Thursday, August 6, 2009అమెరికాలో వరలక్ష్మీ వ్రతం

అమెరికా అయినా ఆస్ట్రేలియా అయినా మన పధ్ధతులు మనం మానుకుంటాంటండీ చోద్యంకాకపోతేనూ. అందులోనూ వరలక్ష్మీ వ్రతం. చిన్నప్పటినుంచీ పెద్ద ఎత్తున చెయ్యటం అలవాటున్నదయ్యే. ఈ మారు వ్రతం రోజు అమెరికాలో వుంటామని ఒక విధంగా సంతోషించా. మా అమ్మాయి కొన్నేళ్ళనుంచీ ఈ వ్రతాన్ని చేసుకోలేకపోతోంది. సరే ఈమారు దానిచేత చేయించవచ్చులే అని నా సరదా. ముందే చెప్పాను ఆరోజు వీలయితే సగం రోజయినా సెలవు పెట్టమని. సరేనన్న పిల్ల కాస్తా ఉదయం 10 గం. లలోపు చేసేయమ్మా. 10 గం. లకి బయల్దేరి వెళ్తాను, అంతమటుకే సర్దుబాటు చేసుకోగలిగాను అన్నది. రోజూకి మల్లే పొద్దున్నే 7 గం. లకల్లా బయల్దేరాలనలేదు. అదే మహద్భాగ్యం అని సంతోషించాను. ఎక్కువ హడావిడి పెట్టుకోకు. 10 గం. లకల్లా ఎట్టి పరిస్ధితుల్లో నేను బయల్దేరాలి అని ఒక కాషన్ కూడా ఇచ్చింది. సరే తప్పేదేముంది

ముందురోజు నేనూ, మా అబ్బాయి ఇండియన్ స్టోర్స్ కి వెళ్ళి కొబ్బరికాయలు వగైరా తెచ్చాము. ఇక్కడ కొబ్బరికాయలకి పిలకలుండవండోయ్. కాయ కొంచెం పెద్ద సైజే వుంటుంది కానీ పీచు అస్సలు వుండదు. గుండ్రంగా బంతిలాగా వుంటుంది. ఇండియన్ స్టోర్స్ లో ఇండియాలో దొరికే సామాన్లన్నీ దాదాపు దొరుకుతాయి పూలు తప్ప.

మా అమ్మాయికి చెప్పా పూలు తీసుకు రమ్మని. ఇక్కడ పూలు బొకేలలాగే కట్టలుగా అమ్ముతారు. అది మర్చిపోయింది. ఇంటి పక్కన చిన్న బుష్ కి పూలు చూశాను అవ్వన్నా నాలుగు కోసుకురమ్మన్నాను. ఇక్కడ అలా కొయ్యరమ్మా అని చిన్న చిన్న పూలు సరిగ్గా నాలుగే కోసుకొచ్చింది. ఇండియాలో అమ్మవారికి ఎన్ని పూలు పెట్టినా నాకు తృప్తి వుండేది కాదు. మా వారిని మార్కెట్ కి పంపి మరీ పూలు తెప్పించేదాన్ని. ఏం చేస్తాం. Be a Roman while in Rome అనుకున్నాను.

సరే వంటలో మా వారి సహకారంతో (వంట వచ్చిన మగవాళ్ళతో ఉపయోగాలు కూడా వున్నయ్యండోయ్) పూజ తొందరగానే మొదలు పెట్టాము.

సంకల్పం మొదలు పెట్టేసరికి తికమక. అలవాటు ప్రకారం జంబూ ద్వీపే, భరత వర్షే, భరత ఖండే...అవునూ మనమున్నది భరత ఖండంలో కాదుకదా...మరేం చెప్పాలి...ఇప్పుడెవర్నడుగుతాం..మనకొచ్చిందే చెప్పుకుందాం....అమెరికా దేశే, మిచిగాన్ రాష్ట్రే, మేరో దక్షిణ..సరే ఇక్కడ అవి తెలియవు..వదిలేయ్.. శ్రీ శైలస్య సుదూర ప్రదేశే, కృష్ణా గోదావ...కాదు కాదు....ఇక్కడేమన్నా నదులున్నాయా....ఆ...మిచిగాన్లో లేక్స్ ఎక్కువ. పెద్దవి నాలుగో ఐదో వున్నట్లు చెప్పారు..ఇప్పడవ్వన్నీ అడుగుతూ కూర్చుంటే ఆలస్యమవుతుంది..పంచ సరస్సుల సమీప ప్రాంతే......హమ్మయ్య....

చివరికి పూలు తక్కువ అయినా పూజ తక్కువ కారాదు, సంకల్పలోపాలున్నా భక్తి లోపాలుండకూడదనుకుంటూ పూర్తి చేశాము.

అమ్మవారికి పూర్ణం బూరెలు, పరవాణ్ణం, పులిహోర, కట్టు పొంగలి, దధ్ధోజనం నైవేద్యం పెట్టాం.

మా అమ్మాయి మాత్రం సంతోషించింది చాలా ఏళ్ల తర్వాత పూజ చేసుకున్నందుకు. మేముండబట్టి ఈ మాత్రమైనా..లేకపోతే వాళ్ళ హడావిడిలో వాళ్లకి చేతయింది....ఇదొక ఎక్స్పీరియన్స్. కదా!1 comments:

కొత్త పాళీ said...

హ హ హ. బాగా చెప్పారు సంకల్పం.
ఇక్కడ అడపాదడపా పూజ చేసుకునే వాళ్ళకి ఇది సంతత సందిగ్ధ ఘట్టం.
కొందరు క్రౌంచ ద్వీపే, ఐంద్ర ఖండే అని చెబుతారు.
మా వూరి శాస్త్రిగారు క్రౌంచ ద్వీపే అమెరికా వర్షే, అమెరికా ఖండే, పంచ సరోవరానాం మధ్య దేశే అని చెబుతారు.