26-2-11 శనివారం, అనుకోకుండా శ్రీశైలం బయల్దేరాము నేనూ, మావారూ. ఉదయం 11-30 కి మేము రిజర్వు చేసుకున్న ఆర్.టీ.సీ. బస్ కోసం మహాత్మాగాంధీ బస్ స్టాండులో వేచి చూస్తుండగా (అది మధ్యాహ్నం 12 గం. లకి) శ్రీ శైలానికి వెళ్ళే బస్సులు ఎన్నో..ప్రతి పది నిముషాలకు ఒక బస్ వెళ్తోందా అనిపించింది. ఏ బస్ చూసినా నిండిపోతోంది. అక్కడ జనం చాలా ఎక్కువగా వున్నట్లున్నారు అనుకున్నాము.
శ్రీ శైలంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 25నుంచీ మార్చి 5 వ తారీకుదాకా. శివరాత్రికింకా టైముందికదా, ఇప్పుడంత రష్ వుండదులే అని ధైర్యంగా బయల్దేరాము మేము. ఆ జనాలని చూస్తే ఎలాగా అనిపించింది. సరే బయల్దేరాక వెనక్కి తిరిగేది లేదుకదా.
వాతావరణం ఆహ్లాదకరంగా వున్నది. దోవలో రకరకాల చెట్లు పూలతో నిండి అందంగా వున్నాయి. ఇన్నిసార్లు శ్రీశైలం వెళ్ళాంగానీ ఈ పూవులని ఇదివరకు చూడలేదు. ఎంత అందంగా వున్నాయో..లేత గులాబీరంగూ, తెలుపు రంగూ మిళితమై, బతకమ్మకోసం పేర్చే పొడుగు పూలల్లా వున్నాయి కొన్ని. బతకమ్మ పూలేనేమో అనుకున్నాను కానీ అవి చిన్న పొదలే..ఈ పూలేమో పెద్ద చెట్లకి వున్నాయి. అగ్ని పూలు (flme of the forest) ముదురు ఆరెంజ్ కలర్ లో విరగబూసి చూసేవాళ్ళని కళ్ళు తిప్పుకోనీయకుండా చేస్తున్నాయి.
శ్రీశైలమింకా 82 కి.మీ. ల దూరం వున్నదనగా ఘాట్ రోడ్డు మొదలవుతుంది. బస్ లో కుడి వైపు కూర్చోవటంతో తిన్నగా వుండే రోడ్డుమీద అంతకుముందు గమనించలేదుకానీ ఘాట్ రోడ్డులో మలుపుల్లో చూశాము..బంగారు వర్ణం బట్టలు వేసుకున్న పాదచారులని. రోడ్డుమీద, కొండల్లో, అడవుల్లో అడ్డదోవల్లో నడిచి ఎక్కడికి వెళ్తున్నారో..బహుశా పక్కన వాళ్ళ వూళ్ళున్నయ్యేమోననుకున్నా. ఈ రోడ్డులో ఎప్పుడూ నడిచే జనాలని చూడలేదే అనుకునేలోపల ఇంకొక మలుపులో ఇంకొంతమంది..ఒకరి వెనుక ఒకరు ఊత కఱ్ఱలు పట్టుకుని, నెత్తిన చిన్న మూటలతో…అప్పుడు అర్ధమయింది వారు శివదీక్షాపరులని.
