Wednesday, March 7, 2012

బసవనగుడి (బుల్ టెంపుల్), బెంగుళూరు


ఆలయానికి దారి

ఆలయంలో వృషభరాజు

వెనుక శివాలయం (గర్భగుడిలోనే)

ఆలయంపైన శివపార్వతులు, వినాయకుడు

ఆలయ గోపురం

బసవనగుడి (బుల్ టెంపుల్), బెంగుళూరు

ఈశ్వరుని వాహనమైన నందికి ప్రత్యేకింపబడిన ఈ ఆలయం బెంగుళూరులో క్రీ.శ. 1537 లో నిర్మింబబడింది. ద్రావిడ శైలిలో నిర్మింపబడిన ఈ ఆలయ నిర్మాత ఇంకెవరోకాదు..బెంగుళూరు నిర్మాత కెంపెగౌడ. ప్రస్తతం కనబడుతున్న గోపురం 20వశతాబ్దం ఆరంభంలో నిర్మింపబడింది.

ఆలయంలో పెద్ద నందీశ్వరుడి విగ్రహం, దాని వెనుకే శివాలయం వుంటాయి. ఒకే రాతిలో మలచబడ్డ ఈ నందీశ్వరుడి ఎత్తు 15 అడుగులు, పొడవు 20 అడుగులు. ఈ నందీశ్వరుని విగ్రహం సంవత్సరాలతరబడి బొగ్గు, నూనెలతో రుద్దటంవల్ల నల్లగా వుంటుంది. పూర్వం ఈ వృషభ విగ్రహం పెరుగుతూ వుండటంతో దానిని ఆపటానికి తలమీద ఒక ఇనుప రేకు తాపటం చేశారు. అప్పటినుంచీ విగ్రహం పెరగటం ఆగిందంటారు. ఈ ఆలయంలోని నంది ప్రపంచంలోని ఆలయాలలో వున్న అన్ని నందులకన్నా పెద్దది.

ఈ ఆలయ నిర్మాణం వెనుక ఒక కధ వుంది. పూర్వం ఒక అతి బలిష్టమైన ఎద్దు ఈ ఆలయం చుట్టుపక్కలగల వేరుసెనగ పంటను తిన్నంత తిని మిగతా అంతా ధ్వంసం చేసేదిట. ఈ విధ్వంసం ఆపటంకోసం చేసిన ప్రయత్నాలు వ్యర్ధమయి, కెంపెగౌడ ఈ ఆలయాన్ని నిర్మించాడుట. అప్పటినుంచీ ఆ వృషభరాజు ఎటువంటి విధ్వంసం చెయ్యలేదుట.

ఈ విషయాన్ని గుర్తుచేసుకుంటూ ఇప్పటికీ ప్రతి ఏడాదీ వేరుసెనగ పంట రాగానే ఇక్కడి రైతులు ముందుగా తమ పంటని ఈ వృషభరాజానికి సమర్పించి తర్వాతే వ్యాపారం చేసుకుంటారు. ఈ సందర్భంగా ప్రతి ఏడాదీ నవంబరు, డిసెంబరు నెలలలో కడలికాయ పరిషె అనే ఉత్సవం ఇక్కడ జరుగుతుంది. దీనికి వేరుసెనగ పండించే రైతులేగాక, చుట్టుపక్కల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొంటారు.

0 comments: