దొడ్డగణపతి దేవాలయం, బెంగుళూరు
ఈ మధ్య ఒక పెళ్ళికోసం బెంగుళూరు వెళ్ళాము. మరి వెళ్ళినవాళ్ళం ఆ పెళ్ళొకటే చూసొస్తే ఎలా? అందుకే కర్ణాటకాలోని కొన్ని ఆలయాలు చూసొచ్చాము. వాటి విశేషాలు మీక్కూడా..
ఇంకొక్క విషయం..కర్ణాటకాలో నేను చూసినంతమటుకూ నేను గమనించినవి రెండు విషయాలు. మొదటిది వాణిజ్య ప్రకటనలలో స్త్రీల వస్త్రధారణ నిండుగా వుండటమయితే రెండవది ఎక్కడా నీరు అత్యంత విలువైనది..ఒక్క బొట్టుకూడా వృధా చెయ్యద్దు అనే బోర్డులు లేకపోవటం. మరి మన రాష్ట్రం.. సరే లెండి విషయంలోకెళ్దాం.
దొడ్డ గణపతి ఆలయం బెంగుళూరులోని బసవనగుడిలో బుల్ టెంపుల్ పక్కనే వున్నది. ఈ ఆలయ నిర్మాత బెంగుళూరుని తీర్చిదిద్దిన కెంపెగౌడ. ఒకసారి ఆయన ఈ ప్రాంతంలో సంచరిస్తూవుండగా ఇక్కడ పెద్ద పెద్ద రాళ్ళ గుట్టలను చూశాడు. వాటిలో ఒకదానిమీద విఘ్నేశ్వరుడి ఆకారం చూసి శిల్పులను రప్పించి ఒక పెద్ద రాతిమీద ఆ విగ్రహాన్ని మలచమని ఆనతినిచ్చాడు. ఆనాటి ఆ సంఘటన రూపమే మనమిప్పుడు చూస్తున్న దొడ్డ గణపతి.
ఈ గణపతి విగ్రహం ఎత్తు 18 అడుగులు, వెడల్పు 16 అడుగులు వుంటుంది. ఈయనకి శక్తి గణపతి అనీ, సత్య గణపతి అనీ కూడా పేర్లున్నాయి. ఈ స్వామి విగ్రహం కుడివైపుకి పెరుగుతున్నది ఇక్కడివారి నమ్మకం.
ఈ స్వామిని ప్రతి రోజూ రకరకాలుగా అలంకరిస్తారు. వాటిలో ముఖ్యమైనది వెన్నతో చేసే అలంకారం. ఈ అలంకారానికి 100 కిలోలపైనే వెన్నని వాడుతారు.
ఈ ఆలయం వెనకే శ్రీ శివ శక్తి బేడర కన్నప్ప, శ్రీ కానేశ్వర, శివాలయాలు వున్నాయి. బెంగుళూరు వెళ్ళినప్పుడు ఈ స్వామిని దర్శించి రండి.
ఆలయ సమయాలు
ఉదయం 7 గం. లనుంచీ 12-30 దాకా, తిరిగి సాయంకాలం 5-30నుంచీ 8-30 దాకా.
0 comments:
Post a Comment