పావనమైన పాలకుర్తి సోమేశ్వరాలయం
పూర్వం భారతదేశంలో అనేక ప్రదేశాలు పచ్చని వృక్షాలు, నదీనదాలు, కొండలూ వగైరా ప్రకృతి సంపదతో కళకళలాడేవి. అప్పుడు మనుషుల జీవితాలుకూడా ప్రశాంతంగా గడిచేవి. అనేకమంది ఋషులు పర్వతాల్లో, అరణ్యాల్లో తపస్సు చేసుకుంటూ ఆధ్యాత్మిక చింతనలో కాలం గడిపేవారు. అలాంటివారిలో కొందరికి భగవంతుడు సాక్షాత్కరించి, వారి కోరిక మీద అక్కడే వెలిసిన సంఘటనలు కూడా అనేకం. అలాంటి అద్భుతమైన ప్రదేశాలు ఎన్నో అనేక విధాల అభివృధ్ధిచెంది, అనేక రాజుల పోషణలో అత్యున్నత స్ధితి చూసి, కాలాంతరంలో ఆదరణ తగ్గి, ఈ కాలంలో మరుగునపడిపోతున్నాయి. అలాంటి అపురూప ఆలయాలు దర్శించటంవల్ల చరిత్రలో అనేక విశేషాలు తెలుసుకోగలుగుతాము. వాటిలో ఒకటి వరంగల్ జిల్లాలోని పాలకుర్తి.
హైదరాబాద్ - వరంగల్ రహదారిలో -- స్టేషన్ ఘనాపూర్ రైల్వే స్టేషన్ ముందునుంచి సరాసరి వెళ్తే 14 కి.మీ.లు వెళ్ళాక పాలకుర్తి వస్తుంది. ప్రశాంత వాతావరణంలో కొండల మధ్య వున్నది ఈ సోమేశ్వరాలయం. ఇక్కడ శివ కేశవులకు బేధం లేదని నిరూపిస్తూ పక్క పక్క గుహల్లో ఒక గుహలో సోమేశ్వరుడు, ఇంకొక గుహలో లక్ష్మీ నరసింహస్వామి వెలిశారు.
1200, 1300 సంవత్సరాల క్రితం ఇక్కడ ఋషులు తపస్సు చేసేవారనీ, వారికి ప్రత్యక్షమయిన సోమేశ్వరుడు వారి కోరికపై భక్తజనులనాదరించటానికి స్వయంభూగా ఇక్కడ వెలిశాడనీ చెబుతారు. సప్త ఋషుల కోరికపై సోమేశ్వరుడు ఇక్కడ వెలిశాడని ఇంకొక కధనం. ఈ గుహాలయంలో అమ్మవారినికూడా దర్శించవచ్చు.
ఈ స్వామి కరుణకి ఇంకో నిదర్శనం..పూర్వం ఒక వృధ్ధురాలు ప్రతి నిత్యం స్వామికి ప్రదక్షిణ చెయ్యటానికి కొండపైన ప్రదక్షిణ మార్గంలేక కొండ చుట్టూ తిరిగి వచ్చేది. వయసు మీద పడుతున్నకొలదీ ఆవిడ గిరి చుట్టూ తిరగలేక ప్రయాస పడుతుంటే పరమేశ్వరుడు తన ఆలయం వెనుక కొండ చీల్చి ప్రదక్షిణ మార్గమేర్పరిచి ఆ వృధ్ధురాలి ప్రయాస తప్పించాడు. అప్పటినుంచీ స్వామి ప్రదక్షిణ ఆ మార్గంలోనే చేస్తారు. ఈ సొరంగ మార్గం సన్నగా వుండి, కొండ చీలి ఏర్పడినట్లే వుంటుందిగానీ, ఎక్కడా కొండ పగలగొట్టి ఏర్పరచిన మార్గంలా వుండదు.. భక్తులు శుచిగా, భక్తిగా ఆ మార్గంలో వెళ్తే ఎంత లావయినవాళ్ళయినా సునాయాసంగా వెళ్తారనీ, అపరిశుభ్రంగా వెళ్ళేవారిని తేనెటీగలు కుట్టి, కుట్టి తరుముతాయనీ అక్కడివారి నమ్మకం. అక్కడ తేనెపట్లు చాలా వున్నాయి. ఆ తేనెటీగలు ఆ ప్రాంతానికి రక్షక భటుల్లాంటివన్నమాట.