శివదీక్ష తీసుకున్నవారిలో వీలయినవారు శ్రీశైలం వెళ్ళి శివరాత్రిరోజు అక్కడ దీక్ష విరమణ చేస్తారు. ఇదివరకు ఈ దీక్ష ఇంత ప్రాచుర్యంలోలేదుకానీ అయ్యప్ప దీక్షాపరులలాగానే వీరూ ఈ మధ్య ఎక్కువయ్యారు. ఆ రోజు దోవ పొడుగూతా, అంటే 82 కి.మీ. పైన వారిని చూశాము. ముందు పదులలో అనుకున్నా..వందలనుకున్నా కానీ ఖచ్చితంగా వేలల్లోనే వున్నారు. వాళ్ళ ఊళ్ళనుంచి శ్రీశైలందాకా కాలి నడకనే వస్తారు. ఊళ్ళో కొందరు కలిసి గ్రూప్స్ గా బయల్దేరుతారు. ఒక వాహనంలో వంటకీ, ఇంకా కావాల్సిన సామానంతా వెంట తీసుకెళ్తారు. దోవలో ఆలయాలలోగానీ, నీళ్ళ వసతి వున్నచోటగానీ ఆగి గుడారాలు వేసుకుని, స్నానాలు భోజనాలు వగైరాలు కానిస్తారు. శ్రీశైలంలో కూడా ఏ గ్రూప్ కి ఆ గ్రూప్ గుడారాలు వేసుకుని వుంటారు. ఆలయ సిబ్బంది కూడా సౌకర్యాలు బాగానే చేశారు. శ్రీశైలం చుట్టుపక్కల వూళ్ళనుంచేకాక కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాలనుంచి కూడా శివదీక్షాపరులు కాలినడకన శ్రీశైలం వస్తారుట.
ఇంతమందిని చూడటం సరదాగానే వున్నా, మాకు స్వామి దర్శనం అవుతుందా, ఆ రష్ లో వెళ్ళగలమా అనే భయం కూడా పట్టుకుంది. మరీ అవసరమైతే బయటనుంచే నమస్కారం చేసి వద్దామనుకున్నాం. మా బస్ శ్రీశైలం దరిదాపుల్లోకెళ్ళాక పాడయింది. మగవారిని కొంతదూరం నడిపించి, డ్రైవరు ఎలాగో సున్నిపెంటదాకా తీసుకెళ్ళి బస్సు బాగుచేయించటానికి ప్రయత్నించాడు. ఆలస్యమవుతుందని, అందర్నీ వేరే బస్ ఎక్కించి పంపించాడు. రద్దీ అక్కడనుంచే మొదలయిందనుకున్నా. శ్రీశైలం చేరేసరికి రాత్రి 8-30 అయింది.
అదృష్టం బాగుండి ముందు ఫోన్ చెయ్యటంవల్ల రూమ్ వెంటనే దొరికింది. మర్నాటినుంచీ దానికికూడా ఇబ్బందికాబోతోందని వాళ్ళమాటలవల్ల తెలిసింది. టిఫెన్ చేసి ఆలయందగ్గర పరిస్ధితి ఎలావుందో చూసొద్దామని వెళ్ళాము. రద్దీమూలంగా కేవలం దర్శనంతప్ప ఏ సేవలూ లేవు 5 వ తారీకుదాకా. అదికూడా బాగానే వుంది, అందరూ తేలిగ్గా దర్శనం చేసుకోవచ్చు అనుకున్నాము. పోలీసులు చాలామందే వున్నారు. మధ్యలో ఒక అర్ధగంట తప్పితే రాత్రి మొత్తంకూడా దర్శనం వుండచ్చన్నారు. ఉచిత దర్శనం క్యూ ఒకటి, 100 రూ. టికెట్ దర్శనం క్యూ ఒకటి. టికెట్ తీసుకుందామనుకుంటే అక్కడవారు చెప్పారు ఉచిత దర్శనం క్యూ కూడా ఖాళీగానే వుంది అటెళ్ళండని. ఇంక అటు వెళ్ళాము. క్యూ అయితే ఖాళీగానే వుందిగానీ అమ్మో ఎన్ని మలుపులు తిరిగీ, తిరిగీ మొత్తానికి ఆలయం లోపలికి చేరాము. 100 రూ. వాళ్ళనికూడా ఆలయ ప్రధాన ద్వారం దగ్గరే కలుపుతున్నారు. అక్కడిదాకా జనంలేరు. అందుకే వాళ్ళలా చెప్పారు అనుకున్నాము.
