Thursday, February 24, 2011

స్వామి మలైతమిళనాడులోని కుంభకోణం తాలూకా, తంజావూరు జిల్లాలో వున్న ఈ వూరుఅనేక విధాల పేరు ప్రఖ్యాతులు చెందింది. తమిళనాడులో సుబ్రహ్మణ్యస్వామికి వున్న ఆరు ముఖ్య క్షేత్రాలలో ఇది నాలుగవది. ఇంకొక విశేషమేమిటింటే సాక్షాత్తూ పరమశివుడు తన కుమారుని తెలివితేటలకు మురిసిపోయి పుత్రోత్సాహం బడసిన స్ధలమిది. సుబ్రహ్మణ్యేశ్వరుడు తన తండ్రిని శిష్యునిగా చేసుకుని తను గురువుగా ప్రణవ స్వరూపమైన ఓంకారానికి అర్ధంచెప్పిన పవిత్ర ప్రదేశమిది. ఇంత అద్వితీయమైన ప్రదేశం గురించి మనమిప్పుడు తెలుసుకుందామా మరి.

ఒకసారి సృష్టికర్త అయిన బ్రహ్మగారు కైలాసానికి బయలుదేరారు. ఆయనకి దోవలో కుమారస్వామి కనబడ్డాడు. కనబడ్డవాడు వూరుకున్నాడా. ప్రణవ మంత్రమైన ఓంకారానికి అర్ధం చెప్పమని బ్రహ్మగారిని అడిగాడు కుమారస్వామి. పాపం దేవతలకి కూడా ఎవరి డిపార్టుమెంటు వారిదేనేమో బ్రహ్మగారు చెప్పలేకపోయారు. ఇంకేముంది కుమారస్వామి ఆయనని బందీ చేశాడు. సృష్టికర్త బందీ అయ్యేసరికి సృష్టి ఆగిపోయింది. దేవతలందరూ శివుని దగ్గరకెళ్ళి పరిస్ధితి వివరించారు.

అందరూ కలసి కుమారస్వామి దగ్గరకు వచ్చి బ్రహ్మ దేవుణ్ణి విడిచి పెట్టమని అడిగారు. అందుకు కుమారస్వామి ఆయన ప్రణవ మంత్రమైన ఓంకారానికి అర్ధం అడిగితే చెప్పలేదు. అందుకే బందీ చేశాను అన్నాడు తన తప్పేమి లేదన్నట్లు. అప్పడు శివుడు కుమారస్వామిని అడిగాడు..సరే ఆయనకి తెలియదని బందీని చేశావు. మరి నీకు తెలుసా దానర్ధం..అయితే చెప్పు అన్నాడు. కుమారస్వామి ఘటికుడు. అంత తేలిగ్గా చెప్తాడా. నాకు తెలుసు. నేను చెప్తాను. అయితే నేను ప్రణవ మంత్రార్ధాన్ని బోధిస్తున్నాను గనుక నేను గురువుని, నువ్వు అత్యంత భక్తి శ్రధ్ధలు గల శిష్యునిగా వింటానంటే చెప్తానన్నాడు. ఇంకేముంది. కుమారుడు గురువైనాడు. తండ్రి అత్యంత భక్తి శ్రధ్ధలతో కుమారుడు ఉపదేశించిన ప్రణవ మంత్రార్ధాన్ని విని పులకరించిపోయాడు.

పరమ శివుడు జగత్తుకే స్వామి. ఆ స్వామికే గురువై, నాధుడై ఉపదేశించాడు గనుక ఇక్కడ కుమారస్వామికి స్వామి నాధుడనే పేరు వచ్చింది. ఈ స్ధలానికి స్వామి మలై అనే పేరు.

అతి పురాతనమైన ఈ ఆలయాన్ని కార్తవీర్యార్జునుడు కట్టించాడు. గర్భ గుడి బయట హాల్లో ఈయన విగ్రహాన్ని చూడవచ్చు.

యీ చిన్ని కొండ పైకి ఎక్కాలంటే విశాలమైన 60 రాతి మెట్లు ఎక్కాలి. ఈ అరవై మెట్లూ అరవై తమిళ సంవత్సారాలకి ప్రతీకలనీ, ఆ సంవత్సరాధిదేవతలు ఈ రూపంగా స్వామిని సేవిస్తున్నారనీ

అంటారు. ప్రతి మెట్టు దగ్గర గోడమీద ఆ సంవత్సరం పేరు వ్రాసి వుంటుంది తమిళంలో. ఈ మెట్ల దోవ మధ్యలో, 32 మెట్లు ఎక్కగానే కుడివైపుకు చూడండి. కుమారస్వామి తన తండ్రికి ఉపదేశం ఇస్తున్న అద్భుత శిల్పం కనబడుతుంది.

గుడి క్రింది భాగంలో శివుడు పార్వతుల మంటపాలు వున్నాయి. వీరి పేర్లు మీనాక్షీ సుందరేశ్వర్, మీనాక్షి. పాండ్య రాజైన వరగుణుడు ఒకసారి మధుర నుంచి పుణ్యక్షేత్రమైన తిరువిదైమరుదూర్ కు వెళ్తూ ఈ ఆలయంలో ఒక రాత్రి గడిపాడుట. ఆయన కుల దైవమైన మీనాక్షీ సుందరేశ్వరుని ఆరాధించటానికి ఈ మంటపాలనేర్పరచాడు. తర్వాత కీ.శే. అరుణాచల చెట్టియార్ ఇక్కడ రాతి కట్టడాలు కట్టించాడు.

ధ్వజ స్ధంబం దగ్గర వున్న వినాయకుడిగుడి కూడా చాలా మహిమ కలది. ఇక్కడ కుమార తరై, నేత్ర పుష్కరిణి అనే రెండు పుష్కరిణులు వున్నాయి. కొంగు ప్రాంతంనుంచి వచ్చిన పుట్టుగుడ్డి అయిన ఒక భక్తుడు ఈ రెండు పుష్కరిణులలో స్నానం చేసి స్వామి సన్నిధానానికి వస్తుంటే ఈ వినాయకుడి గుడి దగ్గరకు వచ్చేసరికి ఆయనకి కన్నులు కనిపించాయట. అందుకే ఈ వినాయకుణ్ణి నేత్ర వినాయగర్ అంటారు.

పురాణాల కధనం ప్రకారం ఈ దేవుని సన్నిధానానికి వచ్చి నిశ్చల భక్తితో ఈ స్వామిని కొలిచే వారు చేసిన పాపాలన్నీ సూర్యుని ముందు పొగమంచులాగా కరిగి పోతాయంటారు. ఈ దేవాలయంలో వివాహం చేసుకున్నవారికి సత్ప్రవర్తన, సత్సంతానం కలుగుతాయంటారు.

రోజూ అసంఖ్యాక భక్తులు ఈ స్వామి దర్శనార్ధం వస్తూంటారు. ఈస్వామి భక్తులు భారత దేశంలోనే కాక అనేక ఇతర దేశాలలో కూడా వున్నారు. భక్తులు తమ కోర్కెలు తీరిన తర్వాత స్వామికి అనేక ముడుపులు పాల కావడి, పూల కావడి వగైరాలు సమర్పిస్తారు.

మీరు సాయం సమయంలో కనుక వెళ్ళిసట్లయితే 5-45 ప్రాంతంలో స్వామికి అభిషేకం చేస్తారు. పసుపు అభిషేకం చేసిన తర్వాత స్వామి కన్నులు, ముక్కు, నోరు, తుడుస్తారు. అప్పుడు స్వామి సౌందర్యం వర్ణించటానికి మాటలు చాలవు.

కుంభకోణంనుంచి 3040 ని. ల్లో తేలిగ్గా బస్సులో వెళ్ళవచ్చు స్వామిమలైకి. నేలనుంచి షుమారు 60 అడుగుల ఎత్తున వున్న ఈ ఆలయం ప్రకృతి సౌందర్యం మధ్య కనువిందు చేస్తూ వుంటుంది.2 comments:

rajachandra said...

nenu chudalanukune pradeshalalo idi kuda okati andi... subramanyudu 6 pradeshalanu chudalani anukuntunnanu.. nenu mi taravahalone blog start chesanu andi..

http://rajachandraphotos.blogspot.in/

psm.lakshmi said...

thank you raja chandragaru. I am seeing your blog. nice photos. I thought several times that you are taking lot of interest in giving informatiohn to people just like me.

psmlakshmi