దక్షిణ భారత దేశంలో, తమిళనాడులోని వెల్లూరు దగ్గర తిరుమలైకొడి అనే వూర్లో 3-1-1976న జన్మించిన శ్రీ శక్తి అమ్మ అనే బాలుడు, 1992లో, తన 16వ ఏటనే స్ధాపించిన పీఠం పేరు శ్రీ నారాయణి పీఠం. సమాజంలో శాంతి స్ధాపనకోసం, పేద ప్రజల జీవన సరళి మెరుగు దిద్దే వుద్దేశ్యంతో అనేక రంగాలలో సేవా కార్యక్రమాలు ప్రారంభించారు. విద్య, ఆరోగ్యం, ప్రకృతి పరిరక్షణ, గ్రామీణ ప్రజలకు ఉపాధి కల్పన, వేస్ట్ మేనేజ్మెంట్, ఇలా ఎన్నో రంగాలలో, ముఖ్యంగా గ్రామిణ ప్రజల అభివృధ్ధికోసం ఎన్నో కార్యక్రమాలు జయప్రదంగా నిర్వహిస్తున్నారు.
మనిషి తన తోటివారికి సహాయపడటం ద్వారా సంతోషాన్ని పెంచగలడు. తన స్వార్ధాన్ని అధిగమించి ఈ ప్రపంచాన్ని అత్యుత్తమమైన ప్రదేశంగా తీర్చిదిద్దే శక్తి మనిషికి వుంది. కానీ మనిషి సాధారణంగా మానవ జీవిత విలువల్ని గ్రహించక స్వార్ధ చింతనలో పడిపోతున్నాడు. మనిషి తనలోని దైవత్వాన్ని గుర్తించటానికి ప్రేరణ కావాలనే వుద్దేశ్యంతో శ్రీపురంలోని శ్రీ లక్ష్మీ నారాయణి బంగారు దేవాలయం నెలకొల్పబడింది.
100 ఎకరాల సువిశాలమైన ఈ ప్రదేశం ప్రకృతి సౌందర్యానికి ఆలవాలం. ప్రకృతినుంచి అపార శక్తిని విలీనం చేసుకునేందుకు వీలుగా నక్షత్రం ఆకారంలో నిర్మించబడిన మార్గంగుండా వెళ్తే శ్రీ లక్ష్మీ నారాయణి బంగారు దేవాలయానికి చేరవచ్చు. వివరాలు తెలియకుండా వెళ్ళిన వాళ్ళకి మనం నక్షత్ర ఆకార మార్గంలో వెళ్తున్నామని తెలియదు. అసలు ఎంత దూరం నడిచామోకూడా తెలియదు. ఎండాకాలం, వానాకాలం, ఏ కాలంలోనైనా ఆ మార్గం యాత్రీకుల సేద తీరుస్తూనే వుంటుంది. చక్కటి గాలి, కనుల విందు చేసే ప్రకృతి సౌందర్యం, హిందీ, తెలుగు, తమిళ. ఇంగ్లీషు భాషల్లో చక్కని సూక్తులు రాసిన బోర్డులు, కొంత దూరం వెళ్ళిన తర్వాత కనుల విందు చేసే బంగారు ఆలయ దృశ్యం, అందమైన అనుభవం. దోవ పొడుగూతా పూజా ద్రవ్యాలు, కేసెట్స్, పుస్తకాలు వగైరా విక్రయించే దుకాణాలు – సంస్ధవారివే – యాత్రీకులకు సకల సౌకర్యాలు – అన్నీ పరి శుభ్రంగా, అందుబాటులో వున్నాయి.
ఆలయం చట్టూ వున్న కోనేరు పేరు సర్వ తీర్ధం. భారత దేశంలోని అనేక ప్రసిధ్ధ నదుల పవిత్ర జలాలు ఈ కొలనులో కలిపారు. అందుకే దానికాపేరు.
ఈ ఆలయానికి బంగారు రేకు తాపడం చెయ్యటానికి 1 . 5 టన్నుకన్నా ఎక్కువ బంగారాన్ని వినియోగించారు.
బంగారు ఆలయం కనుక విద్యుద్దీపాల కాంతిలో అత్యద్భుతంగా కనబడుతుంది. మేము మధ్యాహ్నంపూట వెళ్ళాం. సూర్యకాంతి బంగారు ఆలయం మీదపడి అందంగా మెరిసింది.
