Tuesday, August 25, 2009

జగ్గయ్యపేటలో దేవాలయాలు

శ్రీ చెన్నకేశవస్వామి ఆలయం వెలుపలి ద్వారం



శ్రీ పంచనామాల వెంకటేశ్వరస్వామి ఆలయం వెలుపలి దృశ్యం


జగ్గయ్యపేటలోని ఆలయాలు



జగ్గయ్యపేట ఊళ్ళో ప్రసిధ్దికెక్కిన పురాతన ఆలయాలతోపాటు క్రొత్త ఆలయాలు కూడా చాలా వున్నాయి. అయితే వీటిని చూడాలంటే ఉదయం 9 గం. లలోపే వెళ్ళాలి. తర్వాత గుడి మూసేస్తారు. మధ్యాహ్నం ఒక గంటసేపు నైవేద్యంకోసం తీస్తారు, మళ్ళీ సాయంత్రం 6 గం. లకే తీస్తారు. అయితే చాలా ఆలయాలలో పూజారి ఇల్లు సమీపంలోనే వుంటుందిగనుక కనుక్కుని వెళ్ళి అడిగితే వాళ్ళు వచ్చి ఆలయాన్ని తెరుస్తారు. ఇక్కడ గుళ్ళకి మాన్యాలుకూడా బాగానే వున్నాయంటారుకానీ చాలామటుకు జీర్ణావస్ధలో వున్నాయి. మన దేశానికే ప్రత్యేకమైన ఈ పురాతన ఆలయాలను ఆదరించి, అభివృధ్ధిచేసి తరతరాలూ కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనావుంది.

ఉదయం జగ్గయ్యపేటలోని కొన్ని గుళ్ళు చూడాలని బయల్దేరాము. ఊళ్ళో పాత దేవాలయాలు వున్నాయని హోటల్ లో చెప్పారుగానీ అవి ఏమిటో, ఎక్కడ వున్నోయో చెప్పలేకపోయారు. ఇలాంటి విషయాలలో ఆటోవాళ్ళు సరైన సమాచారం ఇస్తారు. ఒక ఆటో అతన్ని అడిగేసరికి ఇద్దరుముగ్గురు పోగయ్యారు. వాళ్ళకి అన్ని గుళ్ళూ తెలియవని ఇంకొకతన్ని పిలిచారు..అతనికి అన్ని గుళ్ళూ తెలుసని. అతని పేరు రాము. ముందే చెప్పాం మాకు ఇక్కడ దోవలు తెలియవు, మధ్యాహ్నందాకా వీలైనన్ని పాత గుళ్ళు చూపించాలని. రాము చాలా మంచివాడు. పంచనామాల వెంకటేశ్వరస్వామి గుడి తప్ప మిగతా గుళ్ళు మూసివుంటే, పూజార్ల ఇళ్ళు కనుక్కుని వెళ్ళి పిలుచుకు వచ్చాడు. ఇద్దరు కొడుకులను చదివిస్తున్నాడుట. మాతోబాటు అన్ని గుళ్ళకీ వచ్చి అర్చకులనడిగి మాకు వివరాలు చెప్పించాడు. అతను చూపించిన నాలుగు దేవాలయాల గురించి వివరిస్తున్నాను. ఇవికాక పాత, కొత్త ఆలయాలు చాలా వున్నాయ

పంచనామాల వెంకటేశ్వరస్వామి ఆలయం

200 సంవత్సరాల క్రితం కట్టిన ఆలయం ఇది. ఇటీవల మరమ్మత్తులు చేయించి ఆలయం చుట్టూ బయటవైపు దేవుళ్ళ టైల్స్ వేయించారు. బాగున్నాయి.

ఇదివరకు ఇక్కడ గోశాల వుండేదిట. ఏసోబు కోటయ్య అనే ఆయనకు శ్రీ వెంకటేశ్వరస్వామి కలలో కనబడి తానక్కడ వెలిశానని చెప్పటంతో విగ్రహాన్ని తవ్వి తీశారుట. శిలకు 5 నామాలు వున్నట్లు ప్రత్యక్షమయ్యారుట స్వామి. (ఇక్కడ వెంకటేశ్వరస్వామి విగ్రహ రూపంలో వుండరు...శిలా రూపంలో వుంటారు). ఆప్పటినుంచీ స్వామిని కేశవనామాలతో అర్చించసాగారు।

శ్రీ చెన్నకేశవస్వామి ఆలయం

ఇది చాలా పాతది. ఆలయం మూసివున్నది. ద్వారం చాలా పెద్దది. ఆ ద్వారాన్ని చూసి లోపల గుడి చూడలేకపోయామే అనుకున్నాము. ఇక్కడ పూజారి ఉదయం, సాయంత్రం వచ్చి పూజలు చేసి వెళ్ళిపోతారుట. జనం ఎక్కువగా రారట...అందుకనేనేమో.

రేపటి పోస్టు శ్రీ చంద్రమౌళీశ్వరస్వామి దేవాలయం గురించి।





0 comments: