Monday, September 24, 2012

పాలకుర్తి - ఇంకో నాలుగు ఫోటోలు


పాలకుర్తి - ఇంకో నాలుగు ఫోటోలు

పాలకుర్తి గురించి వచ్చిన స్పందన చూసి ఇంకొక నాలుగు ఫోటోలు మీకోసం......

 పాలకుర్తి సోమేశ్వరాలయం కొండ దిగువన బమ్మెర గురించి బోర్డు .. శిధిలావస్ధలో వున్నదని బాధపడాలో, ఆ మాత్రమైనా వున్నదని సంతోషించాలో...
 పాల్కురికి సోమనాధుని సమాధి...అక్కడెక్కడా బోర్డు వున్నట్లు లేదు.  అక్కడివారిద్వారా తెలుసుకున్నది.
 సోమనాధ మహాకవి సమాధి మందిరంలో శివ లింగం.  ముందు పాదుకలు ఎవరివో!!????
శ్రీ రామ మందిరం .. రాముడు పద్యం పూరించిన ప్రదేశం ..  ఇదీ మూసే వుంది.  ఎక్కడా బోర్డులేదు.

Sunday, September 23, 2012

పావనమైన పాలకుర్తి సోమేశ్వరాలయం






పావనమైన పాలకుర్తి సోమేశ్వరాలయం




పూర్వం భారతదేశంలో అనేక ప్రదేశాలు పచ్చని వృక్షాలు, నదీనదాలు, కొండలూ వగైరా ప్రకృతి సంపదతో కళకళలాడేవి. అప్పుడు మనుషుల జీవితాలుకూడా ప్రశాంతంగా గడిచేవి. అనేకమంది ఋషులు పర్వతాల్లో, అరణ్యాల్లో తపస్సు చేసుకుంటూ ఆధ్యాత్మిక చింతనలో కాలం గడిపేవారు. అలాంటివారిలో కొందరికి భగవంతుడు సాక్షాత్కరించి, వారి కోరిక మీద అక్కడే వెలిసిన సంఘటనలు కూడా అనేకం. అలాంటి అద్భుతమైన ప్రదేశాలు ఎన్నో అనేక విధాల అభివృధ్ధిచెంది, అనేక రాజుల పోషణలో అత్యున్నత స్ధితి చూసి, కాలాంతరంలో ఆదరణ తగ్గి, ఈ కాలంలో మరుగునపడిపోతున్నాయి. అలాంటి అపురూప ఆలయాలు దర్శించటంవల్ల చరిత్రలో అనేక విశేషాలు తెలుసుకోగలుగుతాము. వాటిలో ఒకటి వరంగల్ జిల్లాలోని పాలకుర్తి.



హైదరాబాద్ - వరంగల్ రహదారిలో -- స్టేషన్ ఘనాపూర్ రైల్వే స్టేషన్ ముందునుంచి సరాసరి వెళ్తే 14 కి.మీ.లు వెళ్ళాక పాలకుర్తి వస్తుంది. ప్రశాంత వాతావరణంలో కొండల మధ్య వున్నది ఈ సోమేశ్వరాలయం. ఇక్కడ శివ కేశవులకు బేధం లేదని నిరూపిస్తూ పక్క పక్క గుహల్లో ఒక గుహలో సోమేశ్వరుడు, ఇంకొక గుహలో లక్ష్మీ నరసింహస్వామి వెలిశారు.




1200, 1300 సంవత్సరాల క్రితం ఇక్కడ ఋషులు తపస్సు చేసేవారనీ, వారికి ప్రత్యక్షమయిన సోమేశ్వరుడు వారి కోరికపై భక్తజనులనాదరించటానికి స్వయంభూగా ఇక్కడ వెలిశాడనీ చెబుతారు. సప్త ఋషుల కోరికపై సోమేశ్వరుడు ఇక్కడ వెలిశాడని ఇంకొక కధనం. ఈ గుహాలయంలో అమ్మవారినికూడా దర్శించవచ్చు.




