Thursday, December 10, 2009

చిదంబర రహస్యం--3



చిదంబంరంలో ఇతర దర్శనీయ స్ధలాలు

తిల్లయ్ కాళి ఆలయం
 ఈ ఆలయానికి సంబంధించిన ఒక కధ.. ఒకసారి శివునికీ, శక్తికీ మధ్య నాట్య పోటీ జరిగింది.  దానిలో ఓడిన శక్తిని తిల్లయ్ సరిహద్దులలో వుండవద్దని స్వామి శాసించారు.  అందుకే ఆలయానికి ఉత్తరంగా ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలో ఈవిడ ఆలయం వుంటుంది.  ఇక్కడ శక్తి ఉగ్రరూపంలోను, శాంత రూపంలోను ఒకే ప్రాంగణంలో రెండు వేరు వేరు ఆలయాల్లో కొలువై వుంది.  ఉగ్ర రూపం విగ్రహం మొత్తం కుంకుమతో అలది కళ్ళు కాటుకతో తీర్చిదిద్దారు.



పాశుపతేశ్వర ఆలయం
కాళీ ఆలయం నుంచి అన్నామలైనగర్ లో వున్న ఈ ఆలయానికి ఆటోలో 25 నిముషాల ప్రయాణం.  నటరాజ ఆలయంనుంచీ ఈ రెండు ఆలయాలనూ చూసిరావటానికి ఆటోకి 140 రూ. తీసుకున్నాడు.  శివుడు అర్జునునికి పాశుపతాస్త్రాన్ని ఇచ్చిన ప్రదేశం.  ఇక్కడ శివుణ్ణి వేటగాని రూపంలో ప్రతిష్టించారు.  అమ్మవారు నల్లనాయకి.


అన్నామలై యూనివర్సిటీ
ప్రసిధ్ధి పొందిన అన్నామలై యూనివర్సిటీ భవనాలను పాశుపతేశ్వరాలయానికి వెళ్ళే త్రోవలో చూడవచ్చు.


పిచ్చవరం
చిదంబరానికి 15 కి.మీ. ల దూరంలో వున్న పిక్నిక్ స్పాట్ ఇది.  ఇక్కడి ప్రకృతి అందాలు ఆస్వాదించాలంటే సముద్రం బ్యాక్ వాటర్స్ లో  వున్న బారులు తీరిన తిల్లయ్ వృక్షాల  మధ్యనుంచి బోటు షికారు తప్పనిసరి.  ఈ వృక్షాల వల్లనే ఈ మధ్య వచ్చిన సునామీని ఈ ప్రాంతం తట్టుకుందట.  లేకపోతే నామరూపాలు లేకుండా పోయేదిట.  వీటికి ఇంకో పేరు అండిలయ్ సుర పొన్నయ్.  బొటానికల్ పేరు రెజోఫరా ఎపిక్యులేటా.  ఇద్దరికి ప్రత్యేక బోటు గంటకి 90 రూ. లు.  మనుషులు,  సమయం, సీజన్ బట్టి రేట్లు మారుతాయి.  ఇక్కడికి కూడా ఆటోలో వెళ్ళిరావచ్చు (250 రూ.)  బస్సుస్టాండునుంచీ గంటకోబస్సు కూడా వుంది.  నటరాజ ఆలయంముందునుంచి వెళ్ళే ప్రతి బస్సూ  బస్ స్టాండుకి వెళ్తుంది.




ఇవ్వండీ చిదంబర క్షేత్ర వివరాలు.  ఒక రోజు అక్కడ వుండేటట్లు వెళ్తే అన్నీ చూడచ్చు.

Wednesday, December 9, 2009

చిదంబర రహస్యం--2






చిదంబర రహస్యం ఏమిటో తెలుసుకోవాలని కుతూహలంగా వుందా  అయితే చదవండి.

గర్భ గుడిలో నటరాజస్వామికి కుడి ప్రక్కన ఒక చిన్న ద్వారం వుంది. దానికి తెర వేసి వుంటుంది.  ఇక్కడ గోడలో ఒక విశిష్ట యంత్రం బిగించబడి వుందని చెప్తారు.  అది ఏ యంత్రమో ఎవరికీ తెలియదు.  దాని పైన ఎప్పుడూ దట్టమైన చందనం పూసి వుంటుంది.  దానిని ఎవరూ తాకరాదు.  ప్రధాన అర్చకుడు మాత్రం రాత్రి వేళ తలుపులు వేసి ఆ యంత్రానికి పూజ చేస్తారు.  ఇంకెవరికీ పూజ చెయ్యటానికేకాదు  పూజా సమయంలో చూడటానికి  కూడా అనుమతి లేదు.  అయితే ఆసక్తిగల భక్తులు అక్కడి వూజారిని అడిగి రూ. 50 టికెటు తీసుకుంటే కిటికీగుండా కొద్ది దూరంనుంచి  ఆ యంత్ర దర్శనానికి అవకాశం వుంటుంది..  ఆ సమయంలో ద్వారానికి వున్న తెర తొలగించి హారతి వెలుగులో కొద్ది క్షణాలు మాత్రం ఆ యంత్ర దర్శనానికి అవకాశం కల్పిస్తారు.  ఆ యంత్రంపై బంగారు బిల్వ పత్రాల మాలలు కనబడుతాయి.. ఆ కొద్ది క్షణాల దర్శనంలో ఎవరి అనుభూతులు వారివి.. ఎవరి భక్తి పారవశ్యం వారిది.  ఇంతకీ ఆ స్ధలంలో ఏమి వున్నట్లు?   చూసిన భక్తులకు ఏమి కనిపించినట్లు?   ఎవరికీ అంతుబట్టని రహస్యం.  ఇదే చిదంబర రహస్యం.  అయితే విజ్ఞులుమాత్రం ఈ రహస్యం నిరాకారుడైన దేవ దేవుని ఉనికిని సూచిస్తుందనీ, చిత్ + అంబరం అంటే జ్ఞానాకాశాన్ని, అనంతాన్ని వెల్లడిస్తుందని, ఎవరి అంతరంగ భావాలననుసరించి వారికి ఆ రూపంలో నిరాకారుడైన స్వామి దర్శనమిస్తారని తెలుయజేస్తుందని చెబుతారు.


హమ్మయ్య!  రహస్యం తెలిసిపోయిందికదా.  రేపు చిదంబరంలోనూ, చుట్టుపక్కల చూడదగ్గ ప్రదేశాల గురించి తెలుసుకుందాము.



ఆలయ గోపురం మీద శిల్ప సౌందర్యం





Tuesday, December 8, 2009

చిదంబర రహస్యం--1

                           చిదంబర రహస్యం             
                                                             

  తమిళనాడు శివాలయాలకి పుట్టిల్లు అంటే అతిశయోక్తి కాదేమో.  అక్కడ వున్నన్ని విశాలమైన, అద్భతమైన, అపురూపమైన కళా సంపదతో కూడిన దేవాలయాలు ఇంకెక్కడా కనబడవు.  దీనికి ముఖ్య కారకులు తమిళనాడు పాలకులైన చోళ, పాండ్య చక్రవర్తులు అభినందనీయులు.  ముఖ్యంగా చోళులు.  శివుని పట్ల తమకు గల అత్యంత భక్తి ప్రపత్తులకు నిదర్శనంగా ఈ దేవాలయాలకోసం వారు ఖర్చుపెట్టిన డబ్బు అపారం,  వెలకట్ట లేనిది.   ఇన్ని తరాల తర్వాత కూడా మనమీ విశాలమైన దేవాలయాలను ఇంత భక్తి శ్రధ్ధలతో దర్శించి పులకితులమవుతున్నామంటే, ఆ శిల్ప సౌందర్యానికి ముగ్ధలమవుతున్నామంటే, వీటిద్వారా చరిత్ర పుటలను తిరగేస్తున్నామంటే వారు ఖర్చుపెట్టిన ప్రతి దమ్మిడీ వెలకట్టలేనిదేకదా.

  ఇన్ని వేల ఏళ్ళనుంచీ శివనామ స్మరణతో మారు మ్రోగుతున్న ఆ ఆలయాల దర్శనం మన పూర్వ జన్మ సుకృతం.  అవకాశంవున్నవారు తప్పనిసరిగా దర్శించాల్సిన కోవెలలివి.  అలాంటి ఎన్నో కోవెలలో ఇప్పుడ నటరాజస్వామి వేంచేసిన, పంచ భూత శివ క్షేత్రాలలో ఆకాశ క్షేత్రంగా పేరు పొందిన  చిదంబరం గురించి తెలుసుకుందాము.

  నటరాజస్వామి ఆనంద తాండవం చేసే ఈ ప్రదేశానికి కోయిల్, తిల్లయ్ వగైరా రకరకాల పేర్లు.  ఇదివరకు ఈ ప్రదేశంలో తిల్లయ్ వృక్షాలు ఎక్కువగా వుండేవట.  అందుకని ఆ పేరు.  ఇక్కడ ప్రణవ మంత్రమైన ఓంకారానుగుణంగా నటరాజ స్వామి నర్తిస్తారు.  పంచాక్షరీ సారమైన తన నృత్యం ద్వారా నటరాజ స్వామి సృష్టి, స్ధితి, లయ, సమ్మోహనం, ముక్తి అనే ఐదు క్రియలను ఉద్దీపనం చేస్తారు.


  ఈ ఆలయానికి నాలుగువైపులా నాలుగు ఉన్నతమైన గోపురాలు  పైన 13 పెద్ద రాగి కలశాలతో  విశాలమైన వాకిళ్ళతో, అపురూపమైన శిల్ప సంపదతో అలరారుతూ  వుంటాయి. 

  ఈ దేవాలయంలో ఐదుసభలున్నాయి -  చిత్రాబంళం, పొన్నాంబళం, పెరంబళం, నృత్తసభ, రాజ సభ.   చిత్రాంబళంలో నటరాజస్వామి కొలువై వున్నాడు.   చిత్రాంబళానికి ముందు వున్నది పొన్నాంబళం.  ఇక్కడ రోజుకి ఆరుసార్లు స్ఫటిక లింగానికి అభిషేకం చేస్తారు.  పెరాంబళం అంటే దేవ సభ.  ఇక్కడ ఉత్సవ విగ్రహాలు  వుంటాయి.   నృత్యసభలో స్వామి అపురూపమైన ఊర్ధ్వతాండవ నృత్యం చేశారు.  ఇక్కడ స్వామి నృత్య భంగిమ విగ్రహం ప్రతిష్టించబడింది.  రాజ సభ వెయ్యి స్తంబాలతో అలరారుతున్న సుందరమైన మండపం. ఇక్కడే ఆదిశేషుని అవతారమైన పతంజలి ఋషి తన శిష్యులకు వ్యాకరణ సూత్రాలను బోధించారు. ఆణి, మార్గళి మాసాలలో పది రోజులపాటు జరిగే ఉత్సవాలలో తొమ్మిదవ రోజు స్వామిని ఇతర దేవతలను ఐదు రధాలలో ఊరేగించిన తర్వాత ఇక్కడ విశ్రమింప చేస్తారు.  మర్నాడు పూజాదికాల తర్వాత మధ్యాహ్నం స్వామిని, అమ్మవారిని నాట్యరీతిలో చిత్రాంబళానికి తీసుకు వెళ్తారు.  ఈ వైభవాన్ని చూసితీరవలసినదేగానీ మాటలలో చెప్పనలవికాదంటారు చూసిన భక్తులు.

  ఇక్కడ అమ్మవారు శివ కామ సుందరీదేవి.  వెలుపలి ప్రాకారంలో ఈవిడకి ప్రత్యేక ఆలయం వున్నది.  ఇక్కడే చిత్రగుప్తుని మందిరమున్నది.  ఈ ఆలయంలోని శిల్పకళ, చిత్రకళ బహు సుందరం.

  నటరాజ ఆలయంలో తప్పక చూడవలసిన స్వామి మూలాట్టనేశ్వరార్. ఈయన స్వయంభూ.  ఈ స్వామికి ఈ పేరు రావటానికి కారణం అర్ధరాత్రి పూజ తర్వాత ఇతర శివ క్షేత్రాలలో గల స్వామి శక్తి యావత్తు ఇక్కడి లింగంలోకి వచ్చి లీనం కావడమేనని చెబుతారు.  ఇక్కడ అమ్మవారు ఉమాదేవి.  8 అడుగుల ఎత్తు వున్న ముక్కురుని వినాయకర్, ఏడు చేతులతో నాట్య భంగిమలో వున్న కర్పగ వినాయకుడేకాకుండా, ఇంకా అనేక దేవీ దేవతామూర్తుల ఉపాలయాలు, విగ్రహాలు చూడదగ్గవి.

ఆలయ విశేషాలు
  నటరాజ స్వామి  ఎదురుగా నిలబడి ఎడమ వైపు తలతిప్పితే వరదరాజ స్వామి కనబడతాడు.  ఒకేచోట నుంచుని శివ కేశవులను దర్శించుకునే అవకాశం బహుశా ఈ ఆలయంలో మాత్రమే వున్నదేమో. 

రవాణా సౌకర్యాలు

  ఈ ఆలయం చేరుకోవటానికి రవాణా సౌకర్యాలు బాగున్నాయి.  చెన్నై, తిరుచిరాపల్లి మెయిన్ రైల్వే లైనులో చిదంబరం స్టేషనులో రైలు దిగితే ఒక కిలో మీటరు దూరంలో ఆలయం వుంది.  తమిళనాడు రాష్ర్టంలోని వివిధ ప్రదేశాలనుంచి బస్సు సౌకర్యం కూడా వుంది.


ఇతర సౌకర్యాలు

   వసతికి  ఆలయ సమీపంలోనే హోటళ్ళున్నాయి. అద్దె రూ. 300 నుంచీ పైన.  చాలాహోటల్స్ లో రూమ్ సర్వీసు వుండదు.  భోజనానికి ఆలయ సమీపంలోనే  కుమరన్ భవన్ (మధ్యాహ్నం 12-30 నుంచీ 3 గం. ల దాకా మాత్రమే భోజనం దొరుకుతుంది మిగతా సమయాలలో టిఫెన్లు మాత్రమే వుంటాయి),  హోటల్ శ్రీ కృష్ణా వున్నాయి (ఇక్కడ మధ్యాహ్నం కూడా భోజనం వుండదు అయితే రైస్ ఐటమ్స్ లభిస్తాయి). 

  తమిళనాడులో ఏ ఆలయంలోనైనా అర్చన టికెట్ల ధర తక్కువ వుంటుంది గానీ నైవేద్యానికి తప్పనిసరిగా ఫలములుండాలి (కొబ్బరికాయైతే మంచిది.  వేరే ఊరిలో కొబ్బరి ఏంచేసుకోవాలంటారా   ప్రసాదం ఎపరికైనా ఇవ్వచ్చు.  స్వామి దగ్గర మనం తీసుకు వెళ్ళిన కొబ్బరికాయ కొట్టి నివేదన చేస్తారంటే మనకీ సంతోషం కదా).  అది లేకపోతే అర్చన షోడశ నామాలకే పరిమితమవుతుంది.

  సాయంత్రం 6 గం. లకి చాలా ఆలయాలలో అభిషేకం జరుగుతుంది.  ఆ సమయంలో చందనాభిషేకం తర్వాత దైవ ప్రతిమ కళ్ళు, కనుబొమలు, నోరు దగ్గర చందనం తుడుస్తారు.  అప్పుడు దేవుళ్ళ దివ్య సౌందర్యం చూడటానికి రెండు కళ్ళూ చాలవు అనిపిస్తుంది.

చిదంబర రహస్యం గురించి రేపు చెప్తాను.  సరేనా? 




ఆలయం లోపలి ప్రాకారంలో శిల్ప సౌందర్యం


 రధం మీద శిల్ప సౌందర్యం

ఆలయ గోపురం
 


రధం

Friday, December 4, 2009

తిరువణ్ణామలైలో కార్తీక దీపం


ఆలయం లోపల వెలిగించిన జ్యోతి ఇది. ఇలాంటిదే ఆలయం వెలుపల కూడా వెలిగిస్తారు (కొండమీద కాకుండా)
ఆలయ ప్రధాన ముఖద్వారం (కనబడే గోపురం) షుమారు ఒక కి.మీ. దూరం వుంటుంది.
గిరి ప్రదక్షిణ
కొండమీద కార్తీక దీపం -- ఈ కొండకే ప్రదక్షిణ చేసేది
(దీపం వెలిగించక ముందు గిరి ప్రదక్షిణ)

తిరువన్నామలిలో కార్తీక దీపం

తమిళనాడులో ప్రసిధ్ధికెక్కిన శైవ క్షేత్రం తిరువణ్ణామలై. ఇక్కడ శివుడు పంచ భూతాలలో ఒకటైన అగ్ని లింగం రూపంలో వుంటాడు. పూజ్యులు రమణ మహర్షి ఆశ్రమం ఇక్కడే వున్నది. తిరువణ్ణామలైలో ప్రతి సంవత్సరం తమిళ కార్తీక మాసంలో జరిగే అతి పవిత్రమైన, ప్రసిధ్ధికెక్కన కార్తీక దీపం చుట్టుప్రక్కల చాలా కిలో మీటర్ల దూరం వరకు కనబడుతుంది. ఈ దీపాన్ని పార్వతీ పరమేశ్వరుల నివాస స్ధలంగా చెప్పబడే కొండ మీద ప్రతి తమిళ కార్తీక పౌర్ణమి నాడు సాయం సంధ్యా సమయంలో వెలిగిస్తారు.

ఇక్కడ ఈ కొండకి చేసే ప్రదక్షిణని గిరి వలం అంటారు. దీనిని చాలా పవిత్రంగా, పుణ్యప్రదంగా భావిస్తారు. 14 కి.మీ. ల దూరం, చెప్పులు కూడా లేకుండా నడుస్తారు ఈ గిరి ప్రదక్షిణ కోసం. ముఖ్యంగా పౌర్ణమి నాడు షుమారు 60 అడుగుల వెడల్పు వున్న ఈ ప్రదక్షిణ మార్గంలో ప్రదక్షిణ చేసే జనాన్ని చూస్తే తమిళనాడు మొత్తం అక్కడే వుందా అనిపిస్తుంది. అంత జనం. ఈ పర్వతాన్ని సాక్షాత్తూ పార్వతీ పరమేశ్వరుల రూపంగా కొంతమందంటే, పార్వతీ పరమేశ్వరులు ఈ శిఖరం మీద వుంటారని కొందరి నమ్మకం.

మా అబ్బాయి, తేజస్వి తిరువణ్ణామలైలోని అరుణై ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్ధి అవటంతో ఆ క్షేత్రంతో కొంత అనుబంధం ముడిపడివుంది. వాడి చదువు కారణంగా మేమూ ఆ క్షేత్ర దర్శనం, గిరి ప్రదక్షిణ చేయగలిగాము. వాడు 4 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఈ ఏడాది దీప దర్శనానికి వెళ్ళాడు. ఈ ఏడాది తమిళ కార్తీక పౌర్ణమి (రాత్రిపూట పౌర్ణమి వున్న రోజు) 1-12-2009 అయింది. ఆ ఫోటోలతో బాటు, దీపం వెలిగిన వీడియో, గిరి ప్రదక్షిణలో జన సందోహం వీడియో కూడా అప్ లోడ్ చెయ్యాలని ఉదయం నుంచి ప్రయత్నించి లాభం లేకపోయింది. ప్రస్తుతానికి ఫోటోలు చూడండి.


Saturday, November 21, 2009

షిర్డీ యాత్ర


షిర్డి యాత్ర

శ్రీ శైల్ గారు షిర్డీ యాత్ర గురించి చెప్పమన్నారు. అంతకన్నా మహద్భాగ్యం నాకేముంటుంది. శైల్ గారూ, మీరెక్కడ వుంటారో తెలియదుగానీ అనేక ప్రదేశాలనుంచీ ఆర్.టి.సీ వారూ, రైల్వేవారూ, ఇంకా ప్రైవేటు బస్సుల వాళ్ళూ షిర్డీకి టూర్ పాకేజ్ లు ప్రవేశ పెట్టారు. మొదటిసారి షిర్డీ వెళ్ళేవాళ్ళు, కొంచెం సొకర్యంగా వెళ్దామనుకునేవాళ్ళు వీటిని ఉపయోగించుకుంటే, షిర్డీలో దిగగానే ఎక్కడ వుండాలి అనే మొదటి ప్రశ్న రాదు. ఎందుకంటే వసతి వారే చూపిస్తారు. లాడ్జింగులు బాగానే వుంటాయి. చాలామటుకు గుడి పరిసర ప్రదేశాల్లోనే వుంటాయి. లేకపోయినా నడవలేనివారికి ఆటో సౌకర్యం బాగా వుంటుంది.

ఆలయ సమీపంలోనే దేవస్ధానంవారు ఇచ్చే వసతి సౌకర్యంకోసం కూడా దేవస్ధానం ఆఫీసులో సంప్రందించవచ్చు. వారివి వసతికి డార్మెంటరీల దగ్గరనుంచి విడి గదులదాకా వున్నాయి. అవకాశాన్నిబట్టి ఇస్తారు. జనం ఎక్కువగా వున్నప్పుడు ఇవ్వేమీ దొరక్కపోయినా కంగారు పడక్కరలేదు. దేవస్ధానంవారు పరుపులు అద్దెకు ఇస్తారు. విడివారు అవి తీసుకుని ఆరుబయట వేసుకుని పడుకుంటారు. చాలామందిని ఆకర్షించినవి మాత్రం నిస్సందేహంగా వసతి సౌకర్యం, తిరుగు ప్రయాణంతో కూడిన బస్ రిజర్వేషన్లే.

హైదరాబాదు నుంచి సాయంత్రం 5 గం. నుంచి బయల్దేరటం మొదలు ఈ బస్సులు. ఇక్కడనుంచి 14 గం. ల ప్రయాణం. త్రోవలో భోజనాలు, కాఫీ, టీలు, దేనికీ ఇబ్బంది లేదు. తిరుగు ప్రయాణం టిక్కెట్టు కూడా ముందు తీసుకున్నవాళ్ళకి మాత్రమే వసతి సౌకర్యం. కనుక మీరు తిరుగు ప్రయాణం ఎప్పుడో ముందే నిర్ణయించుకోవాలి. మర్నాడే బయల్దేరి రావచ్చు, లేదా మీ ఇష్టం వచ్చినన్ని రోజులు అక్కడ ప్రదేశాలన్నీ చూసి తర్వాత బయల్దేరచ్చు. బస్లో వెళ్తే ఖచ్చితమైన ప్రయాణం తేదీ, బస్ నెంబరూ, సీట్ల నెంబర్లు వేసిన టికెట్ మీరు భద్ర పరచుకోండి, బస్ రాంగానే మీ సీట్లు ఆకుపై చెయ్యండి. టూరిస్టు ప్రదేశాలు కదండీ పొరపాట్లు ఎవరికైనా సహజం.

ఇంక ఇక్కడ చూడవలసిన ప్రదేశాలు

1. సాయిబాబా సమాధి మందిరం. ఇక్కడే బాబా విగ్రహం కూడా వుంటుంది. ఈ హాల్లోనే ముందువైపు బాబాకి ఉదయం భక్తులు పాల్గొనే ఆభిషేకాదులు నిర్వర్తిస్తారు, సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి.

2. ద్వారకామాయి (మసీదు)..ఇక్కడ బాబా మొదటిసారి వెలిగించిన ధుని ఇంకా వెలుగుతూనే వుంది. బాబా ఉపయోగించిన వస్తువులు కొన్ని, ఆయన కూర్చున్న ప్రదేశాలు, అన్నీ బోర్డులు పెట్టి వుంటాయి. చూడండి.

3. చావడి..బాబా కొన్ని రాత్రులు ఇక్కడ నిద్రించేవారు. చెక్కబల్లకి పాత గుడ్డపీలికలు కట్టి ఎత్తుగా వేలాడదీసి దాని మీదకెక్కి నిద్రించినది ఇక్కడే.

4. గురుస్ధాన్. ఇక్కడే నేలలో తవ్వినప్పుడు వెలిగించిన దీపాలు కనబడ్డాయంటారు.

5. లెండీ తోట, మందిర పరిసర ప్రాంతంలోనే బాబా శిష్యుల సమాధి మందిరాలు, శివ, గణేష్, శనీశ్వరుని ఆలయాలు, దత్త మందిరం, పారాయణ హాల్ అన్నీ దర్శనీయ స్ధలాలే.

6. కొద్ది దూరంలో లక్ష్మీబాయి ఇల్లు వుంది. అక్కడ ఆవిడకి బాబా ఇచ్చిన తొమ్మిది వెండి రూపాయి నాణేలు ఒక ఫ్రేమ్ లో బిగించి పెట్టారు వారి కుటుంబీకులు భక్తుల సందర్శానార్ధం.

7. మసీదుకి చావిడికి మధ్యలో ఆంజనేయస్వామి ఆలయం. ఇవి ఆలయ పరిసరప్రాంతంలో చూడదగ్గవి. షాపుల గురించి నేను చెప్పలేదండీ అవ్వెటూ మీరో, మీతో వచ్చినవారో చూస్తారుగదా.

8. పరిసర ప్రాంతాల్లో చూడదగ్గవి అంటే ముఖ్యంగా చెప్పతగ్గది శనిసింగడాపూర్. ఇక్కడ శనీశ్వరుడు ఒక నిలువెత్తు రాయి రూపంలో కొలువబడతాడు. ఆయనకి ఆలయం లేదు. అంటే ఆ రాయి ఆరుబయలే వుంటుంది. శని దోషం వున్నవారు ఇక్కడకి వెళ్ళి శనీశ్వరునికి తైలాభిషేకం చేసి వస్తారు. దీనికి మగవారిని మాత్రమే అనుమతిస్తారు. వారు కూడా అక్కడ ఇచ్చే ధోవతులు కట్టుకుని, స్నానం చేసి వెళ్ళి అభిషేకం చేసి, మళ్ళీ వచ్చి స్నానం చేస్తారు. స్త్రీలు ఆభిషేకం చెయ్యకూడదు కానీ, చూడవచ్చు. ఇక్కడ ఇళ్ళకి తలుపులూ, తాళాలూ వుండవు. ఆ ఊళ్ళో దొంగతనాలు అస్సలు జరగవు. అంత మహిమగల ప్రాంతంగా చెప్తారు. షిర్డీనుంచి జీపులో వెళ్ళి అదే రోజు తిరిగి రావచ్చు. బహుశా 70, 80 కి.మీ. ల దూరం వుంటుంది.. గుడి దగ్గరే జీపుల వాళ్ళు అరుస్తూ వుంటారు. మనిషికింతని తీసుకుంటారు. ఎంత సమయం పడుతుందో ముందు కనుక్కోండి.

9. తర్వాత సాకురీ అనే చోట ఉపాసినీ బాబా ఆశ్రమం వున్నది. దీనికి వెళ్ళి రావటానికి జట్కా సౌకర్యం కూడా వుంది. మేము వెళ్ళి చాలా రోజులయింది. అందుకే వివరాలు పూర్తిగా ఇవ్వలేక పోతున్నాను. ప్రదేశం తెలిస్తే అన్నిచోట్లకీ వాహన సౌకర్యం వుంటుంది.

10. తర్వాత పంచముఖ ఆంజనేయస్వామి ఆలయం వుంది అన్నారు కానీ మేమింత మటుకు చూడలేదు.

11. నాసిక్, త్రయంబకేశ్వరం (జ్యోతిర్లింగం) కూడా షిర్డీకి దగ్గరే. అయితే దీనికి రెండు రోజులుంటే తీరిగ్గా చూడవచ్చు.

12. అలాగే కొందరు పండరీపూర్, తుల్జాపూర్ కూడా ఈ యాత్రలో కలుపుకుంటారు.

మేము వెళ్ళి మూడేళ్ళపైనే అయింది. షిర్డీ గురించి అడిగారు కదాని నాకు గుర్తున్నంత మటుకూ చెప్పాను. క్షేమంగా వెళ్ళి బాబా ఆశీస్సులతో రండి.


Sunday, November 1, 2009

రామాలయం, డిచ్ పల్లి





జోరు వానలో కారు ప్రయాణం


ఖిల్లా రామాలయం, డిచ్ పల్లి

నిజామాబాదుకు 12 కి.మీ ల దూరంలో ప్రకృతి రామణీయకత మధ్య కొండమీద కొలువైవున్న రామయ్యతండ్రి ఆలయం ఇది. 11వ శతాబ్దంనాటి ఈ ఆలయాన్ని చాళుక్యులు జైనమత ప్రేరణతో కట్టించారు. కొండమీదికి మెట్లు చిన్నగా, ఎక్కటానికి వీలుగా వుంటాయి. పూజాదికాల సమయానంతరం పూజారి వుండకపోవచ్చు. కటకటాల వాకిలిలో నుంచి పగలు ఏ సమయలోనైనా స్వామి దర్శనం చేసుకోవచ్చు.

ఆలయం చిన్నదయినా అద్భతమైన శిల్ప సౌందర్యంతో అలరారుతున్నది. చుట్టూ పచ్చని చెట్లు. పైగా మేము వెళ్ళినప్పుడు వాతావరణం చల్లగా వుండి సన్నగా తుపర పడుతోంది. ఆ వాతావరణంలో ఆ ప్రదేశాన్ని వదిలి రాబుధ్ధి కాలేదు. అందుబాటులోవున్న ఇలాంటి కళాఖండాల విలువ తెలుసుకుని ఆదరించి వాటి వైభవాన్ని నిలపవలసిన బాధ్యత ప్రభుత్వానిదే కాదు...మనందరిదీ కూడా.

ఆలయాలేకాదు, ఆలీ సాగర్, శారదా సాగర్ లాంటి పిక్నిక్ ప్రదేశాలు కూడా వున్నాయి నిజామాబాదులో. మేము 21-3-2008 ఉదయం 7 గం. లకు ఇంట్లో బయల్దేరిన వాళ్ళం ఏడుపాయలు, మెదక్ చర్చ్, బికనూరు, ఇస్సన్నపల్లి, బుగ్గరామేశ్వరం, ఇందూరు, సారంగాపూర్, జానకంపేట, బాసర, నిజామాబాదులో ఆలయాలు, డిచ్ పల్లి ఇన్ని చూసి 23-3-2008 రాత్రి 7 గం. లకి ఇంటికి చేరాం. చాలా చూశాం కదూ. వచ్చేటప్పుడు నిజామాబాదునుంచి హైదరాబాదు ఇంకో పది కిలోమీటర్లు వుంది అనేదాకా చాలా పెద్ద వాన. నాకైతే కొంచెం భయంకూడా వేసింది. వానలో మా కారు ప్రయాణం ఫోటోలు కూడా చూడండి. మరింకేం బయల్దేరండి...నిజామాబాదు దర్శనానికి.






Thursday, October 29, 2009

శ్రీ సాయి ఆలయం, నిజామాబాద్





శ్రీసాయి ఆలయం

హైదరాబాదు నిజామాబాదు రోడ్డులో నిజామాబాదు మొదట్లోనే వున్న ఈ ఆలయంలో సాయినాధుడు భక్తులకు కొంగు బంగారమై వెలిశాడు. ఈ ఆలయం నూతనంగా నిర్మింపబడింది. దిన దిన ప్రవర్ధమానమవుతున్న ఈ ఆలయంలోని ద్వారకామాయిలో సాయి విగ్రహం భక్తులను ఎంతో ఆత్మీయంగా పలకరిస్తున్నట్లుంటుంది.


Monday, October 26, 2009

శ్రీ లలితా పరమేశ్వరి ఆలయం, న్యాల్కల్












లలితా పరమేశ్వరి ఆశ్రమం, నిజామాబాదు

మన రాష్ట్రంలో వున్న అతి కొద్ది లలితాదేవి ఆలయాల్లో ఇది ఒకటి. అతి సుందరమైన ఈ ఆలయం న్యాల్ కల్ రోడ్డులో ప్రశాంత వాతావరణంలో సందర్శకులను సమ్మోహితుల్ని చేస్తుంది.

ఈ ఆలయ శంఖుస్ధాపన 9-2-2000 న జరిగింది. అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన 20-6-2003న జరిగింది.

ఆలయ ద్వారంలోనే 21 అడుగుల వినాయక విగ్రహం ఆలయంలోకి అడుగు పెడుతూనే వీక్షకులను భక్తి భావంతో కట్టి పడేస్తుంది. మెట్లు ఎక్కి పైకి వెళ్తే విశాలమైన హాలులో శ్రీ మాత, శ్రీ లలితా దేవి గర్భాలయం దర్శనమిస్తుంది. ఇక్కడ అమ్మవారి పాదాలను తలపై పెట్టుకుని రోజుకు తొమ్మిది చొప్పున తొమ్మిది రోజులు అమ్మవారికి ప్రదక్షిణలు చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయంటారు.

ప్రక్కనే వున్న శివాలయంలో పంచముఖ శివుని పానువట్టంమీద ద్వాదశ జ్యోతిర్లింగాలు 3-7-2007 న ప్రతిష్టింపబడ్డాయి.








Sunday, October 25, 2009

శ్రీ నీలకంఠేశ్వరాలయం, నిజామాబాదు




నీలకంఠేశ్వరాలయం, నిజామాబాదు

చిన్నదే అయినా అతి పురాతనమైనది ఈ ఆలయం. ఈ ఆలయాన్ని 13 వ శతాబ్దంలో కాకతీయులు పునరుధ్ధరించారు. అంటే అంతకుముందు ఎప్పటి నిర్మాణమో ఈ ఆలయం. ఈ ఆలయంలోకి అడుగు పెడుతూనే మనసు భక్తి భావంతో నిండి పోతుంది. ఇంత పురాతనమైన ఈ ఆలయం దర్శనీయం.


Saturday, October 24, 2009

శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం, జానకంపేట

అష్టముఖ కోనేరు
దూరంనుంచి ఆలయ దృశ్యం
అష్టముఖ కోనేరు

శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం, జానకంపేట

సారంగపూరుదాటాక వస్తుంది జానకంపేట. ఇక్కడ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో అష్ట ముఖ కోనేరు ప్రసిధ్ధి చెందింది. ఈ కోనేరును కాకతీయులు నిర్మించారు. ఈ కోనేరులో ఒక్కొక్క కోణానికి ఓం శ్రీమన్నారాయణ అనే అక్షరాలు వ్రాసి వున్నాయి. ఇలాంటి విశిష్టమైన కోనేరు ఇంకెక్కడా లేదుట.

ఇంకొక విశేషం. స్వామి ముందు పెద్ద వర్తులాకారంగావున్న ప్రదేశం వున్నది. ఈ ప్రదేశంలో ఏమైనా తల్చుకుని ఒక నాణేన్ని నిలబెట్టాలిట. ఆ నాణెం నిలబడితే ఆ కోరిక నెరవేరుతుందని ఇక్కడివారి నమ్మకం.











Friday, October 16, 2009

హనుమాన్ దేవాలయం, సారంగావూర్







హనుమాన్ దేవాలయం, సారంగపూర్

నిజామాబాదుకి 5 కి.మీ. ల దూరంలో చిన్న కొండమీద వున్న గుడి ఇది. గుడి చిన్నదయినా ఆవరణ విశాలమైనది. చాలా ఆకర్షణీయంగా వుంటుంది. గుడి మొత్తం, ముందు ధ్వజ స్తంబంతోసహా సింధూర వర్ణంతో కనులవిందు చేస్తుంది. ఖిల్లా రఘునాధాలయంలాగానే ఈ ఆలయానికీ, ఛత్రపతి శివాజీకీ సంబంధముంది. ఛత్రపతి శివాజీ గురువుగారైన శ్రీ సమర్ధ రామదాసు ఈ ఆలయంలోని ఆంజనేయస్వామి విగ్రహం ఆకారాన్ని స్వయంగా గీసి, ఆ రూపురేఖల ప్రకారం విగ్రహాన్ని చేయించి ఇక్కడ స్ధాపించారుట. చుట్టూ మఠాధిపతుల సమాధులు వున్నాయి.

కొండకింద పార్కు అభివృధ్ధి చేశారు. దైవ దర్శనంతోబాటు సరదాగా కొంత సమయం గడపవచ్చు.







