Friday, February 18, 2011

అన్నవరాలనిచ్చే అన్నవరం సత్యన్నారాయణ స్వామి

ఆలయ ప్రవేశ ద్వారం
ఆలయంలో సత్యన్నారాయణ స్వామి వ్రతం

రత్నగిరి కింద ఆలయ మహాద్వారం

శ్రీ వీర వెంకట సత్యన్నారాయణస్వామి వెలసిన అన్నవరం క్షేత్రం గురించి తెలియనివారుండరంటే అతిశయోక్తికాదు. అయితే మీకందరికీ ఒక విషయం తెలుసా? ఈ ఆలయంలో పగుళ్ళు రావటం కారణంగా గర్భగుడిలో స్వామి దర్శనం తాత్కాలికంగా నిలిపివేయబడ్డది. ఆలయ పునర్నిర్మాణ కార్యక్రమాలు చురుకుగా సాగటానికి ఈ చర్య తీసుకున్నారు. 4 కోట్ల రూపాయలతో ప్రధాన ఆలయాన్ని పునర్నిర్మించబోతున్నారు. గర్భగుడిలో స్వామిని దర్శిస్తేగానీ యాత్ర చేసినట్లుకాదు అనుకునేవాళ్ళు మీ ప్రయాణం కొంతకాలం వాయిదా వేసుకోండి. మేము కొన్ని సంవత్సరాలక్రితం ఈ స్వామిని దర్శించాం. మొన్న నర్సీపట్నం వెళ్ళినప్పుడు తిరిగి ఈ స్వామి దర్శన భాగ్యం కలిగింది.


మూల విరాట్ కి మామూలుగానే నిత్యపూజలు, నైవేద్యాలు జరుగుతూంటాయి. మరి స్వామి దర్శనార్ధం ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి వచ్చే భక్తుల మాటేమిటంటారా? వారి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఉత్సవ మూర్తులను ధ్వజస్ధంబం దగ్గర ప్రతిష్టించి, నిత్య కార్యక్రమాలు నిర్వర్తిస్తూ, భక్తులకు ఉత్సవమూర్తుల దర్శనం ఏర్పాటు చేస్తున్నారు. ఆలయం వారు భక్తులకోసం చేసిన సూచన మీరూ గమనించండి.ఎటూ అన్నవరం గురించి చెప్పుకుంటున్నాము గనుక, ఈ స్వామి చరిత్ర కొంచెం తెలుసుకుందామా? ఇక్కడ స్వామి మనం అన్న (అంటే కోరిన) వరాలను ఇచ్చేవాడు కనుక ఈ ఊరుకి అన్నవరం అని పేరు వచ్చింది. పావన పంపానదీ తీరాన, రత్నగిరిపై, సముద్రమట్టానికి 300 అడుగుల ఎత్తున వెలసిన క్షేత్రమిది. ఈ రత్నగిరికి ఒక కధ వున్నది. పర్వత రాజయిన మేరువుకి, ఆయన భార్య మేరు దేవికి కలిగిన సంతానం భద్రాచలము, రత్నాచలము, వగైరా. భద్రాచలము శ్రీరామ భక్తుడై ఆ స్వామిని తనపై నిలుపుకుని జగద్విఖ్యాతి చెందాడు. రత్నాచలము కూడా తన సోదరునిలాగానే శ్రీ మహావిష్ణువుకోసం తపస్సుచేసి, ఆయనని మెప్పించి ఆ స్వామి తనపైనే నివసించేటట్లు వరంపొందాడు. రత్నాచలమునకిచ్చిన వరం ప్రకారం ఆ శ్రీ మహావిష్ణువు వీర వెంకట సత్యన్నారాయణమూర్తిగా, దేవేరి అనంతలక్ష్మీ సత్యవతి సమేతంగా అక్కడ కొలువైవున్నాడు. అదెలా జరిగిందంటే…..


క్రీ.శ. 1891లో ఆ ప్రాంతానికి రాజైన శ్రీ రాజా ఇనుగంటి వేంకట రామానారాయణిం బహద్దూరువారి కలలో సత్యదేవుడు కనిపించి నేను రత్నగిరిమీద వెలుస్తున్నాను.. శాస్త్ర ప్రకారం ప్రతిష్టించి పూజించమని చెప్పాడు. ఆ రాజు సంతోషంతో అందరినీ వెంటబెట్టుకుని వెళ్ళి వెతికి, ఒక పొదలో స్వామి విగ్రహాన్ని చూసి అమితానందం చెందారు. కాశీనుండి మహా వైకుంఠ నారాయణ యంత్రాన్ని తెప్పించి 1891, ఆగస్టు 6 వతారీకున ప్రతిష్టించి, ఆ యంత్రంపై స్వామిని దేవేరియైన అనంతలక్ష్మీ సత్యవతీ సమేతంగా ప్రతిష్టించారు. హరి హరులకు బేధం లేదని నిరూపిస్తూ సత్యన్నారాయణ స్వామి ప్రక్కనే ఈశ్వరుడుకూడా పూజలందుకుంటూంటాడు.


ఆలయ నిర్మాణం 1934 లో జరిగింది. ఆలయ నిర్మాణం రెండు అంతస్తులలో జరిగింది. క్రింది భాగంలో నారాయణ యంత్రం, పై అంతస్తులో దేవతా మూర్తులు. ప్రధాన ఆలయం రధాకారంలో నాలుగువైపులా చక్రాలతో నిర్మింపబడింది. స్వామి విగ్రహం 4 మీటర్ల ఎత్తుంటుంది. ఈ స్వామిని మూలం బ్రహ్మ, మధ్య భాగం ఈశ్వరుడు, పై భాగం మహ విష్ణువుగా, త్రిమూర్తి స్వరూపంగా కొలుస్తారు.


ఆంధ్రులు అన్ని శుభకార్యాల్లో కొలిచే దేవుడు శ్రీ సత్యన్నారాయణ స్వామి. ఆయన వ్రతం ఏదో ఒక సందర్భంలో చెయ్యనివారు అరుదేమో. మరి సాక్షాత్తూ ఆ స్వామి సన్నిధిలోనే ఆయన వ్రతం చేసుకోవటంకన్నా భాగ్యమేముంటుంది. ఆలయంలో స్వామివారి వ్రతానికి 200 రూ. నుంచి రూ. 1116 దాకా వివిధ రకాల రుసుం వసూలు చేస్తారు


క్షేత్రపాలకుడు శ్రీ రామచంద్రమూర్తి ఆలయం, వనదుర్గ ఆలయాలుకూడా రత్నగిరి మీద భక్తులు దర్శించవచ్చు.


విజయవాడ – విశాఖపట్నం రైలు మార్గంలోవున్న అన్నవరానికి వివిధ ప్రాంతాలనుంచి రైలు, రోడ్డు రవాణా సౌకర్యాలున్నాయి. కొండపైదాకా వాహనాలు వెళ్తాయి. నడిచి వెళ్ళాలనుకునేవాళ్ళకి మెట్ల మార్గం వున్నది. కొండపైనే వసతికి, భోజనానికి వివిధ రకాల సదుపాయాలున్నాయి. కొండపైనుంచి చూస్తే పంపానది సుందర దృశ్యాలు కనువిందు చేస్తాయి.

త్వరలో ఆలయ మరమ్మత్తులు పూర్తయి స్వామి దర్శనం అందరికీ లభిస్తుందని కోరుకుందాము.

0 comments: