Sunday, November 7, 2010

కాశీ యాత్ర మేడ్ ఈజి అనబడే కాశీ కబుర్లు – 20



కాశీలో దర్శనీయ స్ధలాలు

కాశీలో దేవాలయాలు అనేకం.  ఎన్ని చూసినా ఇంకా చూడనివి వుంటాయి.  ముఖ్యమైన కొన్ని దేవాలయాలను అక్కడ ఆటోవారు, టాక్సీవారు ఒక పేకేజ్ కింద చూపిస్తారు.  సమయం ఒక పూట పడుతుంది.  అందులో మొదటిది

కాలభైరవ మందిరం

పరమ శివుని ఆగ్రహంనుంచి పుట్టిన వాడు కాలభైరవుడు.  ఆయన ఒకసారి ఆబధ్ధం చెప్పిన బ్రహ్మదేవుని ఐదవ తలని తన గోటితో తుంచేశాడు.  బ్రహ్మగారిని తల తుంచటంవల్ల కాలభైరవునికి బ్రహ్మ హత్యాదోషం పట్టుకుని, ఆ బ్రహ్మగారి తెగిన తల ఈయన చేతికి అతుక్కుపోయింది.  పాపం ఆయన ఆ తలను వదిలించుకునేందుకు అనేక ప్రయత్నాలు చేసినా లాభం లేకపోయింది.  లోకాలన్ని తిరిగినా పోని పాపం ఆయన కాశీకి రాగానే పోయింది.   చేతికి అతుక్కున్న తల వూడి కిందపడింది.  కాశీ ప్రవేశంతోనే బ్రహ్మ హత్యాది పాపాలుకూడా నశిస్తాయంటారు మరి.

 ఆ భైరవుడిని విశ్వేశ్వరుడు కాశీ నగరాధిపతిగా నియమించాడు.  ఈయనకు చాలా పెద్ద పనులున్నాయి.  కాశీకి వచ్చినవారివి, అక్కడ నివసిస్తున్నవారివీ పాప పుణ్యాల చిట్టాల మైయిన్టెయిన్ చెయ్యటం ఈయన డ్యూటీనే.  వీళ్ళందరి పాపాలనూ కడిగివెయ్యటం కూడా ఈయన డ్యూటీనే.  కాశీలో మరణించినవారికి మరణ సమయంలో సాక్షాత్తూ ఆ విశ్వేశ్వరుడే తారక మంత్రాన్ని ఉపదేశిస్తాడని ప్రతీతి.  మరి సాక్షాత్తూ భగవంతునితో తారక మంత్ర ఉపదేశం పొందాలంటే దానికి అర్హత వుండాలికదా.  కాశీలో మరణించటమే ఆ అర్హత.  వారి పాపాలను పటాపంచలు చేసి తారక మంత్రోపదేశానికి అర్హులైన వారిగా జీవులను తయారు చెయ్యటం కూడా భైరవులంగారు పనే.  మరి మనం చేసిన దుర్మార్గాలకు శిక్షలు అనుభవించాలికదా.  దానికోసం కాల భైరవుడు అతి తక్కువ సమయంలో కఠిన శిక్షలు విధిస్తాడు.  అన్నట్లు యమ ధర్మరాజుకీ, చిత్ర గుప్తుడికీ కాశీలో నివసిస్తున్న వారిపైగానీ, అక్కడ మరణించిన వారిపైగానీ ఎటువంటి అధికారం లేదు.  కానీ అంతకుమించి తక్కువ సమయంలో ఎక్కువ శిక్షలు అనుభవింప చేసే కాలభైరవుడిని దర్శించి సేవించటం మరువకండి.

విశ్వనాధుని ఆలయంనుంచి రెండు కిలో మీటర్ల దూరం లోపే వుంది ఈ ఆలయం.


3 comments:

కొండముది సాయికిరణ్ కుమార్ said...
This comment has been removed by the author.
కొండముది సాయికిరణ్ కుమార్ said...

కాశీ క్షేత్రపాలకుడు కాలభైరవుడు. ఆయన అనుజ్ఞ లేకుండా కాశీ ప్రవేశమే దుర్లభం. అందుకే, కాశీ విశ్వనాధుని దర్శనం కన్నా ముందుగా కాలభైరవ దర్శనం చేసుకోవాలని చెబుతారు. ఎట్టకేలకు, మీ ఇరవయ్యో వ్యాసంలో కాలభైరవుడి మందిరం గురించి ప్రస్తావించారు :)

tejaswi manepalli said...

Sai Kiran garu
we had darshan of Kala Bhairava after Viswanadh's darshan. We don't have any advise or guidance before the visit. That is why I am writing all these things in my blog so that people who visit will have first hand information.
psmlakshmi