కొండపైన వున్న ఈ ఆలయానికి మహత్యం చాలా ఎక్కువ అని భక్తుల నమ్మకం. ఈ స్వామిని సేవిస్తే సుఖ సంతోషాలు, సిరిసంపదలేకాక అపార జ్ఞాన సంపద లభిస్తుందని ప్రఖ్యాతి. ఇక్కడ గుహాలయంలోకి స్వామి దర్శనానికి కూడా ఇదివరకు కూర్చునీ, వంగునీ వెళ్ళవలసి వచ్చేదిట. అయితే 2003 లో భక్తుల సౌకర్యార్ధం ఈ మార్గం సుగమం చేశారు. ఏ ఇబ్బందీ లేకుండా మామూలుగా నడచివెళ్ళి స్వామిని దర్శించవచ్చు. సోమేశ్వరస్వామిని దర్శించి, పూజలు చేసి, పక్కనే ఇంకొక గుహలో వున్న (బయటకు వస్తున్న మార్గంలోనే కనబడుతుంది) శ్రీ లక్ష్మీ నరసింహస్వామినికూడా సేవించవచ్చు. ఇదివరకు కొండపైకి వెళ్ళటానికి 365 మెట్లు ఎక్కి వెళ్ళవలసి వచ్చేది. ఇప్పుడు కొండపైకి రోడ్డు కూడా వేశారు. ఆలయందాకా కార్లు వెళ్తాయి.
సంతానం లేనివారు ఈ ఆలయంలో కొబ్బరిగాయ ముడుపు కట్టి మొక్కుకుంటే పిల్లలు కలుగుతారనీ, తరువాత తమ మొక్కు తీర్చకోవటానికి స్వామి దర్శనం చేసుకుని, తొట్టెలు కడతారనీ చెబుతారు. కొండ దిగువ గో సంరక్షణశాల వున్నది. ఆసక్తి వున్నవారు ఇక్కడ గో పూజ చేసుకోవచ్చు. కార్తీక మాసంలో ఇక్కడ విశేష పూజలు, కార్తీక పౌర్ణమి రోజు లక్ష దీపారాధన జరుగుతాయి.
ఇతర దర్శనీయ స్ధలాలు
కొండ దిగువున ప్రఖ్యాత కవి పాలకుర్తి సోమేశ్వరుడి సమాధి వున్నది. ఈయన జన్మస్ధలం ఇదే. ఈయన రచించిన కావ్యాలు దశమ పురాణం, పండితారాధ్యుల చరిత్ర మొదలగునవి. సోమేశ్వర కవి తల్లిదండ్రులు ఈ స్వామిని సేవించి, కొడుకు పుడితే ఆ స్వామి పేరే పెట్టారుట. ఈ కవి జీవిత కాలం క్రీ.శ. 1160 – 1240. ఈ మహా కవి కూడా ఈ సోమేశ్వరుని ఆరాధించాడుట. అంటే అంతకు పూర్వంనుంచీ సోమేశ్వరస్వామి అక్కడ కొలువై భక్తుల అభీష్టాలు తీరుస్తున్నాడన్నమాట.
