కాశీ చేరాం.
పూర్వకాలంలో కాశీకి వెళ్ళటం కాటికి వెళ్ళటం సమానమనే వాళ్ళు. ఈ నానుడి అలవాటయ్యే కాబోలు మనవాళ్ళు చాలామంది కాశీ వెళ్ళిరావటంకంటే అమెరికా వెళ్ళిరావటం సులువనుకుంటున్నారు. అలాంటివాళ్ళంతా ఓస్ కాశీ ప్రయాణం అంటే ఇంతేనా వెళ్ళోచ్చేస్తే పోలా అనుకుంటారు ఇది చదివాక. ఇంత గ్యారంటీ ఇచ్చానని మూటా మల్లే కట్టేయకండి...ముందు అక్కడి విశేషాలు తెలుసుకోండి.
కాశీ వెళ్ళటానికి, మరీ ఎండా, అతి వృష్టీ కాకుండా అనువైన సమయం అక్టోబర్ నుంచీ ఏప్రిల్ దాకా. మా ట్రిప్ మార్చి 23నుంచీ ఏప్రిల్ 3 దాకా. ఈ సమయంలో అక్కడా ఎండలు బాగానే వున్నాయి. తర్వాత మనం భరించలేనంత ఎండలు వుంటాయి. ఎండలు మనకలవాటేకదా అని బయల్దేరిపోయారనుకోండి...ఏ ఎండలు ఎలా వుంటాయో అనుభవపూర్వకంగా తెలుసుకుంటారు. అంతే. పైగా అక్కడ పవర్ కట్ కూడా చాలా ఎక్కువ. దాదాపు పగలంతా పవర్ వుండదు. మేమున్నచోట జనరేటర్ ద్వారా లైట్స్ మాత్రం వచ్చేవి. పగలు సగం పైగా ఫాన్ వుండేది కాదు. ఫైవ్ స్టార్ హోటల్స్ సంగతి నాకు తెలియదు. కాశీలో అవ్వికూడా వున్నాయి. నెట్ ద్వారా ముందే రిజర్వు చేసుకోవచ్చేమో చూసుకోండి.
సరే కాశీ వెళ్ళటానికి పయాణ సాధనాలు మీ ఊరినుంచీ రైలు వుంటుంది చూడండి.. మేమయితే మాఊరు (హైదరాబాదు) నుంచీ మార్చి 23వ తారీకు ఉదయం 9-50 కి పాట్నా ఎక్సప్రెస్ ఎక్కాము. దీనికి పీయన్బీఈ యస్ సీ ఎక్స్ప్రెస్ అని అన్నీ పొడక్షరాలతోకూడా ఒక పేరు వుందికానీ పాట్నా ఎక్స్ప్రైస్ అంటే సుభ్భరంగా అందరికీ తెలుస్తుంది కదా. ఉదయం 10 గం. లకల్లా రైలు సికింద్రాబాద్ లో బయల్దేరింది. కాజీపేట చేరేసరికి మధ్యాహ్నం 12 గంటలయింది. అక్కడనుంచీ మా గ్రూప్ మిగతా సభ్యులు మాపిన్ని శ్రీమతి సావిత్రీ మౌళి, సత్యప్రభ, కుసుమ, శ్యామ్ కలిశారు. మా ప్రయాణం సాగీ, సాగీ, సాగీ, మధ్యలో ఇంటినుంచీ తెచ్చుకున్న పులిహోరలూ, పెరుగన్నాలూ, చపాతీలూ, ఇంకా చాలా బోలెడు ఐటమ్స్ కి న్యాయం చేస్తూ, మర్నాడు సాయంకాలం 3 గం. లకు వారణాసి స్టేషన్ చేరాము. 29 గంటల ప్రయాణం. ఎప్పుడెప్పుడు చూస్తామా అని ఎదురు చూసిన వారణాసి గాలి తగలగానే ప్రయాణ బడలిక అంతా ఎగిరి పోయింది.
సామానుతో బయటకు వచ్చి, ఒక్కో ఆటోకి 100 రూ. చొప్పున 2 ఆటోల్లో మా సామానుతో సహా ఎక్కి గడోలియాలోని శ్రీ సాయి విశ్వనాధ అన్నపూర్ణ సేవాసమితివారి సత్రం కి చేరుకున్నాము. సింపుల్ గా బనారస్ లాడ్జి అంటే చాలామందికి అర్ధమవుతుంది. అందులో కొంత భాగం తీసుకుని ఈ సేవా సమితివారు నాలుగు నెలలక్రితం ఈ సత్రాన్ని ప్రారంభించారు. మాకు తెలిసినవారు అంతకుముందు అక్కడ వుండి వచ్చారు. బాగున్నదని చెప్పటంతో మా ప్రయాణం నిర్ణయమయిన రోజునుంచీ ఫోన్ చేస్తున్నాను రూమ్స్ కోసం. మేనేజర్ శ్రీ రామకృష్ణ డోనర్స్ ఎవరన్నా వస్తే మీకివ్వలేము..కానీ చుట్టుప్రక్కల తెలిసిన సత్రాలుంటాయి కనుక మీ కిబ్బందిలేకుండా ఎక్కడన్నా రూమ్ ఏర్పాటు చేస్తాము...వారణాసి స్టేషన్ కి రాగానే ఫోన్ చెయ్యండి అన్నారు. అలాగే ఫోన్ చేసి వెళ్ళగానే రూమ్ ఇచ్చి ఆయన మాట నిలుపుకున్నారు. ఈ సత్రం కాశీ విశ్వనాధుని ఆలయానికి దగ్గరలో వుంది.
కాశీలో వసతికి ఇబ్బంది లేదు. అనేక సత్రాలు, హోటల్స్ వున్నాయి. సత్రాలలో కూడా ఎటాచ్డ్ బాత్ రూమ్స్, ఎసీ రూమ్స్ వుంటాయి. సత్రాలని ఫ్రీ అనుకునేరు. వాటికి అద్దెలు కూడా వుంటాయి. మేమున్నది రెండు వరస గదులు, ప్రతి గదిలో రెండు బెడ్స్, కానీ ఒకే బాత్ రూమ్, రోజుకి అద్దె 500 రూ. లు. పెద్ద వరండా. అందులోనే భోజనాలు. భోజనాలంటే గుర్తొచ్చింది. ఇక్కడ చాలా సత్రాలలో మధ్యాహ్నం భోజనం, సాయంత్రం టిఫెన్ ఏర్పాట్లు వుంటాయి. ఇవి ఉచితమేగానీ, కాశీలో అన్నదాన మహాత్యాన్ని గురించి కొన్నిచోట్ల ఊదరగొడుతూ వుంటారు. అర్ధమయిందిగా. మేమున్న సత్రంలో రూ. 1516 ఇస్తే సంవత్సరంలో మనం కోరుకున్న ఒక రోజు మనమేపేరు చెప్తే ఆపేరుతో అన్నదానం జరుగుతుంది. ఆ రోజు దాతలు చాలామంది వుండవచ్చు...వుండాలి కూడా..ఎందుకంటే మాసత్రంలో కొన్ని రోజులు రోజుకి 200, 300 మంది పైన భోజనం చేశారు. అలాంటప్పుడు అంతమందికి భోజనం పెట్టటానికి డబ్బు సరిపోవాలికదా. పెద్ద గ్రూప్స్ వచ్చినప్పుడు మనకి ఆ హడావిడి కొంచెం ఎక్కువగా అనిపించవచ్చుగానీ ఊళ్ళనుంచి వచ్చిన గ్రూప్స్ అంతా ఒక చోట వుండాలంటే కొన్ని ఇబ్బందులు తప్పవుకదా.
సాయంకాలం టిఫెన్లంటే ఇడ్లీ, వడా వూహించుకోకండి. మా సత్రంలో ఇంచక్కా రోజుకోరకం ఉప్మా పెట్టాడు. రెండు రోజులు తినేసరికి ఎక్కడ ఏమున్నాయా అని వెతుక్కోవటం మొదలు పెట్టాం. కిందనే అయ్యర్స్ హోటల్ లో ఊతప్పం, ఇడ్లీ, వడ, దోశ దొరికాయి. పొద్దున్న రోడ్డు పక్కన వేడి వేడి ఇడ్లీ, దోశ తిన్నాము. కాఫీ, టీలకు లోటు లేదు. మంచి పాలు కూడా దొరుకుతాయి. ఇంచక్కా కొంచెం మీగడ వేసి చిక్కని లస్సీ దొరుకుతుంది. స్వీట్స్ కోవాతో చేసినవి బాగుంటాయి. గులాబ్ జామ్, జిలేబీ మనదగ్గరకన్నా అక్కడ రుచి ఎక్కువ. భోజన ప్రియులూ, ఆహారం గురించి కంగారు పడకండి. ఎటొచ్చీ యాత్రా స్ధలాల్లో తినటం అలవాటు చేసుకోవాలి.
