వరంగల్ అనగానే గుర్తుకొచ్చేది ఓరుగల్లునేలిన తెలుగు ప్రభువులయిన కాకతీయులు, వారి ప్రతిభా కీర్తులకు నిలువెత్తు గురుతులుగా నిలిచిన కీర్తి తోరణాలు. ఎంత అద్భుతంగా వుంటాయోకదండీ అవి. అందుకే ఆ కీర్తి తోరణం ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ పర్యాటకు చిహ్నంగా వాడుకలో వున్నది.
కాకతీయులు 12-14 శతాబ్దాలలో ఓరుగల్లును పాలించారు. వీరిలో ప్రఖ్యాతి చెందినవారు గణపతిదేవుడు, ఆయన కుమార్తె రుద్రమదేవి, ఆమె దత్తత తీసుకున్న ఆమె మనవడు (పెద్ద కూతురు కొడుకు) ప్రతాప రుద్రుడు. ప్రతాప రుద్రుడు కాకతీయ రాజులలో చివరివాడు.
ప్రస్తుతం శిధిలాలుగా మిగిలివున్న కోట నిర్మాణం 13వశతాబ్దంలో గణపతిదేవుడు మొదలుపెట్టగా రుద్రమదేవి పూర్తిచేసింది. ప్రతాపరుద్రనికాలంలో ధ్వంసంగావించబడటం మొదలైంది. 19 చ.కి.మీ ల విస్తీర్ణంలోవున్న ఈ కోటకు 3 ప్రాకారాలు వుండేవి. మొదటి ప్రాకారం మట్టిది..దానినే ధరణి కోట అనేవాళ్లు. రెండవ ప్రాకారం రాతికోట..గ్రానేట్ రాళ్ళతో కట్టబడింది. ఈ రాతికోటకి 30 అడుగుల ఎత్తున్న ద్వారాలున్నాయి. ఈ ద్వారాలమీద కీర్తితోరణాలు. ఇలాంటి నాలుగు ద్వారాలను ఇప్పటికీ చూడవచ్చు.
అతులిత సంపదలతో, ఎనలేని కీర్తి ప్రతిష్టలతో తులతూగుతున్న కాకతీయ సామ్రాజ్యమంటే కన్ను కుట్టి క్రీ.శ 1310 లో మాలిక్ కాపుర్ మొట్టమొదటిసారిగా ఓరుగల్లుమీద దండయాత్ర సాగించాడు. నెలల తరబడి కోటని ముట్టడించి మట్టిగోడను ధ్వంసంచేశాడు. రాతి గోడనుదాటి లోపలకి వెళ్ళలేక, బయట
గ్రామాల్లో ప్రజలను దారుణంగా హింసించటం, వధించటంచేశాడు. ప్రజలకోసం ప్రతాపరుద్రుడు సంధిచేసుకుని, మాలిక్ కాపుర్కి ఎనలేని సంపదను అప్పగించాడు.
క్రీ.శ. 1321 లో మహ్మద్ బిన్ తుగ్లక్ దండయాత్రని ప్రతాపరుద్రుడి సైన్యం ధైర్యంగా ఎదుర్కొన్నారు. అదే సమయంలో రోగాలు వ్యాపించటంతోకూడా తుగ్లక్ వెనుదిరిగాడు. మళ్ళీ క్రీ.శ. 1323లో తిరిగి దండెత్తివచ్చాడు. ఈమారు అతనుపయోగించిన ఆధునిక యుధ్ధ పధ్ధతులవల్ల, అశ్వికదళం బాగుండటంవల్ల, తెలుగు నాయకుల అనైక్యతవల్ల ప్రతాపరుద్రుడు ఓడిపోయి బంధింపబడ్డాడు. అతనిని ఢిల్లీ తీసుకువెళ్తుండగా దోవలోనే మరణించాడు. తర్వాత ముసునూరి నాయక నేతలు 72మంది ఏకమై ఢిల్లీనుంచి తిరిగి వరంగల్లును స్వాధీనపరచుకున్నారు. కానీ, వీరిలో అంతః కలహాలవల్ల 1370లో బహుమనీ సుల్తానులు…(వారిలో గోల్కొండ సుల్తానులు ఓరుగల్లునేలారు), మొగలు చక్రవర్తి ఔరంగజేబు 1687 లో గోల్కొండను జయించినప్పటినుంచి 1724 లో హైదరాబాదు స్టేట్ ఏర్పడేదాకా మొగలులు, కుతుబ్ షాహీలు ఓరుగల్లుని పరిపాలించారు.
