Friday, March 11, 2011

శ్రీ శంభులింగేశ్వరస్వామి ఆలయం, ఖిల్లా వరంగల్



ఈ మధ్య మా అబ్బాయి చి. తేజస్వి హనుమకొండలో వుండటంతో వరంగల్ ప్రయాణాలెక్కువైనాయి. వెళ్ళినవాళ్ళం వూరుకోంకదా. అక్కడ విశేషాలని చూశాము. మేమే చూస్తే ఎట్లా అందుకే మీ కోసం కూడా ఆ వివరాలు. శివరాత్రి సందర్భంగా శివాలయం గురించి చెప్తానన్నానుకదా. కంప్యూటర్ పలకను, కనబడను అని మొండికెయ్యటంతో ఆలస్యం అయింది.

సరే. హనుమకొండలో వుంటున్నాడని వరంగల్ వెళ్తున్నామంటున్నారు. ఆరోగ్యం ఎలా వుంది అని అడుగుతున్నారా. నేనన్నది కరెక్టేనండీ. కాజీపేట, హనుమకొండ, వరంగల్ ఈ మూడూ కలిసే వుంటాయి హైదరాబాద్ సికిందరాబాద్ లాగా. కాజీపేట, వరంగల్ లో రైల్వే స్టేషన్లున్నాయి. హనుమకొండలో లేదు. అయితే ఈ మూడు వూళ్ళల్లో ఎక్కడనుంచి ఎక్కడికి తిరగటానికైనా బస్సులు, ఆటోలు, ముఖ్యంగా షేర్డ్ ఆటో సౌకర్యం బాగావున్నది.

కాకతీయులు పరిపారించిన ఓరుగల్లు సామ్రాజ్యం కాలక్రమేణా వరంగల్ అయింది. వారి వైభవానికి చిహ్నంగా ఆ కాలంలో వారు నిర్మించిన ఆలయాలు నేటికీ నిలిచి వున్నాయి. అలాంటివాటిలో ఒకటి వరంగల్ కోటలో, టికెట్ కౌంటర్ కి ఎదురుగా వున్న శ్రీ శంభులింగేశ్వరస్వామి ఆలయం.

ఈ స్వామి స్వయంభూ అంటారు. ఆలయం 11వ శతాబ్దంలో నిర్మింపబడిందని ఇక్కడి శాసనాలవల్ల తెలుస్తోంది. ఆలయం చిన్నదే. హనుమకొండలోని వెయ్యిస్ధంబాల గుడికన్నా ఇది పురాతనమైనదంటారు. ఒకసారి కాకతీయరాజు గణపతిదేవుడు ఈ వైపు ప్రయాణం చేస్తున్నప్పుడు రధ చక్రం భూమిలో దిగబడి ఎంతసేపయినా కదలలేదు. దిగి పరిశీలించగా ఇనుప రధ చక్రం బంగారంగా మారింది. ఆ ప్రాంతమంతా పరిశీలించగా శివలింగం కనబడింది. ఆ లింగానికి తాకిన రాజు ఖడ్గం కూడా బంగారంగా మారింది. ఆ లింగం విశేషం గమనించి అక్కడ గుడి కట్టించారు. ఆ లింగాన్ని పరశువేది లింగంగా ప్రశంసించారు. అయితే ఈ పరశువేది లింగం తర్వాత దొంగిలింపబడిందంటారు. (ధాంక్ గాడ్. అది అక్కడే వుంటే నాకీ పోస్టు రాసే అవకాశం వుండేదికాదు. అన్ని రకాల లోహ సామానుతో అక్కడ ఎప్పుడూ తరగని క్యూ వుండేదికదా).

ఇక్కడ స్వామి ఎదురుగావున్న నంది దక్షిణంవైపు చూస్తూ కుడి కాలు లేపి వుండటంతో ఈ ప్రాంతం దక్షిణ కాశీగా పేరుపొందింది. కాకతీయులకాలంనాటి శిల్పాలు కొన్ని ఈ ఆలయంలో వున్నాయి.

కాకతీయ సామ్రాజ్యం ఉఛ్ఛ స్ధితిలోవున్న సమయంలో ఈ కోటలో 300 పైన ఆలయాలు వుండేవిట. శత్రురాజుల దండయాత్రలలో అవ్వన్నీ శిధిలమయినా ఈ ఆలయంమాత్రం అలాగే వున్నది. శత్రువులు ఈ ఆలయం ధ్వంసం చేయటానికి లోపలకి అడుగుడిన వెంటనే రక్తపు వాంతులతో అవస్ధపడి ఆలయం వెలుపలకి వెళ్ళి క్షమించమని స్వామిని వేడుకుని ఈ ఆలయంజోలికి రాకుండా వెళ్ళిపోయారుట. దీనితో స్వామిమీద ప్రజలకు వున్న నమ్మకం బలపడి, ఇప్పటిదాకా అచంచలంగా వున్నది.

ఆకారానికి చిన్నదయినా తరతరాలుగా ప్రజల మనసులో మహోన్నతంగా నిలిచిన ఈ ఆలయాన్ని అవకాశం వచ్చినప్పుడు తప్పక దర్శించండి.

వచ్చే పోస్టు వరంగల్ కోట గురించి.