ఈ స్వామి కరుణకి ఇంకో నిదర్శనం..పూర్వం ఒక వృధ్ధురాలు ప్రతి నిత్యం స్వామికి ప్రదక్షిణ చెయ్యటానికి కొండపైన ప్రదక్షిణ మార్గంలేక కొండ చుట్టూ తిరిగి వచ్చేది. వయసు మీద పడుతున్నకొలదీ ఆవిడ గిరి చుట్టూ తిరగలేక ప్రయాస పడుతుంటే పరమేశ్వరుడు తన ఆలయం వెనుక కొండ చీల్చి ప్రదక్షిణ మార్గమేర్పరిచి ఆ వృధ్ధురాలి ప్రయాస తప్పించాడు. అప్పటినుంచీ స్వామి ప్రదక్షిణ ఆ మార్గంలోనే చేస్తారు. ఈ సొరంగ మార్గం సన్నగా వుండి, కొండ చీలి ఏర్పడినట్లే వుంటుందిగానీ, ఎక్కడా కొండ పగలగొట్టి ఏర్పరచిన మార్గంలా వుండదు.. భక్తులు శుచిగా, భక్తిగా ఆ మార్గంలో వెళ్తే ఎంత లావయినవాళ్ళయినా సునాయాసంగా వెళ్తారనీ, అపరిశుభ్రంగా వెళ్ళేవారిని తేనెటీగలు కుట్టి, కుట్టి తరుముతాయనీ అక్కడివారి నమ్మకం. అక్కడ తేనెపట్లు చాలా వున్నాయి. ఆ తేనెటీగలు ఆ ప్రాంతానికి రక్షక భటుల్లాంటివన్నమాట.




కొండపైన వున్న ఈ ఆలయానికి మహత్యం చాలా ఎక్కువ అని భక్తుల నమ్మకం. ఈ స్వామిని సేవిస్తే సుఖ సంతోషాలు, సిరిసంపదలేకాక అపార జ్ఞాన సంపద లభిస్తుందని ప్రఖ్యాతి. ఇక్కడ గుహాలయంలోకి స్వామి దర్శనానికి కూడా ఇదివరకు కూర్చునీ, వంగునీ వెళ్ళవలసి వచ్చేదిట. అయితే 2003 లో భక్తుల సౌకర్యార్ధం ఈ మార్గం సుగమం చేశారు. ఏ ఇబ్బందీ లేకుండా మామూలుగా నడచివెళ్ళి స్వామిని దర్శించవచ్చు. సోమేశ్వరస్వామిని దర్శించి, పూజలు చేసి, పక్కనే ఇంకొక గుహలో వున్న (బయటకు వస్తున్న మార్గంలోనే కనబడుతుంది) శ్రీ లక్ష్మీ నరసింహస్వామినికూడా సేవించవచ్చు. ఇదివరకు కొండపైకి వెళ్ళటానికి 365 మెట్లు ఎక్కి వెళ్ళవలసి వచ్చేది. ఇప్పుడు కొండపైకి రోడ్డు కూడా వేశారు. ఆలయందాకా కార్లు వెళ్తాయి.




సంతానం లేనివారు ఈ ఆలయంలో కొబ్బరిగాయ ముడుపు కట్టి మొక్కుకుంటే పిల్లలు కలుగుతారనీ, తరువాత తమ మొక్కు తీర్చకోవటానికి స్వామి దర్శనం చేసుకుని, తొట్టెలు కడతారనీ చెబుతారు. కొండ దిగువ గో సంరక్షణశాల వున్నది. ఆసక్తి వున్నవారు ఇక్కడ గో పూజ చేసుకోవచ్చు. కార్తీక మాసంలో ఇక్కడ విశేష పూజలు, కార్తీక పౌర్ణమి రోజు లక్ష దీపారాధన జరుగుతాయి.




ఇతర దర్శనీయ స్ధలాలు


కొండ దిగువున ప్రఖ్యాత కవి పాలకుర్తి సోమేశ్వరుడి సమాధి వున్నది. ఈయన జన్మస్ధలం ఇదే. ఈయన రచించిన కావ్యాలు దశమ పురాణం, పండితారాధ్యుల చరిత్ర మొదలగునవి. సోమేశ్వర కవి తల్లిదండ్రులు ఈ స్వామిని సేవించి, కొడుకు పుడితే ఆ స్వామి పేరే పెట్టారుట. ఈ కవి జీవిత కాలం క్రీ.శ. 1160 – 1240. ఈ మహా కవి కూడా ఈ సోమేశ్వరుని ఆరాధించాడుట. అంటే అంతకు పూర్వంనుంచీ సోమేశ్వరస్వామి అక్కడ కొలువై భక్తుల అభీష్టాలు తీరుస్తున్నాడన్నమాట.



బమ్మెర పోతన సమాధి


ఇక్కడకి 2 కి.మీ. ల దూరంలో భాగవతం రచించిన మహాకవి పోతన నివసించిన బమ్మెర గ్రామం వున్నది. ఇక్కడే మహా భాగవతం రచింపబడ్డది. పోతనగారు ఒక పద్యం పూర్తి చేయలేనప్పుడు రామ లక్ష్మణులు వచ్చి ఆ పద్యం పూర్తిచేశారు. అలాంటి పుణ్య స్ధలానికి మనం సరైన విలువ ఇవ్వటం లేదనిపిస్తుంది. సోమేశ్వరస్వామి వెలిసిన కొండకింద బమ్మెరని దర్శించమని బోర్డు వున్నదిగానీ, మార్గ నిర్దేశక సూచికలేమీలేవు. అక్కడివారినడిగితే కారు వెళ్ళదు..రెండు కిలో మీటర్లు నడవాలి అన్నారు. మేమున్న పరిస్ధితుల్లో వెళ్ళలేక…అంతటి మహనీయుని సమాధి దర్శించలేకపోయామనే బాధతో వచ్చేశాము. అయితే అక్కడిదాకా రోడ్డు వేస్తున్నారనీ, ఆ పరిసరాలను యాత్రీకుల దర్శనార్ధం తీర్చి దిద్దుతున్నారనీ విని సంతోషించాము. అలాగే ఒక చిన్న రామాలయం వున్నది..కానీ మూసి వున్నది. అక్కడ ఏ విషయమూ తెలిపే బోర్డేమీ లేదు. బహుశా రామ లక్ష్మణులు పద్యం పూర్తి చేసినది ఇక్కడే అయి వుండచ్చనుకున్నాం.



వరంగల్ నుంచీ పాలకుర్తికి బస్సు సౌకర్యం వున్నది. దూరం 40 కి.మీ. లు. పాలకుర్తిలో వసతి భోజన సౌకర్యాలు లేవు. కొండ దిగువ కాఫీ, టీలు, చిప్స్ లభిస్తాయి.


(ఆశ ఆభినవ మాస పత్రిక జూన్ 2012 సంచికలో ప్రచురించబడింది.) 


 సోమేశ్వరాలయానికి దోవ
 దూరంగా కొండమీద ఆలయం
 ప్రదక్షిణ మార్గము

సోమేశ్వరుడు

Monday, September 17, 2012

మధ్యార్జునం




మధ్యార్జునం

ఇవాళ ఉదయం మా టీవీలో బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావుగారి శ్రీశైల వైభవం ప్రవచనంలో మధ్యార్జునం గురించి ప్రస్తావించారు.  పరమ గురువు శ్రీశ్రీశ్రీ చంద్రశేఖరాచార్యులవారికి అత్యంత ప్రీతిపాత్రమైన ప్రదేశాలు మధ్యార్జునం, శ్రీశైలం అనీ, మధ్యార్జునంనుంచి ప్రసాదం ఎవరైనా తెస్తే అత్యంత భక్తితో తీసుకుని తలమీద పెట్టుకుని తీసుకునేవారనీ, ఆయన ఎవరేమిచ్చినా తీసుకోరనీ, ఈ ప్రసాదానికి మాత్రం అభ్యంతరం చెప్పేవారుకాదనీ చెప్పారు.

ఇంకా ఇక్కడ ఒక మద్ది చెట్టువున్నదని, అటు వెళ్ళే దోవకి తాళం వేసి పెడతారని, అడిగితే చాలా కష్టంమీద తాళం తీసి చూపిస్తారు, మేముకూడా అలాగే తాళం తీయించే చూశాము..ఆ చెట్టుకి ప్రదక్షిణ చేస్తే చాలా మంచిది అని చెప్పారు.  పైగా ఇటువంటి మద్ది చెట్లు మధ్యార్జునం, శ్రీశైలంలో మాత్రమే వున్నాయని చెప్పారు.