ఈ దేవాలయంలోనికి ఏ విధమైన ఎలక్ట్రానిక్ వస్తువులను తీసుకు వెళ్ళనివ్వరు. సెల్ ఫోన్స్, కెమేరాలు అన్నీ అక్కడ వున్న కౌంటర్లో డిపాజిట్ చెయ్యవలసిందే. ఎవరి వస్తువులు వారికి విడివిడిగా ప్లాస్టిక్ కవర్లల్లో పెట్టి భద్రంగా తిరిగి అందజేస్తారు. అంత అందమైన ప్రదేశాల్ని ఫోటోలు తీసుకోలేక పోయామనే బాధ అందరికీ వుండి వుంటుంది. నేనిచ్చిన ఫోటోలు వారి మేగజైన్ నుంచి తీసినవి.
అంత విశాలమైన ప్రదేశంలో ఎటు వెళ్ళాలా అని ఎవర్నీ అడగక్కరలేదు. మనం ప్రవేశించిన మార్గాన్ననుసరిస్తే చాలు...దేవాలయంలో కనీసం మూడు గంటలన్నా గడప గలిగితేనే బయల్దేరండి. ఆ మార్గంగుండా వెళ్ళి దైవ దర్శనం చేసుకోవటానికి పట్టే కనీస సమయం అది.
ఉచిత దర్శనంతోపాటు 250 రూ., 600 రూ., వెయ్యి రూపాయల టికెట్లు కూడా వున్నాయి దర్శనానికి. వారికీ వీరికీ క్యూలు ఆలయం దగ్గర వేరే వుంటాయి. ఉచిత దర్శనంవాళ్ళు అమ్మవారి దర్శనం చేసుకుంటూ వెళ్ళాలి. అదే టికెట్ కొన్నవారిని అమ్మవారిముంది కూర్చోపెట్టి హారతి ఇస్తారు. ఇందులోకూడా ఎక్కువ ధరతో టికెట్ కొన్నవాళ్ళుముందు, మిగతావారు వారి వెనక తప్పితే వేరే తేడాలు లేవు. మిగతా అన్నిచోట్లా అందరూ ఒకటే.
గోల్టెన్ టెంపుల్ కి వెల్లూరు కొత్త బస్టాండునుంచి విరివిగా బస్సులున్నాయి. ఈ ప్రదేశం చెన్నైనుంచీ 150 కి.మీ., బెంగుళూరునుంచి 200 కి.మీ. దూరంలో వుంది. అన్ని చోట్లనుంచీ వెల్లూరుకి రైలు, బస్ సౌకర్యాలున్నాయి.
ఇక్కడ గెస్టు హౌస్ లు కూడా వున్నాయి. అయితే అక్కడ వుండటానికి ముందు రిజర్వు చేసుకోవాలి.
ఫోన్ నెం. +91.416.220 6500 (10 lines) Fax +91.416.220 6666
2 comments:
క్రిందటేడాది అనుకోని కారణాల వల్ల నేను రెణ్ణెల్ల పాటు వెల్లూరి లో ఉన్నాను. అన్ని రోజులలో ఒక రోజు మాత్రం అతి కష్టమ్మీద శ్రీపురం వెళ్ళిరాగలిగాను. అది చాలా సుందర ప్రదేశం . అమ్మవారు చాలా అందం గా ఉంటారు. అక్కడ పోటోలు తీయటం నిషిధ్ధం . ముఖ్యం గా నాకు బాగా నచ్చింది. లోపలికి నడుస్తున్నప్పుడు పక్కన శిలాఫలకాల మీద మంచి మంచి సూక్తులు వ్రాసారు. అవి అన్నీ నెమ్మదిగా చదువుకుంటూ వెళుతుంటే అసలు అంత దూరం ఎలా నడిచానో కూడా తెలియలేదు. ఈ ప్రదేశం చూసాను కాబట్టి మీరు వ్రాసే విశేషాలతో రిలేట్ చెయ్యగలుగుతున్నాను. థాంక్స్ ఫర్ పోస్టింగ్ దిస్ మేడం!
కృతజ్ఞతలు అభిజ్ఞానగారూ
అక్కడికి వెళ్ళేవారు వీలైతే శ్రీ నారాయణి పీఠం కూడా చూడండి. అది అక్కడ కైలాసగిరి అనే చిన్న కొండమీద వుంటుంది. మాకు కుదరక వెళ్ళలేదు.
psmlakshmi
Post a Comment