గుంటూరు జిల్లాలోని తెనాలి మా ఊరు. మా ఆఫీసులో చేరిన కొత్తల్లో నా ధైర్యాన్ని చూసి ఏ ఊరి అమ్మాయి అని కూపీ లాగారు కొందరు. తెనాలి అమ్మాయి జాగ్రత్త అని సమాధానం విన్నారుట వాళ్ళు. ఆ సంగతి నా దాకా వచ్చినప్పుడనుకున్నాను...మా తెనాలికి ఇంత ఖ్యాతి వుందా...ఆ ఊరినుంచి వచ్చిన అమ్మాయిలంటేనే జాగ్రత్తగా వుంటున్నారే...శభాష్ తెనాలీ అనుకున్నా ఆ రోజు. రెండు రోజుల క్రితం మైల్ లో శ్రీ అనిల్ అట్లూరిగారు తెనాలి గురించి ప్రముఖ రచయిత్రి ఓల్గాగారు వ్రాసిన వ్యాసం ఆంధ్రజ్యోతి దినపత్రిక 16-2-2010 నవ్య అనుబంధంలో ప్రచురించబడినదాని లింకు పంపితే చదివాను. ఎంత గొప్పదో మా తెనాలి అనుకున్నాను మళ్ళీ.
http://bit.ly/Tenali_Sutasramam
1963-64 ల్లో తెనాలిని వదిలి హైదరాబాద్ వచ్చేశాను. ఈ 46 ఏళ్ళల్లో హైదరాబాదుతో అనుబంధాలు పెనవేసుకుపోయి ఇదే మా ఊరు అనుకున్నా, చిన్నతనాన్నీ, పెరిగిన ఊరునీ మర్చిపోలేముకదా. ప్రస్తుతం తెనాలిలో దగ్గరవారెవరూ లేక పోయినా చిన్ననాటి ఆ ప్రదేశం ఎలా వున్నదోనని ఈ మధ్య వెళ్ళి చూసి వచ్చాము. ఎంత మార్పో. గుర్తుపట్టలేనంత మార్పు.
బయటనుంచీ చూస్తే నేను చదివిన తాలూకా హైస్కూలు చిన్నదయిపోయినట్టు కనిపించింది. కొత్త కట్టడాలవల్ల అనుకుంటాను. దేవీ చౌక్ లోని దేవీ గుడి అలాగే వున్నది. దేవీ నవ రాత్రులు ఎంత వైభవంగా జరిగేవో ఇక్కడ. మేము అక్కడ వున్న కొన్నేళ్ళు సందడంతా మాదే. అలాగే స్వరాజ్ టాకీస్ కి కొంచెం అవతలగా ఆంజనేయ స్వామి దేవాలయం. శ్రీ రామ నవమికి 9 రోజులు చాలా పెద్ద ఎత్తున ఉత్సవాలు జరిగేవి అక్కడ.
రామలింగేశ్వరపేటలోని శ్రీ దుర్గా పార్వతీ సమేత శ్రీ రామలింగేశ్వరస్వామి దేవాలయం...మేము వున్నప్పుడు చాలా పాతగా వుండేది. 1911లో ప్రతిష్టింపబడిన ఈ దేవ దేవునికి 76 సంవత్సరాలు వార్షిక కళ్యాణ మహోత్సవాలు జరగలేదు. 1987 జూన్ నెలలో శ్రీ పినపాటి వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రిగారిచే ఆగమ శాస్త్ర సంప్రదాయం ప్రకారం సంప్రోక్షణ కార్యక్రమాలు జరిగాయి. 1988 లో విమాన గోపుర నిర్మాణం జరిగింది. ఈ దేవాలయం ఇప్పుడు కొత్త రంగులతో తళుకులీనుతోంది.
ఇక్కడే మేమున్న ఇంటికి ఎదురుగూ శ్రీ ములుకుట్ల సదాశివ శాస్త్రిగారిల్లు వుండేది. ఆయన చాలా ప్రసిధ్ధికెక్కిన హరికధా భాగవతార్, కర్ణాటక సంగీత విద్వాంసులు.
నాకు తెలియకుండానే అనేక సార్లు తన గుడికి రప్పించుకున్న సాయిబాబా మందిరం...స్వరాజ్ టాకీస్ దగ్గరవుంది. మేమున్నప్పుడు బాబా గర్భ గుడి ముందు విశాలమైన మండపంలాగా వుండేది. సాయంకాలాలు అక్కడ పురాణ కాలక్షేపాలు జరుగుతూ వుండేవి. ఇప్పుడు అక్కడ ధుని, బాబా ఫోటోలు వున్నాయి. మేము వెళ్ళేసరికి మధ్యాహ్న హారతి జరుగుతోంది. ఆ వీధిలో మేమున్న ఇల్లు గుర్తుపట్టలేకపోయాను.
అలాగే వైకుంఠపురం...మే మక్కడవుండగా దేవేరులతో సహా శ్రీ వేంకటేశ్వరస్వామి విగ్రహం కొంచెం ఎత్తయిన ప్రదేశంలో పడుకోబెట్టినట్లు వుండేవి. పూజలు జరుగుతూ వుండేవీ. భక్తులు వస్తూండేవారు. ఇప్పుడో చక్కని ఆలయం నిర్మింపబడింది. అనేక ఉపాలయాలు. దైవ దర్శనమే కాకుండా శుభ కార్యాలు గూడా దైవ సమక్షంలో చేసుకుంటున్న భక్తులు... చాలా కోలాహలంగా వుంది.
ఆలయాలు, ఊరు ఎంతో అభివృధ్ధి చెందాయి. కానీ ఎందుకో అవ్వన్నీ మేమున్న సమయంలోనే బాగున్నాయనిపించింది. బహుశా ఆ పరిసరాలు అప్పుడు మాకు పంచి ఇచ్చిన ఆత్మీయతవల్ల అనుకుంటా.
శ్రీ సాయిబాబా దేవాలయం (స్వరాజ్ టాకీస్ దగ్గర)
శ్రీ సాయిబాబా
వైకుంఠపురం
.