బమ్మెర పోతన సమాధి
ఇక్కడకి 2 కి.మీ. ల దూరంలో భాగవతం రచించిన మహాకవి పోతన నివసించిన బమ్మెర గ్రామం వున్నది. ఇక్కడే మహా భాగవతం రచింపబడ్డది. పోతనగారు ఒక పద్యం పూర్తి చేయలేనప్పుడు రామ లక్ష్మణులు వచ్చి ఆ పద్యం పూర్తిచేశారు. అలాంటి పుణ్య స్ధలానికి మనం సరైన విలువ ఇవ్వటం లేదనిపిస్తుంది. సోమేశ్వరస్వామి వెలిసిన కొండకింద బమ్మెరని దర్శించమని బోర్డు వున్నదిగానీ, మార్గ నిర్దేశక సూచికలేమీలేవు. అక్కడివారినడిగితే కారు వెళ్ళదు..రెండు కిలో మీటర్లు నడవాలి అన్నారు. మేమున్న పరిస్ధితుల్లో వెళ్ళలేక…అంతటి మహనీయుని సమాధి దర్శించలేకపోయామనే బాధతో వచ్చేశాము. అయితే అక్కడిదాకా రోడ్డు వేస్తున్నారనీ, ఆ పరిసరాలను యాత్రీకుల దర్శనార్ధం తీర్చి దిద్దుతున్నారనీ విని సంతోషించాము. అలాగే ఒక చిన్న రామాలయం వున్నది..కానీ మూసి వున్నది. అక్కడ ఏ విషయమూ తెలిపే బోర్డేమీ లేదు. బహుశా రామ లక్ష్మణులు పద్యం పూర్తి చేసినది ఇక్కడే అయి వుండచ్చనుకున్నాం.
వరంగల్ నుంచీ పాలకుర్తికి బస్సు సౌకర్యం వున్నది. దూరం 40 కి.మీ. లు. పాలకుర్తిలో వసతి భోజన సౌకర్యాలు లేవు. కొండ దిగువ కాఫీ, టీలు, చిప్స్ లభిస్తాయి.
(ఆశ ఆభినవ మాస పత్రిక జూన్ 2012 సంచికలో ప్రచురించబడింది.)
సోమేశ్వరాలయానికి దోవ
దూరంగా కొండమీద ఆలయం
ప్రదక్షిణ మార్గము
సోమేశ్వరుడు
11 comments:
mee punyamaa ani someswarunni darsinchaamu. potanagaari vooriloki velli vachchaaru ade adrushtam. potana gaari samaadhi avi akkada vunnaayani prachaaram chesi akkadiki bhaktulu velle daari sarichese baadhyata prabhutvaanidi. teluguvaariki krushnunni darsimpa chesindi,teluguloni tiyyadana teliya cheppindee potanekadaa? mee vyaasam chadivi spandana vaste santosham
chudatame kani ఇలా విశదంగా విశేషాలతో అందరూ రాయలేరు లక్ష్మీ గారూ ...మాకు ఇలా తీర్థ యాత్రలు చెయ్యడం వీలేకాదు..మీద్వార ఎన్నో తెలుసుకుంటున్నాం . మీ ఫోటోలు కూడా చాలా బాగుంటాయి. అభినందనలు
లక్ష్మీ రాఘవ
ఈ ’పాల్కుర్తి’నే ప్రాచీన కాలంలో ’పాల్కుర్కి’ అనే వారు. పన్నెండవ శతాబ్దికి చెందిన మహాకవి పాల్కుర్కి సోమనాథుని జన్మస్థలం ఇది. ఆ దేవాలయంలోని ఆ సోమేశ్వర స్వామి వరప్రసాదిగా పుట్టడం వలన ఆ కవికి ఆ పేరు పెట్టారని ప్రతీతి. అక్కడి నుండి రెండు కి.మీ. దూరంలో ఉన్న ’బమ్మెర’ పదిహేనవ శతాబ్దికి చెందిన మహాకవి బమ్మెర పోతన జన్మస్థలం.
నేను ఒక కవిగా ఆ ఇరువురు మహా కవులపై ఎంతో భక్తితో ఆ ప్రాంతాలను దర్శించుకోడానికి వెళ్ళినప్పుడు - దారులను వెదుక్కొంటూ, తిండి తిప్పలు దొరకక పడ్డ అవస్థలు మరచిపోలేను. తెలుగు భాషా ప్రాతిపదికన ఏర్పడ్డ 'ఆంద్ర ప్రదేశ్' ప్రభుత్వం 56 ఏళ్లలో అత్యంత ప్రముఖ తెలుగు ప్రాచీన మహాకవుల జన్మ స్థలాలను ఇలాంటి దుర్భాగ్య స్థితిలో వదలివేయడం ప్రాంతీయ వివక్ష కాక ఇంకేమిటి?
జ్ఞాన ప్రసూనగారూ, మీ స్పందనకు చాలా సంతోషం.
రాముడు పద్యం పూరించిన చోటు, పోతన, పార్కురికి సోమనాధుడు, వీరందరూ మనవారు అని గర్వించినా, వీరంతా ఏ ఫారెన్ లోనో వుంటే వారి విలువ ఇప్పుడు ఆకాశమంత ఎత్తుకి ఎదిగేదికదా..మనవాళ్ళకి విలువలు తెలియక చేజార్చుకుంటున్న మణులెన్నో.
psmlakshmi
ధన్యవాదాలు లక్ష్మీ రాఘవగారూ
అందరికీ అన్ని ప్రదేశాలకూ వెళ్ళటానికి అవకాశం వుండదు. దానికి అనేక కారణాలు. కానీ తెలుసుకోవాలనే జిజ్ఞాస వుంటే చాలండీ ఇలాంటి ప్రదేశాలు మరుగునపడకుండా వుండటానికి.
psmlakshmi
డా. ఆచార్య ఫణీంద్ర గారికి నమస్కారములు.
మీ స్పందనకు ధన్యవాదాలు. పోతనగారి జన్మస్ధలం, రాముడు పద్యం పూరించిన చోటు, సోమనాధుని గురించి తెలుసుకుందామని ఎంతో ఉత్సాహంగా వెళ్ళిన మాకు అక్కడ పరిస్ధితులు చాలా బాధాకరం అనిపించాయి. కొంత ఊరట ఏమిటంటే పోతన గారి సమాధి ప్రాంతాలు అభివృధ్ధి పరుస్తున్నారన్నారు. ఎప్పటికవుతుందో. ఇవేకాదండీ. ఇలాంటివి మన ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నో వున్నాయి. వరంగల్ జిల్లాలోని ఘనాపూర్ లో వున్న కొటగుళ్ళు. రామప్పగుడికి కేవలం పది కిలో మీటర్ల దూరంలో వున్నా, రామప్పగుడినుంచి దోవవున్నా, అక్కడ సరైన సూచిక లేకపోవటంవల్ల సమయం, అభిరుచి వున్నవాళ్ళుకూడా అక్కడదాకా వెళ్ళి అవి చూడకుండా వస్తారు. అలాంటివి చూసినప్పుడల్లా చాలా బాధ కలుగుతుంది. సర్కారువారి రాజకీయ అజెండాలో ఇలాంటివాటిని వాళ్ళంతవాళ్ళు పట్టించుకునే అంశం వుండకపోవచ్చు. కానీ ఆ ప్రాంత ప్రజలు వాళ్ళ దగ్గరవున్న అమూల్య సంపదను గుర్తించి, ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చి వాటి సంరక్షణ గురించి కొంత బాధ్యత వహిస్తే బాగుంటుందని నాకనిపిస్తోంది.
ఆంధ్రప్రదేశ్ లో ఇలాంటివాటిని ఎన్నో చూశాము. ఏదో చెయ్యాలనే తపన. ఏం చెయ్యాలో తెలియక ప్రస్తుతానికి వీలయినంతమందికి తెలియజేసే ప్రయత్నంలో వున్నా.
psmlakshmi
/ఇలాంటి దుర్భాగ్య స్థితిలో వదలివేయడం ప్రాంతీయ వివక్ష కాక ఇంకేమిటి? /
ఓ తిండి తిప్పలు లేకుండా కష్టపడి దర్శించిన కవిగా మీరు దేవాదాయశాఖకు ఏమైనా అర్జీ ఇచ్చారా? ఎప్పుడూ ప్రాంతీయ వివక్ష అని ఏడ్వటం, రాజకీయాలు ఆడటం
తప్ప? దేవాదాయ శాఖ మంత్రి మన MS.Satyanaaraayana వుండేవారుగా.
పోతన రాముని సేవించింది మాత్రం కడప దగ్గరి ఒంటిమిట్టలో. అక్కడ పురాతనమైన పెద్ద ఆలయం కూడా వుంది. నేవెళ్ళినపుడు చూశాను.
snkr గారూ
ఒంటిమిట్టలో అతి పురాతనమైన రామాలయం, దానికి పెద్ద చరిత్రకూడా వున్నాయి. మేమూ చూశాము. కానీ పోతనగారు భాగవతంలో ఒక పద్యం పూర్తి చేయటం కుదరక అలాగే నిద్రపోతే, ఆయన నిద్ర లేచేసరికి రాముడు వచ్చి ఆ పద్యం పూర్తి చేశాడని, అది ఇక్కడేనని విన్నాము. అలాంటిదే నిజమైతే ఆ సంగతి అందరికీ తెలిసేట్లు చేస్తే బాగుండేది.
psmlakshmi
ఎప్పుడూ ఏడుస్తూ ఉంటారని అంటారనే, కనీసం ఇలాంటి సందర్భం వచ్చినప్పుడైనా నలుగురికీ విషయం తెలియపరచాలన్న ప్రయత్నం చేస్తుంటాము మేము. వెంటనే SNKR లాంటి వాళ్ళు వచ్చి మీదపడి మా నోళ్ళు మూయించాలని చూస్తారు.
అయ్యా!
నేను సంకుచిత ప్రాంతీయ వాదినని నీ ఉద్దేశ్యం. మరి నువ్వు సమదృష్టి గల సమైక్యవాదివి కదా! నువ్వు అర్జీలు పెట్టి ఒకటి రెండు సంవత్సరాలలో ఆ ప్రాంతాలను తెలుగు వారు గర్వించగల పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేయించు.
ఊళ్ళో వాళ్ళు, ఎం.ఎల్.ఏలు పోరగా, పోరగా - లక్షలు వెచ్చించాల్సిన ఈ ప్రాజెక్టులకు వేలు విదిల్చడానికి కూడా వేళ్ళు రావు ఈ ప్రభుత్వానికి.ఆ వేలతో ఆ ఫోటోలలో ఉన్న ఆ 'కమానులు', గద్దెలు అవడమే ఎక్కువ. ఆ మాత్రం పనులు జరిగింది పి.వి. నరసింహా రావు రాష్ట్ర మంత్రిగా, ప్రముఖ కవి జే. బాపురెడ్డి జిల్లా కలెక్టర్ గా ఉన్నప్పుడు.
నువ్వు, నేను సరే! డా. సి.నారాయణ రెడ్డి తెలుగు విశ్వ విద్యాలయం వైస్ చాన్సలర్ గా ఉన్నప్పుడు పాలకుర్తిని సాహిత్య పీఠంగా, పర్యాటక స్థలంగా అభివృద్ధి చేయాలని విశ్వ ప్రయత్నం చేయగా - విడుదలైన అత్తెసరు నిధులు " ఇది పాల్కురికి సోమనాథుని జన్మస్థలం" అని గుడి ముందు ఒక శిలా ఫలకం వేయడానికి సరిపోయాయి.
