Friday, February 12, 2010

మేము చూసిన రెండు కోటిలింగ శివ క్షేత్రాలు




మీరు చదివింది కరెక్టేనండీ.  మన దేశంలో కోటి శివ లింగాలు స్ధాపించాలనే ఉద్దేశ్యంతో రెండు క్షేత్రాలలో మూల విరాట్టులను నెలకొల్పి లింగ ప్రతిష్టలు కొనసాగిస్తున్నారు.  ఆ రెండు క్షేత్రాలనూ చూసే అవకాశం, అదృష్టం మాకు కలిగింది.  మహా శివరాత్రి సందర్భంగా మీ కోసం ఆ వివరాలు.

ఈ రెండు క్షేత్రాలలో ఒకటి మనకి 200 కి. మీటర్ల దూరాన వున్న కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలంలోని ముక్త్యాలలో 54 ఎకరాల సువిశాల ప్రదేశంలో కంచికచర్ల వాస్తవ్యులు శ్రీ గద్దె ప్రసాద్, పావని దంపతుల సంకల్పంతో మొదలయినది.

ఆంధ్ర ప్రదేశ్ లో కృష్ణా జిల్లా జగ్గయ్యపేటకి 10 కి.మీ. ల దూరంలో ముక్త్యాల గ్రామంలో   కోటి శివలింగ క్షేత్రాన్ని నెలకొల్పుతున్నారు.  జగ్గయ్యపేట నుంచి బస్సు, ఆటోల సౌకర్యం వున్నది.  (దీనిగురించి జులై 2008లో ఒక పోస్టు రాశాను.  కార్తీక మాసంలో మేమక్కడ వెలిగించిన దీపాల గురించి కూడా అంతరంగ తరంగాలు లో కార్తీక దీపాలు పేరుతో ఒక పోస్టు రాశాను.)  ముఖ్యదైవం శ్రీ పంచముఖ లింగేశ్వరుడితోబాటు ఉపాలయాలుకూడా పూర్తయి నిత్య పూజలు జరుగుతున్నాయి.  108 దేవతలకు ఉపాలయాలు వున్నాయి.  శివలింగ ప్రతిష్టలుకూడా చాలాకాలం క్రితమే వేలల్లో జరిగాయి.  ఇప్పుడా సంఖ్య చాలా పెరిగి వుండవచ్చు.  చాలా అభివృధ్ధి జరిగి వుండవచ్చు. 

ముక్త్యాల లో (ఆంధ్ర ప్రదేశ్) లింగాలకు పానువట్టాలు లేవు.  లింగాలు ఎత్తైన అరుగు మీద కదలకుండా స్ధాపించారు.   
 ప్లాను
దూరంనుంచి ఆలయ సమూహం              
పంచముఖ అమృత లింగేశ్వరస్వామి
 
శ్రీ కామాక్షీ అమ్మవారు
 కార్తీక దీపాలు


 రెండవది కర్ణాటక రాష్ట్రంలోని కోలారు జిల్లాలో, బంగారుపేట తాలూక, కమ్మసంద్రంలో  శ్రీ సాంబ శివ మూర్తి అను శివ భక్తుని సంకల్పంతో ప్రారంభమయినది.

శ్రీ కోటి లింగేశ్వరస్వామి దేవస్ధానము, కమ్మసంద్రం, కె.జి.ఎఫ్., కర్ణాటక

కర్ణాటకలోని బంగారుపేట తాలూక, కోలారు జిల్లాలో కమ్మసంద్రంలో వున్నది ఈ దేవాలయం.  శ్రీ సాంబ శివ మూర్తి అను శివ భక్తుడు, ఇక్కడ కోటి శివలింగాలు ప్రతిష్టింప చేయాలనే సంకల్పంతో  ప్రారంభించారు.   1980, అక్టోబర్, విజయ దశమి రోజున  శ్రీ మంజునాధస్వామి ప్రధాన లింగాన్ని ప్రతిష్టించారు.  ఈ క్షేత్రంలో తూర్పు, పశ్చిమ దిశలందు శివుని అష్టోత్తర నామాలతో 108 చిన్న మంటపాలలో శివ లింగములు ప్రతిష్టించబడినాయి.  ఆవరణ అంతా ఎటు చూసినా శివలింగాలే.
వీటన్నింటి నడుమా 108 అడుగుల ఎత్తయిన శివ లింగం, లింగానికి ఎదురుగా 35 అడుగుల ఎత్తయిన నంది చూపరులను ఆకర్షిస్తాయి.   కమ్మసంద్రంలో (కర్ణాటక) ప్రతిష్ట చేసిన చాలా లింగాలు పైకి కనబడటానికి పానువట్టంతో సహా అక్కడ పెట్టినట్లున్నాయి.

లక్ష్మీ విష్ణు, శ్రీ వెంకటేశ్వరస్వామి, మొదలగు అనేక దేవతామూర్తులకే కాక సరస్వతీ సమేత బ్రహ్మకు కూడా ఇక్కడ ఉపాలయాలు వున్నాయి.  అన్ని ప్రధాన దేవతా మూర్తులనూ పుష్పాలతో చాలా అందంగా అలంకరించారు.

పూర్వం ఈ ప్రదేశంలో వాల్మీకి ఆశ్రమం వుండేదని, లవ కుశుల జన్మ ప్రదేశమిదేనని, కధనం.

మధ్యాహ్నం 12 గంటలనుంచి 2 గంటల దాకా ఆలయం తరఫున ఉచిత భోజన ఏర్పాటువున్నది.  భోజనం చేసినవారు వారి ఇష్టప్రకారం అన్నదానానికి విరాళం ఇవ్వవచ్చు.

మేము చిత్తూరునుంచి  కుప్పం వెళ్ళే బస్ లో వి. కోట (వెంకటగిరి కోట) దాకా ఎ.పి.యస్.ఆర్.టి.సీ వారి బస్ లో, అక్కడనుంచీ కె.జీ.ఎఫ్. వెళ్ళే కర్ణాటక బస్ లో ఈ ప్రదేశాన్ని చేరుకున్నాం.  బస్ సౌకర్యం బాగా వుంది.  మేము చిత్తూరునుంచీ ఉదయం 9 గంటలకు బయల్దేరి ఆ క్షేత్రాన్ని దర్శించి తిరిగి సాయంకాలం 5 గంటలకల్లా చిత్తూరు చేరాము.

ఎంతో వ్యయ ప్రయాసలకోర్చి నెలకొల్పుతున్న ఈ క్షేత్ర దర్శనానికి భక్తులు విశేషంగా వస్తున్నారు.  అయితే మమ్మల్మి బాధపెట్టిన అంశమొకటి.  కొన్ని అష్టోత్తర శివ లింగాల మండపాలు ఊడ్చే చీపుళ్ళు, గోతాలు భద్ర పరిచే ప్రదేశాలయినాయి. అలాగే కింద ఊడ్చిన చీపురుతో శివ లింగాలమీద పూలు, పత్రి  ఊడుస్తున్నారు.  ఇది చూసి బాధవేసి ఆఫీసులో ఆ సమయానికి వున్న ఒక ఉద్యోగినితో చెప్పి వచ్చాము భక్తులకి బాధగా వుంటుంది, వీటిని సవరించమని.
 
  

 
 




2 comments:

భావన said...

చాలా బాగుందండి. ఇన్ని మంచి ప్రదేశాలు చూపుతున్నందుకు ధన్య వాదాలు. మహా శివ రాత్రి శుభాకాంక్షలు.

Maitri said...

లక్ష్మిగారూ నేను మీ బ్లోగ్‌ని మొదటిసారి చూసేను. ఇన్నాళ్ళూ మీరేదో computer savvy అయిన యువతిగానే భావించేను గానీ ఇప్పుడు మీ బ్లోగ్‌ని చూస్తే ( ఇంకా మీ ఫోటోలని చూస్తే) అమ్మో! మీరూ మీవారూ ఉన్న ఫోటోలన్నీ పార్వతీ పరమేశ్వరులలా ఉన్నాయి. నిజంగా చెప్తున్నాను. అబద్ధాలు కాదు సుమండీ. జోహార్లు. నా తెలుగు కనుక మీకర్థమైతే అర్థం చేసుకోగలరు. నిజంగా హేట్స్ ఓఫ్. ఇంతకీ మీమీద అర్థం పర్థం లేని వ్యాఖ్యానాలు రాసినవారెవరో కానీ అసూయపడి ఉంటారు. దాన్ని నేను చూడలేదనుకోండి , మీరు తొలిగించేరేమో నాకు తెలియదు. కానీ ఇలాంటివారు ఉంటూనే ఉంటారు. పట్టించుకోకండి. ఎలా ఉన్నారో అలాగే సాగండి. ఇలాగే మీ యాత్రలనన్నీ కొనసాగించి మా అందరికీ తెలుపుతారని ఆశిస్తాను. శుభాభివందనలు. మీకు ఈ వయస్సులో ఉన్న ఉత్సాహానికి మరియు చురుకుతనానికి గల చిట్కా ఏమిటి సుమా! చెప్పరూ?
క్రిష్ణవేణి.