మా ముందువాళ్ళు అంతకుముందు దర్శనం చేసుకున్నారుట. బయటకు వెళ్ళటానికి అమ్మవారి గుళ్ళోనుంచి వెనక ద్వారంగుండా వెళ్ళాలి. కానీ వాళ్ళు ఉపాలయాలను చూడాలని వెనక్కి వచ్చి బయటకు వెళ్ళలేక మళ్ళీ క్యూ ద్వారానే వెళ్ళాల్సివచ్చి క్యూలోకొచ్చారు. వాళ్ళు ముందు దర్శనానికి వచ్చినప్పుడు శివడ్ని దూరంనుంచే చూసి వెళ్ళారుట. మేము వెళ్ళినప్పుడి మాత్రం గర్భగుడిలోకి వెళ్ళి లింగాన్ని తాకి నమస్కరించనిచ్చారు. వాళ్ళు సంతోషపడ్డారు మళ్ళీ రావటంవల్ల లింగాన్ని తాకగలిగామని. జ్యోతిర్లింగాలను తాకి నమస్కరిస్తే మంచిది. రాత్రి 10-30కి క్యూలోకెళ్తే 11-30 కి బయటకొచ్చాము. లింగాన్ని స్పర్శించగలిగామనే సంతోషంలో, అప్పటికింకా జనం తగ్గివుండచ్చనే ఆశతో మళ్ళీ క్యూలో వెళ్ళి ఇంకోసారి దర్శనం చేసుకొచ్చాం.
ఆలయంలో దైవ దర్శనానికి దీక్ష తీసుకున్న స్వాములకు, మామూలు జనానికీ వేరు వేరు క్యూలు పెట్టారు. ఎక్కువ ఇబ్బందిలేకుండా క్యూ కదులుతున్నా, చిన్నపిల్లలున్నవాళ్ళు ఇబ్బంది పడ్డారు.
మర్నాడు దర్శనానికి వెళ్ళే సాహసం చెయ్యలేమనిపించింది. పొద్దున్న 10-30 గం. ల బస్ లో రిజర్వు చేయించుకుని సాయంత్రం 4-30కల్లా హైదరాబాదు చేరుకున్నాము. మొత్తానికి అనుకోకుండా బ్రహ్మోత్సవాల సమయంలో వెళ్ళినా పెద్దగా ఇబ్బంది పడకుండా శివదీక్షాపరుల సందడి చూసి వచ్చాము. ఇలాంటి సమయంలో వసతి, దర్శనం కొంచెం ఇబ్బందే. ఈ సమయంలో వెళ్ళదల్చుకున్నవాళ్ళు తగు ఏర్పాట్లతో వెళ్ళిరండి.
శివరాత్రి సందర్భంగా వచ్చే పోస్టులో ఏదన్నా శివాలయం గురించి చెప్తాను.
5 comments:
namassivaaya
మీబ్లాగు అభినందనీయము .
ధార్మికచర్చలకోసం ఏర్పడ్డ వందేమాతరం నకు మీకు ఆహ్వానం పలుకుతున్నాము.
మీవంటివారు వచ్చిచేరవలెనని మనవి
లింక్
https://groups.google.com/group/vandemaatulam?hl=en
lakshmi gariki namaskaram
me blog chala baundhi....madi east godavari....andi
meeru hyd lo undi
east godavri vachhi mari akkada famous place lu choosi aa anubhavalu rayadam chala anandamga undhi....teliyani famous plces kooda vrasaru........chala bagundhi
దుర్గేశ్వరగారూ
ధన్యవాదాలు. మీ ఆహ్వానానికి నా కృతజ్ఞతలు. నెట్ లేక ఇప్పటిదాకా నేను చూడలేదు. రేపు తప్పక చూస్తాను.
psmlakshmi
మల్లిగారూ
చాలా సంతోషమండీ. మీలాంటివారి ప్రోత్సాహం నూతన ఉత్సాహా్న్నిస్తుంది. ధన్యవాదాలు.
psmlakshmi
Post a Comment