Tuesday, October 13, 2009

ఖిల్లా రఘునాధాలయం, ఇందూరు

కొండపైన కోటలోన ఆలయ దృశ్యం
శ్రీ దాశరధి రంగాచార్యని బంధించిన ప్రదేశం

ఆంజనేయస్వామి ఆలయ ద్వారాలు


ఖిల్లా రఘునాధాలయం, ఇందూరు

ఈ ఆలయం నిజామాబాదు శివారులో కొండపైన కోటలో వున్నది కొండపైకి కారు వెళ్తుంది. రాష్ట్రకూట రాజవంశంలో ప్రసిధ్ధి చెందిన ఇంద్రుడు అనే రాజు క్రీ.శ. 914-928 మధ్య ఈ కోటని నిర్మించాడు. ఛత్రపతి శివాజీ గురువైన శ్రీ సమర్ధ రామదాస్ జీ ఈ ఆలయాన్ని నిర్మింప చేశారు. అతి పురాతనమైన ఈ కోట ఇప్పటికీ చెక్కు చెదరకుండా వుంది. దీని ప్రక్కనే బొడ్డెమ్మ చెరువు.




రఘునాధుడనే మహర్షి ఈ ఖిల్లాలోవున్న సొరంగ మార్గం ద్వారా బొడ్డెమ్మ చెరువు లో వున్న శిలా కట్టడందాకా వెళ్ళి స్నానం చేసి వచ్చేవారని పలు కధనాలు. కోటలో వున్న ఈ మహర్షి ధ్యాన మందిరం కట్టడంలోనే విశిష్టమైన వెంటిలేషన్ సౌకర్యంతో చల్లగా వుంటుంది. ఇక్కడనుంచి డిచ్ పల్లి, సారంగపూర్ కి కూడా సొరంగాలు వున్నాయట.

ఇక్కడ శ్రీ రఘునాధ ఆలయంలో కూర్మ పీఠముపై ప్రతిష్టింపబడ్డ సీతారామస్వామి విగ్రహాలు భద్రాచలంలో విగ్రహాలను పోలి వుంటాయి. 2002 సం. దాకా ఈ గుడి మూసి వుండేదట. ఏడాదికొకసారి మాత్రమే తీసి స్వామి కళ్యాణం జరిపించేవారుట. 2002 సం. నుంచి చిన్న జియ్యరు స్వామి నిత్య పూజలు పునఃప్రారంభించారు,

తెలంగాణా స్వాతంత్ర్య పోరాటంలో శ్రీ దాశరధి రంగాచార్యగారు బంధింపబడిన జైలుని ఈ రామాలయం ముందు చూడవచ్చు.

ఈ కోటలోకి వెళ్ళే మార్గంలో ఆంజనేయస్వామి ఆలయంవుంది. ఈ ఆలయంముందు పెద్ద బండరాళ్ళు కోట గోడల్లా నిలిచి వుండి దర్శకులకు దుర్భేద్యమయిన కోటలోకి ప్రవేశిస్తున్న అనుభూతిని కలిగిస్తాయి.








Monday, October 12, 2009

యాత్ర కొనసాగుతోంది

అవునండీ, యాత్ర కొనసాగుతోంది. ఇది చెప్పటానికి ఇంత ఆలస్యమయిన కారణం కేవలం నా అనారోగ్యమే. 

సెప్టెంబరు నెలాఖరు లోపల యాత్ర కొనసాగించాలా వద్దా అనే పోస్టు చూసిన నా శ్రేయోభిలాషులు 600 మంది పైనే అనే విషయమే నా బ్లాగుకి విలువనిచ్చింది. 10-10-2009 ఈనాడులోవచ్చిన మహిళా బ్లాగుల అభివృధ్ధి వ్యాసంలో నా బ్లాగు గురించి కూడా చెప్పబడింది. ఆ వ్యాసం ద్వారా నా బ్లాగుకి విచ్చేసిన యాత్రీకులు 700 పైనే. కొత్త ప్రదేశాలను గురించి తెలుసుకోవటానికి వచ్చే ఇంతమందిని నిరాశపరచటం ఇష్టంలేకపోయింది. అందుకే వ్యక్తిగత కోపతాపాలు పక్కన పెట్టి, ఆ భగవంతుడు శక్తి ఇచ్చినంతమటుకూ తిరిగి నా బ్లాగు ద్వారా మిమ్మల్ని యాత్రలకి తీసుకెళ్ళాలని నిశ్చయించుకున్నాను.  

ఎందరో శ్రేయోభిలాషులు ఈ పని ఇదివరకే చెయ్యమని నా బ్లాగులో, మైల్ లో కామెంట్ల ద్వారా ప్రోత్సహించారు. అందరికీ ధన్యవాదాలు. ఏ బ్లాగరయినా, ఏ కారణం వల్లనయినా కొంచెం వెనుకడుగు వేసేటప్పుడు ఇలాంటి ధైర్యం వెన్నుతట్టి ప్రోత్సహిస్తుంది. అందుకే విడప్పుడు కామెంటు చేసినా చెయ్యకపోయినా ఇలాంటి సమయాల్లోమాత్రం తప్పనిసరిగా మీ విలువైన అభిప్రాయాలను తెలియచెయ్యండి.

బ్లాగులో టెక్నికల్ గడబిడలవల్ల ఫాలోయర్స్ అందరికీ కోపం వచ్చి వెళ్ళిపోయారు. కానీ మళ్ళీ కొందరు కొత్తగా వచ్చారు. వారి ప్రోత్సాహానికి శతకోటి వందనాలు.  


Saturday, September 19, 2009

యాత్ర కొనసాగించాలా? వద్దా??

స్వప్న@కలల ప్రపంచం, నా బ్లాగులో ఒక కామెంట్ చేశారు. మీకు ఇన్ని డబ్బులు ఎక్కడివండి మీ ఆయన బాగా సంపాదిస్తారా అన్ని చోట్లకి వెళ్ళి చూస్తారు..మీ ఓపికకి మెచ్చుకోవచ్చు అని. దీనికి నేను సమాధానం రాశాను కానీ దానిమీద ఒక్క కామెంటు కూడా రాకపోయేసరికి కొంచెం అసంతృప్తిగా అనిపించి ఈ పోస్టు రాస్తున్నాను.

స్వప్నా, మీరు వయసులో చాలా చిన్నవారు. అందుకే ఒక పరిధిలోనే ఆలోచించారు. అవునూ, మీరూ ఉద్యోగం చేస్తున్నారు. బస్ మిస్ అయితే ఆఫీసుకి ఎవరి పర్మిషన్ అడగకుండానే ఆటోలో వెళ్తున్నారు...అంటే మీ ఉద్యోగం మీకు కొంత ఆర్ధిక స్వాతంత్ర్యాన్ని ఇచ్చిందనేకదా అర్ధం. అలాగే నేను కూడా అనే ఆలోచన రాలేదా నేనూ 40 ఏళ్ళు ఉద్యోగం చేశానండీ. నేను చేశానని మా ఆయన మానేయలేదులెండి...పాపం ఆయనా ఆయన ఉద్యోగం చేశారు అన్నేళ్ళూ. సంసార సాగరంలో అనేక సుడిగుండాలుంటాయండీ...వాటిలో చాలా ఇంకా మీ ఊహల్లోకి కూడా వచ్చి వుండవు. అవ్వన్నీ దాటుకుని మేము నిలదొక్కుకునేసరికి ఇద్దరం రిటైరయ్యాము. ఇన్నేళ్ళ ఇద్దరి ఉద్యోగంతో మేము మిగుల్చుకున్నది మా ఇద్దరి + మా ఇద్దరి పిల్లల చేతిలో పి.జీ. డిగ్రీ సర్టిఫికెట్లూ, వుండటానికో ఇల్లూ..అంతే. ఇలా క్లుప్తంగా చెప్తున్నానుగానీ ఈ భవసాగరాల సునామీలలో మేము సాధించిన వాటితో మాకు తృప్తి వుంది. ఎందుకంటే అన్నీ మా కష్టార్జితం. మా సంపాదన వివరాలు అయిపోయాయికదా.