శ్రీ చాగంటివారి ప్రసంగం విన్నాక ఆ మధ్యార్జునం గురించి తెలుసుకుని వీలైతే, దర్శించాలని నెట్ లో వెతికాను.  మా అదృష్టం.  నేను అనుకున్నది నిజమయింది.  ఈ క్షేత్రాన్ని మేము 24-12-2008న దర్శించాము.  అయితే నాకు ఆ క్షేత్రం పేరు మధ్యార్జునం అని ఇవాళే తెలిసింది.  ఇది తమిళనాడులో కుంభకోణం దగ్గర వున్నది.  కుంభకోణంనుంచి బస్సు ప్రయాణం 40 నిముషాలు పట్టింది. 

ఈ క్షేత్రానికి మాకు తెలిసిన పేరు తిరువిదైమరుదూరు.  శివుడు మహాలింగేశ్వరుడు.  పెద్ద లింగం.  చాలా పెద్ద ఆలయం.  పెద్ద కారిడార్.  అతి పురాతన ఆలయం.  చాలా ప్రశాంతంగా, దర్శకుల మనసులో భక్తిభావం పెల్లుబికేలా వున్నది.  దూరంనుంచే మహాలింగేశ్వరుని చుట్టూ ఆర్చి లో వెలిగించిన దీపాలు కనులవిందు చేస్తుంటే తాదాత్మ్యంగా స్వామిని దర్శించుకున్నాము. 

ఆ ఆలయాన్ని చూసి అత్యంత ప్రభావితులమయ్యాముగానీ, భాషారపమైన ఇబ్బందులవల్ల ఇంతటి అపురూప ఆలయాల చరిత్ర సరిగా తెలుసుకోలేకపోయానని అప్పుడు చాలా బాధ పడ్డాను.  తెలుసుకున్నంతవరకు  సృష్టి మొదలయినప్పుడు భక్తులు సేవించుకోవటానికి పరమ శివుడు ఈ లింగాన్ని సృష్టించి, ఆ లింగానికి శక్తిని ప్రసాదించటానికి తాను తపస్సు చేసి, ఆ తపో శక్తిని అందులో ప్రవేశపెట్టి, తానుకూడా అందులో లీనమయ్యాడని.  పరమశివుడు స్వయంగా తపస్సు చేసి ఆ శక్తిని ఆ లింగంలో ప్రవేశపెట్టాడంటే అది ఎంతటి మహాద్భుత లింగమో అని తిరిగి తిరిగి నమస్కారాలు చేస్తూ వచ్చాము.

ఇంకొక విశేషంకూడా మేమక్కడ చూశాము.  మేము కుంభకోణంనుంచి అక్కడికి వెళ్ళేసరికి సాయంకాలం 4 గం. లు కావస్తోంది.  4 గం. లకు ఆలయం తీశారు.  అప్పుడు మావటివాడు ఆలయ గజరాజాన్ని కొంత లోపలికి తీసుకువచ్చి ప్రదక్షిణ చేయించి తీసుకువెళ్ళాడు.

అమ్మవారికి విడిగా ఆలయం, మూకాంబికకు ఒక చిన్న ఆలయం కూడా వున్నాయి.  అప్పుడు నేను ఇంతకన్నా వివరాలు సేకరించలేకపోయాను.  ఇదని తెలియక పొద్దున్న శ్రీ చాగంటివారు చెప్పినప్పుడు విశేషాలు రాసుకోలేకపోయాను.  ఈ క్షేత్రం గురించి ఇంకా తెలిసినవారు స్పందించగలరు.

ఆలయం లోపలి దృశ్యాల ఫోటోలు చూడండి.  అప్పుడు ఎవరూ అభ్యంతర పెట్టకపోవటంతో మీకీ ఫోటోలందివ్వగలుగుతున్నాను.