ఈ దండయాత్రలవలన కోట ధ్వంసంకావింపబడింది. కోటలోని ఆలయాలు, మందిరాలు ధ్వంసంకావింపబడి, శిధిలాలు మిగిలాయి. ఈ శిధిలాలనేమి చూస్తాం అని అశ్రధ్ధ చేసేవారున్నా, గత వైభవం ఆనవాళ్ళు దర్శించాలనే ఆకాంక్ష వున్నవారు అవకాశమున్నప్పుడు తప్పక ఈ కోటను దర్శించండి.
టికెట్ కౌంటర్ పక్కనే వున్న పార్కు..దీనిలోంచి వెళ్తే (టికెట్ రూ. 5) ఒక చిన్న కొండమీద ఒక శిధిల మండపం, ఒక బురుజు. బురుజు పైకి ఎక్కవచ్చు. ఈ కొండపైకి చేరుకోవటానికి, కొండలోనే తొలిచిన చిన్న చిన్న మెట్లు వున్నాయి. తేలిగ్గా ఎక్కవచ్చు. ఆహ్లాదకరమైన వాతావరణంలో వెళ్తే కొంతసేపు అక్కడ గడపచ్చు.
తరువాత పోస్టు భోగేశ్వరస్వామి ఆలయం, మట్టెవాడ, వరంగల్.
7 comments:
ఇప్పటికి చెక్కు చెధరకున్దా మిగిలిన కాకథియ కళా థొరనమ్ మాత్రమ్ చ్హాల బాగున్ది....thanks for the post
అద్భుతం!
"గోనగన్నారెడ్డి" (రుద్రమ్మ సేనాపతి) నవలలో అడివి బాపిరాజుగారు అప్పటిలోనే ఆంధ్రులు మహాపౌరుషప్రతాపాలు కలవారని అందఱూ భయపడేవారనీ, ఐతే ఆంధ్రులలో ఉన్న అంతఃకలహాలే మనుగడకు ప్రశ్నార్థకాలనీ తెలియజేసారు.
ఓరుగల్లు పిల్లాడూ
కృతజ్ఞతలు
psmlakshmi
రాఘవగారూ
కృతజ్ఞతలు. ఇదివరకు చాలాసార్లు ఈ కోటని చూద్దామని ప్రయత్నించటం, మావాళ్ళు అక్కడేమీలేదు, విరిగిపోయిన రాళ్ళూరప్పలుతప్పితే అని నిరుత్సాహపరచటం జరిగింది. రామప్ప, వెయ్యస్తంబాలగుడి, భద్రకాళిగుడి తప్పితే వరంగల్ లో ఏమున్నాయి అనుకునేవాళ్ళం ఈ మధ్య ట్రిప్స్ లో చిన్నవాటినయినా చూద్దామని చూశాము. ఆకారంలో చిన్నవేకానీ ఒక్కొక్కటీ చరిత్రల్లో పెద్దవే వున్నాయి. మేము చూసినవాటిగురించి వీలువెంబడి విశదీకరిస్తాను.
నాకు చరిత్ర అంత ఆసక్తిలేదు. వరంగల్ కోట గురించి రాద్దామని రీసెర్చి చేసి, నాకు తెలిసిన అతి తక్కువ విషయాలు పోస్టు రాస్తుంటే ఆ సంఘటనలన్నీ నా కళ్ళముందే జరిగినట్లనిపించింది. ఆంధ్ర రాజ్యం అప్పుడెంత ఔన్నత్యంలో వుండేదో, అప్పుడుకూడావున్న అంతఃకలహాలవల్ల ఎలా నాశనమయిందో...మేమా కోట చూడకపోతే ఈ కొంచెం చరిత్రకూడా తెలుసుకునేదాన్నికాదు.
ఈమారుకూడా మావాళ్ళు అంత ఉత్సాహం చూపించకపోవటంతో ఆ శిధిలాలన్నీ దూరంనుంచే చూసివచ్చేశా. ఆ కొండమాత్రం ఎక్కాం. చరిత్ర తెలుసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి అవ్వన్నీ తిరిగి చూడాలనిపిస్తోంది.
psmlakshmi
అన్నట్లు కోట చూసినంతమాత్రాన చరిత్ర తెలుసుకోవాలని తెలుసుకోలేదండీ. మీ అందరికీ దాని గురించి చెప్పాలని తెలుసుకున్నా. అంటే బ్లాగు రాయటంవల్ల నా జ్ఞానం కూడా పెరుగుతోంది.
psmlakshmi
thanks a million. pls post all possible information on warangal and its surrounding places.
madhuri.
కృతజ్ఞతలు మాధురిగారూ. భోగేశ్వర ఆలయం చూశారా ఇంకా కొన్ని పోస్టులు వరంగల్, చుట్టుపక్కల ప్రదేశాల గురించే.
psmlakshmi
Post a Comment