Friday, August 14, 2009

కృష్ణాష్టమి

ఆంజనేయ స్వామి (అసలు విగ్రహం...ఇప్పుడు వేరేది పెద్ద విగ్రహం చేయించి ప్రతిష్టించారు)
మొవ్వ గోపాలుని పదాల సృష్టికర్త వరదయ్య లేక క్షేత్రయ్య

మొవ్వ వేణు గోపాల స్వామి (అసలు విగ్రహం...దీని స్ధానంలో పెద్ద విగ్రహం చేయించి ప్రతిష్టించారు)

కృష్ణాష్టమి

కృష్ణాష్టమి సందర్భంగా పోస్టు రాయండి అని శ్రీమతి జ్యోతి అంటే నాకేమీ తోచలేదు. కృష్ణుడి గురించి రాసే పాండిత్యం నాకు లేదు. గురువారం సాయంత్రం 6 గం. లయింది. ఏమీ రాయలేకపోయాను. పోనీ ఈ మాటుకి మానేద్దామా అనుకున్నాను. మనసొప్పటంలేదు. ఆకస్మాత్తుగా గుర్తొచ్చింది భక్తి మాస పత్రికలో ప్రచురించబడిన నా మొవ్వ వ్యాసం. కృష్ణాష్టమినాడు మీకందరికీ మొవ్వ వేణుగోపాలుని పరిచయంచెయ్యటంకన్నా మహద్భాగ్యం ఏముంటుంది. కృష్ణాజిల్లాలోని మొవ్వ గ్రామంలో వెలసిన వేణుగోపాల స్వామిని చూశారా ఎవరైనా? లేదా? ఇప్పుడు చూడండి.

మొవ్వ

మొవ్వ అనగానే మువ్వ గోపాలుడు గుర్తుకొస్తున్నాడు కదూ. నిజమేనండీ. ఆ వేణు గోపాలుడు మౌద్గల్య మహర్షికి ప్రత్యక్షమైన ప్రదేశం ఇది. సామాన్య గోవుల కాపరి వరదయ్యను ఆ వేణుగానలోలుడు క్షేత్రయ్యగా మార్చి క్షేత్రయ్య పదాలకు నాందీ పలికిన ప్రదేశమిది. కృష్ణా జిల్లాలో కూచిపూడి నాట్యానికి ప్రసిధ్ధి చెందిన కూచిపూడికి 3 కి.మీ. ల దూరంలో వున్నది. వసతి, ఆహార సౌకర్యాలు కూచిపూడిలోనే. మీరు వెళ్ళేది మరీ అపరాహ్ణ సమయంలో కాకపోతే గుడి మూసి వున్నా తెరుస్తారు. పూజారిగారిల్లు ప్రక్కనే. ఆయనే అక్కడి చరిత్ర చాలా విపులంగా చెప్పారు.

పూర్వం ఈ ప్రాంతము కృష్ణా నదీ పరీవాహక క్షేత్రం. ఇక్కడ మౌద్గల్య మహర్షి తపస్సు చేస్తూ వుండేవారుట. ఆయనకి కృష్ణా నది ఒడ్డున ఇసుక దిబ్బల్లో ఈ వేణు గోపాల స్వామి విగ్రహం దొరికింది. ఆ విగ్రహ విశేషాలేమిటంటే శిలాకృతిలోనే, స్వామి వెనుక వున్న మకరతోరణం పై దశావతారాలు వున్నాయి. స్వామి ప్రక్కన రుక్మిణీ సత్యభామలు. చేతిలో వేణువుకు గాలి వూదే రంధ్రాలు కూడా స్పష్టంగా కనబడతాయి. ఈ విగ్రహం ఇసుక విగ్రహం కావటంతో అభిషేకాలు చేసేటప్పుడు కాళ్ళ దగ్గర కొంచెం తరుగు ఏర్పడింది. అలాంటి విగ్రహాలు పూజనీయాలు కావని, 2000 సంవత్సరంలో అదే ఆకారంలో వున్న పెద్ద విగ్రహాన్ని చేయించి ప్రతిష్టించారు. ఈ విగ్రహాన్ని వెనుక ఒక హాల్లో వుంచారు. ప్రస్తుతం పూజాదికాలులేవు గనుక ఈ విగ్రహాన్ని మనం ముట్టుకుని కూడా చూడవచ్చు. ఈ విగ్రహాన్ని చిన్నగా తడితే డొల్లు శబ్దం వస్తుంది. ఇసుకలోంచి ఉద్భవించిన విగ్రహం, ఇసుక తయారీ కనుక అలా వస్తుంది.

ఇంక వరదయ్య కధ. చాలా కాలం క్రితం వరదయ్య అనే గోవుల కాపరి గోవులను కాచుకుంటూ వచ్చి రోజూ ఈ విగ్రహం దగ్గర కూర్చుంటూ వుండేవాడుట. అతనికి చదువు సంధ్యలు ఏమీలేవు. ఒక రోజు అతనికి ఆ విగ్రహానికి పూజలు చేయాలనిపించి. అప్పటినుంచీ తనకు తోచిన విధంగా రోజూ పూజ చేసేవాడుట. ఒకసారి వేణు గోపాల స్వామి వరదయ్యకు కనిపించి నువ్వు కారణ జన్ముడవు. ఇక్కడ గోవులు కాయటం కాదు నువ్వు చెయ్యాల్సిన పని, నా గురించి ప్రచారం చెయ్యమన్నాడుట. దానికి వరదయ్య నాకు చదువూ సంధ్యా ఏమీ రాదు. నేను నీ గురించి ఏమి ప్రచారం చెయ్యగలను అని అడిగాడుట. రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా అన్నట్లు, ఆ దేవ దేవుడే తలచుకుంటే చదువులకు కొదవా. వెంటనే స్వామి వరదయ్యని నాలుక చాపమని, అతని నాలుకమీద బీజాక్షరాలు వ్రాశాడు. దానితో వరదయ్య దశ తిరిగింది. ఆయన గొప్ప పండితుడై వేణుగోపాల స్వామి మీద అనేక పాటలు వ్రాశాడు. అవ్వే క్షేత్రయ్య పదాలుగా ప్రసిధ్ధికెక్కాయి.