ఇవి పోను, అసలు ఈ కవులు ఈ ప్రాంతానికి చెందిన వారని ఒప్పుకొంటే తమ ఆభిజాత్యం దెబ్బ తింటుందని బాధ పడే "తెలుగు వారూ" ఉన్నారు. వాళ్ళు పాల్కుర్కి సోమనాథుని జన్మస్థలం కర్ణాటకలో ఉందనడానికి కూడా వెనుకాడరు. మరి వీరు వీరేశలింగం పంతులు గారి "కవుల చరిత్రం", ఇంకా ఇతర సాహితీ వేత్తలు ఆధారాలతో నిరూపించిన గ్రంథాలను చదువరు మరి! ఏదైనా కాస్త ప్రభుత్వం ముందడుగు వేయబోతే, ఇలాంటి వాదాలు రేపి అడ్డుకోవాలి కదా మరి!
సరే! ఇంతవరకు జరిగింది వదిలేయండి. తెలంగాణ పౌరులు చేత కాని వాళ్ళు, సమదృష్టి గల సమైక్య సీమాంధ్ర మంత్రులు, పౌరులు ఇక మనందరికీ కావలసిన ఈ సారస్వత మూర్తుల జన్మ స్థలాల అభివృద్ధికి ఏ మాత్రం పోరాడుతారో చూద్దాం.
లక్ష్మి గారు!
ముందుగా మీ బ్లాగులో ఇతర కామెంటర్ కు ఇలా వివరణ ఇవ్వవలసి వస్తున్నందుకు నన్ను క్షమించగలరు. నిజానికి మీవంటి ఏ భేద భావాలు లేని సహృదయ యాత్రికుల వలన అటు వైపు కొందరికైనా ఈ ప్రాంత విశేషాలు తెలుస్తున్నాయి. అందుకు మీకు పాదాభివందనం చేయాలి.
అందరకీ నమస్కారం. దయచేసి ప్రాంతీయ విభేదాల జోలికి పోవద్దు. నేను పుట్టింది, కొంత చదివింది ఆంధ్రాలో, ఇంకొంత చదివింది, బతుకుతున్నది రాష్ట్ర రాజధానిలో. నాకు ఇలాంటి అమూల్యమైన సంపద, అది ఏ ప్రాంతందైనా సరే చాలా ఇష్టం. అందులోనూ ఇలాంటి సంపద మనదేశంలోనే వున్నదని, ఈ దేశంలో పుట్టించినందుకు భగవంతుడికి కృతజ్ఞతలు చెప్తూవుంటాను. అందుకే వీలయిన ప్రదేశాలన్నీ చూస్తాను. అవి ఏ ప్రాంతంలోవున్నా సరే. అవి ఉన్నత స్ధితిలో వుంటే సంతోషిస్తాను..ఇలావుంటే బాధ పడతాను.
ఇలాంటివి బాగు చేయాలంటే ఏ ఒక్కరివల్లో కాదు. ముందు ఆ ప్రాంతంవారు (నా ఉద్దేశ్యం ఆ ఊరు, మండలం వగైరా మాత్రమే) వాటిగురించి తెలుసుకుని వాటి విలువ పెంచటానికి నడుంకట్టాలి. వాటిగురించి ప్రచారం చేసి, నిర్దేశిత సమయాల్లో ఒకరు అక్కడ వుండేటట్లుచూసి, వారి భుక్తికి కొంతన్నా గ్రామవాసులు ఏర్పాటు చేసి మిగతా అభివృధ్ధి కార్యక్రమాలు వచ్చే భక్తులద్వారాను, సర్కారువారి ద్వారాను ప్రయత్నించవచ్చు.
అన్నింటికన్నా ముందు వివరాలు తెలిపే బోర్డులు పెట్టాలి. వాటివల్ల సందర్శకులు పెరుగుతారు.
psmlakshmi
Post a Comment