గయలో బ్రతికుండగానే ముందస్తు శ్రాద్ధాలు పెట్టుకోవచ్చని ఎవరో చెప్పారు. మీకు తెలిసుంటే వివరాలు చెప్పండి.

psm.lakshmi said...

snkr గారూ
కాశీ యాత్రలో నాకు ఇబ్బంది కలిగించిన విషయాలు వున్నాయి. కానీ ఏ పుస్తకంలో చూసినా కాశీనిగానీ అక్కడ పరిస్ధితులనుగానీ ఏమీ విమర్శించకూడదు, చాలా పాపం వస్తుంది అనే వుంది. బహుశా అక్కడ వాళ్ళే నాలాంటి వాళ్ళకోసం అలాంటి మాటలు చెప్పారని నా అనుమానం. ఎలాంటి పాపం వచ్చినా సరే చివరలో అక్కడ ఎదురయ్యే ఇబ్బందులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పదలుచుకున్నాను. ఇప్పటికే నా ఆవేశం ఆగక చాలా చోట్ల ఇబ్బందులు చెప్పేశాను.
గయలో నేను ఏ కార్యక్రమం చేయించలేదు, మా వారు నాతో రాక పోవటంవల్ల శ్ర్రాధ్ధ కర్మలు చేయించలేదు. నా ప్రవ్వర్తనలో మార్పు రావాలిగానీ, ప్రాయశ్చిత్తం చేసుకున్నంతమాత్రాన, పండు వగైరా వదిలేసినంతమాత్రాన నేను చేసిన పాపాలేమన్నావుంటే పోవని నమ్మకం వున్నదాన్ని....అందుకని అవి చెయ్యకుండా అక్కడ బ్రాహ్మణుని కోపానికి కూడా గురయ్యాను. ఏం చెయ్యకపోతే ఎందుకొచ్చారన్నాడక్కడాయన.
పోయినవారికే అక్కడ శ్రాధ్ధ కర్మలు చేసినా మళ్ళీ ప్రతి ఏడాదీ చెయ్యాలన్నప్పుడు బ్రతికున్నవాళ్ల సంగతి మరి ఆలోచించాలికదా. అయితే మేమంతా ఆడపిల్లలమవటంతో తర్వాత మా వాళ్ళకి ఎవరు చేస్తారో ఏమోనని ఇలాగే ఎవరో అంటే మా నాన్నగారిని అడిగాను నేను ఈ విషయమే (కేవలం వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది రాకూడదనే ఆలోచనతోనే). ఆయన ఏం చెప్పారంటే అలా పెట్టినప్పుడు వాళ్ళు తిరిగి ఇంటికిగానీ, మనుషుల్లోకిగానీ రాకూడదట. మహాప్రస్ధానం వెళ్ళాలట. అంటే అడవుల్లోకీ, పర్వతాల్లోకీ అలా వెళ్తూవుండి ఎక్కడో అక్కడ ప్రాణాలుపోతాయి.
ఎవరి వీలుకోసం వాళ్ళు ఏర్పరుచుకొనే ఆచారాలు కూడా వుంటాయి మరి.
psmlakshmi

రహ్మానుద్దీన్ షేక్ said...

psmlaksmi గారూ, snkr గారూ
గయలో శ్రాద్ధ కర్మ చేసుకొన్నా వాళ్ళు ఆ పై ఎటువంటి మంగళ కార్యాలకు హాజరు కాకూడదు
ఆశీర్వచనాలు ఇవ్వరాదూ, తీస్కోరాదు
ఆ పై వారు అన్ని రకాల ధార్మిక నియమాలను(జప, తప, దానాలు) పాటించాలి
అందుకని ఇది దాటవేయ్యడం మంచిది
మనకు కర్మకాండ, శ్రాద్ధకర్మాలు చెయ్యటానికి వారసులు ఎవ్వరూ లేరనుకోండి అలాంటప్పుడే ఆ తంతు జరగాలి
డబ్బుకు ఆస పడి చాలా మంది పండాలు ఈ నియమాలు పాటించరు
పైగా మీరు అక్కడి పురోహితుల(పండాల) శుచి శుభ్రత వాక్కు ఆహార నియమాలు గమనిస్తే వెంటనే ఆత్మహత్య చేస్కున్నా చేస్కుంటారు
అక్కడి వారు అంతా డబ్బుకి దాసోహం
అటువంటి వారి దుర్భాషలకు పెద్ద ఎఫ్ఫెక్ట్ కూడా ఉండదులెండి, సో నో ప్రాబ్స్