భక్తులపాలిట భద్రకాళి




భక్తులపాలిట భద్రకాళి
                                                                                  
సాధారణంగా మనవాళ్ళు గయ్యాళి స్త్రీలను భద్రకాళి అంటారు.  కానీ అది సరికాదు.  భద్రకాళి అంటే భక్తుల భద్రత చూసే కాళి.  అంటే భక్తులను బ్రోచే తల్లి.  మరి భద్రకాళి అనగానే వరంగల్ గుర్తొస్తోందా  అవునండీ హనుమకొండ, వరంగల్ మధ్య వెలసిన భద్రకాళి గురించే చెప్తున్నా.
భద్రకాళి అనగానే వరంగల్, వరంగల్ అనగానే భద్రకాళి ఆలయం గుర్తొస్తుంది.  అసలు ఆలయం ఎప్పుడు నిర్మింపబడిందో,   అమ్మలగన్న అమ్మ అక్కడ వెలిసి ఎన్ని శతాబ్దాలయిందో ఎవరూ సరిగ్గా చెప్పలేరు.  అతి పురాతనమైన దేవిని అనాదిగా అనేకమంది ఋషులు, సిధ్ధులు, దేవతలు అరాధించారుట.  పూర్వం రాజులు యుధ్ధాలకు వెళ్ళేటప్పుడు తమ ఇష్ట దైవాలకు పూజలు చేసి వెళ్తూండేవాళ్ళుట.  అలాగే  చాళుక్య చక్రవర్తి అయిన రెండవ పులకేశి వేంగి దేశంమీద యుధ్ధానికి వెళ్తూ దేవిని పూజించి వెళ్ళాడుట.  విజయం సాధించిన తర్వాత క్రీ.. 625 ప్రాంతంలో అమ్మవారికి ఆలయం నిర్మించాడు. 

తరువాత కాలంలో కాకతీయ ప్రభువైన రుద్రమదేవుడు తన రాజధానిని ఓరుగల్లుకు మార్చినప్పుడు, ఆలయాన్ని అభివృధ్ధి చేశాడు.  తదనంతరం  కాకతీయ రాజు గణపతిదేవ చక్రవర్తి సమయంలో ఆయన మంత్రులలో ఒకరైన హరి ఆలయ సమీపంలో ఒక తటాకాన్ని త్రవ్వించాడు.  అంతేకాదు,  ఆలయ నిర్వహణకిగాను  కొంత భూమిని కూడా ఇచ్చాడు.  కాలగమనంలో ఢిల్లీ బాదుషా అల్లావుద్దీన్ ఖిల్జి చేతిలో కాకతీయులు ఓడింపబడటంతో, సుమారు 925 సంవత్సరాలబాటు మహా వైభవంగా వెలుగొందిన దేవస్ధానం అన్య మతస్తులచే విధ్వంసంగావింపబడింది.  ఆలయ భూములు అన్యాక్రాంతమైనాయి తర్వాత బహమనీ సుల్తానులు, గోల్కొండ నవాబుల సమయంలో  దేవస్ధానం వైభవం ఇంకా క్షీణించింది..

 క్రీ.. 1940లో శ్రీ గణపతి శాస్త్రి అనే దేవీ ఉపాసకులు కర్ణాటక నుంచి జీవనోపాధి వెతుక్కుంటూ ప్రాంతానికి వచ్చారు.  ఆలయం చూసి, దానిని పునరుధ్ధరించాలనే కోరికతో ఆలయం పక్కనే చిన్న ఇల్లు కట్టుకుని వున్నారు.  ఆయన శ్రీ ముదుంబాయి రామానుజాచార్యులతో కలిసి స్ధానిక వర్తకులైన శ్రీ మగన్ లాల్ సమేజాగారిని కలిశారు.  శ్రీ సమేజాగారికి కలలో అమ్మవారు కనబడి ఆలయాన్ని పునరుధ్ధరించటానికి ఆయన దగ్గరకు వచ్చేవారికి సహాయం చెయ్యమని ఆదేశించినదట.  ఆదేశం ప్రకారం శ్రీ సమేజాగారు, ఇంకా ఇతర పెద్దలు కలిసి  ఆలయ పునర్నిర్మాణం తలపెట్టి 1950 లో పూర్తిచేశారు.

113 సంవత్సరాలు జీవించి తన జీవితంలో చాలా భాగం ఆలయానికి పూర్వ వైభవం తేవటానికి కృషిచేసిన శ్రీ గణపతి శాస్త్రిగారు నవంబరు 11 తారీకు 2011లో స్వర్గస్ధులైనారు.  2011 శ్రావణమాసంలో వారిని, వారి శ్రీమతిని దర్శించి వారి ఆశీర్వాదం తీసుకునే అదృష్టం నాకు కలిగింది.

