Sunday, August 2, 2009

అమెరికాలో నేను గుర్తింపబడ్డానోచ్

1-8-2009 సమయం సాయంకాలం 6-45. నోవై టౌన్ సెంటర్ సినిమా హాల్ లో మగధీర సినిమా చూద్దామని మా కుటుంబం, పిల్లల స్మేహితులతో వెళ్ళాము. అక్కడ జరిగిందండీ ఒక అద్భుతం.

దేశంకాని దేశంలో, ఇంత పెద్ద అమెరికాలో నన్ను గుర్తుపట్టి పలకరించాడొకతను. నిజంగా అద్భుతంకదూ. ఎలాగెలాగు ఏంటా కధ అంటారా? ఆ సంతోషం మీతో పంచుకోవాలనే వెంటనే పోస్ట్ రాస్తున్నా.

మేము కూర్చున్న సీట్లు మా పిల్లలకు నచ్చక ముందుకు వెళ్ళారు. నేను కూడా లేచి వెళ్దామనుకుంటుండగా ఒకతను చివరి సీట్లోంచి లేచి వచ్చి ఇక్కడ ఎవరన్నా వున్నారాండీ అని అడిగి, లేరంటే కూర్చున్నాడు. కూర్చున్నవాడు కూర్చున్నాడా మీరు బ్లాగు రాస్తారు కదా నేను మీ బ్లాగు ఫాలో అవుతాను అన్నాడు. మిమ్మల్ని చూసి గుర్తు పట్టాను. అందుకే వచ్చి పలకరిస్తున్నాను అన్నాడు. ఆ సమయంలో మీరైతే ఏం చేసేవారండీ? సీటెక్కి డాన్స్ చేసేవాళ్ళమంటారా. సరిగ్గా నాకూ అలాగే అనిపించిదండీ. కానీ నేనలా చేస్తే ఆ అబ్బాయి పొరపాటునకూడా మళ్ళీ ఎవర్నీ పలకరించడేమో మీరందరూ ఇలాంటి ఛాన్సులు మిస్సవుతారని మీకోసం ఆ అవకాశాన్ని త్యాగం చేశాను. కానీ నా సంతోషాన్ని చెప్పకుండా ఆగలేకపోయాను.

అతని పేరు వినోద్. ఊరు అనంతపురం. హైదరాబాదులో వుంటారుట. ప్రస్తుతం ఇక్కడ ఉద్యోగం, ట్రాయ్ లో నివాసం. నా బ్లాగు బాగుంటుందని చెప్పాడు. రెగ్యులర్ గా చూస్తానన్నాడు.. నా బ్లాగు బాగుంటుందన్నందుకు కాదండీ అసలు సంతోషం. దేశం కాని దేశంలో బ్లాగులో ఫోటో చూసి మనిషిని గుర్తు పట్టి పలకరించారుకదా. అందుకు ఆ సంబరం.

నా సంతోషాన్ని నేను అతనితోనే చెప్పేశాను. దేశం కాని దేశంలో నన్ను గుర్తుపట్టి పలకరించారంటే నాకు చాలా సంతోషంగా వుందండీ. నిజంగా ఇది బ్లాగులో రాయాల్సిన విషయం అన్నాను. ఆ సంబరంలో అతనితో ఇంకేమీ ఎక్కువ మాట్లాడలేక వెళ్ళి మావాళ్ళ దగ్గర కూర్చున్నాను.

వినోద్ గారూ, సినిమా హాల్ లో వెలుతురు సరిగ్గా లేక పోవటంవల్ల మిమ్మల్ని సరిగ్గా చూడలేదు. అంటే మీరు మళ్ళీ ఎక్కడన్నా కనిపించినా విష్ చెయ్యకపోతే ఏమనుకోకండి. అయినా ఈ సంతోషం మాత్రం నేనున్నంతకాలం వుంటుంది. మీరూ రాస్తూంటారా అని అడిగానో లేదో కూడా గుర్తులేదు. మీ బ్లాగు పేరివ్వండి.

హలో..మీక్కూడా ఇలాంటి అనుభూతులు పొందాలని వుందా? అయితే వెంటనే మీ బ్లాగులో మీ ఫోటోలు పెట్టేసుకోండి. నేనేమనుకున్నానో తెలుసా నా ఫోటో వున్నది తీసేసి ఇంకా స్పష్టంగా కనిపించే పాస్ పోర్టు సైజు ఫోటో పెడితే బాగుంటుందేమో! ఎవరైనా సరిగ్గా పోల్చుకోలేక పలకరించటం మానేస్తే!!?

ఒక చిన్న పలకరింపు ఎంత సంతోషాన్నిస్తుందో కదా. మరి అందరం ఎప్పుడూ ఇలా ఆత్మీయంగా పలకరించుకుంటే!!

5 comments:

జ్యోతి said...

మీ సంతోషం అర్ధమైంది. దేశం కాని దేశంలో బ్లాగు ద్వారా గుర్తుపట్టి పలకరించడం చాలా ఆనందదాయకం. మీ పోటో కాస్త పెద్దది పెట్టండి.. :)

Sujata said...

కంగ్రాట్స్ లక్ష్మి గారు - అయితే మీరు స్టార్ బ్లాగర్ అయిపోయారన్నమాట ! ఆటోగ్రాఫ్ ప్లీస్ ! :D

మాలా కుమార్ said...

వావ్ నాకే చాలా త్రిల్లింగా వుంది. కంగ్రాట్స్
హాపీ ఫ్రెండ్షిప్ డే

పరిమళం said...

"ఒక చిన్న పలకరింపు ఎంత సంతోషాన్నిస్తుందో "
అవును కదా ! అభినందనలండీ

psmlakshmiblogspotcom said...

జ్యోతీ
అదే ఆలోచిస్తున్నా. ఎంచక్కా అందరికీ ఒక 7 అడుగుల స్క్రీన్ వున్న కంప్యూటర్లుంటే ఎంత బాగుంటుంది. అందరూ అందర్నీ గుర్తుపట్టి పలకరించేసుకోవచ్చుకదా. అంత పెద్ద సైజు ఫోటో కంప్యూటర్లో కనిపించాలంటే. రీసెర్చ్ మొదలు పెట్టేశా. నిన్నటినుంచీ నాకదే ఆలోచన.
సుజాతా, మాలా, పరిమళా, నా సంతోషాన్ని పంచుకున్న మీకందరికూ స్నేహ పరిమళాలు గుబాళించే శుభాకాంక్షలు.
psmlakshmi