ఇంక మా యాత్రల విషయానికొస్తే నాకూ, మావారికీ కొత్త ప్రదేశాలు చూడటం చాలా సరదా. మా అమ్మాయి (అమ్మాయి పెద్దదిలెండి) 9వ తరగతికి వచ్చేదాకా, పిల్లల్నికూడా ఏడాదికొకసారి కొత్త ప్రదేశాలకు తీసుకెళ్ళేవాళ్ళం. అక్కడనుంచీ, రెండేళ్ళ క్రితందాకా వాళ్ళ చదువులతో ఎటూ కదలటం కుదరలేదు. రెండేళ్ళ క్రితంనుంచీ, పిల్లలు దగ్గర లేకపోవటం, ఆఫీసులో కొంత వెసులుబాటు దొరకటం, వగైరాలతో మళ్ళీ అరికాళ్ళ దురద ఎక్కువైంది.

మొదట్లో చాలామంది కుళ్ళుకున్నారు. కొందరు ఎదురుగానే అనేవాళ్ళు. నీకేమమ్మా మీవారు కూడా చక్కగా అన్నివూళ్ళూ తిప్పుతారు, మా ఇళ్ళల్లో ఆ సరదాలు లేవు అనేవారు. కొందరు ఫోన్ చేస్తే ఏ వూరునుంచి మాట్లాడుతున్నారు అనే వాళ్ళు సరదాగా. ఎప్పుడొచ్చినా ఇల్లు తాళమే వుంటుంది అసలెప్పుడన్నా ఇంట్లో వుంటారా అనేవాళ్ళు కొందరు, అంత ఓపిక ఎక్కడనుంచొస్తుంది మీకు అనేవాళ్ళు కొందరుఇలా ఎన్నో. మొదట్లో కొంత బాధ పడ్డా తర్వాత స్పష్టంగా చెప్పేదాన్ని. మాకు తిరగటం సరదా, ప్రస్తుతం ఓపిక, సమయం వున్నాయి. ఓపిక లేనప్పుడు మానేస్తాంలే అనేదాన్ని. తర్వాత వాళ్ళకి అర్ధమవటమేకాదు, మా గాలి తగిలి కొందరు మరీ మాలాగా కాకపోయినా ట్రిప్స్ వెయ్యటం మొదలు పెట్టారు.

ఇంక తిరగటానికి అన్ని డబ్బులెక్కడనుంచి వస్తాయి అనే ప్రశ్నకి ....

మాకు బట్టలు, నగలు కొనుక్కోవటం, ఆస్తులు కూడబెట్టుకోవటం వగైరాలకన్నా యాత్రలు చెయ్యటంలోనే ఆసక్తి ఎక్కువ. ఈ డబ్బులుంటే ఇంకో రెండు నగలు చేయించుకునేదాన్నేమోగానీ, వాటిని కాపలాకాయటం నాకు చాలా చికాకు. ఏదయినా అవసరానికుంటే చాలు. కానీ ఈ యాత్రల విషయంలో ఎంత తిరిగినా మాకు తృప్తి వుండటంలేదు. పిల్లలు దగ్గర లేకపోవటంవల్ల వచ్చిన ఒంటరితనాన్ని దూరం చేసుకోవటానికి కూడా కొంత తిరిగేవాళ్ళం.

ఇండియాలో మేము తిరిగిన ప్రదేశాలు ఎక్కువ ఖర్చయ్యేవికాదు. పెద్ద యాత్రలింకా ఏమీ చేయలేదు. ప్రస్తుతానికి ఒక కారు, మా వారికి దానిని డ్రైవ్ చేసే ఆసక్తి వున్నాయి. చాలా మటుకు దానిలో తిరిగినవే. ఖర్చు తక్కువ అవ్వటానికి కారణాలు ఇంకొన్ని

  1. ఉదయం బయల్దేరి సాయంత్రం 6, 7 గం. ల దాకా తిరగటం, ఆ టైముకి ఎక్కడో అక్కడ స్టే చెయ్యటం,
  2. సాధారణంగా వెళ్ళే రోజు ఆహారం ఇంట్లోంచే పేక్ చేసుకెళ్తాం
  3. స్టేకి స్టార్ హోటల్స్ చూసుకోం. కుటుంబీకులు వుండగలిగేవి, నీట్ గా వుండేవి చాలు.
  4. పెద్దవాళ్ళం కనుక బయట చిరుతిండి, చూసినదల్లా కొనటం వగైరా అనవసర ఖర్చులు వుండవు.
  5. ఎక్కడా షాపింగ్ చెయ్యం
  6. రష్ తక్కువగా వుండే సమయాల్లో వెళ్తాం కనుక స్పెషల్ దర్శనానికి వెళ్ళం.
  7. సొంత వాహనంలో వెళ్ళటంవల్ల దగ్గర దగ్గర స్ధలాలన్నీ ఒకేసారి చూస్తాం
  8. కారు కాకపోతే సమయాభావ సమస్య లేదు కనుక పబ్లిక్ ట్రాన్స్ పోర్టు వాడతాం కానీ ఇద్దరి కోసం టాక్సీలు తీసుకోం.
  9. ఈ ప్రదేశాలన్నీ ఇప్పుడు చూసినవే కాదు. రెండేళ్ళనుంచి చూస్తున్నవన్నీ. నేను బ్లాగు మొదలు పెట్టకముందు చూసినవి కూడా వున్నాయి.

ఈ పోస్టులు చూసి మేము హ్యాపీగా తిరుగేస్తున్నాము, ఎక్కడా ఏ ఇబ్బందులూ వుండవనుకోకండి. చిన్న ప్రదేశాలలో కొన్ని చోట్ల తినటానికేమీ దొరకదు. కొన్ని చోట్ల వుండటానికి అవకాశం వుండదు. కొన్ని చోట్ల మేము వెళ్ళేసరికి చూడాల్సిన ప్రదేశాలు మూసేసి వుండేవి. ఈ పోస్టులు చదివి అక్కడికి వెళ్ళే వాళ్ళు మాలా ఇబ్బంది పడకూడదని వాటి వివరాలు కూడా ఇస్తుంటాను.

ఇంకో విషయం. రాసినవాటికన్నా రాయాల్సినవి ఇంకా చాలా ఎక్కువ వున్నాయి!!!!. అందుకే ఒక్కసారి అందరి అనుమానాలూ తీర్చాలని ఈ పోస్టు. అమ్మయ్య. అన్నీ చెప్పేశాను. ఇప్పుడు చెప్పండి మేము చూసిన ప్రదేశాలగురించి ఇంకా రాయమంటారా వద్దంటారా?????????

Wednesday, September 16, 2009

శ్రీ బుగ్గరామలింగేశ్వరాలయం, బుగ్గరామేశ్వరం, నిజామాబాదు జిల్లా



శ్రీ బుగ్గరామలింగేశ్వరాలయం, బుగ్గరామేశ్వరం, నిజామాబాదు జిల్లా

ఇస్సన్నపల్లికి 15 కి.మీ. ల దూరంలో అడవి ప్రాంతంలో వున్న చిన్న వూరిది. త్రోవంతా పచ్చని చెట్లతో అందంగా వుంది. ఇక్కడి బుగ్గ రామలింగేశ్వరుని గుడి చిన్నదయినా చాలా మహత్యం కలదని భక్తుల విశ్వాసం. చుట్టు ప్రక్కల వూళ్లనుంచే కాకుండా దూర ప్రాంతాలనుంచి కూడా ప్రజలు స్వామి దర్శనానికి వస్తారు.

ఇక్కడి శివ లింగం దగ్గరనుంచీ నీళ్ళు వస్తాయిట. ఆ నీరు ఎక్కడనుంచి వస్తుందో తెలియదుగానీ ఆలయం వెనుక వైపు వున్న పెద్ద గుంటలోకి వచ్చి అక్కడనుంచి గుడి పక్కగా కొంచెం దూరం పారి తర్వాత కనబడవు. ఆ నీళ్ళు ఎక్కడికి వెళ్తున్నాయో తెలియదు కానీ ఏ కాలంలోనైనా వుంటాయిట. ఆందుకే స్వామికి బుగ్గ రామలింగేశ్వరుడని పేరు. ప్రక్కనే వేరే మండపంలో పార్వతి అమ్మవారు. విగ్రహం చిన్నదే అయినా పచ్చగా చాలా కళగా వున్నది.

గుడి ప్రక్కనే అన్నదాన సత్రం వుంది. ప్రతి రోజూ వచ్చిన వారందరికీ భోజనం పెడతారు. ఈ ఆలయ పరిసర ప్రాంతాలలో వేరే సౌకర్యాలు లేని కారణంగా, ఆలయానికి వచ్చిన భక్తులు ఇబ్బంది పడకూడదని ఈ ఏర్పాటు.



Monday, September 14, 2009

శ్రీ కాలభైరవాలయం, ఇస్సన్నపల్లి



శ్రీ కాల భైరవాలయం, ఇస్సన్నపల్లి

శ్రీ సిధ్ధ రామేశ్వర స్వామి ఆలయం నుంచి బయల్దేరి, కామారెడ్డి, రామారెడ్డి మీదుగా బికనూరుకి 20 కి.మీ. ల దూరంలో నిజామాబాదు జిల్లాలోనే ఇస్సన్నపల్లి గ్రామంలో వున్న శ్రీ కాలభైరవాలయం చేరాము. శివ జటాజూటోద్భవుడయిన కాలభైరవునికి ఆంధ్ర ప్రదేశ్ లో ప్రత్యేక ఆలయాలు తక్కువగా వున్నాయి. వాటిలో ఇది ఒకటి. ఈ ఆలయంకూడా పురాతనమైనదేకానీ ఈ మధ్య పునరుధ్ధరించారు. కాలభైరవుని పెద్ద విగ్రహం భక్తులని ఆశీర్వదిస్తున్నట్లుంటుంది. శివుని జటాజూటంనుంచి ఉద్భవించాడు కనుక శివ పుత్రుడని కొందరు, శివాంశ సంభూతుడని కొందరు, శివుని ఇంకొక అవతారమని కొందరు కాలభైరవుని ఆరాధిస్తారు.

ఇక్కడ పూజాదికాలు అయిన తర్వాత ఇక్కడి సీ.ఈ.ఓ. శ్రీ లక్ష్మీకాంతంగారు చెప్పిన ఇంకో దేవాలయం, బుగ్గ రామలింగేశ్వరుడు కొలువై వున్న బుగ్గరామేశ్వరం బయల్దేరాము. దాని గురించి రేపటి పోస్టులో.



Saturday, September 12, 2009

నిజామాబాదు జిల్లా


నిజామాబాదు జిల్లా

మన చుట్టు ప్రక్కలే వున్న అనేక అపురూప కళాఖండాలను గురించి మనం తెలుసుకునే ఉత్సాహం చూపించటంలేదు. అందుకే అతి పురాతనమైన అద్భుత కళా ఖండాలు నామ రూపాల్లేకుండా పోతున్నాయి. కొత్తవి వస్తున్నందుకు సంతోషం. కానీ ఏ విదేశాల్లోనూ లేని, మనకే స్వంతమైన, అతి పురాతనమైన ఈ అపురూప సంపదను అతి భద్రంగా కాపాడుకోవాల్సిన బాధ్యత మనమీద వున్నది. అసలు వీటిలో ఎన్నింటిని....కనీసం మీ చుట్టువ్రక్కల వున్న వాటిలో ఎన్నింటిని మీరు చూశారు. ఇంతకు ముందు చూడలేదా? సరే. ఇప్పుడు బయల్దేరండి. అలా నిజామాబాదు పరిసర ప్రాంతాలను చుట్టి వద్దాము.

నిజామాబాదు జిల్లాలో ఎన్నో ప్రాచీనమైన, అపురూపమైన ఆలయాలు వున్నాయి. వాటిని చూద్దామని ఉదయం కారులో బయల్దేరాం.

శ్రీ సిధ్ధ రామేశ్వర స్వామి దేవాలయం, బికనూరు

హైదరాబాదు, కామారెడ్డి రోడ్డులో కామారెడ్డికి 12 కి. మీ. లు ఇవతలే వస్తుంది బికనూరు. ఇక్కడ వెలిసిన శ్రీ సిధ్ధ రామేశ్వరస్వామి ఆలయ విశేషమేమిటంటే అన్ని దేవాలయాల్లోలాగా శివలింగం పానువట్టం పైన కనబడదు. చిన్ని శివ లింగం పానువట్టం లోపలే వుంటుంది. స్వయంభూ లింగం. అంతేకాదు. అభిషేక జలం బయటకు వెళ్ళే మార్గంగుండా ఉదయ సూర్యుని కిరణాలు లింగం మీద పడతాయి. లింగం వెనుక ఈశ్వరుని విగ్రహం, అటూ ఇటూ సిధ్ధగిరి, రామగిరి అనే వాళ్ళ విగ్రహాలు. వీరి హయాంలోనే ఇక్కడ లింగం ఉద్భవుంచిందట. వాళ్ళే ఆలయ నిర్మాణం ప్రారంభించారు. అందుకే శివుడు కూడా వీరి పేర్లతోనే సిధ్ధరామలింగేశ్వరుడయ్యాడు. అమ్మవారు భువనేశ్వరి. దినదినాభివృధ్ధి చెందుతున్న ఈ ఆలయానికి వీరి వంశీకులే పూజారులు.

ఈ ఆలయానికి ఇన్ ఛార్జ్ సీ ఈ ఓ, ఇస్సన్నపల్లి సీఈఓ శ్రీ లక్ష్మీకాతం గారు మా ఆలయ దర్ళనాభిలాష గమనించి త్రోవలోనే వున్న ఇస్సన్నపల్లి, శ్రీ కాల భైరవాలయం, దాని సమీపంలోనే వున్న బుగ్గ రామేశ్వరం చూడమని సలహా ఇవ్వటమేగాక అవసరమైన సహాయం చేశారు. వారి సలహా వల్లనే మేమీ రెండు ప్రదేశాలూ చూశాము. వారికి మా ప్రత్యేక కృతజ్ఞతలు.

రేపటి పోస్టు ఇస్సన్నపల్లి శ్రీ కాలభైరవాలయం.