Sunday, April 25, 2010

కాశీ ప్రయాణం మేడ్ ఈజీ అనబడే కాశీ కబుర్లు—6




విశ్వేశ్వరునికి నిత్య హారతులు

శ్రీ కాశీ విశ్వనాధుని ఆలయంలో స్వామికి నిత్య హారతులు మూడు.  తెల్లవారుఝామున 3గంటలనుంచి 4గంటల మధ్య ఇచ్చే హారతి మొదటిది. దీనికి టికెట్ వున్నది. ఇది మేము చూడలేదు.  కనుక  వివరించలేను.  కానీ ఈ హారతిలో మణికర్ణిక ఘాట్ నుంచి శవం భస్మం తీసుకు వచ్చి అభిషేకం చేస్తారని అన్నారు.  ఇలా ఉజ్జయినిలో చేస్తారు.  మేము చూశాము.

ఇంక రెండవది సప్త ఋషి హారతి.  ఇది సాయంకాలం 7 గంటల ప్రాంతంలో వుంటుంది.  టికెట్ 51 రూపాయలు.  హారతి మొదలు పెట్టే ముందు టికెట్ లేని వాళ్ళని బయటకి పంపుతారు కానీ, మొదలు కాగానే అందరూ వస్తారు.  టికెట్ వున్న వాళ్ళని 4 గుమ్మాల దగ్గర నాలుగు బల్లలు వేసి, గుమ్మంలోనూ, వాటిమీదా కూర్చోబెడతారు.  గుమ్మంలోనో, బెంచీ మీద మధ్యలోనో కూర్చున్నవారు అదృష్టవంతులు.  మిగతావారికి అన్నివైపులనుంచీ తోపుళ్ళు తప్పవు.

ఈ సప్త ఋషి హారతిలో సప్త ఋషులకు ప్రతినిధులుగా ఏడుగురు పండితులు స్వామికి అభిషేకం, అర్చన చేసి హారతి ఇస్తారు.  ఈ హారతి సమయంలో అందరూ గంటలు ఎంత  లయ బధ్ధంగా  వాయిస్తారంటే, మనం కొంచెం మనసు లగ్నం చేస్తే  ఆ పరమ శివుని ఆనంద తాండవం కళ్ళముందు గోచరిస్తుంది.  అంత తన్మయత్వంలో మునుగుతాము.  ఆ అపురూపమైన అనుభవాన్ని కాశీకి వెళ్ళినవాళ్ళెవరూ వదులుకోవద్దు.  అది అనుభవించవలసినదే.

హారతి పూర్తి అయిన తర్వాత ఆ పండితులంతా నాలుగు వైపులకూ వచ్చి, స్వామికి వేసిన  పూల మాలలు, తీర్ధం  బయట వున్న భక్తులకందరికీ ఇస్తారు.

దీని తర్వాత రాత్రి 8 గంటలు దాటిన తర్వాత సేజ్ హారతి వుంటుంది.  ఈ రెండు హారతుల మధ్యా, రాత్రి హారతి తర్వాత 11 గంటలదాకా స్వామి దర్శనం వుంటుంది.  హారతుల సమయంలో లోపలికి ఎవరినీ వెళ్ళనివ్వరు.

ఈ హారతిలో కూడా స్వామికి అభిషేకం, పూజ అంటే మంత్రాలు చదువుతూ పూల మాలలు అలంకరించటం ఎక్కువసేపు వుంటుంది.  హారతి సప్త  ఋషి హారతి అంత ప్రభావితంగా వుండదు.  కానీ ఇదీ చూడదగ్గదు.  దీనికీ టికెట్ 51 రూపాయలు.

ఈ హారతి తర్వాత కూడా బయట తీర్ధం, హారతి సమయంలో స్వామికి నివేదించిన ప్రసాదం  భక్తులందరికీ ఇస్తారు.

వచ్చే పోస్టులో ప్రయాగ త్రివేణీ సంగమలో వేణీదానం వివరాలు.

3 comments:

Gopal said...

ఉదయం 3 నుండి 4 గం వరకూ జరిగే హారతిలో మణికర్ణిక నుండి భస్మం తీసుకవచ్చి అభిషేకం చేస్తారన్నది నిజంకాదు. ఇది అపవాదు మాత్రమే.

కాశీ లో విశేషం ఏమిటంటే ఇక్కడ ఉన్న రెండు స్మశాన ఘట్టాలలోనూ 24 గంటలూ శహదహనం జరగుతుంది. మిగిలిన ఎక్కడా సూర్యాస్తమానం తరువాత శవదహనం జరగదు.

malyala venkateswarlu warangal said...

chala bagundi memu kuda 29/4/2010 nadu velutunnam

భావన said...

లక్ష్మి గారు, చాలా బాగా వర్ణించారు అండి. నేను కొంచం పని వుండీ బ్లాగు ల వైపుకు రాలేదు ఈ రోజే వచ్చి మొత్తం కాశి విశేషాలన్ని చదివేను. మీరు చెప్పినవి చదువుతు, ఆ ఫొటో లు చూస్తుంటే ఎంత తృప్తి గా అనిపించిందో చాలా చోట్ల కళ్ళ నుంచి నీళ్ళు వచ్చేసేయి.. చాలా బాగా చెప్పేరు లక్ష్మి.