వరదయ్య ఈ పదాలు పాడుకుంటూ ఎక్కువగా తిరిగేవాడు. ఆయన వ్రాసిన పదాలు కూడా ఎక్కువగా ఆయననొక గోపికగా వూహించుకుని వ్రాయటంతో భక్తికన్నా రక్తి ఎక్కువగా వుండేదని ఆంధ్రులు ఆదరించలేదు. వరదయ్య తిరుగుతూ తమిళనాడుకెళ్ళి అక్కడ వరదరాజ స్వామిని సేవిస్తూ అక్కడే వుండిపోయాడు. వరదరాజ క్షేత్రంలో వుండటంతో ఆయనకి క్షేత్రయ్య అనే పేరు వచ్చింది.

ఈ ప్రాంగణంలోనే ఆంజనేయ స్వామి ఉపాలయం వుంది. ఈయన కుడి చేతిలో ఖడ్గం, ఎడమ చేతిలో సంజీవని పట్టుకుని వుంటాడు. ఇలాంటి విగ్రహం ఇక్కడ ఒక్క చోటే వున్నదట. ఆరోగ్యానికి, దుష్ట గ్రహ పీడా నివారణకు, సకల ఐశ్వర్యాలకూ, ఈ స్వామిని పూజిస్తే మంచిదట. ఈయన్ని పూజిస్తే పంచముఖ ఆంజనేయ స్వామిలో వున్న అన్ని దేవుళ్ళనీ పూజించినట్లేట. 2000 సంవత్సరంలో ఈయన విగ్రహం స్ధానంలో కూడా అదే రూపు రేఖలతో ఇంకా పెద్ద విగ్రహం తయారు చేయించి పునః ప్రతిష్టించారు. పాత విగ్రహం, వరదయ్య విగ్రహం వెనుక హాల్ లో వేణుగోపాల స్వామి విగ్రహంతోబాటు భద్రపరచబడ్డాయి.

మాఘ పూర్ణిమకు వేణు గోపాల స్వామికి విశేష వుత్సవాలు జరుగుతాయి. ఆ సమయంలో యాత్రికుల బసకు తాత్కాలిక ఏర్పాట్లు చేస్తారుట. మిగతా సమయాల్లో మన సంగతి మనం చూసుకోవాల్సిందే।



9 comments:

సుభద్ర said...

మీ సీనియర్టి చుపి౦చారు.నేను చుడలేదు మొవ్వ.ఇ౦క చుడానవసర౦ కళ్ళ ము౦దుకు తెచ్చారు.

చిలమకూరు విజయమోహన్ said...

గత సంవత్సరం దగ్గరకు పోయి కూడా మువ్వగోపాలుని దర్శించుకోలేక పోయిన దురదృష్టవంతులం.ఈమధ్య ETv2 లో చూసి ప్రత్యక్ష్యంగా కాకపోయినా పరోక్షంగా దర్శించుకుని సంతోషపడ్డాము.మరిన్ని వివరాలు మీదగ్గరనుంచి తెలుసుకున్నాము.ధన్యవాదాలు.సాలగ్రామ మువ్వగోపాలుని రూపం అత్యద్భుతం.
మీకు కృష్ణాష్టమి శుభాకాంక్షలు.
అలాగే నా కృష్ణాష్టమి టపాలు చూడండి
http://vijayamohan59.blogspot.com/2009/08/300.html

http://vijayamohan59.blogspot.com/2009/08/blog-post_8591.html

మాలా కుమార్ said...

మొవ్వ గోపాలుని గురించి చాలా బాగా చెప్పారు.
కృష్ణాష్టమి శుభాకాంక్షలు .

నేస్తం said...

చాలా బాగా రాసారు కృష్ణాష్టమి శుభాకాంక్షలు

శ్రీలలిత said...

మొవ్వ క్షేత్రాన్ని కళ్ళకు కట్టినట్లు వర్ణించారు.

జ్యోతి said...

కృష్ణాష్టమి శుభాకాంక్షలు..

పరిమళం said...

కృష్ణాష్టమి రోజు "మొవ్వ "మువ్వగోపాలుని మాకళ్ళముందుంచారు అంతకన్నా భాగ్యమా ?
కృష్ణాష్టమి శుభాకాంక్షలు .

భావన said...

క్రిష్ణాష్టమి రోజు మువ్వ గోపాలుని మోహన రూపాన్ని మా కళ్ళముందు వుంచారు, లక్ష్మి గారు ధన్యవాదాలు. మా వూరికి దగ్గరే ఐనా ఎప్పుడూ వెళ్ళనందుకు బాధ గా వున్న మీ ద్వారా దర్శన మిచ్చిన గోపాల బాలునికిదే శత శహస్ర వందనాలు ... మీకు కూడా క్రిష్ణాష్టమి శుభాకాంక్షలు

పద్మనాభం దూర్వాసుల said...

శ్రీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు
అభ్యంతరం లేకపోతే మీ ప్రస్తుత ఇమెయిలు చిరునామా నా telugugreetings@gmail.com కి ఇవ్వగలరా?