గంగ హారతి
కాశీలో వీధులు చాలా సన్నగా వుంటాయి. దానికి తోడు రోడ్డుకటూ ఇటూ షాపులు, కొనేవారు, ఎప్పుడూ రద్దీగా వుంటాయి. ఆయాసం, జన సమ్మర్దం ఎక్కువ పడని వాళ్ళు కొంచెం జాగ్రత్తగా వుండాలి. మనుషులు నడవటమే కష్టమయిన ఈ రోడ్లలో రిక్షాలు కొన్నిసార్లు దొరుకుతాయిగానీ ఆటోలకి ఆంక్షలున్నాయి. కనుక మనం సమయానికి ఎక్కడికన్నా వెళ్ళాలంటే నడకే ఉత్తమం. (మేమున్న చోటునుంచీ దేవాలయాలకీ, గంగ ఒడ్డుకీ మేము నడిచే వెళ్ళావాళ్ళం.).
మేము కాశీ శ్రీ రామ నవమి రోజు చేరాము. అక్కడవాళ్ళు నవరాత్రులు చేస్తారు. ఉత్సవాలు, ఊరేగింపులు ఎక్కువ. భక్తులు ఊరేగింపులతో తెల్లవారుఝామునుంచే బృందాలుగా దైవ దర్శనానికి వస్తారు. అలాంటి అనేక ఊరేగింపులను మా సత్రంలోంచే చూశాము కాశీ విశ్వ నాధ దేవాలయ ప్రవేశ ద్వారం మా వీధిలోనే వుండటంతో.
రోజూ సాయంత్రం 7 గంటలకి దశాశ్వమేధఘాట్ లో రెండుచోట్ల గంగమ్మతల్లికి హారతి ఇస్తారు. గంగ ఒడ్డున మెట్లమీద నుంచీ, ఒక్కో చోటా 7గురు చొప్పున హారతి ఇస్తారు. 45 నిముషాలుపాటు సాగే ఈ హారతి దృశ్యం కన్నులపండుగగా వుంటుంది. దీనిని చూడటానికి జనం తండోపతండాలుగా వస్తారు. టూరిస్టులను ఆకర్షించటానికి ఒక ప్రత్యేక సౌకర్యం. బోట్ లో గంగలోంచి హారతి చూడవచ్చు. రేటంటారా, బేరమాడటంలో మీ ప్రతిభ బయటపడేది ఇలాంటిచోట్లేనండీ. ఒకళ్ళిద్దరున్నా ప్రత్యేక పడవకి రూ. 200 నుంచీ, హారతి మొదలయ్యే సమయానికి మనిషికి రూ. 20 చొప్పున కూడా ఎక్కించుకుంటారు. హారతి జరిగినంతసేపూ పడవ కదలదు. తర్వాత దానికీ కదలటం వచ్చని నిరూపించటానికి అలా తిప్పి తీసుకొస్తారు. ఏదైనా పడవలోంచి హారతి ఎదురుగా చూడవచ్చు. అదే మెట్ల మీదనుంచి అయితే వెనకనుంచో, పక్కనుంచో చూడాలి.
హారతి సమయంలో గంగ ఒడ్డున దీపాలకి గిరాకీ ఎక్కువ. యాత్రీకులంతా మగ, ఆడ తేడాలేకుండా తాముకూడా ఒడ్డున అమ్మే పూలు, దీపాలు కొని గంగకి హారతి ఇవ్వటానికి ఉత్సాహ పడతారు. దీపాల వెలుగులతో కళ కళలాడే ఆ సంబరం చూసి తీరాలి.
మేము హారతి సమయానికి ఒక బోటులో ఎక్కాము. అందులో రామకృష్ణ మఠం స్వామి శారదాత్మానంద స్వామి వున్నారు. శిష్యులతో కలిసి కాశీ యాత్రకి వచ్చారు. వేరే ప్రదేశాలు కూడా చూసుకుంటా, ఇక్కడనుండి కలకత్తాలోని బేలూరు రామకృష్ణ మఠం వారి ఈ యాత్రలో చివరి మజీలీ.
హారతి చివరలో పడవల్లో పిల్లలు రకరకాల పౌరాణిక వేషాలలో పడవలలో ఊరేగింపుగా వచ్చారు. గంగమ్మ ఒళ్ళో ఆ ఊరేగింపు కూడా అందంగా వుంది. శ్రీరామనవమి స్పెషల్ అనుకుంటా ఆ ఊరేగింపు, గంగ ఒడ్డున నాట్య ప్రదర్శనయ అవ్వన్నీ చూసిన తర్వాత నెమ్మదిగా నడుచుకుంటూ మా మజిలీ చేరాం. సత్రంవాళ్ళు పెట్టిన వేడి వేడి రైస్ పొంగలి, వడ తిని విశ్రాంతి తీసుకున్నాం.
తర్వాత పోస్టులో గంగ స్నానం, విశ్వనాధ, విశాలాక్షి దర్శనం, అన్నపూర్ణమ్మతల్లి ఆదరం.
గంగమ్మ తల్లికి పూలు, దీపారాధన
స్వామి శారదాత్మానంద స్వామి, రామకృష్ణ మఠం తో
3 comments:
మీ యాత్రా అనుభవాలు బాగున్నాయి. గంగను పూజించే సమయంలో మనం ఒడ్డున ఉండి చూడడమే భావ్యమనిపిస్తోంది. నాకెందుకో గంగపై పడవలో ఆ సమయంలో ఉండడమనే భావన అంత సమంజసమనిపించడం లేదు.
విజయ్ శర్మగారూ
మీ భావన సమంజసమేనండీ. గంగకి ఇస్తున్న హారతికి మనం అడ్డు వెళ్తున్నామా అని ఒక్క క్షణం ఆలోచించానుగానీ, అక్కడ వున్న జనాన్ని చూశాక వాళ్ళల్లో ఒకదాన్నయిపోయాను.
psmlakshmi
మీరు కాశీ వచ్చినప్పుడు మిమ్ములను కలవడం కుదరలేదు (అదే సమయంలో నేను జయపూర్ వెల్ళాను). చాలా బాగా వ్రాస్తున్నారు.
Post a Comment