సరే కాశీ చేరాము.....రూమ్ దొరికింది. ఇంక కాలు నిలవలేదు. గబగబా తయారయి గంగ హారతికి బయల్దేరాము.
ఈ పోస్టులో మనిషి మఖ్యావసరమైన ఆహారం, కాశీలో దొరికేదాని గురించి తెలుసుకున్నాముకదా. వచ్చే పోస్టులో కాశీలో రోడ్లతోపాటు గంగ హారతి విశేషాలు.
కాశీ విశ్వనాధుని ఆలయ ప్రవేశ ద్వారం (దీని వెనకాలే ఆలయం వుందనుకోకండి..దీని లోపల ఇరుకు రోడ్లల్లో దాదాపు రెండు ఫర్లాంగులు నడిస్తే వస్తుంది....సెక్యూరిటీ చెక్)
మేము దిగిన సత్రంలో వున్న విశ్వనాధ, అన్నపూర్ణ విగ్రహాలు. విశ్వనాధునికి ఇవతల సాయిబాబా కూడా వున్నాడు.
శ్రీ సాయి విశ్వనాధ అన్నపూర్ణ సేవా సమితి వారి సత్రంలో భోజనాల హడావిడి
5 comments:
మేము వెళ్ళినపుడు బంగాలీటోలా దగ్గర ఆంధ్రసత్రంలో దిగాం. అదీ బాగుంది. కానీ గుడికి కాస్త దూరం. కానీ అక్కడ కేదార్ ఘాట్ వద్ద తొక్కిసలాటలేకుండా ప్రశాంతంగా ఉంటుంది. భోజనప్రియులకు బ్రేక్‌ఫాస్ట్ కు జిలేబీలు తినడం మాత్రం మాంచి అనుభవం :) అలాగే అక్కడ లస్సీ, రసగుల్లా మన ఏపీలో కంటే వంద రెట్లు బాగుంటాయి. పొద్దుటే నాలుగింటికి వెళ్ళి ఘాట్ దగ్గరకూర్చుంటే దివ్యమైన సూర్యోదయాలు చూడొచ్చు. మీ యాత్రలు బాగున్నాయి.
budugoy
కేదారేశ్వరస్వామి ఆలయం కూడా బాగుంది. ఘాట్ దగ్గర సూర్యోదయాలు చూడలేకపోయాము. అవ్వేనా, మిస్సయినవెన్నో వున్నాయి.
మా యాత్రలు నచ్చినందుకు ధన్యవాదాలు.
psmlakshmi
చదవటం కన్నా, అనుభవించి తీరాల్సిన అనుభూతులు కాశీ యాత్రానుభవాలు. అదృష్టం కొద్దీ, రెండుసార్లు వెళ్ళే అవకాశం దొరికింది. మొదటిసారి శంకరమఠం వారి గెస్టు హౌసులో ఉన్నాము. అది ఘాట్ లకు చాలా దూరంలో ఉండేది. తర్వాత, కర్ణాటక సత్రంలో ఉన్నాము - హనుమాన్ ఘాట్ కు దగ్గరలో. ఆ పక్కనే, హరిశ్చంద్ర ఘాట్. రాత్రి పదకొండు పన్నెండు మధ్యలో అఘోరీలు వచ్చి హరిశ్చంద్ర ఘాట్ లో పూజలు చేయటం కూడా చూసాము మా సత్రం నుంచి. అక్కడి సౌకర్యాలు ఎంత చిరాకు కలుగచేసినా, ఆధ్యాత్మిక తరంగాలు మాత్రం అత్యున్నతస్థాయిల్లో ఉంటాయి. గంగ హారతి మాత్రం అద్భుతం.
నిజమండీ సాయి కిరణ్ కుమార్ గారూ. కాశీ అనుభూతులు చెప్పటానికి సరైన మాటలు దొరకవేమో. సౌకర్యాలు చికాకు కలిగించటం మాదగ్గరే అనుకున్నా. అన్ని చోట్లా అలాగే వుంటుందన్నమాట. అఘోరీల సంగతి విన్నాను.
psmlakshmi
Useful and Informative Blog on Kasi.
Well done !
Post a Comment