మధ్యార్జునం
ఇవాళ ఉదయం మా
టీవీలో బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావుగారి శ్రీశైల వైభవం ప్రవచనంలో మధ్యార్జునం గురించి
ప్రస్తావించారు. పరమ గురువు శ్రీశ్రీశ్రీ చంద్రశేఖరాచార్యులవారికి
అత్యంత ప్రీతిపాత్రమైన ప్రదేశాలు మధ్యార్జునం, శ్రీశైలం అనీ, మధ్యార్జునంనుంచి ప్రసాదం
ఎవరైనా తెస్తే అత్యంత భక్తితో తీసుకుని తలమీద పెట్టుకుని తీసుకునేవారనీ, ఆయన ఎవరేమిచ్చినా
తీసుకోరనీ, ఈ ప్రసాదానికి మాత్రం అభ్యంతరం చెప్పేవారుకాదనీ చెప్పారు.
ఇంకా ఇక్కడ ఒక
మద్ది చెట్టువున్నదని, అటు వెళ్ళే దోవకి తాళం వేసి పెడతారని, అడిగితే చాలా కష్టంమీద
తాళం తీసి చూపిస్తారు, మేముకూడా అలాగే తాళం తీయించే చూశాము..ఆ చెట్టుకి ప్రదక్షిణ చేస్తే
చాలా మంచిది అని చెప్పారు. పైగా ఇటువంటి మద్ది
చెట్లు మధ్యార్జునం, శ్రీశైలంలో మాత్రమే వున్నాయని చెప్పారు.
శ్రీ చాగంటివారి
ప్రసంగం విన్నాక ఆ మధ్యార్జునం గురించి తెలుసుకుని వీలైతే, దర్శించాలని నెట్ లో వెతికాను. మా అదృష్టం.
నేను అనుకున్నది నిజమయింది. ఈ క్షేత్రాన్ని
మేము 24-12-2008న దర్శించాము. అయితే నాకు ఆ
క్షేత్రం పేరు మధ్యార్జునం అని ఇవాళే తెలిసింది.
ఇది తమిళనాడులో కుంభకోణం దగ్గర వున్నది.
కుంభకోణంనుంచి బస్సు ప్రయాణం 40 నిముషాలు పట్టింది.
ఈ క్షేత్రానికి
మాకు తెలిసిన పేరు తిరువిదైమరుదూరు. శివుడు
మహాలింగేశ్వరుడు. పెద్ద లింగం. చాలా పెద్ద ఆలయం. పెద్ద కారిడార్. అతి పురాతన ఆలయం. చాలా ప్రశాంతంగా, దర్శకుల మనసులో భక్తిభావం పెల్లుబికేలా
వున్నది. దూరంనుంచే మహాలింగేశ్వరుని చుట్టూ
ఆర్చి లో వెలిగించిన దీపాలు కనులవిందు చేస్తుంటే తాదాత్మ్యంగా స్వామిని దర్శించుకున్నాము.
ఆ ఆలయాన్ని చూసి
అత్యంత ప్రభావితులమయ్యాముగానీ, భాషారపమైన ఇబ్బందులవల్ల ఇంతటి అపురూప ఆలయాల చరిత్ర సరిగా
తెలుసుకోలేకపోయానని అప్పుడు చాలా బాధ పడ్డాను.
తెలుసుకున్నంతవరకు సృష్టి మొదలయినప్పుడు
భక్తులు సేవించుకోవటానికి పరమ శివుడు ఈ లింగాన్ని సృష్టించి, ఆ లింగానికి శక్తిని ప్రసాదించటానికి
తాను తపస్సు చేసి, ఆ తపో శక్తిని అందులో ప్రవేశపెట్టి, తానుకూడా అందులో లీనమయ్యాడని. పరమశివుడు స్వయంగా తపస్సు చేసి ఆ శక్తిని ఆ లింగంలో
ప్రవేశపెట్టాడంటే అది ఎంతటి మహాద్భుత లింగమో అని తిరిగి తిరిగి నమస్కారాలు చేస్తూ వచ్చాము.
ఇంకొక విశేషంకూడా
మేమక్కడ చూశాము. మేము కుంభకోణంనుంచి అక్కడికి
వెళ్ళేసరికి సాయంకాలం 4 గం. లు కావస్తోంది.
4 గం. లకు ఆలయం తీశారు. అప్పుడు మావటివాడు
ఆలయ గజరాజాన్ని కొంత లోపలికి తీసుకువచ్చి ప్రదక్షిణ చేయించి తీసుకువెళ్ళాడు.
అమ్మవారికి విడిగా
ఆలయం, మూకాంబికకు ఒక చిన్న ఆలయం కూడా వున్నాయి.
అప్పుడు నేను ఇంతకన్నా వివరాలు సేకరించలేకపోయాను. ఇదని తెలియక పొద్దున్న శ్రీ చాగంటివారు చెప్పినప్పుడు
విశేషాలు రాసుకోలేకపోయాను. ఈ క్షేత్రం గురించి
ఇంకా తెలిసినవారు స్పందించగలరు.
ఆలయం లోపలి దృశ్యాల
ఫోటోలు చూడండి. అప్పుడు ఎవరూ అభ్యంతర పెట్టకపోవటంతో
మీకీ ఫోటోలందివ్వగలుగుతున్నాను.
5 comments:
చాలా బాగుంది అమ్మా, అదృష్టవంతులు మీరు,
ఆ అమ్మ అనుగ్రహము మీ మీద నిండుగా వున్నది. ఇలాగే కొనసాగించండి మీ జీవితాన్ని.
మీ
భాస్కరానంద నాధ
నమస్కారం భాస్కరానందగారూ
కృతజ్ఞతలు. నిజంగా అమ్మ అనుగ్రహం వల్లనే ఈ ఆలయ దర్శనం అనిపిస్తుంది.
psmlakshmi
అమ్మా, తిరువిడైమరుదూర్ మహాలింగస్వామి కి సంబంధించిన మరో విశేషం - స్వయంగా "అద్వైతం సత్యం" అని మూడుసార్లు వక్కాణించి శ్రీ శంకరాచార్యులవారిని ఆశీర్వదించి, అద్వైత సిధ్ధాంత ప్రచారానికి "గ్రీన్ సిగ్నల్" ఇచ్చిన పరమేశ్వరరూపం ఈ మహాలింగస్వామివారే!
నమస్కారం కె.వి.యస్. గారూ
ధన్యవాదాలు
పి.యస్.యమ్.లక్ష్మి
Post a Comment