1950 సంవత్సరం ముందు ఇక్కడ జంతు బలులు జరిగేవి.  కానీ ఆలయ పునర్నిర్మాణం తర్వాత వాటిని నిషేధించారు.  అంతేకాదు.  అంతకుముందు అమ్మవారుకూడా భయంకరమైన కళ్ళతో, వేళ్ళాడే నాలుకతో చాలా భీకరంగా వుండేదిట.  భక్తులు అమ్మ రూపాన్ని తట్టుకోలేరని ఆలయ పునరుధ్ధరణ సమయంలో అమ్మవారి నాలుకమీద అమృత బీజాక్షరాలు రాసి, నాలుకను సరిచేశారుట.  చండీ యంత్రం స్ధాపించి అమ్మవారి భయంకరమైన మహాకాళి రూపాన్ని మార్చి మహా త్రిపుర సుందరిగా చేశారుట.  త్రిపుర సుందరి అంటే మూడు పురములలోనా (మూడు లోకములలోనా) అత్యంత సౌందర్యవతి అని.  అప్పటినుంచీ అమ్మ భక్తులను బ్రోచే భద్రకాళి అయింది.

అమ్మవారి విగ్రహం 2.7 మీటర్ల ఎత్తు, 2.7 మీటర్ల వెడల్పుతో కూర్చుని వున్నట్లు వుంటుది.  అమ్మ అష్ట భుజాలతో, వివిధ ఆయుధాలతో అలరారుతూ వుంటుంది.  ప్రసన్నవదనంతో అలరారే అమ్మని ఎంత సేపుచూసినా తనివితీరదు.  అమ్మవారి ముందు శ్రీ చక్రం, ఉత్సవ విగ్రహాలుంటాయి.

ఆలయంలో వున్న ఉపాలయాలు ప్రదక్షిణ మార్గంలోశ్రీ వల్లభ గణపతి, ఆంజనేయస్వామి, శివాలయం, సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయాలు.  ఆలయం ముందు విశాలమైన మండపంలో అమ్మవారి చిన్న విగ్రహంపెట్టి అక్కడ అమ్మవారికి ఒడిబియ్యమిస్తున్నారు వచ్చిన మహిళలంతా.  శ్రావణ మాసంలో ఒడిబియ్యం ఇచ్చేవారి సంఖ్య చాలా ఎక్కువ.  తెలంగాణా ప్రాంతంలో ఇంటి ఆడబడుచులకు ఒడి బియ్యం పెట్టే ఆచారం వుంది.  అమ్మవారిని తమ ఇంటి ఆడబడుచుగా భావించి ఆవిడకి ఒడిబియ్యంపెట్టి తరిస్తారు ఇక్కడి మహిళలు.
 చైత్రమాసంలో వసంత నవరాత్రులు, ఆషాఢమాసంలో శాకంబరి ఉత్సవం, ఆశ్వీయుజమాసంలో శరన్నవరాత్రులు, ఆలయంలో జరిగే ప్రధాన ఉత్సవాలు.
విశాలమైన ఆలయం  ఇంకా విశాలమైన ప్రాంగణంతో, సుందరమైన పరిసరాలతో  చాలా ఆకర్షణీయంగా వుంటుంది.  ఆలయ పరిసరాలు అందంగా తీర్చిదిద్దటంతోబాటు చుట్టూవున్న గుట్టలమీద సమున్నతమైన దేవతా విగ్రహాలు నెలకొల్పి ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు.  పక్కనే వున్న తటాకం మీదనుంచి వచ్చే చల్లని గాలి సందర్శకుల సేద తీరుస్తూ ఆధ్యాత్మికతతోబాటు ఆహ్లాదాన్నీ అందిస్తూ వుంటుంది.  సాయం సమయంలో ఇక్కడి చెరువుమీదనుంచి వచ్చే చల్లగాలిని ఆస్వాదిస్తూ, సూర్యాస్తమయం తిలకించటం ఒక అద్భుతమైన అనుభవం.   ఇలాంటి అద్భుతమైన ప్రదేశం అవకాశం వున్నవారందరికీ అవశ్య దర్శనీయం.


 

(ఆశ అభినవ మాస పత్రిక మే 2012 సంచికలో ప్రచురించబడింది.)