గవి గంగాధరేశ్వర ఆలయం, బెంగుళూరు
బెంగుళూరులోని గవిపురంలో వున్న ఈ ప్రఖ్యాత ఆలయం, భారతదేశంలో అతి పురాతనమైన గుహాలయాలలో (cave temples) ఒకటి. పూర్వం గౌతమ మహర్షి ఇక్కడ తపస్సు చేసుకుంటూ, ఇక్కడి శివలింగాన్ని త్రికాలాలలో పూజించేవాడుట. అందుకే ఈ క్షేత్రాన్ని గౌతమ క్షేత్రమని కూడా అంటారు. భరద్వాజ మహర్షికూడా ఇక్కడ తపస్సుచేసుకున్నారు. గర్భగుడి చుట్టూవున్న ప్రదక్షిణ మార్గంలో మిగతా దేవతల సుందర విగ్రహాలతోపాటు ఈ మహర్షులిద్దరి విగ్రహాలుకూడా వున్నాయి.
ఈ గుహాలయం బయటగల మంటపం 14 స్తంబాలతో, విజయనగర నిర్మాణ శైలిలో వున్నది. ఈ హాలు, బయట సూర్యపాన, చంద్రపాన (ఒక స్తంబానిక పైన పెద్ద వృత్తంలా వుంటుంది..సూర్య, చంద్రులకు ప్రతీకగా వీటిని చెబుతారు), త్రిశూలం వగైరాలన్నీ బెంగుళూరు నిర్మాత కెంపెగౌడ సమయంలో నిర్మింపబడ్డాయి.
ఈ ఆలయంలో ప్రదక్షిణ మార్గాలు రెండు వున్నాయి. శివ లింగానికి కుడి వైపున దుర్గ, పార్వతులకి విడి విడిగా ఉపాలయాలున్నాయి. ఈ ఉపాలయాలని కలుపుతూ దుర్గ ఉపాలయం పక్కనుంచీ ఒక ప్రదక్షిణ మార్గం వుంది. ఈ మార్గంలో వంగుని మాత్రమే వెళ్ళగలం. గర్భగుడి చుట్టూవున్న ఇంకొక ప్రదక్షిణ మార్గం నడవటానికి వీలుగా వుంటుంది. ఈ రెండు ప్రదక్షిణ మార్గాలలో అనేక సుందర దేవతా ప్రతిమలు వున్నాయి.
ఇక్కడ గర్భాలయంలో శివుని దగ్గరనుంచి పలుచని నీటి ప్రవాహం నిరంతరం వుంటుంది. అందుకనే ఇక్కడి శివుడు గంగాధరేశ్వరుడయ్యాడు. ఈ గుహలోంచి రెండు సొరంగ మార్గలున్నాయి. అవి ఒకటి కాశీకి, రెండవది కర్ణాటకలోని శివగంగకువెళ్తాయంటారు.
ఇక్కడ ఇంకొక విశేషం ప్రతి సంవత్సరం మకర సంక్రాంత్రి రోజున సూర్యకిరణాలు ఆలయం బయటవున్న నంది కొమ్ముల మధ్యనుంచి శివలింగాన్ని తాకుతాయి. ఈ అపూర్వ దృశ్యం వీక్షించటానికి భక్తులు వేల సంఖ్యలో హాజరవుతారు.
ఈ ఆలయాన్ని చూడని బెంగుళూరువాసులూ, వీలుచేసుకుని తప్పక దర్శించండి. ఇదేమిటండీ, ప్రఖ్యాత ప్రాచీన ఆలయమంటున్నారు, దీనిని చూడని బెంగుళూరు వాస్తవ్యులుంటారా అని అడగకండి. మేము వెళ్ళిన పెళ్ళిలో బెంగుళూరు వాస్తవ్యులు కొందరికి ఈ ఆలయంగురించి మేము చెప్పివచ్చాము.
0 comments:
Post a Comment